పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?

  • శుభమ్ కిశోర్
  • బీబీసీ ప్రతినిధి
దియామర్ బాషా డామ్ ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, HASSAN ABBAS

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల గిల్గిత్ బల్తిస్తాన్‌లో ఓ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు.

దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ తన తీరును ఇప్పటికే స్పష్టం చేసిందని, అందులో మార్పేమీ ఉండబోదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం చెప్పారు.

‘‘పూర్తిగా జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం భారత్‌లో అంతర్భాగాలు. పాకిస్తాన్ తలపెట్టిన ప్రాజెక్టును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ నిర్మించే ఆనకట్ట వల్ల జమ్మూ, లద్దాఖ్‌ల్లోని చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. పాకిస్తాన్ చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో మార్పులు చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది’’ అని ఆయన అన్నారు.

ఇలాంటి ప్రాజెక్టులపై పాకిస్తాన్‌తోపాటు చైనాపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు.

పాకిస్తాన్ ఈ ఆనకట్టకు దియామార్ బాషా అని పేరు పెట్టింది. జులై 15న ఇమ్రాన్ ఖాన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు చైనా సాయం చేస్తోంది.

ప్రారంభ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ కమర్ జావెద్ బాజ్వా. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కూడా పాల్గొన్నారు.

ఆనకట్టల నిర్మాణంపై దృష్టిపెట్టక పాకిస్తాన్ తప్పు చేసిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

‘’40-50 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుపై నిర్ణయం జరిగింది. కానీ, పనులు ఇప్పుడు మొదలుపెడుతున్నాం. మనం అభివృద్ధి చెందకపోవడానికి ఇదే పెద్ద కారణం’’ అని వ్యాఖ్యానించారు

ఈ ప్రాజెక్టు ద్వారా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, 16వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తోంది.

భారత్‌కు అభ్యంతరం దేనికి?

ఈ ప్రాజెక్టుపై భారత్ అభ్యంతరాలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

కశ్మీర్, లద్దాఖ్‌ల్లో భారత్ తమవిగా చెబుతున్న ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండటం మొదటి కారణం.

ఈ ప్రాజెక్టులో చైనా భాగం కావడం రెండో కారణం.

‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. చైనా, పాకిస్తాన్‌ల మధ్య నీటి ఒప్పందాలు జరగవచ్చని భారత్ ఆందోళనతో ఉంది. లద్దాఖ్ విషయంలో ఇప్పటికే వివాదం ఉంది. నదులు లద్దాఖ్ నుంచే ప్రవహిస్తున్నాయి’’ అని ఆసియా వ్యవహారాల నిపుణుడు ఎస్‌డీ ముని అన్నారు.

‘‘ఒకవేళ ఆనకట్ట తెగినా, నష్టం జరుగుతుంది. భారత్, నేపాల్‌ల మధ్య ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. బిహార్‌లో ఆనకట్టలు తెగినా, నీటిని వదిలినా, నేపాల్ అభ్యంతరాలు పెడుతూ ఉంటుంది. నేపాల్‌లో నీటిని ఆపితే, భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది’’ అని ఆయన అన్నారు.

భారత్ ముందున్న మార్గాలేంటి?

ప్రాజెక్టు విషయమై భారత్ అభ్యంతరాలైతే వ్యక్తం చేసింది. కానీ, దీని నిర్మాణాన్ని ఆపేందుకు భారత్ ఏమైనా చేయగలదా?

ఈ ప్రశ్నకు ఎస్‌డీ ముని బదులు ఇచ్చారు. నిర్మాణాన్ని అడ్డుకోవడం భారత్‌కు అసాధ్యమని ఆయన అన్నారు.

‘‘పాకిస్తాన్‌ నియంత్రణలో ఉన్న కొన్ని ప్రాంతాలు తమకు చెందుతాయని భారత్ వాదిస్తోంది. కానీ, తన నియంత్రణలో ఉన్న ప్రాంతంలో, పాకిస్తాన్ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. కశ్మీర్ తమకు చెందుతుందని పాకిస్తాన్ కూడా అంటోంది. భారత్ అక్కడ ఆనకట్టలు కట్టడం మొదలుపెట్టినప్పుడు పాకిస్తాన్ కూడా అభ్యంతరాలు తెలియజేసింది. భారత్ అక్కడ ఏం చేసినా, పాకిస్తాన్ అభ్యంతరం మాత్రమే వ్యక్తం చేయగలదు. అంతకుమించి ఏమీ చేయలేదు. భారత్ పరిస్థితి కూడా అంతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం అవసరమేనని, తద్వారా పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ఆ ప్రాంతాలు తమవన్న వాదనను గట్టిగా వినిపించవచ్చని ముని అభిప్రాయపడ్డారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఉందని, దాని ఉల్లంఘనలేవీ జరగకపోతే ఈ ప్రాజెక్టుపై బలమైన వివాదమేమీ ఉండదని ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు డాక్టర్ ఎస్‌కే సర్కార్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య చాలా కాలంగా నీటి వివాదాలు నడుస్తున్నాయి.

పాకిస్తాన్ వైపు నుంచే ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు భౌగోళిక పరిస్థితులే కారణమని ఎస్‌కే సర్కార్ అంటున్నారు.

‘‘నదులు భారత్ నుంచి పాకిస్తాన్‌కు ప్రవహిస్తాయి. భారత్ వైపు ఆనకట్టలు కడితే, పాకిస్తాన్ వైపు వెళ్లే నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుంది. ఒకవేళ ఆనకట్ట సింధు జలాల ఒప్పందం ప్రకారం ఉంటే, వ్యతిరేకత వ్యక్తం చేయడానికి పెద్దగా విషయమేమీ లేదు’’ అని ఆయన అన్నారు.

2018లో భారత్‌లో చేనాబ్ నదిపై నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్లో ఒకదానిపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

చేనాబ్‌పై రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు భారత్ నిర్మిస్తోంది. అవి 48 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్ కాల్నాయీ, 1,500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పాకల్ దుల్.

పాకల్ దుల్‌ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ నిర్మిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది.

పాకల్ దుల్ 1,708 మీటర్ల ఎత్తులో ఉండొచ్చని, దీని వల్ల భారత్‌కు తన ఇష్టానుసారం నీటిని వదిలే వీలు కలుగుతుందని ఆ దేశం వ్యాఖ్యానించింది.

గత ఏడాది హరియాణాలో ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, పాకిస్తాన్‌కు ప్రవహించే నీటిని ఆపడం గురించి ప్రస్తావించారు.

‘‘భారత్ రైతులకు, హరియాణా రైతులకు చెందాల్సిన నీరు 70 ఏళ్లుగా పాకిస్తాన్‌కు వెళ్తోంది. దీన్ని ఆపుతాం. ఇక్కడ ఇంటింటికీ నీరు అందిస్తాం’’ అని ఆయన అన్నారు.

అయితే, ఒప్పందం ప్రకారం మూడు నదులపై తమకు ‘ప్రత్యేక హక్కు’ ఉందని, నీటిని ఆపే ప్రయత్నాలను ‘రెచ్చగొట్టే చర్యలు’గా భావించాల్సి ఉంటుందని పాకిస్తాన్ అప్పుడు స్పందించింది. ‘ప్రతీకార చర్య’ తీసుకునే హక్కు కూడా తమకు ఉంటుందని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, HASSAN ABBAS

ఫొటో క్యాప్షన్,

ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మించే స్థలం

ఏమిటీ సింధు ఒప్పందం?

అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారానికి సింధు జలాల ఒప్పందాన్ని ఓ మంచి ఉదాహరణగా నిపుణులు చెబుతుంటారు.

పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత సింధు లోయ నుంచి ప్రవహించే ఆరు నదులపై నియంత్రణ విషయంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది.

1960లో భారత్, పాకిస్తాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం సింధు నది, దాని ఉప నదులను రెండు వర్గాలుగా విడదీశారు.

సత్లజ్, బ్యాస్, రావీ నదులను తూర్పు నదులుగా, ఝేలం, చేనాబ్, సింధులను పశ్చిమ నదులుగా వర్గీకరించారు.

తూర్పు నదుల జలాలను భారత్ పూర్తిగా వినియోగించుకోవచ్చు. కొన్ని మినహాయింపులు మాత్రమే ఉన్నాయి.

పశ్చిమ నదుల జలాలు పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అయితే, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం కోసం పరిమితంగా వీటి నుంచి నీటిని వాడుకునే వెసులుబాటు కూడా భారత్‌కు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)