చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?

  • సందీప్ సోనీ
  • బీబీసీ ప్రతినిధి
వీగర్ ముస్లింలు

కొన్నిసార్లు ‘పొడవాటి గడ్డంపై నిషేధం విధిస్తారు. ఇంకొన్ని సార్లు ‘ఖురాన్ దగ్గర ఉంచుకోవద్దని’ ఆదేశిస్తారు. ‘బ్రెయిన్ వాష్’ చేస్తారు. ఆడవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేస్తారు.

వీగర్ ముస్లింల విషయంలో చైనాపై వచ్చిన ఆరోపణలు ఇవి.

కానీ, ఇవి నిరాధారమైనవంటూ ఆ దేశం తోసిపుచ్చుతోంది.

వీగర్ ముస్లింల కళ్లకు గంతలు కట్టి, రైళ్లలో ఎక్కిస్తున్నట్లుగా దృశ్యాలున్న ఓ డ్రోన్ వీడియో కొంత కాలం కిందట ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

బ్రిటన్‌లోని చైనా రాయబారికి ఆ ఫుటేజీ చూపించి, బీబీసీ వివరణ కోరింది. ఆయన మాత్రం అవన్నీ కట్టుకథలేనని కొట్టిపారేశారు.

చైనా ఈ ఆరోపణలను ఎంతగా తోసిపుచ్చుతున్నా, వీగర్ ముస్లింలు వేధింపులకు గురవుతున్నట్లు బలమైన ఆధారాలతో చాలా కథనాలు వస్తున్నాయి.

అయినా, వీగర్ ముస్లింల పరిస్థితిపై ప్రపంచం అంతగా దృష్టి పెట్టడం లేదు. ముస్లింల హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడుతాయని భావించే దేశాలు కూడా ఈ విషయంలో కిమ్మనడం లేదు. ఎందుకు ఇలా?

ఫొటో సోర్స్, Getty Images

‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టు

‘‘చైనా తన గడ్డపై ఎలాంటి వ్యతిరేకతనైనా కొంచెం కూడా సహించదు. దీన్ని మనం చాలా సార్లు చూశాం’’ అని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ పాలసీలోని ‘డిస్‌ప్లేస్‌మెంట్ అండ్ మైగ్రేషన్ ప్రొగ్రామ్’ డైరెక్టర్ అజీమ్ ఇబ్రహీం అన్నారు.

‘‘పాకిస్తాన్ సహా చాలా దేశాలు చైనా ‘వన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఉన్న దేశాలు, తమకు సంబంధించిన ఏ వ్యవహారంలోనూ జోక్యం చేసుకోకుండా చైనా చూసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రాజెక్టు ద్వారా రహదారులు, పోర్టుల నెట్‌వర్క్‌ను చైనా రూపొందిస్తోంది. ఆఫ్రికా, యూరప్, ఆసియాలతో చైనాను అనుసంధానం చేసే ప్రాజెక్టు ఇది.

ఏడేళ్ల క్రితం చైనా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీన్ని పూర్తి చేసేందుకు వందల కోట్ల డాలర్లను నీళ్లలా ఖర్చు చేస్తోంది.

షింజియాంగ్ ప్రావిన్సుతో సరిహద్దు పంచుకునే పాకిస్తాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైంది.

‘‘పాకిస్తాన్‌కు చైనా వందల కోట్ల డాలర్లు అప్పుగా ఇచ్చింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కారణంగా పాకిస్తాన్‌లో ఎక్కడికైనా చైనా వెళ్లగలదు. అందుకే వీగర్ ముస్లింలకు మద్దతుగా, చైనాకు వ్యతిరేకంగా చైనా ఏమీ మాట్లాడలేదు’’ అని అజీమ్ ఇబ్రహీం అన్నారు.

పైగా పాకిస్తాన్‌కు చైనా ‘ఎవర్‌గ్రీన్’ మిత్ర దేశం.

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేసియా. కానీ, వీగర్ ముస్లింల విషయంలో ఆ దేశం ఎప్పుడూ ‘చైనాతో తాము నేరుగా మాట్లాడతాం’ అని మాత్రమే అంటోంది.

ఫొటో సోర్స్, David Liu

సౌదీ అరేబియా తమను తాము సున్నీ ముస్లిం ప్రపంచానికి నేతృత్వం వహించే దేశంగా భావించుకుంటుంది.

‘‘మిలిటెంట్లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే హక్కు చైనాకు ఉంటుంది. దేశ భద్రత కోసం అతివాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు’’ అని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు.

మిగతా ముస్లిం దేశాల్లానే సౌదీ అరేబియాకు కూడా కొన్ని ‘అనివార్యమైన అంశాలు’ ఉన్నాయని, కొన్ని ‘దౌత్య కారణాలు’ కూడా ఆ దేశం ఈ వైఖరి చూపడానికి కారణమని అజీమ్ ఇబ్రహీం అన్నారు.

సంస్కృతిపరంగా చైనా కన్నా, టర్కీకి తమకు దగ్గరి బంధం ఉందని వీగర్ ముస్లింలు భావిస్తుంటారు.

వీగర్ ముస్లింలను తమ దేశంలోకి స్వాగతిస్తామని ఐదేళ్ల క్రితం టర్కీ అధ్యక్షుడు ఎర్డోవన్ అన్నారు. అయితే, ఆ తర్వాత టర్కీ స్వరం మార్చింది.

‘‘వీగర్ల కార్యకలాపాలు అంగీకారయోగ్యంగా లేవని టర్కీ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరో ప్రకటన‌లో తాము ఇదివరకు చెప్పిందానికి కట్టుబడి ఉన్నామని, తమ వైఖరిలో మార్పేమీ రాలేదని తెలిపింది’’ అని అజీమ్ ఇబ్రహీం అన్నారు.

‘బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’లో టర్కీ కూడా భాగంగా ఉంది.

మరి, వీగర్ ముస్లింల అంశంలో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే ముస్లిం మెజార్టీ దేశాలు లేనట్లేనా?

ఈ ప్రశ్నకు బదులుగా... మలేసియా ఒక్కటి ఇందుకు మినహాయింపు కావొచ్చని అజీమ్ ఇబ్రహీం అంటున్నారు.

‘‘మలేసియా తమ పొరుగుదేశాలతో పోల్చితే బాగా అభివృద్ధి చెందింది. చైనాను విమర్శిస్తున్నవారిలో మహాతిర్ మహమ్మద్ ప్రధానంగా ఉన్నారు. చైనాకు కూడా ఎదురునిలువచ్చన్న విషయం మలేసియా అర్థం చేసుకుందని నేను అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Marco Di Lauro

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్

చైనా రాజకీయ, దౌత్య వ్యూహాలను కూడా అనుసరిస్తోంది. అంతర్జాతీయ మద్దతు తమకు విశేషంగా ఉండేలా చైనా కొన్నేళ్లుగా కృషి చేస్తూ వచ్చింది.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీనికి మంచి ఉదాహరణ అని వాషింగ్టన్‌లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఏసియన్ రీసెర్చ్‌లోని సీనియర్ ఫెలో నడోజ్ రోలాండ్ అన్నారు.

2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. వేర్పాటువాదం, అతివాదం, ఉగ్రవాదంపై పోరాడటం దీని ముఖ్య ఉద్దేశం. ప్రధాన సభ్య దేశాలైన చైనా, కజఖ్‌స్థాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పరస్పరం భద్రతపరమైన సహకారం అందించుకోవాలని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న సూత్రంతో ఇది ఏర్పాటైంది.

అంటే దీనర్థం, షింజింయాంగ్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలేవీ, వీగర్ ముస్లింలకు సంబంధించిన అంశాలపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ‘దేశ భద్రతకు ముప్పు’ అన్న పదానికి ఎలాంటి నిర్వచనమూ ఇవ్వలేదు. దీంతో వీగర్ ముస్లింలను ముప్పుగా నిర్వచించుకోవడం చైనాకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు.

‘‘ప్రభుత్వం ఎవరిని తీవ్రవాదులుగా చెబితే, వారిపై తీవ్రవాదుల ముద్ర వేస్తారు. అంతర్జాతీయ మానవ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు ఈ వేదిక వారికి ఉపయోగపడుతోంది. ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు రాకుండా ఆ దేశాలు చైనాకు అవసరం. మిగతా దేశాలు కూడా ఇదే తరహాలో తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు, ఉగ్రవాదులు అన్న ముద్ర వేసి, చైనా మద్దతు పొందుతారు’’ అని నడోజ్ రోలాండ్ అన్నారు.

వీగర్ ముస్లింల పట్ల సహానుభూతి వ్యక్తం చేస్తూ కొన్ని దేశాలు ఐరాసకు గత ఏడాది ఓ లేఖ రాశాయి. చైనా తయారుచేసుకున్న ఈ నెట్‌వర్క్ పనితీరు అప్పుడు కనిపించింది.

‘‘అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీల నేతృత్వంలో 22 దేశాల బృందం షింజియాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘనల అంశం గురించి చైనాను విమర్శిస్తూ ఐరాసకు లేఖ రాశాయి. దీనికి బదులుగా చైనాను నమర్థిస్తూ ఓ లేఖ వచ్చింది. దానిపై సూడాన్, తజికిస్తాన్, జిబూతీ, యెమెన్, కువైట్, మయన్మార్ సహా 50 దేశాలు సంతకాలు చేశాయి’’ అని రోలాండ్ వివరించారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

మహమ్మది బిన్ సల్మాన్

‘పూర్తిగా వేరే చిత్రాన్ని చూపిస్తుంది’

‘‘చైనా ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వీగర్ ముస్లింల ఫొటోలు ఆ దేశం నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యం’’ అని నాటింగ్హమ్ యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ ఫెలో రాయన్ థమ్ అంటున్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన వీగర్ ముస్లింల గురించి అధ్యయనం చేస్తున్నారు.

వీగర్ ముస్లింల ఫొటోలు వీలైనంత ఎక్కువగా బయటకు రావాల్సిన అవసరం ఉందని రాయన్ అభిప్రాయపడ్డారు.

‘‘వీగర్ ముస్లింలు అనుభవిస్తున్న వేదన బయట ప్రపంచానికి తెలియడానికి ఫొటోలు చాలా అవసరం. వీగర్ ముస్లింలకు అస్తిత్వమే లేదు. కనిపిస్తేనా కదా, ఎవరైనా వారి గురించి ఆలోచిస్తారు’’ అని ఆయన అన్నారు.

చైనా తనపై వచ్చిన ఆరోపణలను తప్పని చెప్పడానికి విషయాలను మరోలా చూపిస్తూ ఉంటుందని రాయన్ థమ్ అన్నారు.

‘‘చైనా ప్రత్యేకంగా ఎంచుకుని, కొన్ని చిన్న దేశాల అధికారులను, పాత్రికేయులను పిలిపిస్తుంది. వారితో వీగర్ ముస్లింల క్యాంపులు ఇలా ఉన్నాయంటూ చూపిస్తుంది. వాటిలో మీకు గార్డులు కనిపించరు. వీగర్ ముస్లిం యువతీ యువకులు తరగతి గదుల్లో చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఎక్కడా ఊచలు కనిపించవు. వీగర్ ముస్లింలపై వేధింపులన్నీ అమెరికా అల్లుతున్న కట్టుకథలు అన్నట్లుగా చూపిస్తారు. ప్రపంచానికి అసలు పూర్తిగా వేరే చిత్రాన్ని చైనా చూపిస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్

వొకేషనల్ ట్రెయినింగా, నిర్బంధ కేంద్రాలా?

‘‘నేను చదువుకున్న పాఠశాలను ఇప్పుడు ప్రిజన్ క్యాంప్ (నిర్బంధ కేంద్రం)గా మార్చారు. రెండేళ్ల క్రితమే నాకు ఈ విషయం తెలిసింది. నేను కన్నీళ్లు పెట్టుకున్నా’’... వరల్డ్ వీగర్ కాంగ్రెస్ యూకే ప్రాజెక్టు డైరెక్టర్ రహీమా మహమూద్ చెప్పిన మాటలివి.

రహీమా షింజియాంగ్‌లోనే పెరిగారు.

చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం షింజియాంగ్‌లో వీగర్ మస్లింల జనాభా 1.2 కోట్లు. కానీ, అక్కడ వీగర్ ముస్లింలు రెండు కోట్ల దాకా ఉంటారని రహీమా అంటున్నారు.

చరిత్రలో కొంత కాలం షింజియాంగ్ స్వతంత్రంగా ఉంది. 1949లో చైనాలో భాగమైంది. అప్పటివరకూ షింజియాంగ్‌లో మెజార్టీ వర్గం వీగర్ ముస్లింలే.

1960ల్లో చైనా ప్రభుత్వం చేపట్టిన సాంస్కృతిక విప్లవంలో భాగంగా ఏర్పడిన ‘రెడ్ గార్డ్స్’ మసీదులను నాశనం చేశారు.

1979 చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో మరణంతో ఓ రకమైన స్తబ్ధత ఏర్పడింది.

ఇదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో చైనాలోని ఇతర ప్రాంతాలకు చెందిన లక్షల మంది షింజియాంగ్‌కు వలస వచ్చారు. తమను అల్పసంఖ్యాకులను చేయడానికే ఈ ప్రయత్నమని వీగర్ ముస్లింలు అర్థం చేసుకున్నారు.

‘‘1980 నుంచి 1989 వరకూ మేం చాలావరకూ స్వేచ్ఛగా ఉన్నాం. మసీదులు తెరుచుకునేవి. పెద్దవాళ్లు వాళ్ల వాళ్ల పద్ధతుల్లో జీవించేవాళ్లు. అప్పుడప్పుడు నిరసన కూడా తెలపగలిగేవాళ్లం’’ అని రహీమా మహమూద్ అన్నారు.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత షింజియాంగ్‌లో వేర్పాటువాదం పెరిగింది. దీంతో వీగర్ ముస్లింల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

‘‘పోలీసులు ఇళ్లపై దాడులు చేసేవారు. మత నాయకులను, యువతీయువకులను అరెస్టు చేసేవారు’’ అని రహీమా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

మహాతిర్ మొహమ్మద్

2009లో షింజియాంగ్ రాజధాని ఉరూంచీలో అల్లర్లు జరిగాయి. వీటిలో 200 మంది చనిపోయారని చైనా ప్రభుత్వం తెలిపింది. చైనాలో అధికసంఖ్యాకులైన హన్ జాతి వాళ్లు ఈ అల్లర్ల మృతుల్లో ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.

ఈ అల్లర్లకు వీగర్ ముస్లింలను బాధ్యులుగా భావించారు..

దీని తర్వాత పెద్ద సంఖ్యలో జనాన్ని నిర్బంధించేందుకు తీగల కంచెలతో పెద్ద పెద్ద భవనాలను చైనా నిర్మించడం మొదలుపెట్టింది. రహీమా చదువుకున్నటువంటి పాఠశాలలు నిర్బంధ గృహాలుగా మారాయి.

‘‘వీగర్, టర్కీ మూలాలున్న జాతులను వేధించడం వారి ఉద్దేశం. మతాన్ని వాళ్లు వైరస్ అంటారు. అందుకే జనాన్ని బంధించి, కొడతారు. తిండి పెట్టకుండా వేధిస్తారు. చిన్న చిన్న గదుల్లో పెద్ద సంఖ్యలో జనాన్ని కుక్కుతారు. అందరూ ఒకేసారి నిద్రించే వీల్లేని పరిస్థితులు అక్కడ ఉంటాయి’’ అని రహీమా అన్నారు.

చైనాలో పది లక్షల మందిని బంధించినట్లుగా వచ్చిన ఓ నివేదికను రెండేళ్ల క్రితం ఐరాస ‘విశ్వసనీయమైనది’గా పేర్కొంది.

‘‘నిర్బంధ గృహాల్లో కమ్యూనిస్టు పార్టీ పాఠాలను బలవంతంగా చెబుతారు. ‘రెడ్ సాంగ్’ను నేర్పుతారు. పెద్దవాళ్లకు ఇలాంటివి నేర్చుకోవడం కష్టమవుతుంది. చైనీస్ రెడ్ సాంగ్ పాడలేకపోతే, శిక్ష కూడా విధిస్తారు. దేవుడు ఉన్నాడా అని అడుగుతారు. ఉన్నాడంటే కొడతారు. దేవుడిని నమ్మడం అక్కడ తప్పు’’ అని రహీమా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

మొదట్లో ఇలాంటి శిబిరాలే లేవని చైనా నిరాకరిస్తూ వచ్చింది. ఆ తర్వాత శిబిరాలు ఉన్నాయని, అయితే, ఇవి ‘రీ-ఎడ్యుకేషన్’ కేంద్రాలని వ్యాఖ్యానించింది. తీవ్రవాదం, మతోన్మాదాలను అంతమొందించేందుకు ‘వొకేషనల్ ట్రెయినింగ్’ ఇస్తుంటామని తెలిపింది.

‘‘కొందరిని 20 ఏళ్లు వచ్చే దాకా బంధించి పెడతారు. చైనా ప్రభుత్వపు మాటల్లో చెప్పాలంటే అప్పుడు గ్రాడ్యుయేట్ అయినట్లు. తర్వాత వారిని పరిశ్రమల్లో పనికి పంపుతారు’’ అని రహీమా అన్నారు.

ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం కొన్ని పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన పరిశ్రమల్లో 80 వేల మంది వీగర్లు పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

శిబిరాల్లో కాకుండా, షింజియాంగ్‌లో నివసించే వీగర్ ముస్లింలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రహీమా చెబుతున్నారు.

‘‘ముఖాలను పసిగట్టే కెమెరాలు ఉంటాయి. ప్రతి 200 మీటర్లకూ ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఇంటిలోపలా మీపై నిఘా కన్ను ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఇంటికి అతిథుల్లా మారి వస్తారు. ఇంట్లో మనతోనే ఉంటూ, మనల్ని గమనిస్తారు’’ అని రహీమా చెప్పారు..

రహీమా బ్రిటన్‌కు వచ్చిన తర్వాత, తిరిగి షింజియాంగ్‌కు వెళ్లలేదు. షింజియాంగ్‌లోనే ఆమె తోబుట్టువులు ఉన్నారు. బ్రిటన్‌లోనే ఉంటూ వీగర్ ముస్లింల పరిస్థితిని ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు కృషి చేయాలని రహీమా నిర్ణయించుకున్నారు.

చైనాలో వీగర్ల గురించైనా, మరే అల్పా సంఖ్యాక జాతుల గురించైనా మాట్లాడటమంటే చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే.

చైనా పెట్టుబడులపై ఆధారపడ్డ దేశాలు ఇలాంటి పనికి దిగాలనుకోవు. కానీ, మాట్లాడినా ఏ నష్టమూ లేని దేశాలు కూడా ఈ విషయమై గట్టిగా గొంతెత్తడం లేదు.

‘‘మొదట ప్రపంచానికి ఏమీ తెలియదేమో అని మేం అనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు తెలిసి కూడా ప్రపంచం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదన్నది మా వాళ్లకు వివరించడం కష్టంగా ఉంది’’ అని రహీమా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)