కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- జేమ్స్ గళ్లఘర్
- బీబీసీ ఆరోగ్యం, సైన్స్ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మానవాళి మీద కొత్త వైరస్ పంజా విసురుతోందంటూ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆరు నెలలు దాటింది.
అలా ప్రకటించిన రోజున - జనవరి చివర్లో - కోవిడ్-19 కేసులు 10,000 కేసులు మాత్రమే ఉండేవి. దానివల్ల చనిపోయిన వారి సంఖ్య 200 మందికి కొంచెం ఎక్కువగా ఉండింది. కానీ అవేవీ చైనా వెలుపల జరగలేదు.
అప్పటినుంచి ఇప్పటివరకు మన ప్రపంచం, మన జీవితాలు చాలా మారిపోయాయి. కరోనావైరస్ మహమ్మారితో మానవ జాతి యుద్ధంలో మన పరిస్థితి ఎలా ఉంది?
ప్రపంచం మొత్తంగా చూస్తే పరిస్థితి కొంత ఆందోళనకరంగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం కోవిడ్-19 కేసులు రెండు కోట్లు దాటాయి. మరణాలు కూడా 7,00,000 సంఖ్యను మించిపోయాయి. మొదట్లో లక్ష కేసులు నమోదయ్యేందుకు వారాలు పట్టేది. ఇప్పుడు ఈ సమయం గంటలకు తగ్గిపోయింది.
''ఇంకా మనం కరోనావైరస్ విజృంభణకు మధ్య దశలో ఉన్నాం. ఇది ప్రపంచంలో అన్ని మూలలకూ విస్తరించింది'' అని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్ మార్గరెట్ హ్యారిస్ చెప్పారు.
కరోనావైరస్ మహమ్మారి ఒకటే అయినప్పటికీ.. దీని విజృంభణ తీరు భిన్నంగా ఉంది. దీని ప్రభావం ఒక్కోచోట ఒక్కోలా ఉంది.
అయితే ఇక్కడ అందరినీ కలిపే విషయం ఒకటుంది. మీ ఇల్లు అమెజాన్ అడవుల్లో ఉన్నా.. సింగపూర్ ఆకాశ హర్మ్యాల్లో ఉన్నా.. యూకే నగరాల్లో ఉన్నా.. భారత పల్లెల్లో ఉన్నా.. మనుషుల కలయికతో పెరుగుతూ పోయే వైరస్ ఇది.
మనం మిగతా వారితో ఎంత సన్నిహితంగా ఉంటే.. వైరస్ అంత ఎక్కువగా విస్తరిస్తుంది. మొట్టమొదట చైనాలో ఈ వైరస్ వెలుగు చూసినపుడు ఎలా జరిగిందో ఇప్పుడూ అలాగే జరుగుతోంది.
ఈ కీలకమైన అంశమే.. ప్రపంచంలో మనం ఎక్కడున్నా పరిస్థితి ఎలా ఉందో కళ్లకుకడుతోంది. భవిష్యత్ ఎలా ఉంటుందో ఇదే అంశం శాసిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం లాటిన్ అమెరికాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు వైరస్ విజృంభణకు ఇది హాట్స్పాట్లా మారింది. భారత్ కేసుల్లోనూ ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపిస్తోంది. హాంకాంగ్ ఎందుకు ప్రజల్ని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతోంది? దక్షిణ కొరియా బ్యాంకు ఖాతాలు, ఫోన్ల ఆధారంగా ప్రజలపై ఎందుకు నిఘా పెట్టింది? లాంటి ప్రశ్నలకు ఇదే సమాధానాలు చెబుతోంది.
ఐరోపా, ఆస్ట్రేలియా కరోనావైరస్కు కళ్లెం వేయడానికి, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడానికి మధ్య సమతుల్యం పాటించేందుకు ఎందుకు కష్టపడుతున్నాయి? లాంటి ప్రశ్నలకూ జవాబులు చూపిస్తోంది. ఎందుకు ఇదివరకటి పరిస్థితులకు బదులు మనం కొత్త పరిస్థితుల కోసం అన్వేషిస్తున్నామో వివరిస్తోంది.
''ఈ వైరస్ ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఇది ప్రభావితం చేస్తోంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ.. మన మంతా కలిసి జీవిస్తున్నామని చెబుతోంది. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడమే కాదు. ఇతరులతో మాట్లాడుతున్నాం. కలిసి జీవితాలు గడుపుతున్నాం. ఇది అందరమూ చేసేదే. మనం కలిసి పాటలు పాడుకున్నా వైరస్ వ్యాపిస్తుంది'' అని సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన డాక్టర్ ఎలిజబెత్తా గ్రొప్పేలీ చెప్పారు.
వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టడమూ చాలా కష్టమని ఇప్పటికే రుజువైంది. చాలా మందిలో లక్షణాలు కూడా కనిపించడం లేదు. మరోవైపు కొందరు తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
''మన కాలం ఈ వైరస్‌కు అనువైనది. మనం ఇప్పుడు కరోనావైరస్ కాలంలో జీవిస్తున్నాం'' అని డాక్టర్ హ్యారిస్ వ్యాఖ్యానించారు.
ఎక్కడైనా విజయం సాధించారంటే.. వైరస్‌ను ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా అడ్డుకోవడం ద్వారానే అది సాధ్యమైందని చెప్పాలి. ఈ విషయంలో న్యూజీలాండ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అక్కడ కేసులు తక్కువగా ఉన్నప్పుడే త్వరగా స్పందించారు. లాక్డౌన్ విధించడంతోపాటు సరిహద్దులనూ మూసివేశారు. ఇప్పుడు అక్కడ దాదాపు కేసులు శూన్యం. పరిస్థితులు కూడా మునుపటిలా మారుతున్నాయి.
కొన్ని పేద దేశాలు కూడా సరైన చర్యలతో వైరస్‌కు కళ్లెం వేశాయి. చైనాతో మంగోలియాకు చాలా పెద్ద సరిహద్దు ఉంది. చెప్పాలంటే అక్కడ కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగుండాలి. కానీ జులై చివరివరకూ ఐసీయూలో చేర్పించాల్సిన కేసులు ఒకటి కూడా నమోదుకాలేదు. నేటికి అక్కడ మొత్తం కేసులు 293 మాత్రమే. మరణాలు శూన్యం.
ఫొటో సోర్స్, Getty Images
''చాలా తక్కువ వనరులతో మంగోలియా అద్భుతంగా కృషి చేసింది. కేసులను ఐసోలేషన్లోకి పంపిస్తూ.. వారితో మాట్లాడిన, కలిసిన వారిని వేగంగా గుర్తించారు'' అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ హేమ్యాన్ అన్నారు.
వారు పాఠశాలలను వేగంగా మూసివేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. మాస్క్‌లు పెట్టుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడంపై విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
మరోవైపు సమర్థులైన రాజకీయ నాయకులు లేకపోవడంతో చాలా దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ప్రొఫెసర్ హేమ్యాన్ అన్నారు. ''ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజారోగ్య నిపుణులు కలిసి పనిచేయడం కుదరలేని చోట ఈ పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, దేశ అంటు వ్యాధుల ప్రధాన నిపుణుడు అంటొనీ ఫాసీ.. రెండు వేర్వేరు మార్గాల్లో నడుస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో అయితే యాంటీ లాక్డౌన్ ర్యాలీలు చేపట్టేవారితో చేతులు కలిపారు. అంతేకాదు కరోనావైరస్ను సాధారణ ఫ్లూతో పోల్చారు. మార్చి చివరినాటికే దాదాపు మహమ్మారికి కళ్లేం పడుతుందని అన్నారు''
నేడు ఒక్క బ్రెజిల్‌లోనే 2.8 మిలియన్ కేసులున్నాయి. మృతుల సంఖ్య లక్ష దాటింది.
ఫొటో సోర్స్, Getty Images
వైరస్ కేసులు విపరీతంగా పెరిగిన కొన్ని దేశాలు లాక్డౌన్లతో కొంతవరకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ లాక్‌డౌన్‌ను సడిలిస్తే.. కేసులు మళ్లీ పెరుగుతాయి. ఇక్కడ మునుపటి పరిస్థితులు ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించడం లేదు.
''అక్కడ లాక్డౌన్ ఆంక్షలను సడలించడం చాలా కష్టంగా మారుతోంది. వైరస్‌తో కలిసి జీవించడం ఎలానో వారు ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటి దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. విక్టోరియా రాష్ట్రం ప్రస్తుతం విపత్తు దశలో ఉంది. జులై మొదట్లో మెల్బోర్న్లో లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలను పెంచుతూ వెళ్లారు. ఇప్పుడు అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలను తమ ఇల్లు దాటి ఐదు కి.మీ. దూరం వెళ్లొద్దని సూచిస్తున్నారు'' అని గ్రొప్పెల్లీ వివరించారు.
ఐరోపాలోనూ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. అయితే స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్‌లలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల్లో తొలిసారిగా జర్మనీలో రోజువారీ కేసులు వెయ్యిని దాటిపోయాయి.
ఒకప్పుడు యూరప్‌లో మాస్క్ పెట్టుకోవడం అక్కడక్కడా కనిపించేది. ఇప్పుడైతే తప్పనిసరి అయ్యింది. కొన్ని బీచ్ రిసార్ట్లు కూడా అందరూ మాస్క్‌లు పెట్టుకోవాలని చెబుతున్నాయి.
మొదటి కేసులను కట్టడి చేయడంపై హాంకాంగ్‌ను అందరూ ప్రశంసించారు. అక్కడ బార్లు, జిమ్‌లు తెరిచారు. అయితే కేసులు పెరగడంతో మళ్లీ వాటిని మూసేశారు. నెల రోజుల క్రితమే అక్కడి డిస్నీల్యాండ్ రిసార్ట్‌ను మళ్లీ తెరిచారు.
''లాక్‌డౌన్‌ను తెరిచినంత మాత్రాన పరిస్థితులు మనుపటికి వచ్చాయని కాదు. ఇవి కొత్త పరిస్థితులు. చాలా మందికి ఇంకా ఈ విషయం అర్థంకాలేదు'' అని హ్యారిస్ వ్యాఖ్యానించారు.
ఆఫ్రికాలో కరోనావైరస్పై పోరాటం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలానే మిగిలింది. అక్కడ కేసులు మిలియన్‌ను దాటిపోయాయి. మొదట్లో చక్కగా పనిచేసిన దక్షిణాఫ్రికా నేడు ఆందోళనకర పరిస్థితిలో ఉంది. నేడు ఆఫ్రికాలో ఎక్కువ కేసులున్నది అక్కడే. అయితే తక్కువ పరీక్షలు చేస్తే పరిస్థితి ఎప్పటికీ బయటపడదు.
మరోవైపు ఆఫ్రికాలో మరణ రేటు మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమైఉండొచ్చంటే..
- ఇక్కడ ప్రజల సగటు వయసు 19. అంటే ఇక్కడ యువకులు ఎక్కువగా ఉన్నారు. వృద్ధులను వైరస్ ఎక్కువగా ప్రభావితం చేసే సంగతి తెలిసిందే.
- కొన్ని ఇతర వైరస్ల విజృంభణ ఇక్కడ ఎక్కువే. అందుకే కొంతవరకు ప్రజలకు రక్షణ ఉండే అవకాశముంది.
- ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ధనిక దేశాల్లో ఉంటాయి. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం లాంటివి. ఇవి కరోనావైరస్తో మరణించే ముప్పును పెంచుతాయి. ఆఫ్రికాలో ఇలాంటి వ్యాధులు తక్కువే.
కొన్ని దేశాలు వైరస్‌ను అడ్డుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. కరోనావైరస్ ఆంక్షల గురించి ప్రజలకు తెలియజేసేందుకు, ఆసుపత్రులకు ఔషధాలు చేరవేసేందుకు రువాండా డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించేవారికి ఇక్కడ శిక్షలు కూడా విధిస్తున్నారు.
భారత్, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీరు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఇక్కడ చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి నీరు అందుబాటులో ఉండటంలేదు.
‘ఇక్కడ కొంత మందికి చేతులు కడుక్కోవడానికి నీరు ఉంటే.. చాలా మందికి నీరు ఉండటం లేదు. ఇక్కడ ఆ విభజన స్పష్టంగా ఉంది. మనం ఇక్కడ ప్రపంచాన్ని రెండుగా విభజించొచ్చు. మరోవైపు వ్యాక్సీన్ లేకుండా వైరస్‌ను ఇక్కడ ఎలా నియంత్రణలోకి తీసుకొస్తారు అనేదే పెద్ద ప్రశ్న’’ అన్ని గ్రోప్పెల్లీ వ్యాఖ్యానించారు.
ఇదంతా ఎప్పటికి ముగుస్తుంది?
ఇప్పటికే ఔషధాలతో చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రంగా లక్షణాలుండే వారిపై డెక్సామెథాసోన్ కొంతవరకు పనిచేస్తోంది. అయితే కోవిడ్-19 రోగులు మరణించకుండా ఆపేందుకు, లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసేందుకు ఇది సరిపోదు. తమ వ్యూహం దీర్ఘకాలంలో పనిచేస్తుందా? లేదా అని అందరూ స్వీడన్వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వీడన్ ఎలాంటి లాక్డౌన్లు విధించలేదు. ప్రస్తుతానికి అక్కడ మరణ రేటు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం అందరి ఆశలు వ్యాక్సీన్పైనే ఉన్నాయి. మునుపటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఆరు వ్యాక్సీన్లు మనుషులపై ప్రయోగ దశకు చేరుకున్నాయి. వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తుందా? లేదా అనేది కనుక్కోవడంలో ఇది కీలకమైన దశ. ఇక్కడే చాలా ఔషధాలు విఫలం అవుతుంటాయి. వ్యాక్సీన్ వస్తుందా? లేదా? అనేది కాదు.. ఎప్పుడు వస్తుంది? అనేదే అసలైన ప్రశ్న అని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కరోనావైరస్: ఇదే చివరి మహమ్మారి కాదా? భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- పాకిస్తాన్: గుజరాత్‌లోని జునాగఢ్‌ను తన రాజకీయ మ్యాప్‌లో చూపడం వల్ల ప్రయోజనం ఏమిటి?
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో రియా చక్రవర్తి ఎందుకు విలన్ అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)