హీలియం డిస్కవరీ డే: ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన బెలూన్ గ్యాస్
- వరికూటి రామకృష్ణ
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
1868 అగస్ట్ 18న గుంటూరులో సూర్యగ్రహణాన్ని పరిశీలిస్తున్న సమయంలో అనుకోకుండా హీలియంను గుర్తించారు.
మచిలీపట్నం బందరు లడ్డుకు పేరయితే, గుంటూరు మిరప ఘాటు అందరికి తెలిసిందే. వీటితో పాటు ఈ రెండు పట్టణాలకు మరో ప్రత్యేకత ఉంది.
హీలియం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గాలిలో తేలిపోయే రంగురంగుల బెలూన్లు. సైన్స్ జీవులయితే అదొక వాయువని, గాలి కంటే తేలికనైదని అంటారు. తేలిపోయే ఈ గుణమే హీలియానికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. హీలియం వాయువుకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేకమైన సంబంధం ఏమిటి? ఈ కథ తెలియాలంటే 152 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. ఆగస్ట్ 18 హీలియం డిస్కవరీ డే సందర్భంగా ఆ కథేమిటో తెలుసుకుందాం.
1868 అగస్ట్ 18... గుంటూరు
సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిన రోజు.
పొద్దున్నే ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. నింగి వంకే చూస్తున్న ఫ్రెంచ్ ఖగోళశాస్త్రవేత్త పియరీ జాన్సెన్ కంగారుగా కనిపిస్తున్నారు. సుమారు పదేళ్లుగా ఈ అవకాశం కోసం ఆయన ఎదురు చూశారు. గ్రహణం రోజున సూర్యుని ఉపరితలాన్ని పరిశీలించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నది జాన్సెన్ లక్ష్యం.
వేల కిలోమీటర్ల దూరంలోనున్న ఫ్రాన్స్ నుంచి గుంటూరుకు వచ్చిన ఆయనను మబ్బులు భయపెడుతున్నాయి. ఆకాశం నిర్మలంగా లేకుంటే సూర్యుడిని స్పష్టంగా గమనించడం సాధ్యం కాదు. ముందుగా మచిలీపట్నం వెళ్లినప్పటికీ తీర ప్రాంతం కాబట్టి అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో గుంటూరును తన ప్రయోగాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. సంపన్నులైన ఫ్రెంచ్ వ్యాపారులు అక్కడ ఉండటం కూడా జాన్సెన్ ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి మరో కారణం. నాడు గుంటూరులోనే ఎత్తయిన ఒక ఫ్రెంచ్ వ్యాపారి భవనాన్ని తన ప్రయోగాల కోసం వాడుకున్నారు జాన్సెన్.
ఫొటో సోర్స్, GettyImages
ఫ్రెంచ్ ఖగోళశాస్త్రవేత్త పియరీ జాన్సెన్ గుంటూరులో ప్రయోగాలు చేశారు.
కొత్త మూలకం:
కొద్ది గంటల తరువాత మబ్బులు విడిపోయాయి. ఆకాశం నిర్మలంగా మారింది. జాన్సెన్ ఉత్సాహంగా స్పెక్ట్రోస్కోప్‌తో సూర్యుని కరోనాను పరిశీలించడం మొదలుపెట్టారు. సూర్యుని రసాయనిక లక్షణాలను గమనిస్తున్న ఆయనకు ముదురు పసుపు రంగులో ఉండే గీత కనిపించింది. అంతక ముందు ఎన్నడూ దాన్ని చూడలేదు. అంటే ఒక కొత్త మూలకం ఏదో సూర్యునిలో ఉంది. కానీ అదేంటో తెలియలేదు.
1868 అక్టోబర్ 20... బ్రిటన్
లండలోని ఖగోళశాస్త్రవేత్త నార్మన్ లాక్యీర్ కూడా సూర్యుని ఉపరితలాన్ని పరిశీలించి ముదురు పసుపురంగు గీతను చూశారు. కానీ అదేమిటో ఆయనకూ తెలియలేదు. దాన్నొక కొత్త మూలకంగా గుర్తించారు. అయితే నార్మన్కు గుంటూరులోని జాన్సన్ చేసిన ప్రయోగాల గురించి తెలియదు.
గుంటూరులోని పీయరి జాన్సెన్, లండన్‌లోని నార్మన్ లాక్యీర్ పరిశోధనల ఫలితాలు ఒకేసారి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చేరుకున్నాయి. అందువల్ల ఆ కొత్త మూలకాన్ని కనుగొన్న ఘనతను వీరిద్దరికి ఇచ్చారు.
ఫొటో సోర్స్, GettyImages
బ్రిటిష్ ఖగోళశాస్త్రవేత్త నార్మన్ లాక్యీర్
కొత్త మూలకమే హీలియం
ఆ తరువాత కొద్ది సంవత్సరాలు ప్రయోగశాలల్లో ఆ కొత్త మూలకాన్ని గుర్తించేందుకు నార్మన్ లాక్యీర్ ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. దానితో ఆ మూలకం సూర్యునికి మాత్రమే చెందినదని భావించిన నార్మన్ దానికి హీలియం అని పేరు పెట్టారు. ఎందుకంటే గ్రీకు భాషలో హీలియాస్ అంటే సూర్యుడని అర్థం.
కొత్త మూలకాన్ని హీలియం అని పిలుస్తున్నప్పటికీ జాన్సెన్, నార్మన్ ప్రతిపాదనలను చాలా మంది నమ్మలేదు. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆ మూలకం జాడ భూమి మీద లభించకపోవడం వారిలో అనుమానాలు రేకెత్తించింది. కొత్తగా కనిపించిన ఆ ముదురు పసుపు రంగు గీతలు హైడ్రోజన్ వల్లే ఏర్పడి ఉంటాయని కొందరు భావించారు.
ఫొటో సోర్స్, NASA/GSFC
1868 అగస్ట్ 18న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం పరిధిని తెలిపే మ్యాపు.
దొరికిన జాడ
1895లో భూమి మీద దాని జాడను గుర్తించారు స్కాటిస్ సైంటిస్ట్ విలియ్ రామ్సే. యురేనియం నుంచి ఆయన ఒక ఇనర్ట్ గ్యాస్‌ను వేరు చేశారు.
దీని తరంగ ధైర్ఘ్యం, సూర్యునిలో పియరీ జాన్సెన్, నార్మన్ లాక్యీర్ గుర్తించిన కొత్త మూలకంతో కచ్చితంగా సరిపోయింది. ఆవిధంగా హీలియం ఆవర్తన పట్టికలోనూ చోటు దక్కించుకుంది.
ఫొటో సోర్స్, Pixabay
మచిలీపట్నంలో మకాం
నాటి మద్రాస్ అబ్జర్వేటరీ డైరెక్టర్ నార్మన్ పోగ్సన్ కూడా 1868 అగస్ట్ 18న సూర్యగ్రహణాన్ని పరిశీలించేందుకు మచిలీపట్నంలో మకాం వేశారు. ఆయన కూడా తన పరిశీలనలో కొత్త గీతను గమనించారు.
పోగ్సన్కు దక్కని గుర్తింపు': ప్రొ. బీమన్ నాథ్
కానీ హీలియం విషయంలో పోగ్సన్ పరిశోధనలకు గుర్తింపు దక్కలేదని రామన్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ఆస్ట్రానమీ ప్రొఫెసర్ బీమన్ నాథ్ అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ 'మచిలీపట్నం నుంచి 1868 ఆగస్టులో సూర్యగ్రహణాన్ని పరిశీలించిన నార్మన్ పోగ్సన్ మాత్రమే కాంతి వర్ణపటంలోని కొత్త గీతల గురించి తన రిపోర్టులో రాశారు. అదే ఏడాది అక్టోబరులో లండన్‌లోని నార్మన్ లాక్యీర్, పోగ్సన్ చెప్పిన దాన్ని రుజువు చేశారు. నేచర్ అనే సైన్స్ జర్నల్‌లో 1895లో నార్మన్ లాక్యేర్ హీలియం కనుగొనడానికి దారి తీసిన ఘటనల వరుసగా రాశారు. అందులో జాన్సెన్ ప్రయోగాల గురించి ఆయన ప్రస్తావించలేదు. పోగ్సన్ రిపోర్టు తనకు ఎంతో ఆసక్తిని కలిగించిందని మాత్రమే లాక్యీర్ రాశారు. అంతేకాదు ఖగోళశాస్త్రవేత్త సుబ్రమణియన్ చంద్రశేఖర్ కూడా 1947లో రాసిన ఒక వ్యాసంలో హీలియం క్రెడిట్ పోగ్సన్కే ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల పోగ్సన్ రిపోర్టు ఏ సైన్స్ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అందువల్ల ఆయనకు గుర్తింపు రాలేదు.' అని వివరించారు.
ఫొటో సోర్స్, NASA
1868 అగస్ట్ 18న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఎందుకు?
ఆరోజుల్లో సూర్యగ్రహణం రోజున తప్ప మాములు రోజుల్లో సూర్యుని ఉపరితలాన్ని చూడలేమని భావించేవారు. అందువల్లే గ్రహణాలప్పుడు సూర్యునిపై ప్రయోగాలు చేపట్టేవారు. అలా ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచమంతా పర్యటించేవారు. 1868 నాటి సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో భారతదేశం కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి గ్రహణాన్ని బాగా వీక్షించవచ్చు.
అయితే భౌగోళికంగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని గుంటూరు, మచిలీపట్నం గ్రహణ వీక్షణానికి అత్యంత అనుకూలంగా ఉండటంతో ఈ ప్రదేశాలను ఎంచుకున్నారు. అంతేకాక గ్రహణం కనిపించే సమయం కూడా ఇక్కడ ఎక్కువ. అందువల్ల బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి ఖగోళశాస్త్రవేత్తలు భారత్‌కు వచ్చారు.
ఆవర్తన పట్టికలోని అన్ని మూలకాలను భౌతిక లేదా రసాయన శాస్త్రవేతలు కనుగొంటే, ఒక్క హీలియాన్ని మాత్రం ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా అనేక ప్రత్యేకతలున్న హీలియం డిస్కవరీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యేకత ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- ‘అచ్రేకర్ సర్‌తో నా అద్భుత ప్రయాణం అలా మొదలైంది’ - సచిన్ తెండూల్కర్
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి చేయి విరగ్గొట్టుకున్నాను: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- సచిన్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- భారత క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)