అమెరికా ఎన్నికలు: కొత్త అధ్యక్షుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు

Promo image showing Joe Biden and Donald Trump

అమెరికా అధ్యక్షుడంటే మాటలు కాదు. యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణంలో మార్పులు... ఇలా ఏ సంక్షోభం వచ్చినా, దానిపై దేశాల స్పందనను అమెరికా అధ్యక్ష పీఠం ప్రభావితం చేస్తుంది.

ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియపై చాలా కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. బీబీసీ ప్రతినిధులుగా మేం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎలక్ట్రోరల్ కాలేజీ ఎలా పని చేస్తుంది, ఏ రాష్ట్రం కీలకంగా మారనున్నాయనే విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మీరు మొదటిసారి తెలుసుకోవాలనుకున్నా, ఉన్న అవగాహనను మరింత పెంచుకోవాలని అనుకున్నా ఈ సింపుల్ గైడ్‌ మీకు సహాయపడుతుంది.

ఎన్నికలు ఎప్పుడు, అభ్యర్ధులు ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్‌ మొదటి సోమవారం తర్వాతి మొదటి మంగళవారం జరుగుతాయి. ఈసారి నవంబరు 3న ఎన్నికలు నిర్వహించారు.

చాలా ఇతర దేశాల ఎన్నికలతో పోలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే జరుగుతాయి. ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒకదాని నుంచి అధ్యక్షుడు ఎన్నికవుతారు.

రిపబ్లికన్‌ పార్టీకి అమెరికాలో సంప్రదాయవాద పార్టీగా పేరుంది. ఈసారి ఆ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పోటీ పడ్డారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ బరిలో నిలిచారు. విజయం ఆయన్నే వరించింది.

విజేతను నిర్ణయించేది ఎవరు ?

దేశవ్యాప్తంగా అత్యధికంగా ఓట్లు సాధించినంత మాత్రాన వారు అమెరికాకు అధ్యక్షులైపోరు. 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది.

ఎలక్ట్రోరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలవుతారు. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. అమెరికాలో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు.

రెండు రాష్ట్రాలు మినహా, మిగిలిన రాష్ట్రాలు విన్నర్స్‌ టేక్స్‌ ఆల్‌ అనే నిబంధన కింద ఓటింగ్‌లో పాల్గొంటాయి. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు గెలిచిన అభ్యర్ధికి రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌ ఓట్లను కేటాయిస్తారు.

చాలా రాష్ట్రాలు ఒకపార్టీవైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతాయి. అంటే పార్టీలు ఒక డజన్‌ ఆపై రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించి, ఎక్కువ ఓట్లను పొందగలిగితే వారు విజేతలవుతారు. అలాంటి రాష్ట్రాలనే బ్యాటిల్‌ గ్రౌండ్ స్టేట్స్‌ అంటారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1992 తర్వాత డెమొక్రాట్లకు దక్కని జార్జియాలో గెలవడం ద్వారా జో బైడెన్‌ చరిత్ర సృష్టించారు. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 272 ఎలక్టొరల్ ఓట్ల అవసరం. అయితే, జో బైడెన్‌ 306 ఎలక్టొరల్ ఓట్లను సంపాదించారు.

ఎవరు ఓటు వేస్తారు, ఎలా వేస్తారు ?

18 సంవత్సరాలు నిండి, అమెరికా పౌరుడైతే అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి అర్హత సాధిస్తారు.అయితే అనేక రాష్ట్రాలు తాము ఎవరో నిరూపించుకునే గుర్తింపు కార్డులను చూపాలంటూ ఓటర్లకు నిబంధనలు విధించాయి.

సాధారణంగా రిపబ్లికన్‌ పార్టీ ఇలాంటి నిబంధనలను డిమాండ్‌ చేస్తుంది. ఓటింగ్‌ ప్రక్రియలో అక్రమాలు జరక్కుండా ఈ ఏర్పాటు ఉండాలన్నది ఆ పార్ వాదన. అయితే డెమొక్రాటిక్‌ పార్టీ మాత్రం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తుంది. ఇది ఓటర్ల హక్కులను అణచి వేయడమేనని, ఐడీ కార్డు చూపలేని మైనారిటీలు, పేదలు ఓటింగ్‌కు దూరమవుతారన్నది ఆ పార్టీ మాట.

ఫొటో క్యాప్షన్,

సెనెట్‌పై పట్టు కోసం డెమొక్రాట్ల ప్రయత్నాలు

ఖైదీలు ఓటు వేయవచ్చా లేదా అన్న అంశంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం అమలులో ఉంది. చాలామంది నేరస్తులకు ఓటు హక్కు ఉండదు. వారు జైలు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికల్లో ఓటేసే అర్హత పొందుతారు.

చాలామంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా అమల్లోకి వచ్చాయి. 2016 ఎన్నికల్లో 21శాతం మంది ఓటర్లు పోస్టు ద్వారా తమ ఓటును వేశారు.

కరోనా వైరస్‌ కారణంగా ఈసారి ప్రజలు ఎలా ఓటేస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోస్టల్ బ్యాలట్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తుంటే, అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తన దగ్గర పెద్దగా రుజువులు లేకపోయినా, ఎన్నికల అక్రమాలకు ఇది కారణమవుతుందని వాదిస్తున్నారు.

ఇది కేవలం అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియేనా ?

కాదనే చెప్పాలి. అందరి దృష్టి ఇప్పుడు పోటీలో ఉన్న ట్రంప్‌, బిడెన్‌ల మీదే ఉందిగానీ, ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్‌ సభ్యులను కూడా ఓటర్లు ఎన్నుకుంటారు.

డెమొక్రాట్లకు ఇప్పటికే ప్రతినిధుల సభ మీద పట్టుంది. ఓవైపు ప్రతినిధుల సభ మీద తమ పట్టును కొనసాగిస్తూనే, సెనెట్‌ను కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలని వారు భావిస్తున్నారు.

రెండింటి మీద పట్టుసాధిస్తే, ఒకవేళ ట్రంప్‌ గెలిచినా, ఆయన తీసుకునే నిర్ణయాలను ఆపడం, ఆలస్యం చేయడంలాంటివి చేయగలరు. ప్రతినిధుల సభలో 435 సీట్లకు ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే సెనెట్‌లో 33 సీట్లకు ఓటింగ్‌ జరగనుంది.

ఫలితాల ప్రకటన

ప్రతి ఓటును లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి, ఫలితాలకు చాలా రోజుల సమయం పట్టింది. అయితే గెలిచేది ఎవరు అన్నది ఓటింగ్ మరుసటి రోజు ఉదయానికి ట్రెండ్స్‌ను బట్టి అర్ధమైపోయింది.

2000 సంవత్సరం ఎన్నికల్లో ఫలితాలు గంటల్లో తేలిపోలేదు. ఒక నెల తర్వాత అంటే సుప్రీం కోర్టు తీర్పుతోనే విజేత ఎవరో తేలింది.

ఫొటో క్యాప్షన్,

వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ సిటీ మెట్ల మీద అధ్యక్షుడి ప్రమాణం ఉంటుంది.

విజేత ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు ?

విజయం సాధించిన జో బైడెన్‌ పగ్గాలు చేపట్టేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో గెలిచిన అభ్యర్ధి తన క్యాబినెట్ మినిస్టర్ల జాబితాతోపాటు కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.

కొత్తగా ఎన్నికైన అభ్యర్ధి అధికారికంగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్‌ బిల్డింగ్‌ మెట్ల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమం తర్వాత కొత్త అధ్యక్షుడు వైట్‌హౌస్‌కు బయలుదేరతారు. అప్పటి నుంచి వారి నాలుగేళ్ల పాలనా కాలం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)