ఫేస్‌బుక్ నిజంగానే భారత్‌లో అధికార బీజేపీకి సహకరిస్తోందా?

  • సౌతిక్‌ బిస్వాస్‌
  • బీబీసీ ప్రతినిధి
Facebook

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫేస్‌బుక్‌కు భారతదేశంలో 30 కోట్ల మంది యూజర్లున్నారు.

భారతదేశంలో తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోడానికి అధికార బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలను ఫేస్‌బుక్‌ తేలికగా తీసుకుందా? వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం దీనిపై విచారణ జరపాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. ఈ కథనం అనంతర పరిణామాలను బీబీసీ ప్రతినిధి సౌతిక్‌ బిస్వాస్‌ అందిస్తున్నారు.

భారతదేశంలో ఫేస్‌బుక్‌కు 34కోట్లమంది యూజర్లు ఉన్నారు. ఇది అతిపెద్ద మార్కెట్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో 5.7బిలియన్‌ డాలర్లను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ఇండియన్‌ మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ రిలయన్స్‌ జియోలో పెట్టుబడిగా పెట్టింది ఫేస్‌బుక్‌. ఇది భారతదేశంలో ఆ సంస్థకు మరింత బూస్ట్‌నిచ్చే నిర్ణయం.

ఫేస్‌బుక్‌ ఆధ్వరంలోనే నడిచే వాట్సాప్‌కు భారత్‌లో 40కోట్లమంది యూజర్లున్నారు. త్వరలో ఇది పేమెంట్ సర్వీసులను కూడా మొదలు పెట్టబోతోంది.

ఈ వివాదం బయటపడ్డాక నేను ఫేస్‌బుక్‌కు కొన్ని ప్రశ్నలు వేశాను. రాజాసింగ్‌ ఎకౌంట్‌ను ఎందుకు రద్దు చేయలేదు, ప్రజాప్రతినిధుల ఎకౌంట్ల విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తారు, హేట్‌ స్పీచ్‌ నిబంధనల పేరుతో ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని పేజీలను బ్లాక్‌ చేశారు, ఎన్ని ఎకౌంట్లను రద్దు చేశారు అన్నవి నా ప్రశ్నలు.

"రాజకీయాలతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ఎలాంటి విద్వేష పూరిత కంటెంట్‌కైనా మా నిబంధనలను అమలు చేస్తాం. ఈ నిబంధనలన్నీ సవ్యంగా అమలవుతున్నాయా లేదా అన్నదానిపై మేం ఎప్పటికప్పుడు సరి చూసుకుంటాం'' అని ఫేస్‌బుక్‌కు చెందిన ఒక ప్రతినిధి నా మెయిల్‌కు సమాధానం పంపారు.

అయితే వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు వివరణ పంపిన ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఆండీస్టోన్‌ " రాజాసింగ్‌లాంటి నేతలను ప్రమాదకరమైన వ్యక్తులుగా ప్రకటించడం వల్ల కలిగే పరిణామాలను మాత్రమే అంఖీదాస్‌ ప్రస్తావించారు. రాజాసింగ్‌లాంటి వ్యక్తులను ఈ ప్లాట్‌ఫామ్‌ మీద కొనసాగించాలన్నది సంస్థ అభిప్రాయం కాదు'' అని నాతో అన్నారు.

ఫొటో క్యాప్షన్,

తన ఫేస్‌బుక్ పేజి 2018లో హ్యాక్ అయిందని, ఆ తరువాత డిలిట్ చేశారని రాజాసింగ్ చెబుతున్నారు.

తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌కు 300,000 మంది ఫాలోవర్లు ఉండేవారని, ఆ ఎకౌంట్‌ను 2018లో హ్యాక్‌ చేసి, డిలీట్‌ చేశారని, తాను ఈ మేరకు స్థానిక సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చెప్పారు. " దానినే కొందరు దుర్వినియోగం చేస్తున్నారేమో'' అని ఆయన నాతో అన్నారు.

విద్వేష పూరిత కామెంట్లు ఉన్నాయన్న కారణంతో తన అభిమానులు సృష్టించిన పేజీలను ఫేస్‌బుక్‌ నిలిపివేసి ఉండొచ్చని రాజాసింగ్‌ అన్నారు. "నా అభిమానులు ఎవరైనా ఈ స్పీచ్‌లను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి ఉండొచ్చు'' అన్నారాయన.

"పబ్లిక్‌ మీటింగ్‌లో నేను నా స్టైల్లో మాట్లాడతాను. వీటిని రికార్డు చేసి నా అభిమానులు ఫేస్‌బుక్‌లో పెట్టి ఉండొచ్చు'' అన్నారు రాజాసింగ్‌.

మీరు అలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు ఎందుకు అప్‌లోడ్ చేస్తారని నేను ఆయన్ను అడిగాను. " మా ప్రాంతంలో చాలామంది సంఘ విద్రోహశక్తులున్నారు. నేను వారికి నా భాషలో కౌంటర్‌ ఇస్తాను. అది ఒక్కోసారి మతం రంగు పులుముకుంటుంది'' అన్నారాయన.

అయితే, ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి అనుకూలంగా ఫేస్‌బుక్‌ నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇవాళ కొత్తగా వచ్చిన ఆరోపణ కాదు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ప్రధాని మోదీ, మార్క్ జుకర్‌బర్గ్ (2015)

భారతదేశంలో సోషల్‌ మీడియా డెవలప్‌మెంట్‌ మీద సిరిల్‌ శ్యామ్‌, పరంజోయ్‌ గుహ అనే ఇద్దరు జర్నలిస్టులు 2018లో పలు కథనాలు రాశారు. ప్రధానమంత్రి , బీజేపీ మిత్రుల సహకారంతో భారతదేశంలో సోషల్ మీడియా సంస్థలు వేగంగా ఎదుగుతున్నాయని ఈ కథనాల్లో పేర్కొన్నారు. (ఫేస్‌బుక్‌తో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అనుబంధాన్ని కూడా ఈ కథనాల్లో ప్రస్తావించారు)

2018 సంవత్సరలో అమెరికాతోపాటు, భారతదేశంలోని ఫేస్‌బుక్‌ సంస్థ సీనియర్‌ ప్రతినిధులతో తాను సమావేశమైనట్లు కాంగ్రెస్‌పార్టీ డేటా ఎనలిటిక్స్‌ చీఫ్‌ ప్రవీణ్‌ చక్రవర్తి వెల్లడించారు.

"మా పట్ల పక్షపాతం, ఇండియాలోని తమ నాయకత్వంతో భాగస్వామ్యం అంశాలపై మేం చర్చించాం. వివాదాస్పద ఫైటర్ జెట్ల ఆరోపణల కారణంగా తమ పార్టీ ప్రకటనలను తీసుకోవడం లేదన్న వాదనను సంస్థ ప్రతినిధులు తోసిపుచ్చారు'' అని చక్రవర్తి చెప్పారు.

"ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కానీ తర్వాత ఏమీ జరగలేదు'' అని ఆయన వివరించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయి గత ఏడాది పార్లమెంటులో ఫేస్‌బుక్‌ అంశాన్ని లేవనెత్తారు."బీజేపీ వ్యతిరేక వార్తలను సెన్సార్‌ చేసేలా ఫేస్‌బుక్‌ తన ప్రోగ్రామ్‌ను తయారు చేసింది'' అని ఆయన ఆరోపించారు.

ఈ విషయంపై నేను డెరెక్‌ను సంప్రదించగా " పార్లమెంటులో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. దీనిని వదిలి పెట్టను'' అని ఆయన అన్నారు.

"ఈ వ్యవహారంపై వివరణ కోరాల్సిన అవసరం ఉంది'' అని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ కమిటీకి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

"ఇది చాలా సీరియస్‌ విషయం. ఎందుకంటే ఫేస్‌బుక్‌కు భారతదేశంలో విస్తృతమైనవ్యాప్తి ఉంది. విద్వేషపూరిత ప్రసంగాల వల్ల దేశంలో మతకల్లోలాలు, ఉద్రిక్తలు చెలరేగే అవకాశం ఉంది. అయితే మీడియా రిపోర్టుల ఆధారంగా కాకుండా, సమగ్ర విచారణ జరిపి ఒక నిర్ణయానికి రావాలి'' అని థరూర్‌ అన్నారు.

"ఇండియాలో ఫేస్‌బుక్‌ డేటా తీసుకోకుండా, ఆ సంస్థ రికార్డులను పరిశీలించడం సాధ్యం కాదు'' అన్నారు చిన్మయి అరుణ్‌. ఆమె యేల్ లా స్కూల్‌లో ఇన్ఫర్మేషన్‌ సొసైటీ ప్రాజెక్టులో ఫెలోగా పని చేస్తున్నారు.

"ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా తమ విధానాలను తక్షణమే మార్చుకోవడం లేదా మెరుగు పరుచుకున్న సందర్భాలున్నాయి. కానీ వాటిని అమలు చేయడమే అనుమానం. సంస్థలో పని చేసేవారు చెబితే తప్ప 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌' ప్రచురించిన కథనంలోని సమాచారం బైటికి రాక పోవచ్చు'' అని అరుణ్‌ అన్నారు.

జనవరి నుంచి మార్చి మధ్యలో రెండు కోట్లకు పైగా ఈ విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పేజ్‌లపై చర్యలు తీసుకున్నట్లు ఇటీవల విడుదల చేసిన కమ్యూనిటీ స్టాండర్ట్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టులో ఫేస్‌బుక్‌ పేర్కొంది.

అయితే, ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఈ సోషల్‌ దిగ్గజం ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)