మొబైల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్‌ లేదు... ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా వినాలి?

  • అనంత్ ప్రకాశ్‌
  • బీబీసీ ప్రతినిధి
ఆన్ లైన్ విద్యాబోధన

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో ఎంతమంది పిల్లలకు చదువుకోవడానికి స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది? ఇది భారత ప్రభుత్వానికి ఇంత వరకు సమాధానం దొరకని ప్రశ్న.

18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంతమంది పిల్లలకు టీవీ, రేడియో, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, కనీసం మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ ఫోన్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని ఆగస్టు 19న నేషనల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) సంస్థ వెల్లడించింది.

నాణ్యమైన ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లాంటి సదుపాయలు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు చదువులకు దూరమవుతున్నారని ఒక సర్వేలో తేలింది.

ఇండియాలో 24 కోట్లమంది విద్యార్ధులుండగా, వారిలో 18,188 మందిపై సర్వే నిర్వహించగా 80 శాతం మంది పిల్లలకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని, 20 శాతం మందికి స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో లేదని తేలింది.

ఈ గణాంకాలతో మనకు తెలిసేదేంటి?

ఈ సర్వేలో తేలిన ఫలితాలు పూర్తి పరిస్థితిని అర్ధం చేసుకోడానికి పనికొస్తాయా? NCERT అంచనా ప్రకారం భారతదేశంలో 27 శాతానికి పైగా పిల్లలు, ఉపాధ్యాయులు, గృహస్తులు ఆన్‌లైన్‌ తరగతులలో పాల్గొనడానికి స్మార్ట్‌ఫోన్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక అమ్మాయి స్మార్ట్‌ఫోన్‌ లేక తాను ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయానన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది.

అసోంలో 15ఏళ్ల విద్యార్ధి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేనందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురలో తన బిడ్డకు ఫోన్‌ కొనివ్వలేకపోయానన్న బాధతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇవన్నీ గణాంకాలు కావు. మానవ జీవితంలోని నిస్సహాయతకు నిదర్శనాలు. ప్రధాన జీవన స్రవంతిలో చాలామందికి కనిపించని విఫల స్వప్నాలు.

భారతదేశంలో కులం, మతం, సామాజిక అగాధాల నుంచి బైటపడటానికి ఉన్న ఒకే ఒక మార్గం విద్య అని నిపుణుల అభిప్రాయం. ఈ అగాధంలో నివసించే ఒక రిక్షా నడిపే వ్యక్తి కూతురు ఐఏఎస్ అధికారి అయ్యింది. మరో అమ్మాయి కులం సరిహద్దులను దాటుకుని ఉన్నతాధికారిగా మారింది.

వీరు ఇలా లక్ష్యాలను సాధించడానికి కారణం వారి తల్లిదండ్రులు. పిల్లలు చదువుకుంటే తాము ఎదుర్కొన్న సమస్యలు పిల్లలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వారు బలంగా నమ్ముతారు.

ఫొటో సోర్స్, Suvrajit Dutta/Pacific Press/LightRocket via Getty

పరిమితంగా మారిన విద్యా హక్కు

మార్చిలో లాక్‌డౌన్ ప్రారంభం అయ్యాక, భారతదేశంలో విద్య కొన్నివర్గాల వారికే అందుబాటులోఉంటుందన్న విషయం చాలామంది విద్యార్ధులకు అర్ధమయింది.

ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో విద్యాహక్కు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నవారికే పరిమితమైంది. డిజిటల్‌ గాడ్జెట్‌లు లేనివారు ఆన్‌లైన్‌ పాఠశాలలకు దూరమవుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన సంబ్రాంత్‌ తండ్రి వీరేంద్రకుమార్, తన కొడుకు రాబోయే కొద్దిరోజులు టెక్స్ట్ మెసేజ్‌లు, వాట్సాప్ ద్వారా చదువుకోవాల్సి వస్తుందని తెలిసినప్పుడు అది అయ్యే పని కాదని అనుకున్నారు.

కానీ ఆయన తన అభిప్రాయాన్ని తన పిల్లల చదువుకు అడ్డంకిగా మార్చలేదు. " అది పనిచేయదని నాకు మొదటి రోజు నుండి తెలుసు. చేయలేదు కూడా. అతన్ని పొలానికి పంపి అక్కడ చదువుకునేలా ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ రాదు. ఇంటర్నెట్ సిగ్నల్‌ లేకుండా చదువు ఎలా సాగుతుంది? మా ప్రాంతంలో సరైన ఇంటర్నెట్ అందుబాటులో లేదు’’ అని వీరేంద్ర వెల్లడించారు.

వీరేంద్ర చెబుతున్నఅటవీ ప్రాంతం రాజధాని లక్నోకు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం సంబ్రాంత్‌ ఆన్‌లైన్‌ స్కూల్‌ మానేశాడు. ఐదారువేల రూపాయలు ఖర్చు పెట్టి అతని తండ్రి వీరేంద్ర పుస్తకాలు కొనుక్కొచ్చారు.“నేను పుస్తకాలు కొనుక్కొచ్చాను. అందువల్ల అతని(సంబ్రాంత్‌) మనసు కుదుటపడింది’’ అన్నారు వీరేంద్ర.

పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు

ఆన్‌లైన్‌ విద్యకు మంచి స్మార్ట్‌ఫోన్‌, మంచి బ్యాటరీ, మెమరీ, ఇంటర్నెట్ కనెక్షన్‌ కావాలి. ఐసీఏఐ ప్రకారం భారతదేశంలో 130కోట్లకు పైగా జనాభా ఉంటే, అందులో 45కోట్లమందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. అంటే జనాభాలో సగానికి పైగా జనం దగ్గర స్మార్ట్‌ ఫోన్‌లు లేవు.

ఐదారుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటే వారికి రెండు స్మార్ట్ ఫోన్‌లు అవసరం.

అసలే లాక్‌డౌన్‌. ఆదాయాలు పడిపోయిన ఈ సమయంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు కొనడం ఏ కుటుంబానికైనా సవాలే.

ఒక కుటుంబ యజమాని రెండు స్మార్ట్‌ ఫోన్‌లు ఎలాగో సంపాదించినా, డేటా సమస్య ఉండనే ఉంటుంది. జూమ్‌ క్లాసులకు 1.5 నుంచి 2 Mbps ఇంటర్నెట్‌ స్పీడ్‌ అవసరం. గంటసేపు క్లాస్‌ జరిగితే 1.5 నుంచి 2GB డేటా ఖర్చవుతుంది.

ఇంటర్నెట్ కనెక్షన్‌ కోసం ఒక్కో కుటుంబం రెండు సిమ్‌లు లేదంటే బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. తగ్గిన జీతం, పెరిగిన ఖర్చులకు అదనంగా ఈ ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది.

ఇద్దరు పిల్లలకు రోజుకు ఆరు తరగతుల చొప్పున నెలకు 144 క్లాసులు జరుగుతాయి. ప్రతి విద్యార్ధికి నెలకు 216 GBకంటే ఎక్కువ డేటా అవసరం.

1GB డేటా ధర రూ.20 అనుకుంటే, ఒక్కో విద్యార్ధికి నెలకు 4500 ఖర్చు అవుతుంది. ఇద్దరు పిల్లలకు నెలకు రూ.9000 రూపాయల అదనపు ఖర్చు ఒక్క ఇంటర్నెట్ కోసమే అవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఖర్చును భరించడం సాధ్యమవుతుందా?

భారతదేశ తలసరి ఆదాయం సుమారు రూ.17 వేలు. కానీ ఇది సగటు ఆదాయమే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఆదాయంలో భారీ అసమానత ఉంది.

ఫొటో సోర్స్, Sakib Ali /Hindustan Times via Getty Images

ప్రాథమిక హక్కులకు భంగం

ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, భారతదేశంలో రోజుకు రూ.200 కన్నా తక్కువ సంపాదించేవారు 26 కోట్లమందికి పైగా ఉన్నారు. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు.

ఇలా రోజుకు రూ. 200కన్నా తక్కువ సంపాదించే జనాభాలో ఎక్కువమంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. రకరకాల పరిస్థితుల వల్ల వారు ఆర్ధికంగా అనేక నష్టాలు ఎదుర్కొంటుంటారు.

ఈ పరిస్థితులలో నెలకు రూ.6 వేలు సంపాదించే వ్యక్తి ఇంటర్నెట్‌ కోసం ప్రతి నెలా రూ.9వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సివస్తే ఇక తినడానికి ఏం మిగులుతుంది?

వీరేంద్ర కూడా ఇదే ఆర్ధిక వర్గానికి చెందిన వారు. ఈ ఏడాది ఆరంభంలోనే వడగళ్లు, భారీ వర్షాల కారణంగా పంటలు పాడైపోయాయి. ఆయనకు ఇది ఆర్ధికంగా భారీ నష్టంగా మారింది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటి కొడుకు చదువుకోసం వీరేంద్ర రూ.6వేల రూపాయలు ఖర్చు చేశారు. తన కుమారుడికి చదువును దూరం చేయవద్దన్నదే ఆయన పట్టుదల.

చదువులకు ఉన్న ప్రాధాన్యతను ఇప్పుడు అందరూ గుర్తించారని విద్యాహక్కు చట్టంపై అవగాహన ఉన్న నిపుణులు అంబరీశ్‌ రాయ్‌ అన్నారు.

"ప్రతి ఒక్కరు అవగాహనతో ఉన్నారు. తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు " అని అంబరీశ్‌ రాయ్‌ అన్నారు.

అవసరమైతే ఇంట్లో ఉన్న పశువులను అమ్మి మరీ స్మార్ట్‌ఫోన్‌ కొనడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు చదువు అన్నది తల్లిదండ్రుల బాధ్యత కాదు. దేశంలోని ప్రతిబిడ్డా విద్యా హక్కును ఉపయోగించుకునేలా ప్రభుత్వం చూడాలి” అని రాయ్‌ అన్నారు. " ప్రభుత్వం ఏ మార్గంలో వెళ్ళినా, విద్య ప్రాథమిక హక్కు అని గుర్తుంచు కోవాలి. దేశంలో ఒక చట్టం ఉంది. ప్రభుత్వ విధానాల కారణంగా, పిల్లలు విద్యా హక్కును కోల్పోకూడదు.అణగారిన వర్గాలకు విద్య అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని రాయ్‌ అన్నారు.

విఫలమవుతున్న కలలు-పెరుగుతున్న అంతరాలు

ఇవన్నీ తెలిశాక కూడా ప్రభుత్వం “ అదృష్టవశాత్తు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఉంది. వారంతా చదువు కోవచ్చు’’ అని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎవరి అదృష్టం గురించి మాట్లాడుతోంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భారతదేశంలాంటి ఆర్థిక అసమానతలున్న దేశంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లవంటి పరికరాలతో చదువులు చెప్పడం అసంబద్ధమని విద్యావేత్త అనితా రాంపాల్ అభిప్రాయపడ్డారు.

“భయంకరమైన ఈ మహమ్మారి కారణంగా భారతదేశంలో విద్యార్ధులు ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఉద్యోగాలు పోతున్నాయి. కొందరి ప్రాణాలు పోతున్నాయి. కొందరికి అనారోగ్యం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితులన్నీ విద్యార్ధులపై మానసికంగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి’’ అని అనితా రాంపాల్ అన్నారు.

స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులకు MMS ద్వారా పాఠాలను అందించే ఏర్పాటు చేయాలని NCERT ప్రిన్సిపాళ్లకు ఇచ్చిన సందేశంలో రాసింది.

అదే సమయంలో సిలబస్‌ పూర్తి కాక ఇబ్బంది పడే పిల్లల సంగతేంటని అనితా రాంపాల్‌ ప్రశ్నిస్తున్నారు. “ఇది క్రూరమైన వ్యవస్థ. ఆన్‌లైన్‌ ద్వారా సిలబస్‌ను పూర్తి చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాదు ’’ అని అనితా వ్యాఖ్యానించారు.

"కొందరికి విద్యను దూరం చేసి, చదువులు చెబుతున్నాం అనడం ఒక విద్యార్ధి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. విద్యాహక్కు చట్టం 5వ చాప్టర్‌ను పరిశీలిస్తే మనం ఎలాంటి విద్య గురించి మాట్లాడుతున్నామో అర్ధమవుతుంది. చర్చ ద్వారా, యాక్టివిటీ ద్వారా చదువు అబ్బుతుంది. తెర ముందు కూర్చుని తదేకంగా చూడటం వల్ల చదువురాదు’’ అని ఆమె అన్నారు.

ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల వారిని అత్యున్నత పదవులు అలంకరించేలా చేయగలదన్న ఆశనిస్తుంది మన విద్యావ్యవస్థ. మాజీ రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దీనికి అతి పెద్ద ఉదాహరణ.

ప్రతి ఒక్కరు తమ బిడ్డ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. ఆన్‌లైన్‌ విద్య పేరుతో, స్మార్ట్‌ఫోన్‌లేదన్న కారణంతో వారు చదువులకు దూరం అవుతున్నారంటే వారి ఆశలను, ఆకాంక్షలను తుంచి వేస్తున్నట్లే. అందుకే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)