కిమ్ జోంగ్ ఉన్: పార్టీ సమావేశంలో మళ్లీ ప్రత్యక్షం... ఇంతకీ ఆయనకేమైంది? సోదరికి అధికారాలు ఎందుకు అప్పగిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్ట్ 25న జరిగిన పార్టీ సమావేశంలో కింగ్ జోంగ్ ఉన్
కిమ్ జాంగ్ ఉన్ చాలా రోజుల తరువాత పార్టీ సమావేశంలో కనిపించారు. కరోనావైరస్ మహమ్మారి వల్లే ఎదురయ్యే ప్రమాదాలు, అలాగే ముంచుకొస్తున్న తుపాను విషయంలో అప్రమత్తం కావాలని ఆయన ఉత్తర కొరియా అధికారులను ఆదేశించారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తాజాగా పార్టీ సమావేశానికి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తర కొరియా ఇంతవరకూ తమ దేశంలో కోవిడ్ కేసులు ఉన్నట్లు నిర్ధరించలేదు. కరోనావైరస్ మహమ్మారి కనుక దాడి చేస్తే ఈ పేద దేశంపై దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండేదని చాలా మంది భావించారు.
ఇదిలా ఉంటడగా, ఉత్తర కొరియా మీదకు వచ్చే వారం తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. టైఫూన్ బవి అని వ్యవహరిస్తున్న ఈ తుపాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని కిమ్ అధికారులకు సూచించారు. మంగళవారం నాటి పార్టీ సమావేశంలో ఆయన సిగరెట్ తాగుతూ కనిపించారు. "వినాశకారి అయిన వైరస్‌ను దేశంలోకి రాకుండే చూసే ప్రయత్నాల్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి" అని కిమ్ చెప్పినట్లుగా ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
తమ దేశంలో కరోనా కేసులు లేవని ఉత్తర కొరియా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ, గత కొన్ని వారాలుగా అక్కడి మీడియాలో ఈ మాటలు కనిపించలేదు. ఒక అనుమానాస్పద కేసు దృష్టికి రావడంతో దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోని ఒక పట్టణంలో లాక్డౌన్ ప్రకటించారు. కానీ, ఆ విషయాన్ని కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు.
కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు వినిపించడం అన్నది చాలా రోజులుగా జరుగుతోంది. ఈ మధ్య ఆయన తన అధికారాలు కొన్నింటిని తన సోదరి కిమ్ యో-జింగ్‌కు అప్పగించారు.
ఫొటో సోర్స్, Reuters
కిమ్ యో జోంగ్
సోదరికి ఎందుకు అధికారాలు అప్పగిస్తున్నారు?
ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్కు మరిన్ని అధికారాలు అప్పగించారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్(ఎన్ఐఎస్) సర్వీస్ వెల్లడించింది.
ముఖ్యంగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకొనే అధికారాలను ఆమెతో పాటు మరికొందరు సన్నిహితులకు బదిలీ చేసినట్లు ఎన్ఐఎస్ పేర్కొంది.
మరోవైపు విదేశాంగ వ్యవహారాలు మొత్తం ఇకపై కిమ్ యో జోంగ్ చూసుకుంటారని దక్షిణ కొరియా వార్తా సంస్థలు తెలిపాయి.
అమెరికా, దక్షిణ కొరియాతోపాటు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాలను కిమ్ యో జోంగ్ నడిపిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయని దక్షిణ కొరియా శాసనకర్తలు పేర్కొన్నారు.
ఇంతకీ ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది? అధికారాలను ఎందుకు బదిలీ చేస్తున్నారు? కిమ్ జోంగ్ ఉన్‌కు ఏమైంది?
ఫొటో సోర్స్, kona
కిమ్ జోంగ్ ఉన్
కోమాలోకి వెళ్లిపోయారా?
కిమ్ అరోగ్యం బాగా క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. కొన్ని వార్తా సంస్థలు అయితే ఆయన చనిపోయారనీ చెబుతున్నాయి.
మరోవైపు ఆయన కోమాలోకి వెళ్లిపోయారని దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్కు అత్యంత సన్నిహితుడు, దౌత్యవేత్త చాంగ్ సాంగ్ మిన్ వెల్లడించారు. అందుకే ప్రస్తుతం అధికారాలను కిమ్ యో జోంగ్కు బదిలీ చేస్తున్నారని తెలిపారు.
''నా అంచనాల ప్రకారం.. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కానీ చనిపోలేదు. ఇంకా అధికార మార్పిడికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కిరాలేదు. ప్రస్తుతం అధికార శూన్యాన్ని భర్తీ చేసేందుకు కిమ్ యో జోంగ్‌ను తెరపైకి తీసుకొచ్చారు''అని దక్షిణ కొరియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాంగ్ తెలిపారు.
కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం మంచానికే పరిమితం అయ్యారని, దేశాన్ని పరిపాలించే శక్తి ఆయనకు లేదని చాంగ్ పునరుద్ఘాటించారు.
ఈ సమాచారం తనకు చైనాలోని వర్గాల ద్వారా అందిందని చాంగ్ పేర్కొన్నారు.
మరోవైపు కిమ్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఉత్తర కొరియా మీడియా ఇటీవల కొన్ని ఫోటోలను విడుదల చేసింది. అయితే అవి ఫేక్ అని చాంగ్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కరచాలనం చేస్తున్న కిమ్ యో జోంగ్, పక్కన కిమ్ జోంగ్ ఉన్
ఇదేమీ తొలిసారి కాదు
ఉత్తర కొరియా నాయకుడైన కిమ్ జోంగ్ ఉన్ మరణించారని వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు.
మూడు నెలల క్రితం కిమ్‌కు గుండె ఆపరేషన్ జరిగిందని, అది విఫలం కావడంతో ఆయన చనిపోయారని వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో 20రోజులపాటు కిమ్ ప్రజలకు కనిపించలేదు. తన తాత జన్మదిన వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఉత్తరకొరియాకు సంబంధించి ఆ వేడుకలకు దేశంలో అత్యంత ప్రాధాన్యముంది.
దీంతో ఆయన వారసులపై మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. కానీ కొన్ని రోజులకే
ఆయన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రారంభోత్సవం చేస్తూ కనిపించారు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ తమ దేశంలో ఎలాంటి కేసులూ లేకపోయినా ఆయన ప్రజలకు కనిపించడం తగ్గించి ఉంటారని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ వివరించింది.
2014లోనూ కిమ్ 40రోజులపాటు కనిపించలేదు. ఓ వైపు ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తుండగానే, ఫోటోలలో చేతికర్రతో కిమ్ కనిపించారు.
శారీరకంగా ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని ఆ దేశ అధికార మీడియా ప్రకటించింది. అయితే, ఆయన కాళ్లకు సంబంధించిన ఒక సమస్యతో బాధపడుతున్నారన్న ఊహాగానాలకు మాత్రం ఆ మీడియా అప్పట్లో సమాధానం చెప్పలేదు
మీడియాలో తత్తరపాటు
ప్రస్తుతం అధికార శూన్యాన్ని పూర్తిస్తున్న కిమ్ జోంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ పూర్తికాల పాలకురాలిగా మారే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఉత్తర కొరియా బయట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కిమ్ యో జోంగ్ వయసు 31 ఏళ్లు. సోదరుడి లాగే ఆమె కూడా విదేశాల్లో చదువుకున్నారు. పోలిట్‌బ్యూరోలో ప్రత్యమ్నాయ సభ్యురాలిగా ఉన్నారు. కీలకమైన ప్రభుత్వ ప్రచార విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు.
కిమ్ జోంగ్కు 'డైరీ సెక్రటరీ'గా కిమ్ యో జోంగ్ పేరు పొందారు. కిమ్ జోంగ్ రోజువారీ ఎజెండాను నిర్ణయించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంటారు. విధానపరమైన నిర్ణయాల్లో సోదరుడికి ఆమె సలహాలు ఇస్తుంటారు.
కిమ్ ఇల్ సంగ్ వారసులను 'బయెకదూ వంశం'గా పిలుస్తుంటారు. యో జోంగ్ కూడా ఈ వంశానికి చెందినవారే. ఉత్తర కొరియా నాయకులు ఈ వంశం వారై ఉండటం చాలా ముఖ్యం.
అప్పుడప్పుడూ యో జోంగ్ తత్తరపాటుకు గురై మీడియాలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
ఉత్తర కొరియాలో రాజకీయపరంగా, సమాజ నిర్మాణపరంగా మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. అయితే, వాళ్లలో అధికారంలో పైకి ఎదిగేవాళ్లు చాలా అరుదు.
ఫొటో సోర్స్, AFP
ఆమె ఎంత శక్తిమంతమైన నాయకురాలు?
ఉత్తర కొరియాలో రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం చాలా కష్టం. అందుకే కిమ్ యో జాంగ్ రాజకీయ శక్తి, సామర్థ్యాలను ఓ పట్టాన అంచనా వేయలేం.
కిమ్ జోంగ్ తర్వాత అంత పలుకుబడి ఉండే పార్టీలో కీలకమైన సెక్రటరీ చో ర్యాంగ్ హే కుమారుణ్ని ఆమె పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అవి నిజమైతే ఆమెకు కూడా మంచి హోదా ఉన్నట్లే.
''ఆమె వయసు 30పై చిలుకు ఉంటుంది. సాధారణంగా ఈ వయసులో ఉండే మహిళలకు ఉత్తర కొరియాలో అంత పలుకుబడి ఉండదు. కానీ ఆమె పలుకుబడి అంతా సోదరుడి నుంచి వచ్చినదే''అని బీబీసీతో ఎన్కే న్యూస్ ప్రతినిధి ఓలివర్ హోథామ్ చెప్పారు.
ఇటీవల కిమ్ యో జాంగ్ దక్షిణ కొరియాకు గట్టి సందేశాలను పంపారు. రెండు కొరియాలను విభజించే డీమిలిటరైజ్డ్ జోన్లోకి తమ సైన్యం ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలూ జారీచేశారు.
కిమ్ జోంగ్ కంటే కిమ్ యో జాంగ్ పాలనే మరింత అరాచకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా? BBC Reality Check
- అమెరికా చమురు ధరలు... డిమాండ్ లేక తిరోగమనం
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)