డోనల్డ్ ట్రంప్‌ను 'ఉల్లూ' అన్న అమెరికన్ టీవీ యాంకర్ టోమీ లహరే - BBC Newsreel

టోమీ లహరే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

టోమీ లహరే

అమెరికా టీవీ ప్రయోక్త టోమీ లహరే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అనుకోకుండా 'ఉల్లూ' అని తిట్టారు. హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆమె ట్రంప్‌ను ఉల్లూ (గుడ్లగూబ) అనేశారు. ఆ మాటను హిందీలో ఎవరైనా బుద్ధిలేనివాడా అని తిట్టడానికి ఉపయోగిస్తారు.

ఆమె అలా అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఆ వీడియోను ముచ్చటపడి చూస్తున్నారు.

హిందూ మతంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అది పవిత్రమైన పక్షి అని చాలా మంది విశ్వసిస్తారు. ఆ పక్షి శక్తికి, యుక్తికి సంకేతమని కూడా అర్థాలు చెబుతారు.

కానీ, సామాన్య ప్రజల భాషలో ఆ పదాన్ని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని తిట్టడానికి ఉపయోగిస్తారు.

కన్సర్వేటివ్ రాజకీయ వ్యాఖ్యాతగా టోమీ లహరే 2016 ఎన్నికల సందర్భంగా బాగా పాపులర్ అయ్యారు. తాజా వీడియోలో కూడా ఆమె ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్న భారత సంతతి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు ఫేస్‌బుక్‌లో లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె వీడియోలో చాలా వరకు వైరల్ అవుతుంటాయి.

అమరావతి

అమరావతి: ఏపీ ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సీఆర్‌డీఏ రద్దు, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అంశంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ అంశం గురువారం నాడు హైకోర్టులో విచారణకు వస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు బుధవారం నాడు పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తన వాదనను హైకోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

అమరావతి రైతుల ఆందోళన
ఫొటో క్యాప్షన్,

విజయవాడలో ఆందోళనకు దిగిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు

మరోవైపు.. విజయవాడలో సీఆర్‌డీఏ ఆఫీసు ముందు అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారు.

ఆందోళనకు దిగిన వారిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హాంకాంగ్

ఫొటో సోర్స్, Getty Images

హాంకాంగ్‌లో ఇద్దరు ప్రతిపక్ష నేతలు సహా 16 మంది అరెస్ట్

హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతు ఇచ్చినందుకు గాను ఇద్దరు ప్రతిపక్ష చట్టసభ సభ్యులు సహా 16 మందిని అరెస్ట్ చేశారు.

ప్రజాస్వామ్య మద్దతుదారుల మీద చర్యలను తీవ్రతరం చేసిన ప్రభుత్వం.. డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు లామ్ చెక్-టింగ్, టెడ్ హూ చి-ఫంగ్‌లను బుధవారం ఉదయం వారి ఇళ్లలో అరెస్ట్ చేసింది.

2019 జూలైలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా.. మాస్కులు ధరించిన వ్యక్తులు కొందరు నిరసనకారులపై సంఘటనలో దాడి చేసిన ఘటనకు సంబంధించి.. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణతో లామ్‌ను అరెస్ట్ చేశారు.

ఆ దాడిలో గాయపడిన డజన్ల మంది నిరసనకారుల్లో లామ్ కూడా ఉన్నారు. ఆ సంఘటనలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులకు రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి.

బెలారస్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టిన బెలారస్‌ ప్రభుత్వం

బెలారస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు సీనియర్ నేతలు, ఓల్గా కోవల్కోవా, సెర్గీ దిలెవ్‌స్కీలకు పది రోజుల జైలు శిక్షను విధించింది అక్కడి ప్రభుత్వం.

ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న ప్రతిప్రక్ష నేత స్వెత్లానా తిఖనోవస్క్యా ఏర్పాటు చేసిన నేషనల్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్‌లో వీరిద్దరూ సభ్యులు.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వీరిపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం.. లుకషెంకో రాజీనామాను కోరుతున్న ఉద్యమాన్ని తీవ్రతరంలో చేస్తున్నవారిలో సెర్గీ దిలెవ్‌స్కీ ఒకరుగా భావిస్తోంది.

సబా సహార్‌

ఫొటో సోర్స్, ULLSTEIN BILD/GETTY

అఫ్ఘానిస్తాన్‌లో తొలి మహిళా దర్శకురాలిపై కాల్పులు

అఫ్ఘానిస్థాన్‌లో తొలి మహిళా డైరక్టర్‌, నటి 44 ఏళ్ల సబా సహార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సంఘటన జరిగిన వెంటనే ఆమె భర్త ఈమల్‌ జాకీ ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సబా ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ముగ్గురు గన్‌మన్‌లు కాల్పులు జరిపినట్లు భర్త ఈమల్ జాకీ పేర్కొన్నారు. అయితే ఇంత వరకు ఎవరూ ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.

మహిళా హక్కుల కార్యకర్తగా, నటిగా, దర్శకురాలిగా, హోంశాఖలో ఉద్యోగిగా సబా భిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటన పట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

జేమ్స్ ఆండర్సన్

ఫొటో సోర్స్, STU FORSTER

జేమ్స్ ఆండర్సన్‌: 600 టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి పేస్ బౌలర్‌

టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన ముగ్గురు బౌలర్లు ముత్తయ్య మురళీధరన్‌ (800), షేన్‌వార్న్‌ (708), అనిల్‌కుంబ్లే (619)ల సరసన చేరారు ఇంగ్లాండ్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌.

ఆయన ఈ ఘనత సాధించిన తొలి పేస్‌బౌలర్‌గా నిలిచారు.

పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ చివరి రోజు పాకిస్థాన్‌ బౌలర్‌ అజార్‌ అలి వికెట్ తీయడం ద్వారా ఆండర్సన్‌ ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.

2003 నుంచి ఇంగ్లాండ్ తరఫున టెస్ట్‌ క్రికెట్ ఆడుతున్న ఆండర్స్ 156 మ్యాచ్‌లలో 600 వికెట్లు సాధించారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఆస్ట్రేలియా యువతికి జైలు శిక్ష

ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తితో తీవ్రంగా ప్రభావితమైన విక్టోరియా రాష్ట్రంలో క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన అషర్‌ ఫయి వ్యాండర్‌ అనే 28 ఏళ్ల యువతికి జైలుశిక్ష పడింది.

పెర్త్‌ నుంచి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు వచ్చిన ఆమె, 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉండగా, అక్కడి నుంచి తప్పించుకుని రహస్యంగా ఒక ట్రక్కులో తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో కోవిడ్‌-19 నిబంధనలు పాటించని వారికి ఏడాది జైలు లేదా 50,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2,67,000) జరిమానా విధిస్తారు.

తన భాగస్వామి ఇంటికి వచ్చినా ఐసోలేషన్‌లోనే ఉన్నారని ఆమె తరఫు లాయర్ వాధించారు. దీనిని అంగీకరించని న్యాయమూర్తి ఆమె తీవ్రమైన నేరానికి పాల్పడ్డారంటూ ఆరు నెలల జైలు శిక్ష విధించారు .

పోలియో

ఫొటో సోర్స్, AFP

‘ఆఫ్రికాలో పోలియో వ్యాధి అంతమైంది’

ఆఫ్రికా ఖండం పోలియో నుంచి విముక్తమైందని 'ది ఆఫ్రికా రీజనల్‌ సర్టిఫికేషన్ కమిషన్‌' ప్రకటించింది.

పాతికేళ్ల కిందట వేలమంది చిన్నారులు ఆఫ్రికాలో పోలీయోబారిన పడి అంగవికలురుగా మారారు. ఒకసారి వ్యాధిన వచ్చిన తర్వాత దానికి చికిత్స లేదు. ఆఫ్రికా ఖండంలో పోలియో నుంచి విముక్తమైన ఆఖరి దేశంగా నైజీరియా గుర్తింపు పొందింది.

ఒక పక్క తీవ్రవాదుల సమస్య ఉన్నా, ఆరోగ్య సిబ్బంది నైజీరియాలో గ్రామ గ్రామానికికి వెళ్లి పోలీయో టీకాలు వేశారు. కొందరు సిబ్బంది తీవ్రవాదుల చేతిలో మరణించారు కూడా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌లలోనే పోలియో కేసులు నమోదవుతున్నాయి.

అమెరికా పోస్టల్

ఫొటో సోర్స్, EPA

ట్రంప్‌ విధానాలపై కేసు వేసిన మూడు రాష్ట్రాలు

అమెరికా పోస్టల్ సర్వీసు విధానాలలో మార్పులపై ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హవాయి, న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలు కోర్టుకెక్కాయి.

ఒకవైపు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఎక్కువమంది ఓటేసే అవకాశాలున్నాయంటున్న తరుణంలోనే ట్రంప్‌ ప్రభుత్వం మెయిల్ బాక్సులను తొలగించడం, ఓవర్‌ టైమ్‌ చేసే ఉద్యోగులకు అదనపు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని పలువురు తప్పు బడుతున్నారు.

ఈ విధానాల వల్ల పోస్టల్ బ్యాలట్‌లో ఆలస్యం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోస్టల్ శాఖను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమెరికా లారా హరికేన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా తీరానికి ముంచుకొస్తున్న లారా హరికేన్‌...

తీరప్రాంత రాష్ట్రాలైన టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాలవైపు హరికేన్‌ లారా దూసుకువస్తుండటంతో అక్కడి నుంచి వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం సూచించించింది.

ఈ హరికేన్‌ ఈ రెండు రాష్ట్రాల మీదుగా క్యూబావైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ హరికేన్‌తోపాటు వచ్చిన మార్కో అనే తుపాను సోమవారం నాడు లూసియాన స్టేట్‌ తీరాన్ని తాకింది.

ఇప్పటికే కరీబియన్‌ ద్వీపాన్ని తాకిన ఈ రెండు తుపానులకు కనీసం 20మంది మరణించారు. ట్రంప్‌ ప్రభుత్వం ఈ రెండు తుపానులను డిజాస్టర్‌గా ప్రకటించింది.

మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ట్రంప్‌ పాలనకు మెలానియా ప్రశంసలు

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా మరోసారి తన భర్త డోనాల్డ్‌ ట్రంప్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

రిపబ్లిక్‌ నేషనల్ కన్వెన్షన్‌ సెకండ్‌ నైట్‌లో భాగంగా వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌ నుంచి కొద్దిమంది సభికులనుద్దేశించి మెలానియా ప్రసంగించారు.

భర్త ట్రంప్‌తోపాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతివివక్ష, కోవిడ్‌-19 విషయంలో డోనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిందని ఆమె అన్నారు. అయితే వైట్‌హౌస్‌ను రాజకీయ వేదికగా మార్చుకోవడంపై అమెరికాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

నావల్నీ హత్యకు పుతిన్ కుట్ర వాదనలను ఖండించిన క్రెమ్లిన్‌

రష్యాలో ప్రభుత్వ విమర్శకుడు నావల్నీ హత్యకు ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ పుతిన్‌ కుట్రపన్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.

ఈ వాదనలు అసత్యమని, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నారు. ప్రస్తుతం జర్మనీలోని ఓ ఆసుపత్రిలో నావల్నీ చికిత్స పొందుతున్నారు.

ఆయనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చని జర్మనీ వైద్యులు ఇంతకు ముందే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సూడాన్

ఫొటో సోర్స్, AFP

సహారా ఎడారిలో ప్రాచీన సంపదను స్మగ్లర్లు తవ్వేశారు

సహారా ఎడారిలోని 2000 ఏళ్ల నాటి పురాతనమైన ప్రదేశాన్ని బంగారం స్మగ్లర్లు ధ్వంసం చేసినట్లు సూడాన్‌ అధికారులు వెల్లడించారు.

ఐదుగురు వ్యక్తులు యంత్రాల సాయంతో 17 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పున తవ్వకాలు జరిపారని, ఇందులో బంగారం ఉంటుందన్న ఆశతోనే స్మగ్లర్లు ఈ తవ్వకాలు జరిపి ఉంటారని అధికారులు వెల్లడించారు.

పిరమిడ్లు, పురాతన కాలపు మమ్మీలను పూడ్చి పెట్టిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిధులు ఉండొచ్చని స్మగ్లర్లు భావిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి తవ్వకాలు జరిగాయని సూడాన్‌ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)