కరోనావైరస్: అమెరికా, బ్రెజిల్ కాదు మరణాల రేటులో ఈ దేశమే టాప్

ఫొటో సోర్స్, REUTERS/SEBASTIAN CASTANEDA
ఆక్సిజన్ కోసం క్యూలో జనాలు
కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో ఉన్నాయి. కానీ కోవిడ్-19 వల్ల మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశం మాత్రం ఇవేవీ కావు.
అత్యధిక మరణాల రేటు జాబితాలో దక్షిణ అమెరికాలో తూర్పు సముద్ర తీరంలో ఉన్న పెరూ అన్నిటికంటే టాప్‌లో ఉంది. ఈ దేశంలో కోవిడ్-19 మరణాల రేటు ప్రపంచంలోనే అత్యధికం.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పెరూలో మరణాల రేటు 93.71. అంటే లక్ష మంది జనాభాలో దాదాపు 94 మంది చనిపోతున్నారు.
లాటిన్ అమెరికా దేశాల్లో మొట్ట మొదటి కోరనా కేసు బ్రెజిల్‌లో నమోదైంది. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకూ ఈ వైరస్ వల్ల లక్షా 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, కరోనాకు అత్యంత ఘోరంగా ప్రభావితమైన అమెరికాలో మృతుల సంఖ్య కొన్ని వారాల్లో రెండు లక్షలకు చేరుకోనుంది.

ఫొటో సోర్స్, johns hopkins
మొట్టమొదట ఆంక్షలు
మహమ్మారి ప్రారంభమైన సమయంలో దాని వ్యాప్తిని అడ్డుకోడానికి ఎన్నో ఆంక్షలు విధించిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పెరూనే. లాక్‌డౌన్ వల్ల ఎదురైన సమస్యల నుంచి బయటపడ్డానికి ప్రజలకు సహాయ ప్యాకేజ్ ఇచ్చిన మొదటి దేశం కూడా ఇదే.
కరోనా వల్ల పెరూలో ఇప్పటివరకూ 28,471 మంది చనిపోయారు. జాన్స్ హాప్కిన్స్ డాష్‌బోర్డ్ గణాంకాల ప్రకారం ఈ వైరస్ వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో పెరూ 9వ స్థానంలో ఉంది.
గతవారం కరోనాతో చనిపోయే వారి సంఖ్య కాస్త తగ్గింది. గత బుధవారం ఇక్కడ ఆరోగ్య శాఖ 123 మంది చనిపోయినట్లు ధ్రువీకరించింది. కానీ తర్వాతరోజే (గురువారం) అక్కడ మరణాల సంఖ్య 153కు పెరిగింది.
కానీ, 3 కోట్ల 25 లక్షల జనాభా(2019)ఉన్న ఈ దేశంలో కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోడానికి కారణం ఏంటి. దానికి నిపుణులు ఐదు కారణాలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రభుత్వ సాయం కోసం క్యూలో ఎదురుచూపులు
మొదటి కారణం-పేలవమైన ఆరోగ్య వ్యవస్థ
ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశంలో తగినంత పెట్టుబడులు పెట్టలేదని సాయటానో హెరెడియా యూనివర్సిటీ ఆఫ్ లీమా ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ గోటుజో చెప్పారు.
“ఇక్కడ ఆస్పత్రుల కొరత మాత్రమే కాదు, ఐసీయూలో పడకలు కూడా లేవు. ఆరోగ్య సిబ్బంది వేతనాలు తక్కువ. మాలిక్యులర్ పరీక్షలు చేయగలిగే ల్యాబ్ ఒక్కటే ఉంది” అని ఆయన చెప్పారు.
దేశంలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులు గత రెండు దశాబ్దాలుగా కాస్త పెరిగాయి. ప్రపంచబ్యాంక్ అంచనా ప్రకారం 2017 నాటికి ఆరోగ్య రంగంలో దేశం మొత్తం జీడీపీలో 4.9 శాతం వరకూ పెట్టుబడులు పెట్టారు.
అయితే, వృద్ధి రేటుతో పోలిస్తే ఇక్కడ ఆరోగ్యంపై తలసరి వ్యయం చాలా తక్కువ అని మైక్రోకన్సల్ట్ కన్సల్టెన్సీ ఆర్థికవేత్త ఎల్మర్ క్యూబా అన్నారు.
మహమ్మారి మొదలైన సమయంలో పెరూలోని ఆస్పత్రుల్లో 3 వేల పడకలు, ఐసీయూలో 100 పడకలే ఉన్నాయి. తర్వాత జూన్ చివరి నాటికి తమ దేశంలోని ఆస్పత్రుల్లో 18 వేలకు, ఐసీయూలో 1660కు పడకల సంఖ్య పెంచామని అధ్యక్షుడు మార్టిన్ విజ్కార్రా చెప్పారు.
“కానీ, ఈ మహమ్మారి మా సన్నాహాలకంటే ఒక అడుగు ముందే ఉండేది” అంటారు డాక్టర్ ఎడ్వర్డ్ గోటుజో.
“ఆరోగ్య రంగంలో సంస్కరణల ప్రభావంతో మరణాల రేటు తగ్గుతూ వస్తోంది” అని సయాటానో హెరెడియా యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ అర్నెస్టో గాజర్ అన్నారు.
అయితే మరణాల రేటు పెరగడానికి ఇదొక్కటే కారణం కాదని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/Sebastian Castaneda
రెండో కారణం-నివారణలో నిర్లక్ష్యం
ఆస్పత్రులు, రక్షణ, పరీక్షల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్ గాజర్ భావిస్తున్నారు.
కరోనా వ్యాపించడంతో మొదట స్కూళ్లు, కాలేజీలు మూసేశారు, సరిహద్దులు సీల్ చేసి, ప్రజలను క్వారంటైన్లో పెట్టారు. తర్వాత ఆస్పత్రుల్లో ఎక్కువ పడకలు ఏర్పాటు చేసి, డెడికేటెడ్ ఆరోగ్య సిబ్బంది నియామకం పెంచినా కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. దాంతో, లాక్‌డౌన్ వల్ల ఆశించినది పూర్తిగా నెరవేరలేదు” అన్నారు.
ప్రభుత్వం ఐసీయూలో పడకల సంఖ్య పెంచింది. కానీ ఈ వ్యాధితో చివరికి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
“ప్రభుత్వం సెరోలాజికల్ టెస్ట్, రాపిడ్ పరీక్షల సంఖ్య పెంచింది. కానీ, ఆ పరీక్షలతో వ్యాధి గురించి కచ్చితమైన సమాచారం లభించదు. వాటికి బదులు ప్రభుత్వం మాలిక్యులర్ పరీక్షల సంఖ్యను పెంచుండాల్సింది” అని గాజర్ అన్నారు.
శుక్రవారం(ఆగస్టు 28) నాటికి పెరూలో మాలిక్యులర్ పరీక్షల ద్వారా 1,54,197 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ర్యాపిడ్ టెస్టుల ద్వారా దీనికి మూడు రెట్లు అధికంగా 4,67.800 కేసులు ధ్రువీకరించారు.
కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో దేశంలో ఒకే ఒక మాలిక్యులర్ పరీక్షల ల్యాబ్ ఉండగా, వాటి సంఖ్యను జూన్‌లో 12కు, ఆగస్టులో 35కు పెంచారు.
“పాజిటివ్ కేసును మొదట గుర్తించగానే, వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించి, వారిని ఐసొలేట్ చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం మొదటి నుంచీ జరిగుంటే ఈ మహమ్మారిని నియంత్రించడానికి సాయం లభించేది” అంటారు డాక్టర్ ఎడ్వార్డ్ గోటుజో.
“అసలు ఐసీయూల అవసరమే రాకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఐసీయూల్లో పడకలు పెంచడంపై దృష్టి పెట్టింద”ని డాక్టర్ గాజర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడో కారణం-ఆక్సిజన్ కొరత
పెరూలో కరోనా వల్ల మరణాలు పెరగడానికి మరో కారణం ఆక్సిజన్ కొరత
మీడియాలో పదే పదే కనిపించిన ఫొటోల్లో దేశంలో జనం ఆక్సిజన్ కోసం పొడవాటి క్యూలలో ఉండడం కనిపించింది. పెరుగుతున్న ఆక్సిజన్ కొరతను అనుకూలంగా మార్చుకున్న సప్లయర్స్ దాని ధరలను పెంచేశారు. ఆక్సిజన్ అమ్మకాలకు కేంద్రాలు తెరిచారు.
దీంతో జూన్‌లో ప్రభుత్వం ఆక్సిజన్‌ను జాతిప్రయోజనానికి సంబంధించిన ఉత్పత్తిగా ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లు 2.5 కోట్ల డాలర్ల ఆక్సిజన్ కొనుగోలు చేస్తామని చెప్పింది.
“ఆక్సిజన్ కొరత వల్ల ఆ ప్రభావం నేరుగా మరణాల రేటుపై పడింది. ఎందుకంటే అది అందుబాటులో ఉంటే, చాలామంది ఆరోగ్యం మెరుగుపడేది. పరిస్థితి ఘోరంగా మారడంతో అప్పటికే పడకల కొరతతో ఉన్న ఐసీయూల్లో వారిని చేర్చాల్సిన అవసరం వచ్చింది” అంటారు డాక్టర్ గాజర్.
నాలుగో కారణం-ప్రభుత్వ తొందరపాటు
కరోనా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాపిస్తున్న సమయంలో తొందరపాటుతో వ్యవహరించిన పెరూ ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధించింది.
అంతే కాదు, జీడీపీలో 9 నుంచి 12 శాతాన్ని లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాయంగా కేటాయించింది.
కానీ ప్రభుత్వం అందించిన సాయం సరిపోలేదు. పెరూలో 71 శాతం జనాభా అసంఘటిత రంగంలో లేదా కూలీ పనుల్లో ఉన్నారు. అలాంటి వారందరికీ ఇళ్లలోనుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారింది.
దీంతో, ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ప్రజలకు డబ్బులు పంచడం ప్రారంభించింది. కానీ పెరూలో 38.1 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాంతో జనం భారీగా బ్యాంకుల దగ్గరికి చేరుకున్నారు.
“ప్రభుత్వం మహమ్మారికి కళ్లెం వేసేందుకు చర్యలు తీసుకుంది. కానీ ఆ చర్యలు నిజానికి మహమ్మారి మరింత వ్యాపించడానికి కారణం అయ్యాయి” అంటారు డాక్టర్ గోటుజో.
“మహమ్మారిని నియంత్రించడానికి యూరప్‌లో తీసుకున్న చర్యలను, పెరూ ప్రభుత్వం గుడ్డిగా అనుసరించింది. పరిస్థితిని అర్థం చేసుకోడానికి ప్రభుత్వం వేరే విధానాల గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది” అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రాంతీయ అధ్యక్షుడు హుగో నోపో చెప్పారు.
“దేశంలో మహమ్మారి గురించి ఎవరికీ తెలీదు. ప్రభుత్వం పొరపాటు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ప్రభుత్వం పొరపాటు చేసినపుడు, పారదర్శకత వహిస్తూ అది దానిని సరిదిద్దుకుని ఉండాల్సింది” అన్నారు.
పెరూ ప్రభుత్వం తన తప్పులను కూడా సరిదిద్దుకుంది, మార్కెట్లను సురక్షితం చేయడానికి చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ సమయాన్ని పెంచింది. 18 ఏళ్లకు పైబడిన వారు ఆటోమేటిక్ బ్యాంక్ అకౌంట్లు తెరవగలిగే ఏర్పాటు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐదో కారణం-లాక్‌డౌన్ ఉల్లంఘన
ఇటీవల దేశంలో చాలామంది ప్రభుత్వం అమలుచేసిన నిబంధనలను పాటించినవారిని విమర్శిస్తూ మహమ్మారి వ్యాప్తికి వారే కారణం అన్నారు.
వారు అలా అనడానికి కారణం ఇటీవల లీమాలో జరిగిన ఒక పార్టీ. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు. పెరూలో బహిరంగ కార్యక్రమాలపై నిషేధం ఉన్నప్పటికీ థామస్ రెస్టోబార్‌లో జరిగిన పార్టీలో 130 మంది పాల్గొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.
మహమ్మారి వ్యాపించిన తర్వాత దేశంలో అలాంటి పార్టీలు 321 జరిగాయని గురువారం పోలీసులు ఒక పత్రికకు చెప్పారు.
దేశంలో కరోనా పాజిటివ్ గణాంకాలకు మన తప్పిదం కూడా ఒక పెద్ద కారణం అని ఆ పత్రిక చెప్పింది. కరోనా వ్యాప్తికి సమాజం కారణమైతే, దానికి ‘విక్టిమ్ బ్లేమ్’ అంటే ఆ తప్పంతా కరోనా బాధితులదే అన్నట్టు చూశారని తెలిపింది.
“ఇలాంటి పార్టీల వల్ల మృతుల సంఖ్య పెరిగిందనేది వాస్తవం. కానీ, కరోనా వల్ల సంభవించిన మరణాలకు అది ముఖ్య కారణం మాత్రం కాదు. దీనిని ధ్రువీకరిస్తూ ఇప్పటివరకూ ఎలాంటి డేటా బయటికి రాలేదు” అని యూనివర్సిటీ డేల్ పెసిఫియో ప్రొఫెసర్ పాబ్లో లావాడో అన్నారు.

ఫొటో సోర్స్, EPA/Andina
పెరూ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి
అత్యధిక మరణాల రేటుపై ప్రభుత్వ స్పందన
“కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్యను బట్టి పెరూలో మరణాల రేటు ప్రపంచంలోనే అత్యధికం” అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభుత్వ అధికారులు అంగీకరించారు.
“మహమ్మారి సమయంలో మరణాల రేటు ప్రకటనలో వేరే ఏ దేశమూ మా అంత పారదర్శకతతో ప్రకటించినట్లు నాకు అనిపించడం లేదు” అన్నారు.
కరోనా నియంత్రణకు అమలు చేసిన నిబంధనలు జనం పాటించేలా రహదారులపై, బ్యాంకులు, మార్కెట్లు, బస్ స్టాపుల్లో పోలీసులను మోహరించారు.
కరోనా నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేలా ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటించడం గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)