లాక్డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో తాగలేక, బయటకు వెళ్లలేక మద్యం మానేసేవాళ్లు పెరుగుతున్నారా?
- ఫెర్నాండో డువార్టే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
‘టీనేజీలో ఉండగానే మద్యం తాగడం మొదలుపెట్టినవారు ముందు తరాలతో పోల్చితే జూమర్స్లో తక్కువగా ఉంటున్నారు’
కోవిడ్-19 సంక్షోభం మొదలయ్యేటప్పటికే, టీనా రోడ్రిగేజ్ మద్యం మానేసి దాదాపు మూడు నెలలు గడిచింది.
‘‘ఎప్పటికీ తాగకుండా ఉండాలని నేనేమీ నిర్ణయించుకోలేదు. కానీ, లాక్డౌన్ పెట్టిన తర్వాత నుంచి ఇక ఎందుకో మద్యంపై మళ్లీ ఆసక్తి రాలేదు. ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నా. అలాగే కొనసాగడం ముఖ్యమని అనిపిస్తోంది’’ అని టీనా అన్నారు.
టీనాకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడితోపాటు ఇంట్లో ఉండటం మద్యానికి దూరంగా ఉండేందుకు తనకు ఉపయోగపడిందని ఆమె అంటున్నారు.
‘‘బయటకు వెళ్లి జనాలను కలిసే పరిస్థితి లేదు. ఇంట్లో తాగలేను’’ అని ఆమె చెప్పారు.
కరోనావైరస్ సంక్షోభ సమయంలో మద్యం తీసుకోవడం చాలా ఎక్కువైంది. అలాగే, టీనాలా మద్యం మానేస్తున్నవాళ్లు, మితంగానే తాగాలని నిర్ణయించుకున్న వాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది.
జులైలో పబ్‌లు, బార్లు తెరుచుకున్న తర్వాత కూడా టీనా మద్యం ముట్టుకోలేదు. తనకు ఇక తాగాల్సిన అవసరం ఉందని అనిపించడం లేదని ఆమె అంటున్నారు.
లాక్డౌన్ సమయంలో మద్యం మానేసిన చాలా మంది ఆ తర్వాత మళ్లీ తాగడం మొదలుపెట్టారు.
భారత్, బ్రెజిల్, అమెరికా, యురోపియన్ దేశాల్లో ఈ సంక్షోభ సమయంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
అమెరికాలో ఏప్రిల్ చివర్లో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అక్కడ మద్యం అమ్మకాలు 400 శాతం పెరిగాయి. అందుకే దక్షిణాఫ్రికా లాంటి కొన్ని దేశాలు మద్య నిషేధం అమలు చేశాయి.
‘ఆల్కహాల్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో... బ్రిటన్‌లో 30 శాతం మంది తాము కరోనా సంక్షోభ సమయంలో సాధారణంగా తీసుకునేదాని కన్నా ఎక్కువ మద్యం తీసుకుంటున్నట్లు చెప్పారు.
మరోవైపు మద్యానికి దూరంగా ఉండే ట్రెండ్ కూడా పెరిగింది.
మద్యపానాన్ని నియంత్రించుకునేందుకు 37 శాతం మంది ఏదో ఓ రకంగా ప్రయత్నిస్తున్నామని ఆల్కహాల్ ఛేంజ్ సర్వేలో చెప్పారు. మద్యం తీసుకోవడాన్ని ముందుకన్నా తగ్గించినవారు, పూర్తిగా మానేసినవారు వీరిలో ఉన్నారు.
‘‘ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేందుకు కొందరికి ఇన్నాళ్లూ అడ్డుపడుతూ వచ్చిన విషయాలు ఈ సంక్షోభ సమయంలో తొలగిపోయాయి. ఇబ్బందులు ఎదుర్కొన్నవారు లేరని నేను అనను. కొందరికి మాత్రం ఈ లాక్డౌన్ సరైన వాతావరణాన్ని కల్పించింది’’ అని బ్రిటన్‌కు చెందిన థెరపిస్ట్ జెమ్ టిమోన్స్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ సహా చాలా దేశాల్లో లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు పెరిగాయి
సోషల్ మీడియా ప్రభావం
1981 నుంచి 1996 మధ్య పుట్టినవారిని ‘మిలీనియల్స్’ అని... 1996 తర్వాత పుట్టినవారిని జూమర్స్ (జనరేషన్-జెడ్) అని పిలుస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు తరాల వాళ్లు మునపటి తరాలతో పోలిస్తే మద్యం తీసుకోవడం తక్కువైందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
1976 నుంచి 2016 మధ్య 80 లక్షల అమెరికన్ టీనేజర్లపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఓ అధ్యయనం నిర్వహించింది. టీనేజీలో ఉండగానే మద్యం తాగడం మొదలుపెట్టినవారు ముందు తరాలతో పోల్చితే జూమర్స్లో తక్కువగా ఉంటున్నారని అందులో వెల్లడైంది.
‘‘ఇప్పుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే ట్రెండ్. సమాజంలో అవగాహన పెరుగుతోంది. మద్యం తాగడాన్ని ఇంతకుముందులా వారు సమర్థించుకోవడం లేదు. జూమర్స్ చాలా ఆరోగ్యవంతమైన తరం. వాళ్లు మద్యం పరిశ్రమల రంగంలో మార్పులకు కారణమవుతారు’’ అని మద్యం పరిశ్రమల రంగంలో నిపుణుడు జానీ ఫోర్సిత్ అన్నారు.
మద్యపానం అలవాటుకు దూరంగా ఉండమని ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ కూడా పెరుగుతున్నారు.
‘‘ఈ సంక్షోభ సమయంలో మద్యానికి దూరంగా ఉండటం మరింత కష్టమైందా అన్నది నాకు తెలియదు. కానీ, ఇలా ఉండటం ఇప్పుడు చాలా మందికి అవసరం’’ అని కెల్లీ ఫిడ్జ్‌గెరాల్డ్ అన్నారు. ఆమె ‘సోబర్ సెనోరిటా’ అన్న పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయ్యారు. సోబర్ అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం.
‘‘మద్యపానానికి దూరంగా ఉండేవారిపై బోరింగ్ మనుషులని ముద్ర వేయడం ఇప్పటికీ ఉంది. కానీ, జనాల తీరులో మార్పు వస్తోంది’’ అని లీ మెంగో అనే మరో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పారు.
లాక్డౌన్ సమయం చాలా మందిపై సానుకూల ప్రభావం చూపిందని జర్నలిస్ట్ మిల్లీ గూక్ అన్నారు. ఆమె మద్యపానం అలవాటు మానుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ‘ద సోబర్ గర్ల్ సొసైటీ’ అనే గ్రూప్‌ను నడుపుతున్నారు.
‘‘కరోనా మహహ్మరి వల్ల జనాల్లో ఆందోళన పెరిగింది. దీని వల్ల జనం మద్యం తాగడం ఎక్కువ కావొచ్చు. అదే సమయంలో తాగడం మానేయాలనుకునేవారికి ఈ సమయం బాగా సహకరించింది. బయట పెద్దగా వేడుకలు, కార్యక్రమాలు లేకపోవడం మేలు చేసింది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, Getty Images
మద్యం తాగేవాళ్లు లాక్డౌన్ సమయంలో మరింత ఎక్కువగా తాగారని అధ్యయనంలో తేలింది
ఆల్కహాల్ రహిత డ్రింక్స్‌కు డిమాండ్
పాశ్యాత్య దేశాల యువతలో వస్తున్న ఈ మార్పు, కొత్త కొత్త వాణిజ్యాలకు ఊపిరిపోస్తోంది. ఈ వైఖరి ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
‘వన్ ఇయర్... నో బీర్’ అనే వెల్బీయింగ్ వెబ్సైట్... 90 దేశాల వ్యాప్తంగా 70 వేలకుపైగా మంది సభ్యులను సంపాదించుకుంది.
మద్యపానం అలవాటు మానేందుకు అవసరమైన సేవలను ఈ వెబ్సైట్ అందిస్తోంది. గత మార్చి తర్వాత ఆ వెబ్సైట్లో సభ్యులు 30 శాతం పెరిగారు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ వెబ్సైట్ మొదలైంది. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వం కూడా వారికి సాయం అందించింది.
ఈ సంక్షోభ సమయంలో ఆల్కహాల్ పాళ్లు తక్కువగా ఉండే డ్రింక్‌లు, ఆల్కహాల్ లేని డ్రింక్‌ల అమ్మకాలు కూడా పెరిగాయి.
పాల్ మాథ్యూ అనే ఆయన గత ఏడాది ఆల్కహాల్ లేని ఆపెర్టిఫ్ డ్రింక్‌ను తయారుచేశారు. బార్లకు, రెస్టారెంట్లకు ఆయన దీన్ని విక్రయిస్తూ వచ్చారు.
కరోనా సంక్షోభం మొదలైన తర్వాత నేరుగా వినియోగదారులకే వాటిని ఆయన విక్రయించడం మొదలుపెట్టారు. తమ డ్రింక్ అమ్మకాలు 4వేల శాతం పెరిగాయని ఆయన చెప్పారు.
‘‘నెలకు రెండు మూడు వందల సీసాలు అమ్మే స్థాయి నుంచి, వేల సీసాలు అమ్మే స్థాయికి చేరుకున్నాం. ఈ మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదు’’ అని ఆయన అన్నారు.
2024కల్లా యూరప్‌లో ఆల్కహాల్ రహిత డ్రింక్‌ల వ్యాపారం ఆరు బిలియన్ డాలర్లకు పెరగొచ్చని ఆగస్టులో ఏఈరీసెర్చ్ అనే సంస్థ మార్కెట్ అధ్యయనంలో అంచనా వేసింది.
ఆల్కహాల్ డ్రింక్స్ తయారుచేసే పెద్ద సంస్థలు కూడా, ఆల్కహాల్ రహిత డ్రింక్‌లపై దృష్టిపెట్టాయి.
హెంకెన్ సంస్థ హెంకెన్ జీరో పేరుతో ఆల్కహాల్ లేని బీరును అందిస్తోంది.
ఆల్కహాల్ లేని కాక్టెయిల్ డ్రింక్స్‌ని ‘మాక్ టెయిల్’ అని పిలుస్తుంటారు. 2019లో దీని కోసం గూగుల్‌లో వెతికేవారి సంఖ్య 42 శాతం పెరిగినట్లు రమ్ తయారీ సంస్థ బకార్డీ ఓ అధ్యయన నివేదికలో తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
ఆల్కహాల్ తాగకూడదని తీర్మానించుకున్న వారికి లాక్డౌన్ పరిస్థితులు బాగా సహకరించాయి
మళ్లీ, ముట్టకుండా ఉంటారా?
మంచి అలవాట్లు ఎక్కువ కాలం ఉంటాయా?
రాబోయే రోజుల్లో ఏదైనా వేడుకలో, కార్యక్రమంలో మద్యం తనను మళ్లీ ఆకర్షించవచ్చని టీనా రోడ్రిగేజ్ కూడా కొంచెం భయపడుతున్నారు.
అయితే, తన స్నేహితులు కూడా చాలావరకూ మద్యం తీసుకోవడం తగ్గించారని ఆమె అంటున్నారు. ‘‘మన అందరికీ ఆరోగ్యంగా ఉండటం మీద ఇష్టం పెరగాలి అని ఆశిస్తున్నా’’ అని టీనా అన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉండగలరా లేదా అన్నదాన్ని వ్యక్తుల మానసిక స్థైర్యం ఒక్కటే నిర్ణయించదని రచయిత మాండీ మానర్స్ అంటున్నారు. ‘లవ్ యువర్సెల్ఫ్ సోబర్’ అనే పుస్తకానికి ఆమె సహరచయితగా ఉన్నారు.
‘‘బార్లు, రెస్టారెంట్లు కూడా మద్యం తీసుకోనివారికి అనుకూలంగా ఉండటం ముఖ్యం. వారికి కూడా ఎంచుకోవడానికి అవసరమైనన్ని ఆప్షన్లు కల్పించాలి’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘వన్ ఇయర్... నో బీర్’ సభ్యుల్లో చాలా మంది 35 నుంచి 55 ఏళ్ల మధ్యవారే. దీనిలో కొత్తగా చేరుతున్నవారిలో 40 ఏళ్ల వయసు దాటినవారు ఎక్కువగా ఉంటున్నారు.
న్యూజీలాండ్‌కు చెందిన క్లెయిర్ బూత్ కూడా ఈ వెబ్సైట్ సభ్యత్వం తీసుకున్నారు. ఆమె వయసు 56 ఏళ్లు.
జనవరిలో కరోనా గురించి వార్తలు రావడం మొదలయ్యాక ఆమె ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించారు.
న్యూజీలాండ్లొ లాక్డౌన్ విధించే సమయానికి ఆమె దాదాపుగా ఆల్కహాల్ మానేశారు.
‘‘వ్యాధి ముప్పు తగ్గించుకోవడానికి ఆరోగ్యంగా ఉండాలనుకున్నా. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా. గత ఆరు నెలల్లో నేను మూడు సార్లు మాత్రమే తాగాను’’ అని క్లెయిర్ చెప్పారు.
మునుపటి తరాలు కూడా మద్యానికి దూరమవుతుండటం తనను ఆశ్చర్యపరచలేదని మిల్లీ గూక్ అన్నారు.
‘‘సోషల్ మీడియా తరం కాబట్టి, మనం ఈ విషయం గురించి బయటకు ఎక్కువగా మాట్లాడుతున్నాం అనుకుంటా. కానీ, ముందు తరాల వారి కోసం కూడా కృషి చేస్తున్నవారు గొప్పవాళ్లు కూడా ఉన్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విని విని చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ బందీ అయిన భారత సైనికుడి కథ
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కరోనావైరస్ అంటించారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)