కొలంబియాలో పోలీసుల చేతుల్లో వ్యక్తి మరణం.. ఆందోళనల్లో మరో ఐదుగురి మృతి - Newsreel

కొలంబియా ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters

పోలీసుల చేతుల్లో ఒక వ్యక్తి మరణించటంతో కొలంబియాలో ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారటంతో మరో ఐదుగురు మరణించారు.

పోలీసులు బొగోటాలో ఒక వ్యక్తిని నేలకు అదిమి పదే పదే షాక్ ఇవ్వటంతో అతడు చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన జనం ఆందోళనలకు దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో 46 ఏళ్ల జేవియర్ ఓర్డిజ్ పోలీసులతో "ఆగండి, నాకు ఊపిరాడడం లేద"ని వేడుకుంటూ కనిపిస్తాడు. స్నేహితులతో మద్యం తాగుతూ సామాజిక దూరం నియమాలను ఉల్లంఘించాడనే ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని చెబుతున్నారు.

అతడిని పోలీస్ స్టేషన్‌కు, తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు చనిపోయాడు. దీంతో కొలంబియా రాజధాని బొగోటాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు చనిపోయారని, చాలామంది గాయపడ్డారని, క్షతగాత్రుల్లో 30 మంది పోలీసులు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు.

పోలీసులు ఓర్డిజ్‌ను అరెస్ట్ చేసిన ఎంగేటివా కేంద్రంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఓర్డిజ్‌ను ఉంచిన పోలీస్ పోస్ట్ బయట వందలాది ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. నగరంలోని 40 పోలీస్ పోస్టుల్లో 17 తగలబెట్టారు.

ఈ నిరసనలను అదుపుచేసేందుకు 1,600 మంది అదనపు పోలీసు బలగాలను బొగోటాకు పంపుతున్నట్లు రక్షణ మంత్రి కార్లోస్ హోమ్స్ తుజిల్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డ 13,000 మంది వలసదారులకు గ్రీకు నౌకల ఆశ్రయం

మోరియా శరణార్థుల శిబిరంలో అగ్నిప్రమాదం జరగడంతో లెస్బోస్ దీవిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది వలస ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు గ్రీస్ మూడు నౌకలను పంపింది.

లెస్బోస్ దీవిలో కిక్కిరిసిన మోరియా క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరగడంతో వీరంతా నిరాశ్రయులయ్యారు.

ఈ క్యాంపులో 13 వేల మంది దుర్భర పరిస్థితుల్లో ఉండేవారు. అది కాలిపోవడంతో ఇప్పుడు ఎన్నో కుటుంబాలు వరసగా రెండో రోజు రాత్రి కూడా రోడ్ల మీద, పొలాలు, కార్ పార్కింగుల్లో పడుకున్నాయి.

మంగళవారం రాత్రి మోరియా క్యాంపులో అగ్ని ప్రమాదం జరగింది. బుధవారం మరో ప్రమాదంలో మిగిలిన గుడారాలు కూడా కాలిపోయాయి. దీంతో దాదాపు 400 మంది యువతీయువకులు, పిల్లలు గ్రీస్ మెయిన్ లాండ్ వెళ్లారు.

ఏ తోడూ లేని 400 మంది మైనర్లను యూరప్ లోపలికి తీసుకొచ్చేందుకు జర్మనీ చాన్సలర్ ఏంజిలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ అంగీకరించారని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. కానీ ఇప్పటికే గ్రీస్ చేరుకున్నవారు, ఈ మైనర్లు ఒకరేనా, కాదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

గ్రీస్ నౌక బ్లూ స్టార్ చియోస్ లెస్బోస్ రేవుకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్లో వెయ్యి మంది ఉండచ్చు. గ్రీస్ మరో రెండు నౌకలను లెస్బోస్‌కు కూడా పంపిస్తోంది. ఈ నౌకల్లో దాదాపు 2 వేల మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తామని గ్రీస్ మంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

బేరూత్ పోర్టులో మళ్లీ భారీ మంటలు

లెబనాన్‌లోని బేరూత్ పోర్టు ప్రాంతంలో మరోసారి భారీ అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. నెల రోజుల కిందట ఇక్కడ జరిగిన పెను విస్ఫోటనంలో దాదాపు 190 మంది చనిపోయారు.

ఓడరేవులోని చమురు, టైర్ల గోడౌన్‌లో తాజాగా గురువారం నాడు మంటలు చెలరేగాయి. ఇందుకు కారణమేమిటనేది వెంటనే తెలియరాలేదు.

భారీ అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఆ మంటల నుంచి పుడుతున్న పొగ నగరం మీద ఆకాశాన్ని కప్పివేయటం కనిపిస్తోంది.

ఈ మంటల వల్ల ఇప్పటివరకూ ఎవరైనా చనిపోయారనేది కూడా తెలియలేదు.

అగ్నికీలలను అదుపులోకి తీసుకురావటానికి అగ్నిమాపక శకటాలు, హెలికాప్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

ఈ మంటలు, దట్టమైన పొగ కారణంగా అక్కడున్న కొంత మందికి ఊపిరి ఆడటం లేదని లెబనాన్‌లోని రెడ్ క్రాస్ విభాగం అధిపతి జార్జ్ కెటానే చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

రియా చక్రవర్తి మీద మీడియా విచారణ.. నిష్పాక్షిక విచారణ హక్కుకు భంగకరం: ఆమ్నెస్టీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో సినీ నటి రియా చక్రవర్తి పాత్ర ఉందనే ఆరోపణలతో ఆమె మీద మీడియా చానళ్లలో విషప్రచారం జరుగుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ వ్యాఖ్యానించారు.

''నిష్పాక్షికమైన, న్యాయమైన విచారణ హక్కు అనేది న్యాయం జరిగేలా చూడటానికి అతి ముఖ్యం. ఆ హక్కును నిరాకరించటం వల్ల బాధితులకు ఎంత అన్యాయం జరుగుతుందో నిందితులకూ అంతే అన్యాయం జరుగుతుంది. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం సహా కొంతమంది వ్యక్తులను మీడియా చానళ్లు దోషులుగా చూపటం ఈ హక్కుకు భంగం కలిగించటమే'' అని ఆయన తప్పుపట్టారు.

''రియా చక్రవర్తి గురించి గత రెండు నెలలుగా అనేక వివక్షాపూరిత వ్యాఖ్యలు, విశ్లేషణలు, ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో హింస, దుర్భాషలకు దారితీశాయి. ఆమె ప్రవర్తనను, శీలాన్ని కించపరిచే విధంగా మీడియా కవరేజి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు'' అని అవినాష్ కుమార్ పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థలను బాధ్యతవహించేలా చూడటంలో మీడియా సంస్థలు తప్పనిసరిగా పాత్ర పోషించాల్సిందేనన్నారు. ''కానీ.. నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన న్యాయ ప్రక్రియకు అవి ప్రత్యామ్నాయం కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిన

2021 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు నార్వేకు చెందిన మితవాద పార్టీ నాయకుడు క్రిస్టియన్‌ టైబ్రింగ్‌ వెల్లడించారు.

ఇజ్రాయెల్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ మధ్య శాంతి ఒప్పందంలో కీలకపాత్ర పోషించినందుకు తాను ఆయన పేరును ప్రతిపాదిస్తున్నానని టైబ్రింగ్‌ చెప్పారు.

దేశాల మధ్య శాంతి, స్నేహాల కోసం ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు, మిగతా అందరు నామినీలకన్నా ఆయన్ను అగ్రస్థానంలో ఉంచుతాయని తాను గట్టిగా నమ్ముతున్నట్లు టైబ్రింగ్‌ ఫాక్స్‌ న్యూస్‌తో అన్నారు.

“ఏవో కొన్నిసార్లు ఆయన ప్రవర్తించే తీరునుబట్టి కాకుండా, వాస్తవాల ఆధారంగా నోబెల్ కమిటీ ఆయన పేరును పరిశీలించాలి’’ అని టైబ్రింగ్ వ్యాఖ్యానించారు.

మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్న తరుణంలో ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)