కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి పంచాలంటే ‘8000 జంబో జెట్లు కావాలి’

వ్యాక్సిన్ సరఫరా సమయంలో విమానంలో ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వ్యాక్సిన్ సరఫరా సమయంలో విమానంలో ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది

మరికొన్ని నెలల్లో కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వస్తుందన్న అంచనాల నడుమ, ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచం మొత్తానికి సరఫరా చేయాలంటే రవాణా కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై చర్చ నడుస్తోంది.

కరోనా వ్యాక్సిన్‌ను అన్నిదేశాలకు చేరవేయడం “ రవాణా రంగంలో అతి పెద్ద సవాల్‌’’ అని వైమానిక రంగ నిపుణులు అంటున్నారు .

బోయింగ్‌ 747 సైజులో ఉండే దాదాపు 8,000 విమానాలు అవసరమవుతాయని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) వెల్లడించింది.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంకా సిద్ధం కానప్పటికీ, ఒకవేళ అది సిద్దమైతే దాని రవాణాఎలా. అన్నదానిపై విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలు, ఆరోగ్యసంస్థలు, ఫార్మా కంపెనీలతో IATA చర్చలు జరుపుతోంది.

“కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సురక్షితంగా అన్నిదేశాలకు చేరవేయడం రవాణా రంగంలో ఈ శతాబ్దిలోనే అతి పెద్ద పరిణామం. కానీ సరైన ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇది అసాధ్యం’’ అని IATA చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలెగ్జాండ్రే డీ జునైక్‌ అన్నారు.

ఫొటో సోర్స్, AirAsia

ఒకపక్క ప్రయాణికుల విమానయాన రంగంలో పూర్తి స్తబ్దత నెలకొన్న తరుణంలో వైమానిక సంస్థలు సరుకు రవాణా మీద దృష్టి పెట్టాయి. అయితే వ్యాక్సిన్‌ను తరలించడం మాత్రం క్లిష్టమైన వ్యవహారం.

అన్ని విమానాలు వ్యాక్సిన్‌ తరలింపుకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వీటి తరలింపు సమయంలో విమానంలో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కొన్ని వ్యాక్సిన్‌లకు గడ్డకట్టేంత చల్లదనం అవసరం. అలాంటి పరిస్థితిలో మరికొన్ని విమానాలు ఈ జాబితా నుంచి తీసేయాల్సి ఉంటుంది.

“వ్యాక్సిన్‌ రవాణాకు సంబంధించిన విధి విధానాలపై మాకు అవగాహన ఉంది. వాటన్నింటినీ సరైన సమయంలో అనుసరించడమే ముఖ్యం’’ అని ఓ కార్గో సంస్థ అధిపతి గ్లిన్‌ హ్యూగ్స్‌ అన్నారు.

కొన్ని తూర్పు ఆసియా దేశాలతోపాటు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాలు లేని కొన్నిప్రాంతాలకు దానిని సరఫరా చేయడం క్లిష్టమైన వ్యవహారమని గ్లిన్‌ అన్నారు.

వీడియో క్యాప్షన్,

కరోనావైరస్ విమాన ప్రయాణాలను ఎలా మార్చేస్తుందంటే..

పకడ్బందీ ఏర్పాట్లు అవసరం

ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ సరఫరా చేయడం సాధ్యం కాదని IATA వెల్లడించింది. సరిహద్దులు, కార్గో కెపాసిటీ, ప్రాంతాల పరిమాణం తదితర సమస్యలు దీనికి కారణంగా చెబుతోంది.

వ్యాక్సిన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు అవసరం. వివిధ ప్రాంతాలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లు తయారీ దశలో ఉన్నాయి. అందులో పాతిక వరకు వ్యాక్సిన్‌లతో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారవుతున్న వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాలు ప్రస్తుతానికి నిలిచిపోయినా, ఆ ట్రయల్స్‌ చివరి దశలో ఉన్నాయి.

వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వాలకు IATA సూచించింది. జాగ్రత్తగా సరఫరా చేయడం, అవసరమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్‌ చేయడం తమ పని అని, అయితే భద్రతా చర్యలు కూడా చాలా కీలకబమని IATA అంటోంది.

“ఈ వ్యాక్సిన్‌లు చాలా విలువైనవి. దొంగతనాలు, అక్రమాలు జరక్కుండా రవాణాను అత్యంత పకడ్బందీ చర్యల మధ్య చేపట్టాల్సి ఉంది” అని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)