అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకుంటే జరిమానా... కంబోడియాలో కొత్త చట్టంపై నిరసనలు

  • లారా ఓవెన్
  • బీబీసీ ప్రతినిధి
కంబోడియా మోడల్స్

ఫొటో సోర్స్, Getty Images

పొట్టి దుస్తులు వేసుకునే మహిళలకు జరిమానాలు విధించేలా కంబోడియాలో ఓ చట్టం ముసాయిదా సిద్ధం చేశారని తెలిసి 18 ఏళ్ల మోలిక షాక్‌కు గురయ్యారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆమె ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ మొదలుపెట్టారు.

ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే, కంబోడియాలో ‘శరీరం ఎక్కువగా కనిపించేలా’, మహిళలు ‘పొట్టి’ బట్టలు వేసుకోవడంపై నిషేధం అమలవుతుంది. పురుషులు కూడా అర్ధనగ్నంగా (ఛాతీపై దుస్తులు లేకుండా) తిరగకూడదు.

సంస్కృతి, సంప్రదాయాలను, సభ్యతను పరిరక్షించేందుకు ఈ చట్టాన్ని తెస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ, ఈ చట్టంలోని నిబంధనలను చాలా మంది తప్పుపడుతున్నారు.

ఈ చట్టాన్ని మహిళలపై జరుగుతున్న దాడిగా మోలిక అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Molika Tan

ఫొటో క్యాప్షన్,

మోలిక

‘‘ఓ కంబోడియా యువతిగా నేను ఎక్కడికి వెళ్లినా అభద్రత భావం కలగకూడదని ఆశిస్తున్నా. నేను నాకు సౌకర్యంగా అనిపించే దుస్తులను వేసుకోవాలనుకుంటున్నా. నా దుస్తుల ద్వారా నన్ను నేను వ్యక్తీకరించుకోవాలనుకుంటున్నా. ప్రభుత్వం నాపై పరిమితులు పెట్టడాన్ని నేను అంగీకరించను’’ అని మోలిక అంటున్నారు.

మహిళలు స్కర్టులు వేసుకోకుండా నిషేధం విధించడం కాకుండా... సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు వేరే మార్గాలు ఉంటాయని తాను భావిస్తున్నానని ఆమె అన్నారు.

ప్రభుత్వం తేదలుచుకుంటున్న కొత్త చట్టానికి వ్యతిరేకంగా మోలిక గత నెలలో ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే 21 వేల మందికిపైగా సంతకాలు చేశారు.

ఫొటో సోర్స్, Sopheary OU

ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా కంబోడియాలో చాలా మంది మహిళలు గొంతు ఎత్తుతున్నారు. స్కర్టులు, షార్టులు, స్విమ్‌వేర్ ధరించి ఉన్నప్పటి ఫొటోలను, చట్టంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘దీనికి మాకు జరిమానా వేస్తారా?’ అని ప్రశ్నిస్తూ ‘#mybodymychoice’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్‌లు పెడుతున్నారు.

‘‘పురుషుల కన్నా కింది స్థాయి వారిలా మహిళలు ఉండాలని వాళ్లు అనుకుంటుంటారు’’ అని అన్నారు మోలిక. మహిళలు అణిగిమణిగి ఉండాలన్న సంప్రదాయ భావనలే ఈ పరిస్థితికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

గత కొన్నేళ్లుగా ప్రభుత్వం మహిళల వస్త్రధారణను లక్ష్యంగా చేసుకుంటోంది. సింగర్స్, యాక్టర్స్ ‘అనుచిత’ దుస్తుల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిషేధం విధించింది.

గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో దుస్తులు విక్రయిస్తున్న ఓ మహిళ‌కు కంబోడియాలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆమె ‘రెచ్చగొట్టేలా’ దుస్తులు ధరించారంటూ, ‘పోర్నోగ్రఫీ’, ‘అసభ్యకరంగా కనిపించడం’ వంటి అభియోగాలు మోపి ఈ శిక్ష వేశారు.

మహిళలు ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని... లైంగిక వేధింపులను, మహిళలపై నేరాలను ఇది ప్రేరేపిస్తోందని కంబోడియా ప్రధాని హన్ సెన్ అప్పుడు అన్నారు.

కంబోడియాలో జనాలు బాధితులనే నిందించే (విక్టిమ్ బ్లేమింగ్) తీరు గురించి చర్చ జరగాలన్న ఉద్దేశంతో తాను కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగమయ్యాయని 18 ఏళ్ల అయ్లిన్ లిమ్ అన్నారు.

‘‘ఈ చట్టం ఆమోదం పొందితే, లైంగిక వేధింపులకు పాల్పడేవారిది తప్పు కాదన్న భావన పెరుగుతుంది. వాళ్లు శిక్షల నుంచి తప్పించుకుంటారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Aylin Lim

ఫొటో క్యాప్షన్,

అయ్లిన్ లిమ్

‘‘కంబోడియాలో జీవితమంటే... రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చేయాలి. శరీరం ఎక్కువగా బయటకు కనిపించకుండా చూసుకోవాలి’’ అని ఆమె అన్నారు.

వస్త్రధారణపై ఉన్న నిబంధనలతోపాటు ఈ చట్టంలో చాలా ఆందోళనకరమైన అంశాలున్నాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

‘మానసిక వ్యాధులు’ ఉన్నవారు ‘బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా నడవడం’పై, అన్ని రకాల ‘భిక్షాటనల’పై ఈ చట్టం నిషేధం ప్రతిపాదించింది. బహిరంగ ప్రదేశాల్లో శాంతియుతంగా సమావేశం నిర్వహించుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది.

ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే కంబోడియా సమాజంలోని అత్యంత నిరుపేదలపైనా ప్రభావం పడుతుందని కంబోడియన్ మానవ హక్కుల కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాక్ సోఫీప్ అన్నారు.

ఫొటో సోర్స్, Chak Sopheap

ఫొటో క్యాప్షన్,

చాక్ సోఫీప్

ఈ చట్టం పేదలను మరింత అణగదొక్కి, సమాజంలో అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే ఈ చట్టం వచ్చే ఏడాది అమల్లోకి వస్తుంది.

కంబోడియా అంతర్గత మంత్రి ఒవుక్ కిమ్లేఖ్‌ నుంచి బీబీసీ ఈ విషయం గురించి వివరణ తీసుకునేందుకు ప్రయత్నించింది. ‘ఇది చట్టం తొలి ముసాయిదా’నే అని ఆయన పొడిగా సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు మాట్లాడేందుకు నిరాకరించారు.

ప్రజల నుంచి ఒత్తిడి రాకపోతే, అసలు ఏ తనఖీ లేకుండా ఆ చట్టం ఆమోదం పొందొచ్చని చాక్ సోఫీప్ ఆందోళన వ్యక్తం చేశారు.

తాను మొదలుపెట్టిన పిటిషన్‌తో ప్రజల్లో అవగాహన పెరిగి, ప్రభుత్వం ప్రతిపాదిత చట్టానికి మార్పులు చేసే పరిస్థితి వస్తుందని మౌలిక ఆశాభావంతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)