కిమ్ జోంగ్ ఉన్: దక్షిణ కొరియా అధికారి హత్యకు క్షమాపణలు చెప్పిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణలు చెప్పారు

కిమ్

ఫొటో సోర్స్, Reuters

తమ దేశానికి చెందిన అధికారిని చంపేయడంపై ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారని దక్షిణకొరియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇలా జరిగి ఉండాల్సి కాదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌కు పంపిన సందేశంలో కిమ్ క్షమాపణలు తెలిపారని దక్షిణకొరియా చెబుతోంది.

ఈ మేరకు కిమ్ లేఖ పంపించారని చెబుతున్నారు.

తమ దేశానికి చెందిన 47 ఏళ్ల అధికారి ఉత్తరకొరియా జలాల్లో కనిపించడంతో వారు తుపాకులతో కాల్చి చంపారని.. ఆ తరువాత ఆయన మృతదేహాన్ని తగలబెట్టారని దక్షిణకొరియా ఆరోపిస్తోంది.

ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో గట్టి పహారా ఉంటుంది.. పైగా కరోనావైరస్ నుంచి దేశాన్ని కాపాడుకునే క్రమంలో ఉత్తర కొరియా తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించేవారిని కాల్చిచంపాలన్న పాలసీ పెట్టుకుందన్న వాదనా ఉంది.

కాగా ఈ ఘటనపై ఉత్తరకొరియా విచారణ జరిపించి ఆ వివరాలు కూడా దక్షిణ కొరియాకు వెల్లడించింది.తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన తరువాత సరిహద్దు గస్తీ దళాలు ప్రశ్నించగా తానెవరన్నది చెప్పకుండా పారిపోయే ప్రయత్నించడంతో కాల్పులు జరిపారని.. మొత్తం 10 రౌండ్లు ఆయనపై కాల్చారని ఉత్తర కొరియా తెలిపిందని దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్ సు హూ వెల్లడించారు.

అయితే.. ఆ అధికారి మృతదేహాన్ని తగలబెట్టలేదని.. ఆయన వచ్చిన తెప్పను మాత్రమే తగలబెట్టారని.. వ్యాధుల నివారణ కోసం దేశంలో ఉన్న అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం అలా చేశారని ఉత్తరకొరియా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలో ఉన్న యెయాన్‌పైయాంగ్ ద్వీపం

అంతకు ముందు ఏం జరిగింది?

దక్షిణ కొరియా ఫిషరీస్ విభాగంలో పని చేస్తున్న ఒక అధికారిని ఉత్తర కొరియా సేనలు చంపి, కాల్చి పడేసినట్లు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిని అమానుష చర్యగా దక్షిణ కొరియా పేర్కొంది.

దక్షిణ కొరియా సరిహద్దులో గస్తీ చేస్తున్న ఆ అధికారి అకస్మాత్తుగా అదృశ్యమై, ఉత్తర కొరియా జలాల్లో శవంగా తేలారని సియోల్ తెలిపింది.

ఉత్తర కొరియా సేనలు ఆయనను హతమార్చి, శరీరం పై నూనె వేసి తగలబెట్టారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కరోనావైరస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు.

ఈ విషయంపై ఉత్తర కొరియా స్పందించలేదు.

ఉత్తర కొరియా సరిహద్దుల దగ్గర సేనలు తీవ్రంగా కాపలా కాస్తున్నారు. దేశంలోకి కోవిడ్ చేరకుండా ఉత్తర కొరియా 'షూట్ టు కిల్' (కనిపిస్తే కాల్చివేత) విధానాన్ని అమలు చేసినట్లు కనిపిస్తోంది.

ఉత్తర కొరియా సేనలు దక్షిణ కొరియా పౌరులను చంపడం ఇది రెండవ సారి. 2008 జులైలో మౌంట్ కుమ్గాంగ్ వద్ద ఉత్తర కొరియా సైనికుడు ఒక యాత్రీకుడిని కాల్చి చంపారు.

దక్షిణ కొరియా ఏమంటోంది?

సోమవారం నాడు దక్షిణ కొరియా అధికారి కనిపించకపోయే సమయానికి ఆయన ఉత్తర కొరియా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఇయాన్పీయాంగ్ దీవి దగ్గర బోటులో గస్తీ కాస్తున్నట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

47 ఏళ్ల అధికారి ఇద్దరు పిల్లలకు తండ్రి. ఆయన షూలు బోటులోనే ఉండిపోయాయి. ఆయన వారికి కనపడకుండా ఉండాలని ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.

గస్తీ కాస్తున్న ఉత్తర కొరియా బోటు సిబ్బంది ఆయనను మంగళవారం పట్టుకున్నట్లు సియోల్ తెలిపింది. వారు గ్యాస్ మాస్కులు ధరించినట్లు చెప్పారు.

అతనిని చంపడానికి పై అధికారుల నుంచి ఆదేశాలు రాక ముందు అతనిని దూరం నుంచి నిలబడి ప్రశ్నించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తరువాత అతనిని నీటిలోనే కాల్చి చంపి అతని దేహాన్ని కాల్చేసినట్లు, మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారు దీనిని వైరస్ కి వ్యతిరేకంగా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉత్తరకొరియా - చైనా సరిహద్దు

దక్షిణ కొరియా అధ్యక్షుడు ఏమన్నారు...

ఈ ఘటన సహించదగినదిగా లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే అన్నారు. ఇటువంటి దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఉత్తర కొరియాను కోరారు.

ఎటువంటి ప్రతిఘటన చేయలేని నిరాయుధులను కాల్చి చంపడాన్ని ఉత్తర కొరియా సమర్థించుకోలేదని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వ్యాఖ్యానించింది.

"ఈ సైనిక చర్య అంతర్జాతీయ నిబంధనలను ఉల్లఘించటమే" అని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జెనరల్ సు-చూ సుఖ్, అన్నారు. "దక్షిణ కొరియా ప్రజల జీవితానికి రక్షణకు భంగం కలిగించే చర్యల పై తీవ్రంగా స్పందిస్తాం" అని సు-చూ సుఖ్ హెచ్చరించారు.

అంతకు ముందు జరిగిన పత్రికా సమావేశంలో ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని పై ఉత్తర కొరియా వివరణ ఇచ్చి దీనికి బాధ్యులయిన వారిని శిక్షించాలని కోరింది.

ఉత్తర దక్షిణ కొరియాల మధ్యన ఉన్న సైనిక హాట్ లైన్ జూన్ నెల నుంచి పని చేయటం లేదు. ఇరు దేశాల మధ్య సమాచార సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఇంటర్ కొరియన్ ఆఫీసుని ఉత్తర కొరియా ధ్వంసం చేసింది. కానీ, ఉత్తర కొరియా రేడియో సమాచార వ్యవస్థను తెలుసుకోగలిగే సామర్ధ్యం దక్షిణ కొరియా సైన్యానికి ఉన్నట్లు ఏ ఎఫ్ పి న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

అసలేం జరుగుతోంది?

ఉత్తర కొరియాలో కరోనావైరస్ సోకకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలకు పాల్పడుతూ ఉండి ఉండవచ్చని బీబీసీ సియోల్ ప్రతినిధి లారా బికెర్ అన్నారు.

అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ 75 వ వార్షికోత్సవం జరుపుకునేందుకు అక్టోబర్ 10న భారీ మిలిటరీ పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

"ఈ పరేడ్ వలన వైరస్ ముప్పు ఉంది" అని కొరియా రిస్క్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చాడ్ ఓ కారోల్ ట్వీట్ చేశారు. వైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు కనిపిస్తే కాల్చివేత లాంటి నిబంధనలను అమలు చేసి మరింత మతి స్థిమితం లేని పని చేశారు" అని ఆయన రాశారు.

వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఉత్తర కొరియా తమ దేశ సరిహద్దులను చైనాతో జనవరి నుంచే మూసేసింది. జులైలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది.

ఉత్తర కొరియా చైనా సరిహద్దు దగ్గర 1 - 2 కిలోమీటర్ల మేర కొత్తగా బఫర్ జోన్ ని ఏర్పాటు చేసినట్లు దక్షిణ కొరియాలో యు ఎస్ సేనల కమాండర్ రాబర్ట్ అబ్రామ్స్ గత నెలలో తెలిపారు. సరిహద్దులో కనిపించిన వారెవరినైనా కనిపిస్తే కాల్చివేత చేయడానికి ప్రత్యేక దళాలను కూడా నియమించిందని ఆయన తెలిపారు.

గతంలో ఉత్తర కొరియాలోకి చొరబడిన కొంత మంది వ్యక్తులను వెనక్కి అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో అనధికారికంగా ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించిన ఒక ఫిషింగ్ బోటును మానవతా దృష్టితో తిరిగి అప్పగించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కె సిఎన్ఏ తెలిపింది.

కానీ, నియమాల ఉల్లంఘన పట్ల ఉత్తర కొరియా తీవ్రంగా స్పందిస్తుందనే పేరు ఉంది. ఈ దేశంలో మరణ శిక్ష చాలా సులభంగా అమలు జరుగుతుంది. అలాగే బహిరంగంగా ఉరి తీయడం కూడా ఇక్కడ సాధారణ విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)