అయ్ వీవీ: చైనా దూకుడుకు కళ్లెం వేయడం సాధ్యమేనా? ఆ దేశ ప్రముఖ అసమ్మతివాది ఏమంటున్నారు?

  • జాన్ సింప్సన్
  • వరల్డ్ అఫైర్స్ ఎడిటర్
అయ్ వీవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అయ్ వీవీ

చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, ఇప్పటికిప్పుడు దాన్నెవరూ ఆపలేరని ఆ దేశానికి చెందిన ప్రముఖ అసమ్మతివాది, కళాకారుడు, చిత్రనిర్మాత అయ్ వీవీ అన్నారు.

''పాశ్చాత్య ప్రపంచం దశాబ్దాల కిందటే చైనా విషయంలో ఆందోళన చెంది ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది. పాశ్చాత్య దేశాలు చైనాలో తమకు సంబంధించి బలమైన వ్యవస్థలను ఏర్పరుచుకున్నాయి.. ఇప్పుడా వ్యవస్థలను గానీ తగ్గించుకుంటే భారీగా దెబ్బతింటాయి. అందుకే చైనా ధిక్కరిస్తుంటుంది''.

చైనా గురించి చెప్పేటప్పుడు వీవీ ఎన్నడూ తగ్గరు.. ''అది ఒక పోలీస్ రాజ్యం'' అంటారాయన.

2008 నాటి బీజింగ్ ఒలింపిక్స్ కోసం ఆయన 'బర్డ్స్ నెట్' స్టేడియాన్ని డిజైన్ చేశారు. అయితే, ఆ తరువాత చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. 2015లో ఆయన చైనా నుంచి బయటకు వచ్చేశారు. తొలుత బెర్లిన్ వెళ్లిన ఆయన గత ఏడాది నుంచి కేంబ్రిడ్జ్‌లో ఉంటున్నారు.

చైనా తనకున్న అపారమైన ఆర్థిక శక్తిని ఉపయోగిస్తూ ప్రపంచంపై రాజకీయంగా తన ప్రభావాన్ని చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో చైనా మరింత దృఢంగా మారిందని అన్నారు.

దశాబ్దం కిందటి వరకు చైనా తన వినమ్ర పార్శ్వాన్నే ప్రపంచానికి చూపించింది. ''మీ వెలుగును దాచిపెట్టుకోండి.. సమయం కోసం నిరీక్షించండి'' అనేది ఆ దేశ అధికారిక నినాదంగా ఉండేది. చైనా ఇప్పటికీ వర్ధమాన దేశమేనని.. పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని ఆ దేశ మంత్రులూ పదేపదే చెబుతుండేవారు.

ఆ తరువాత జిన్‌‌పింగ్ అధికారంలోకి వచ్చారు. 2012 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీ జనరల్ అయ్యారు. ఆ తరువాత ఏడాది అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత ఆయన ప్రపంచానికి చైనా తాలూకు కొత్త స్వరాన్ని వినిపించడం ప్రారంభించారు. ఒకప్పటి వినమ్రత పోయి ఆ స్థానంలో కొత్త నినాదం వచ్చింది. ''అనుకున్నది సాధించేవరకు శ్రమించండి'' అనేదే ఆ నినాదం.

కొన్ని ప్రమాణాల ప్రకారం చూస్తే చైనా ఇప్పటికే వర్ధమాన దేశమే. అక్కడ 25 కోట్ల మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు.

అయినప్పటికీ చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. రానున్న దశాబ్దకాలంలో అమెరికాను అధిగమిస్తుందన్న అంచనాలూ ఉన్నాయి. అమెరికా ఆధిపత్యం తగ్గుతున్న సమయంలో ప్రపంచంపై చైనా ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Twitter/pakpmo

ప్రపంచమంతా చైనా ప్రాబల్యం

గ్రీన్‌లాండ్, కరీబియన్ నుంచి పెరూ వరకు.. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే నుంచి పాకిస్తాన్, మంగోలియా వరకు చైనా రాజకీయ ప్రాబల్యం, ప్రమేయం ప్రపంచమంతా పెరుగుతుండడం చూశాను.

బార్బడోస్‌లో రాణిని దేశాధినేత పదవి నుంచి పక్కనపెట్టాలని చైనా ఒత్తిడి తెస్తోందంటూ బ్రిటిష్ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు టామ్ తుగెంధాత్ ఇటీవల ఆరోపించారు.

ప్రపంచంలో ప్రతి చోటా వర్చువల్‌గా చైనా ఉనికి కనిపిస్తోందిప్పుడు.

దలైలామా డౌనింగ్ స్ట్రీట్‌ను సందర్శించినప్పుడు ఆంగ్లో-చైనీస్ సంబంధాలు నిలిచిపోయాయి. ఇటీవల చెక్ రిపబ్లిక్ పార్లమెంటు స్పీకర్ తైవాన్‌ను సందర్శించారు.. ''చెక్ పార్లమెంటు స్పీకరు, ఆయన వెనుకున్న చైనా వ్యతిరేక శక్తులు ఇలా రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తే చైనా ప్రభుత్వం, ప్రజలు చేతులు ముడుచుకు కూర్చోరు.. మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు'' అని చైనా దౌత్యవేత్త ఒకరు చెక్ రిపబ్లిక్‌ను హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హ్యా జిజిన్

ఎన్నో ప్రతిష్టంభనలు..

చైనాను అంతర్జాతీయ రౌడీ అని ఎవరైనా అంటే ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక చీఫ్ ఎడిటర్ హ్యు జిజిన్ అస్సలు అంగీకరించరు. గ్లోబల్ టైమ్స్‌ చైనా ప్రభుత్వానికి గొంతులాంటిది. ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ అక్కడ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు.

''వారి ఇష్టానికి విరుద్ధంగా చేయాలంటూ చైనా ఏ దేశాన్నైనా ఇప్పటివరకు బలవంతం చేసిందా? ప్రపంచంలో అనేక దేశాలపై ఆంక్షలు, ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నది అమెరికా. చైనా ఇంతవరకు ఏ దేశంపైనైనా ఆంక్షలు విధించిందా?'' అని జిజిన్ ప్రశ్నిస్తారు.

''మేం ఎవరిపైనైనా ఆంక్షలు విధించామా... నిర్దిష్ట సమస్యల విషయంలో మా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మమ్మల్నెవరైనా ఆక్షేపించినప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తాం'' అన్నారు జిజిన్.

అయితే, ప్రస్తుతం తైవాన్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, భారత్‌, బ్రిటన్, అమెరికాలతో ఎడమొహంపెడమొహంగానే ఉంది. భారత్‌తో అయితే ఇటీవల సరిహద్దుల్లో ఘర్షణలు జరిగాయి.

ఒక్కోసారి 'గ్లోబల్ టైమ్స్' ఉపయోగించే భాష మావో జెడాంగ్ కాలం నాటి చెత్త భాషను పోలి ఉంటుంది.

ఇటీవల ఆ పత్రికలో చీఫ్ ఎడిటర్ జిజిన్ స్వయంగా రాసిన వ్యాసంలో ఆస్ట్రేలియాను చైనా బూటుకు అంటుకున్న బబుల్‌గమ్‌గా అభివర్ణించారు.

'హాంకాంగ్‌లో నిరసనకారులు హింసకు పాల్పడితే కాల్చేయాలి'

జిజిన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. ''హాంకాంగ్ ప్రజాస్వామ్యం, వారి స్వేచ్ఛను చైనా ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోదు. వీధుల్లో ప్రదర్శనలు జరిపేందుకు హాంకాంగ్ పౌరులకు ఉన్న హక్కును కూడా చైనా అడ్డుకోదు. అయితే, వారు శాంతియుతంగా ఉండాలన్నది ముఖ్యం. శాంతియుతంగా లేకుండా హింసాత్మక ఆందోళనలు చేసేవారిపై హాంకాంగ్ పోలీసులు బలం ప్రదర్శిస్తే అందుకు మద్దతిస్తాం.

ఆందోళనకారులు పోలీసుల ప్రాణాలను ముప్పులోకి నెట్టినప్పుడు... పెట్రోలు బాంబులు, పదునైన ఆయుధాలను ప్రయోగించినప్పుడు కాల్పులు జరిపేందుకు పోలీసులకు అనుమతివ్వాలి'' అన్నారు జిజిన్.

పైకి కనిపించే చైనా దూకుడు వెనుక ఎన్నో భయాందోళనలు కూడా ఉంటాయని చాలామంది అంతర్జాతీయ పరిశీలకులు అంటుంటారు.

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదు. కాబట్టి వారికి ప్రజల నుంచి ఎంత మద్దతు ఉందో కచ్చితంగా తెలియదు. తీవ్రమైన సంక్షోభాలు తలెత్తితే దాన్నుంచి ఎలా బయటపడుతుందన్నది చెప్పలేం. ఉదాహరణకు ఆర్థికంగా పతనమైతే ఏం చేయగలుగుతుందన్నది ప్రశ్నార్థకం.

ప్రజల మద్దతులేని పాత సోవియట్ యూనియన్ పతనం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆయన సహచరులను నిత్యం వెంటాడుతుంటుంది.

ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధమేమీ ప్రారంభం కాలేదని.. చైనాకు అమెరికాతోనే వివాదం ఉందని.. చైనా విషయంలో ట్రంప్ దూకుడు నవంబర్ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలతో ముడిపడిన అంశమని గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ జిజిన్ అన్నారు.

ఎన్నికల తరువాత ఎవరు గెలిచినా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయన్నారు.

చైనా చాలా పెద్దది.. అందరి జీవితాల్లో దాని ప్రమేయం ఉంది. అమెరికా, దాని మిత్ర దేశాలు మాత్రం చైనాను ఎన్నటికీ ద్వేషిస్తూ ఉంటాయి.

చైనా ప్రాభవం నుంచి తమను తాము రక్షించుకోవడానికి పాశ్చాత్య దేశాలకు ఇప్పటికే ఆలస్యమైందన్న వీవీ వ్యాఖ్యలను ఈ పరిస్థితి మరింత బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)