కరోనావైరస్: కొందరిలో కోవిడ్ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి.. ఎందుకు? పరిష్కారాలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సోకిన వారిలో కొందరికి కోవిడ్-19 లక్షణాలు స్వల్పకాలమే ఉండి, త్వరగా కోలుకోగలుగుతున్నారు. కానీ కొందరిలో కరోనావైరస్ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. నెలల తరబడి అలసట, నొప్పులు, శ్వాస తీసుకోలేకపోవడంలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు.
దీన్ని 'దీర్ఘకాలిక కోవిడ్’ (లాంగ్ కోవిడ్) అని వ్యవహరిస్తున్నారు. ఇలా దీర్ఘకాలం కొనసాగుతున్న లక్షణాలతో చాలామంది బలహీనపడుతున్నారు. కొంచంసేపు నడిచినా కూడా తీవ్రమైన అలసట వస్తోందని అంటున్నారు. ఇటువంటి దీర్ఘకాలిక కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంతవరకూ కోవిడ్ సోకినవారి ప్రాణాలు కాపాడడంపైనే దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇప్పుడు దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కరోనావైరస్ లక్షణాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు.
అయితే, కొంతమందిలో ఎందుకు కోవిడ్ లక్షణాలు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి? వీరు ఎప్పటికైనా పూర్తిగా కోలుకోగలుగుతారా? అనే ప్రశ్నలకు ఇంతవరకూ స్పష్టమైన జవాబు లేదు.
లాంగ్ కోవిడ్ అంటే ఏమిటి?
దీనికి వైద్యపరమైన నిర్వచనాలేమీ లేవు. దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్నవారందరికీ ఒకే రకమైన లక్షణాలు కనిపించడం లేదు. అందరిలోనూ సాధారణంగా నిస్సత్తువ ఉంటోందని చెబుతున్నారు.
మిగతా లక్షణాలు...శ్వాస అందకపోవడం, దగ్గు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, కంటిచూపు మందగించడం, వినికిడి సమస్యలు, తలనొప్పి, వాసన, రుచి తెలియకపోవడం, హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తులు, కిడ్నీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు.
కొందరిలో ఆందోళన, డిప్రెషన్, స్పష్టంగా ఆలోచించలేకపోవడం లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయని చెప్తున్నారు.
"ఇలాంటి అలసట నేను ఇంతకుముందెన్నడూ ఎదుర్కోలేదు" అని దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న జేడ్ గ్రే-క్రిస్టీ తెలిపారు.
"దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అందులో ఏ మాత్రం సందేహం లేదు" అని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్ట్రైన్ బీబీసీకి తెలిపారు.
ప్రొఫెసర్ స్ట్రైన్ ఇప్పటికే తన 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోం' క్లినిక్‌లో దీర్ఘకాలిక కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఎంతమంది దీర్ఘకాలిక కోవిడ్ బారిన పడుతున్నారు?
రోమ్‌లోని ఒక పెద్ద ఆస్పత్రిలో కోవిడ్ 19 లక్షణాలతో చేరిన 143 మందిపై చేసిన ఒక అధ్యయనంలో.. 87 శాతం మందికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు నెలల తరువాత కూడా కనీసం ఒక కోవిడ్ 19 లక్షణమైనా కొనసాగుతోందని, సగం మందికిపైగా అలసట సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది.
ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ప్రచురించారు.
ఇలాంటి అధ్యయనాల్లో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన వారిని మాత్రమే పరిశీలిస్తారు. వీరి సంఖ్య తక్కువగా ఉంటుంది.
ఫొటో సోర్స్, Science Photo Library
కోవిడ్ 19 తీవ్రంగా సోకినవారికే దీర్ఘకాలిక లక్షణాలు కొనసాగుతాయా?
అలా అని కచ్చితంగా చెప్పలేం అంటున్నారు డాక్టర్లు.
డబ్లిన్‌లో చేసిన ఒక అధ్యనంలో కరోనావైరస్ సోకిన వారిలో సగం మందికి పైగా రోగులకు 10 వారాల తరువాత కూడా నిస్సత్తువ ఉంటోందని తేలింది. 30 శాతం మంది ఆఫీస్ పనికి తిరిగి వెళ్లలేకపోయారని తేలింది.
ముఖ్యంగా, వ్యాధి సంక్రమణ తీవ్రతకు, అలసటకు మధ్య సంబంధం లేదని డాక్టర్లు అంటున్నారు.
అయితే, తీవ్రమైన అలసట రావడం దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాల్లో ఒకటి మాత్రమే.
"న్యుమోనియా కూడా వచ్చినవారికి ఊపిరితిత్తులు దెబ్బ తినడంవల్ల ఎక్కువ సమస్యలు రావొచ్చు" అని యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్ బ్రైట్లింగ్ అంటున్నారు. ఈయన కోవిడ్ రికవరీని ట్రాక్ చేసే పీహెచ్ఓఎస్పీ-కోవిడ్ ప్రోజెక్ట్‌లో ప్రధాన పరిశోధకులుగా కూడా ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
దీర్ఘకాలిక కోవిడ్ ఎలా వస్తోంది?
దీనికి కూడా నిర్దిష్టమైన సమాధానం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత శరీరంలోంచి చాలావరకు వైరస్ తొలగిపోతుంది కానీ ఎక్కడైనా కొద్దిగా ఉండిపోవచ్చు.
‘‘విరేచనాలు దీర్ఘకాలం ఉంటే వైరస్ పేగుల్లో ఉండి ఉండొచ్చు. వాసన కోల్పోయినట్లైతే వైరస్ నరాల్లో ఉండి ఉండొచ్చు. అలాంటప్పుడు దీర్ఘకాలిక కోవిడ్ కొనసాగే అవకాశాలున్నాయి" అని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు.
కరోనావైరస్ శరీరంలోని అనేక కణాలను ప్రభావితం చేస్తుంది. దానివలన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు అవసరమైనదానికన్నా ఎక్కువగా ఉండి పలు విధాలా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఒక్కోసారి కోవిడ్ తరువాత రోగ నిరోధక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోకపోవచ్చు. అందువల్ల కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.
కోవిడ్ ఇన్ఫెక్షన్ శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరుపై అధిక ప్రభావం ఉంటుంది. ఇలా వ్యాధి లక్షణాలు దీర్ఘకాలికంగా కొనసాగడం సార్స్, మార్స్ సోకినవారిలో కూడా గమనించారు.
శరీరంలో జీవప్రక్రియను కూడా కోవిడ్ ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు కోవిడ్ సోకిన తరువాత, డయాబెటిస్ ఉన్న కొందరిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కష్టతరమైంది.
కరోనావైరస్ రక్తం పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. రక్తంలో అసాధారణంగా గడ్డలు ఏర్పడడం, రక్తనాళాల్లో పగుళ్లు మొదలైనవన్నీ జరుగుతున్నట్లు గమనించారు.
కోవిడ్ వలన మెదడు పనితీరులో కూడా మార్పులు వస్తున్నట్టు గమనించారు. కానీ ఈ దిశలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
"ప్రస్తుతం, కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్ అందించే చిన్న రక్తనాళాలు అకాలంగా పరిణితి చెందడం అనే సిద్ధంతంపై నేను పరిశోధనలు చేస్తున్నాను. అయితే, దీర్ఘకాలిక కోవిడ్ ఎందువల్ల కొనసాగుతోందో తెలియకుండా దీనికి చికిత్స ఏమిటో చెప్పడం కష్టం" అని ప్రొఫెసర్ స్ట్రైన్ బీబీసీకి తెలిపారు.
ఫొటో సోర్స్, AFP
ఇది అసాధారణమైన విషయమా?
వైరల్ ఇంఫెక్షన్లు సోకిన తరువాత అలసట, దగ్గులాంటివి కొనసాగడం సాధారణమైన విషయమే. కొన్నిసారు ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి కొన్నేళ్లు పట్టొచ్చు.
గ్లాండులర్ జ్వరం వచ్చినవారిలో 10 మందిలో ఒకరికి అలసట కొన్ని నెలలపాటు కొనసాగుతుంది. 1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి లక్షణాలకు, పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు ముడిపెట్టొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"కానీ, కోవిడ్ లక్షణాలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి, అలాగే దీర్ఘకాలిక కోవిడ్ కొనసాగుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తోస్తోంది" అని ప్రొఫెసర్ బ్రైట్లింగ్ అంటున్నారు.
అయితే, కచ్చితంగా ఎంతమంది దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్నారన్నది స్పష్టంగా తెలియనంతవరకూ దీర్ఘకాలిక కోవిడ్‌లో సాధారణంగా కనిపిస్తున్న లక్షణాలేమిటనేది స్పష్టంగా చెప్పలేమని బ్రైట్లింగ్ తెలిపారు.
"వైరస్ శరీరంపై దాడి చేస్తున్న ప్రత్యేక విధానం, కణజాలాలను ప్రభావితం చేస్తున్న విధానం వలన కోవిడ్ ఇన్ఫెక్షన్ మిగతా వాటికన్నా తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఈ వైరస్ లక్షణాలు కూడా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి’’ అని ప్రొఫెసర్ బ్రైట్లింగ్ బీబీసీతో పేర్కొన్నారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
ఎప్పటికైనా పూర్తిగా కోలుకోగలుగుతారా?
లాంగ్ కోవిడ్ ఉన్నవారి సంఖ్య కాలంతోపాటూ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, కోవిడ్ 19 ఈ మధ్యకాలంలోనే వ్యాప్తి చెందినది కావడం వలన ఈ అంశంలో దీర్ఘకాలికమైన వివరాలు లేవు.
"మా పరిశోధనలో భాగంగా కోవిడ్ సోకిన వారిని ఒక 25 సంవత్సరాలైనా పరిశీలించాలని చెప్పాం. ఒక ఏడాది దాటిన తరువాత కూడా వైరస్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య స్వల్పంగానే ఉంటుందని ఆశిస్తున్నాం. కానీ ఏది కచ్చితంగా చెప్పలేం" అని ప్రొఫెసర్ బ్రైట్లింగ్ తెలిపారు.
అయితే.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపించినా, జీవితకాలం కొనసాగే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.
ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వలన భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
"లాంగ్ కోవిడ్ కొంతకాలానికి తగ్గుముఖం పట్టొచ్చు. కానీ ఇది మళ్లీ మరో కరోనావైరస్ ఇన్ఫెక్షన్కు దారి తీస్తే, ఈ పద్ధతి ప్రతి శీతాకాలం కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది" అని ప్రొఫెసర్ స్ట్రైన్ అభిప్రాయపడ్డారు.
కరోనావైరస్ వలన కలిగిన వాపు వలన చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
లాంగ్ కోవిడ్ ఉంటే ఏం చెయ్యాలి?
ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.
ఎక్కువ ఆలిసిపోకుండా ఉండేలా మీ దినచర్యను ప్లాన్ చేసుకోవడం, ఏవి ముఖ్యమైన పనులో అవి మాత్రమే చేస్తూ ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.
ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నట్లనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)