అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?

కరోనావైరస్

ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 వాక్సిన్ ఎప్పుడు తయారవుతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం.

కానీ మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి.

చరిత్రలో అంటువ్యాధుల ముగింపు ఎలా జరిగిందో తెలుసుకోగలిగితే, భవిష్యత్తులో కోవిడ్ 19 మహమ్మారి ముగింపు ఎలా ఉంటుందో అంచనా వెయ్యొచ్చు.

బ్యుబోనిక్ ప్లేగు

బొబ్బలరోగం అని పిలిచే ఈ వినాశనకారి ఇంకా మనతోనే ఉందంటే నమ్మశక్యం కాదు. చరిత్రలో మూడుసార్లు వినాశనాన్ని సృష్టించిన ఈ అంటువ్యాధి మొట్టమొదటసారిగా చీకటి యుగంలో క్రీస్తు శకం 541లో వ్యాపించింది. మనకు దాదాపు 60 తరాల ముందువాళ్లు ఈ ప్లేగు బారిన పడ్డారు.

అయితే, ఇది వైరస్ ద్వారా వ్యాపించేది కాదు. బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకల మీద ఉండే చిన్న చిన్న పురుగులు, ఈగల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. మనుషుల్లో తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా ఒకరినుంచీ ఒకరికి సోకుతుంది.

2,000 సంవత్సరాల కాలంలో ఈ ప్లేగు బారిన పడి కొన్ని కోట్లమంది మరణించారు.

1346-1353 మధ్య కాలంలో 'బ్లాక్ డెత్‌'గా వ్యవహరించే ఈ బ్యుబోనిక్ ప్లేగు మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రజల ప్రాణాలు తీసింది. ఇప్పటివరకూ చరిత్రలో నమోదైన అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారి ఇదే.

ఈ అంటురోగం సోకితే శరీరంపై బ్యూబోస్ అని పిలిచే బొబ్బలు వస్తాయి. కఠినమైన క్వారంటీన్ పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ అంటు వ్యాధిని నివారించగలిగారు.

"ఈ వ్యాధి ఒకరినుంచి ఒకరికి ఎలా సోకుతుందో తెలియకుండా ఇవేవీ సాధ్యం కాదు. ప్రస్తుత కరోనావైరస్‌కూ ఇదే వర్తిస్తుంది. ఎక్కడినుంచి వచ్చింది, ఎలా సోకుతుంది అనే విషయాలు తెలుసుకుని, ఈ జ్ఞానాన్ని పంచుకుంటూ, అందరికి అవహగాన కలిగించగలిగితేనే ఇలాంటి అంటురోగాలను తగ్గించవచ్చు" అని స్టీవెన్ రైలీ అభిప్రాయపడ్డారు. డా. రైలీ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఇన్‌ఫెక్షస్ డిసీజ్ డైనమిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే బ్యుబోనిక్ ప్లేగు ఇంకా అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంది. ఈ ఏడాది జూలైలో మంగోలియాలో ఈ అంటురోగం బయటపడింది.

అయితే, ప్రస్తుత కాలంలో ఈ ప్లేగు బారినపడినవారి సంఖ్య చాలా తక్కువ. అంతే కాకుండా, ఈ వ్యాధిని యాంటీబయొటిక్స్ ద్వారా నయం చెయ్యొచ్చు.

మశూచి

స్మాల్‌పాక్స్ లేదా మశూచి అని పిలిచే ఈ అంటువ్యాధిని సైన్స్ పూర్తిగా తుడిచిపెట్టగలిగింది.

మశూచిని మొట్టమొదటిసారిగా 1520లో గుర్తించారు. వరియోలా మైనర్ అనే వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది.

ఇదొక భయంకరమైన చర్మవ్యాధి. శరీరంపై నీటితో నిండిన పొక్కులు ఏర్పడతాయి. పది మందిలో ముగ్గురు ఈ అంటురోగం బారిన పడి చనిపోయేవారు.

ఈ వ్యాధి తుమ్ము, దగ్గులతో పాటూ బయటికొచ్చే తుంపర్ల ద్వారా లేదా శరీరంపై ఏర్పడే పుండ్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి సోకుతుంది.

ప్లేగు వ్యాధిలాగానే మశూచి కూడా కొన్ని కోట్ల ప్రాణాలు హరించింది. ఒక్క 20వ శతాబ్దంలోనే మశూచి బారిన పడి 30 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారు.

1796లో బ్రిటిష్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నెర్ అభివృద్ధి పరిచిన వ్యాక్సిన్ వలన మశూచి పూర్తిగా తొలగిపోయింది. అయితే, ఈ అంటురోగాన్ని నిర్మూలించడానికి దాదాపు రెండు శతాబ్దాలు పట్టిందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఈ విధంగా నిర్మూలించబడిన ఏకైక మానవ సంక్రమిత వ్యాధి ఇదే.

"మానవజాతి సాధించిన గొప్ప విజయాల్లో మశూచిని అంతం చెయ్యడం కూడా ఒకటి" అని ప్రొఫెసర్ రైలీ అభిప్రాయపడ్డారు.

"దీన్ని ప్రభుత్వ పెట్టుబడికి వచ్చిన అత్యంత గొప్ప రాబడిగా కూడా గుర్తించవచ్చు. ఈ అంటురోగం పూర్తిగా అంతమైపోవడంతో ప్రజలు బోల్డంత డబ్బు ఆదా చేసుకోగలిగారు" అని డా. రైలీ అన్నారు.

కలరా

ఇది, దిగువ ఆదాయ దేశాల్లో ఎక్కువగా వ్యాపించే అంటువ్యాధి. అనేకసార్లు మహమ్మారిగా వ్యాపించింది. 1817లో అతి పెద్ద మహమ్మారిగా మారి అనేకమంది ప్రాణాలు బలి తీసుకుంది.

కలిషితం అయిన నీరు, ఆహారం ద్వారా కలరా వ్యాప్తి చెందుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అందించిన సమాచారం ప్రకారం ఏడుసార్లు కలరా మహమ్మారిగా వ్యాపించినప్పుడు కొన్ని లక్షలమంది మరణించారు.

మెరుగైన పారిశుధ్యం, పరిశుభ్రత వలన పాశ్చాత్య దేశాల్లో ఈ వ్యాధి అంతరించిపోయింది కానీ దిగువ ఆదాయ దేశాల్లో ఇంకా వ్యాపిస్తూనే ఉంది.

డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం కలరా వలన దిగువ ఆదాయ దేశాల్లో ఏడాదికి 1,00,000 - 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కలారాకు వ్యాక్సిన్, చికిత్స కూడా ఉన్నప్పటికీ నీటి కాలుష్యంవలన ఈ వ్యాధి సులువుగా వ్యాపిస్తుంది.

ఇన్‌ఫ్లుయెంజా

ఫ్లూ అని పిలిచే ఈ అంటురోగం ఋతువుల మారుతున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. 1800లనుంచీ 2010 వరకూ అనేకసార్లు మహమ్మారిగా వ్యాపించింది.

హెచ్1ఎన్1 వైరస్ ద్వారా వ్యాపించే ఈ ఫ్లూ, 20వ శతాబ్దం ప్రారంభంల్లో పెద్ద మహమ్మారిగా విస్తరించింది.

1918 లో వచ్చిన ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5 - 10 కోట్లమంది మరణించారు.

ఇటీవల చరిత్రలో అత్యంత తీవ్రమైన మహమ్మారిగా మారిన అంటురోగం ఇదే. దీన్నే స్పానిష్ ఫ్లూ అని కూడా అంటారు.

ప్రస్తుత కోవిడ్ 19 లాగే క్వారంటీన్‌లో ఉండడం, విడిగా ఉండడం ద్వారా ఈ అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టగలరు.

1918, 1920ల మధ్యలో రెండు సార్లు వ్యాపించిన తరువాత ఈ హెచ్1ఎన్1 ఫ్లూ క్షీణించి కొంతవరకూ అపాయం లేనిదిగా మారింది. కానీ, ఇప్పటికీ ఫ్లూ అంటువ్యాధి అనేక దేశాల్లో వస్తూనే ఉంటుంది. అయితే, ఇది ప్రాణాంతకం కాదు.

మరికొన్ని రకాల ఫ్లూ వ్యాధులు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఎంతో కలవరపెట్టాయి.

1968లో వచ్చిన హాంకాంగ్ ఫ్లూ బారిన పడి 10 లక్షల మంది మరణించారు. ఇది ఇప్పటికీ కాలానుగుణంగా వ్యాపిస్తూ ఉంటుంది.

స్వైన్ ఫ్లూ - ఇది హెచ్1ఎన్1 లో ఒకరకం. 2009లో 21% ప్రపంచం జనాభా ఈ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు.

ఇప్పటికీ సీజనల్‌గా వచ్చే ఫ్లూ వలన ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

హెచ్ఐవీ / ఎయిడ్స్

హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ)గా పిలిచే ఈ వ్యాధిని 1981లో మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇది శరీరంలోని ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకూ ఎయిడ్స్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లమందికి పైగా మరణించారని అంచనా.

భయంకరమైన హెవ్ఐవీ వైరస్ మనిషి రోగ నిరోధకశక్తిపై దాడి చేస్తుంది.

"అన్నిటికన్నా అత్యంత భయంకరమైన వ్యాధిగా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చని" ప్రొఫెసర్ రైలీ తెలిపారు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. మరణాల రేటు కూడా ఎక్కువే. ఈ వ్యాధి సోకిందని గుర్తించే లోపలే ఒకరినుంచీ ఒకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.

అయితే, మెరుగైన రోగ నిర్థరణా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అవగాహనా కార్యక్రమాల వలన ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పట్టింది.

అయినప్పటికీ, డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం, 2019లో ఎయిడ్స్ కారణంగా 6,90,000 మంది చనిపోయారని అంచనా.

ప్రస్తుతానికి, ఎయిడ్స్‌కు చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం.

సార్స్, మెర్స్ వ్యాధులు

ఈ రెండూ కూడా కరోనావైరస్‌లలో ఒక రకం. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం (సార్స్), కరోనావైరస్ ద్వారా వ్యాపించిన మొట్టమొదటి ప్రాణాంతకమైన మహమ్మారి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం 2002-03 మధ్యలో 800 మంది ఈ వ్యాధి బారినపడి మరణించారు.

'సార్స్ - సీఓవీ వైరస్‌'ను 2003లో గుర్తించారు. అయితే, 2003 చివరికొచ్చేసరికి ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టింది. ఈ మహమ్మారి ముగిసిందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.

కొంతకాలం తరువాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోం (మార్స్) వ్యాపించి 912మంది చనిపోయారు. ఇది కూడా కరోనావైరస్‌లో ఒక రకమే. మెర్స్ అంటురోగం ఎక్కువగా అరేబియా ద్వీపకల్పంలో వ్యాపించింది.

'మెర్స్ - సీఓవీ' వ్యాధి పశ్చిమ దేశాలకన్నా మధ్య ప్రాచ్య దేశాల్లోనే ఎక్కువగా వ్యాపించే అవకాశాలున్నాయి. ఇక్కడ ఒంటెల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.

కోవిడ్-19

'సార్స్ - సీఓవీ-2' గా పిలిచే ఈ కరోనావైరస్ అంటురోగాన్ని 2003లో వ్యాపించిన సార్స్ వైరస్ తాలూకు అభివృద్ధి చెందిన రూపంగా భావిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించే లోపలే ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 చాలా త్వరగా విస్తరించింది.

"ఈ కారణం వలనే కోవిడ్ 19ను కట్టడి చెయ్యలేకపోయారని" ప్రొఫెసర్ రైలీ అభిప్రాయపడ్డారు.

కోవిడ్ 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలమందికి పైనే చనిపోయారని అంచనా.

ఈ వ్యాధి సోకినవారు అధికశాతం కోలుకుంటున్నారు. అయినప్పటికీ ప్రాణాంతకమైన ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రపంచం దేశాలన్నీ కృషి చేస్తున్నాయి.

కోవిడ్ 19కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

"సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్‌తో కోవిడ్-19కు ముగింపు పలికే అవకాశాలున్నాయని" ప్రొఫెసర్ రైలీ తెలిపారు.

"రాబోయే ఐదేళ్లల్లో లేదా అంతకన్నా ముందే కోవిడ్ 19 కు మంచి వ్యాక్సిన్ తయారుకావొచ్చు లేదా మనందరికీ తగినంత రోగనిరోధకశక్తి పెరిగి, కొద్దిపాటి వైరస్ వ్యాప్తితో కలిసి ఎలా జీవించాలో నేర్చుకుంటాం" అని ప్రొఫెసర్ రైలీ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

మహమ్మారులు బలితీసుకున్న ప్రాణాలు

మశూచిలాంటి భయంకరమైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించగలిగినప్పుడు కోవిడ్ 19కు ముగింపు పలకడం కూడా సాధ్యమే అనిపిస్తుంది. అయితే, కోవిడ్ 19 వ్యాధిని రూపుమాపడం మరింత కష్టమైన పని.

"ఇంతకుమునుపెన్నడూ ప్రపంచం మొత్తం సమిష్టిగా ఒక మహమ్మారిని ఎదుర్కోవడానికి పాటు పడలేదు. ఈ సమిష్టి కృషి సమిష్టి విజయాలను అందిస్తుందని ఆశిద్దాం" అని ప్రొఫెసర్ రైలీ అన్నారు.

అయితే, గతంలో వచ్చిన మహమ్మారి రోగాలు అంతమైపోయినప్పటికీ అందుకు కారణమైన వైరస్, బ్యాక్టీరియాలు ఇంకా జీవించి ఉన్నాయన్నది గుర్తుంచుకోవలసిన విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)