లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఉద్యమం.. మద్దతు ఇస్తున్న సైంటిస్టులు, నిపుణులు

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనల కారణంగా తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తూ సాగుతున్న అంతర్జాతీయ ఉద్యామానికి వేల మంది సైంటిస్టులు, ఆరోగ్య నిపుణులు మద్దతిస్తున్నారు.

ఈ లాక్‌డౌన్ విధానాలు శారీరక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీయడంతో పాటు సమాజంపైనా వినాశకర ప్రభావం చూపుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 6 వేల మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యవంతులు వారివారి జీవితాలను చూసుకోగలరని.. దుర్బలమైన వారికి రక్షణ కల్పించేలా చర్యలు ఉండాలంటున్నారు.

'గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్' పేరిట చేసిన ఈ ప్రకటన శాస్త్రీయ సమాజంలోనే ఇతరులు హెచ్చరికలు చేసేలా ప్రేరేపించింది.

విమర్శకులు చెబుతున్నదేమంటే..

* మరింత లక్ష్యీకృత వైఖరి దుర్బలులను రక్షించడం ఇంకా కష్టతరం చేస్తుంది.

* కరోనావైరస్ వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులున్నాయంటే దానర్థం మరింత మందికి ముప్పుందనే.

అయితే... బ్రిటన్‌లోని కొందరు గవర్నమెంట్ ప్రాక్టీషనర్లు సంతకం చేసిన ఒక లేఖలోని అంశాలకు ఈ డిక్లరేషన్ అద్దం పడుతోంది.

టీవీ డాక్టర్లు ఫిల్ హామండ్, రోజ్‌మరీ లియోనార్డ్ సహా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌లో ఉన్న చాలామంది సీనియర్ వైద్యులు హెల్త్ సెక్రటరీకి రాసిన ఆ లేఖలో నాన్ కోవిడ్ కేసుల్లో తీవ్రమైనవాటికి తగినంత ప్రాధాన్యం దొరకలేదని పేర్కొన్నారు.

గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ అంటే ఏమిటి?

ఇది అమెరికాలో ప్రారంభమైన ఉద్యమం. ఈ ప్రకటనపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. 50 వేల మంది ఇతరులు సంతకాలు చేశారు.

సంతకాలు పెట్టినవారిలో బ్రిటన్‌ నిపుణులు

* డాక్టర్ సునేత్ర గుప్తా - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎపిడమాలజిస్ట్

* ప్రొఫెసర్ ఎలెన్ టౌన్‌సెండ్, నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ సెల్ఫ్ హార్మ్ ఎక్స్‌పర్ట్

* డాక్టర్ పాల్ మెక్‌గీ, డిసీజ్ మోడలర్, ఎడినబరో యూనివర్సిటీ

వ్యాక్సిన్ వచ్చేవరకు లాక్‌డౌన్ విధానాలు అమలులో ఉంచడం వల్ల కోలుకోలేని నష్టం కలుగుతుందని.. అణగారినవర్గాలకు మరింత హాని కలిగిస్తుందని వీరంతా అంటున్నారు.

నిపుణులు చెబుతున్న ఆరోగ్య హాని..

* బాల్యంలో టీకాలు వేయడం తగ్గిపోతుంది.

* క్యాన్సర్, హృద్రోగులకు ఆరోగ్య సేవలు మృగ్యమవుతాయి.

వృద్ధులు, మానసికంగా, శారీరకంగా దృఢంగా లేనివారికి కోవిడ్ వల్ల ముప్పు 1000 రెట్లు అధికమని.. అలాగే చిన్నారులకు కోవిడ్‌తో కంటే ఫ్లూ వల్ల అధిక ముప్పు ఉందని వారు అంటున్నారు.

జనాభాలో రోగ నిరోధక శక్తి పెరుగుతున్నకొద్దీ కరోనావైరస్ సోకే ముప్పు క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఉండే రిటైరైనవారికి నిత్యవసరాలు, ఇతర సరకులు అందివ్వాలని ఈ ప్రకటన సూచిస్తోంది.

చేతులు శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటికే పరిమితం కావడం వంటి సాధారణ జాగ్రత్త చర్యలు అందరూ పాటించాలి.

నిపుణుల సూచనలు

* రిస్క్ తక్కువగా ఉన్న యువతను పనులు చేయడానికి అనుమతించాలి.

* ప్రత్యక్ష బోధన కోసం స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు తెరవాలి.

* క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించొచ్చు. రెస్టారెంట్లు తెరవొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)