కరోనావైరస్ మూలాలను దర్యాప్తు చేయటానికి చైనా చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ టీమ్

కరోనావైరస్, కోవిడ్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తు ప్రారంభించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలోని వూహాన్ నగరానికి చేరుకుంది.

డబ్ల్యూహెచ్ఓ, చైనాల మధ్య నెలల తరబడి కొనసాగిన చర్చల అనంతరం ఈ దర్యాప్తు మొదలైంది. డబ్ల్యూహెచ్ఓ బృందంలో 10 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.

వూహాన్ నగరంలో తొలుత ఈ మహమ్మారి ప్రారంభమైనట్లుగా భావిస్తున్న సీఫుడ్ మార్కెట్, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలకు సంబంధించిన వారిని ఈ శాస్త్రవేత్తలు ఇంటర్వ్యూ చేస్తారు.

కోవిడ్-19ను తొలిసారిగా సెంట్రల్ చైనాలోని వూహాన్ నగరంలో 2019 చివర్లో గుర్తించారు. ప్రస్తుతం ఈ నగరంలో పరిస్థితి దాదాపుగా సాధారణ స్థితికి తిరిగివచ్చింది.

అయితే.. చైనాలోని ఉత్తర ప్రాంతంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు బృందం గురువారం వూహాన్ చేరుకోవటం గమనార్హం.

ఈ బృందం తమ పరిశోధన మొదలుపెట్టటానికి ముందుగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటుంది. అనంతరం చైనా అధికారులు అందించే నమూనాలు, ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఏం జరిగిందో మేం పూర్తిగా అర్థం చేసుకోవటానికి సుదీర్ఘ కసరత్తు, సమయం పట్టవచ్చు’’ అని డబ్ల్యూహెచ్ఓ బృందం నాయకుడు పీటర్ బెన్ ఎంబారెక్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

ఈ మహమ్మారి జంతువుల నుంచి మనుషులకు సోకిందనే అంశం మీద ఈ దర్యాప్తు చేయనున్నారు.

ఈ నెల ఆరంభంలో డబ్ల్యూహెచ్ఓ బృందంలో ఒకరు వెనుదిరగటంతో పాటు మరొకరు దారి మధ్యలో చిక్కుకుపోవటంతో.. ఈ శాస్త్రవేత్తలు తమ దేశంలో ప్రవేశించటానికి చైనా నిరాకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

అయితే అది కేవలం అపార్థం మాత్రమేనని.. దర్యాప్తుకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని చైనా స్పందించింది.

కోవిడ్ కేసులు తొలుత వూహాన్‌లో కనిపించినప్పటికీ ఈ వైరస్ ఇక్కడే మొదలై ఉండకపోవచ్చునని చైనా అనేక నెలలుగా చెప్తూ ఉంది.

ఫొటో సోర్స్, Reuters

డబ్ల్యూహెచ్ఓ బృందం దర్యాప్తును శాస్త్రపరిశోదన పర్యటనగానే ప్రపంచం పరిగణిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలోని గ్లోబల్ ఔట్‌బ్రేక్ అండ్ రెస్పాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డేల్ ఫిషర్ బీబీసీతో పేర్కొన్నారు.

‘‘ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు. అలాగని ఎవరినైనా నిందించటం కోసం కాదు. శాస్త్రపరిశోధన పరమైన ప్రశ్నలకు పూర్తి సమాధానాలు తెలుసుకోవటం కోసం’’ అని ఆయన చెప్పారు.

ఈ వైరస్ విజృంభణ ఒక సహజమైన సంఘటనగా అత్యధిక శాస్త్రవేత్తలు నమ్ముతున్నారని ప్రొఫెసర్ ఫిషర్ తెలిపారు.

ఇదిలావుంటే.. చైనాలో కరోనా మహమ్మారిని చాలా వేగంగా అదుపులోకి తెచ్చారు. అయితే.. దాదాపు ఎనిమిది నెలల విరామం అనంతరం కోవిడ్-19 వల్ల మళ్లీ దేశంలో తొలి మరణం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)