జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడి నుంచి ప్రవాస భారతీయులు, తెలుగువారు ఏం కోరుకుంటున్నారు

ఫొటో సోర్స్, GUDAPATI GOPALA/FACEBOOK
గ్రీన్‌కార్డ్ కోసం గోపాలకృష్ణ పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు
హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ యూఎస్ స్టడీ వీసా కోసం దిల్లీలోని అమెరికన్ ఎంబసీలో ఇటీవల ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
మూడోసారి రిజెక్ట్ లిస్టులో చేరిన ఆయన బైడెన్ వచ్చాక తన కష్టాలు తీరతాయన్న ఆశాభావంతో ఉన్నారు.
గుంటూరు జిల్లా రేపల్లె నుంచి అమెరికాకు వచ్చిన గోపాలకృష్ణ గూడపాటి గ్రీన్‌కార్డ్ కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. బైడెన్ తీసుకురాబోయే కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు తన కలను నెరవేరుస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
ఈ ఇద్దరు అమెరికాలో కొత్త ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న సగటు భారతీయులకు ప్రతిరూపాలు. భారతీయులకే కాదు, బైడెన్ ప్రభుత్వ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు ఉన్నాయి.
అమెరికా చేరుకోవాలని కలలుగనే వివిధ దేశాలకు చెందిన మిలియన్ల మంది ఆకాంక్షలను సంచలన నిర్ణయాలతో డోలాయమానంలో పడేసిన ట్రంప్ పాలన ముగిసింది.
మరి కొత్త అధినేత బైడెన్ ఏం చేయబోతున్నారు ? ఆయన విధానాలు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుందన్న దానిపై లక్షలమంది భారతీయులు ఆసక్తిగాఎదురు చూస్తున్నారు.
ఫొటో సోర్స్, FACEBOOK/DHS
అమెరికా అధ్యక్ష ఎన్నికలనగానే భారతీయుల మద్దతు ఎవరికి అన్న ప్రశ్న వెంటనే వినిపిస్తుంది.
అమెరికాలో నివసించే అతి పెద్ద కమ్యూనిటీల్లో ఏసియన్ ఇండియన్ కమ్యూనిటీ ఒకటిగా నిలిచింది.
అమెరికాలో సుమారు 42 లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారని ‘ఇండియాస్పొరా’ స్వచ్ఛంద సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్ధులు ఇలా భిన్న తరగతులతోపాటు ప్రభుత్వం కూడా కొత్త సర్కారుతో సంబంధ బాంధవ్యాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది.
భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉపాధ్యక్ష హోదాను పొందడం, బైడెన్ టీంలో భారతీయులకు చోటు దక్కడం అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ ప్రాభవానికి నిదర్శనమని చెప్పాలి.
అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. 2017నాటికి ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షలు ఉందని తేలింది. 2010తో పోలిస్తే ఇది రెట్టింపయ్యిందని అమెరికాలో నిర్వహించిన కమ్యూనిటీ సర్వే వెల్లడించింది.
ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పెద్ద సంఖ్యలో తెలుగువారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా చదువు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కొన్ని లక్షలమంది ఉన్నారు.
ఫొటో సోర్స్, FACEBOOK/USCIS
భారత్ నుంచి హెచ్-1బీ వీసాపై వెళ్లి అమెరికా పౌరసత్వం పొందిన దంపతులు
హెచ్1బీ వీసా కష్టాలకు తెరపడుతుందా ?
హెచ్1బి వీసాల విషయంలో ట్రంప్ పాలన వివిధ దేశాలకు చెందినవారితోపాటు పెద్ద సంఖ్యలో భారతీయులకు నిరాశను మిగిల్చింది.
టెక్నాలజీ నిపుణులు, వారి కుటుంబాలకు జారీ చేసే హెచ్-1 వీసాలకు భారతీయుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది.
అయితే స్థానికులకే ఉద్యోగాల పేరుతో 2020 చివరి వరకు ఈ వీసాలపై ట్రంప్ నిషేధం విధించారు.
‘‘హెచ్1బి వీసా హోల్డర్ల జీతాలను విపరీతంగా పెంచడం ద్వారా స్థానికులు, లేదంటే గ్రీన్‌కార్డు హోల్డర్లను నియమించుకునేలా ట్రంప్ ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి చేయగలిగింది’’ అని అమెరికాలో ఉంటున్న హైదరాబాదీ శ్రీదివ్య అన్నారు.
''అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటానికి ట్రంప్ చేపట్టిన సాహసోపేతమైన చర్య ఇది'' అని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ క్రికోరియన్ అప్పట్లో అభివర్ణించారు.
అయితే కరోనా సాకుతో ట్రంప్ వలస విధానాలను తిరగ రాస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి.
గూగుల్ మొదలుకొని అనేక టెక్ కంపెనీలు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను తప్పుబట్టాయి.
బైడెన్ రాకతో ఇమ్మిగ్రేషన్ పాలసీలు పూర్తిగా మారిపోతాయన్న అంచనా ఉంది. అమెరికాలో చదువు కోవాలనుకునే వారు, ఉద్యోగాల కోసం అక్కడి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నవారు బైడెన్ విధానాల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నారు
“కొత్త ప్రభుత్వం కచ్చితంగా భారతీయులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను’’ అన్నారు శ్రీదివ్య.
జో బైడెన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది... అమెరికాలోని తెలుగువారు ఏమంటున్నారు?
“ట్రంప్‌కు భిన్నంగా బైడెన్ విధానాలు ఉంటాయని, అవి భారతీయులకు మేలు చేస్తాయని మేమంతా భావిస్తున్నాం’’ అని అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్న నిశాంత్ సిరికొండ వ్యాఖ్యానించారు.
“ఇమ్మిగ్రేషన్ విధానాలలో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై ఇక్కడి తెలుగువారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’’ అని అమెరికాలో 15 ఏళ్లుగా ఉంటున్న గోపాలకృష్ణ గూడపాటి అన్నారు. ఆయన అమెరికన్ ప్రొగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్ ‘ఆప్టా’కు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
“రాబోయే రోజుల్లో అమెరికా వలస విధానాల్లో పెను మార్పులు ఉంటాయని, అవి తెలుగు వారితోపాటు ప్రపంచదేశాల వారందరికీ మేలుచేస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది’’ అని గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.
“గత ప్రభుత్వ విధానాల కారణంగా అర్హత ఉండి కూడా హెచ్1బి వీసాలను పొందలేకపోయిన తెలుగువారు బైడెన్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా అవకాశాల స్వర్గం. ఇక్కడ అందరికీ అవకాశాలు వస్తాయి’’ అని గత 30 ఏళ్లుగా అమెరికాలో నివస్తున్న శాంతి కూచిభొట్ల అన్నారు. ‘సిలికానాంధ్ర’ అనే ఎన్జీవోలో ఆమె క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
ఫొటో సోర్స్, FACEBOOK/USCIS
గ్రీన్‌కార్డులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా ?
హెచ్1బి వీసాల తర్వాత తెలుగువారు ఎక్కువగా ఆశించేంది, ఎదురుచూసేది గ్రీన్‌కార్డ్ కోసం.
ట్రంప్ హయాంలో గ్రీన్‌కార్డుల జారీ కూడా నిలిచిపోవడంతో అమెరికాలో స్థిరపడాలనుకున్న లక్షలమంది ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
“పదిహేనేళ్లుగా అమెరికాలో ఉంటున్నాను. పదేళ్లుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు గోపాలకృష్ణ గూడపాటి.
“గ్రీన్‌కార్డ్ ఆశించేవారు దశాబ్దాలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్యకు బైడెన్ పాలనలో పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం’’ అని వాషింగ్టన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న విజయకుమార్, జనార్దన్‌లు వ్యాఖ్యానించారు.
“ట్రంప్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను బైడెన్ ప్రభుత్వం 60 రోజులపాటు హోల్డ్‌లో పెట్టాలని భావిస్తోంది.
ఈ సమయంలోనే ఇమ్మిగ్రేషన్ విధానాలను సమూలంగా మార్చాలన్నది వారి ప్రయత్నం.
ఇది కచ్చితంగా తెలుగు వాళ్లకు మేలు చేస్తుంది’’ అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి అన్నారు.
“ట్రంప్ విధానాలు ఎన్నారైలను ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. కొత్త ప్రభుత్వం వాటిని కొనసాగిస్తుందని మేం భావించడం లేదు’’ అంటున్నారు వెంకట్ మడిపడిగ. పెన్సిల్వేనియా తెలంగాణ అసోసియేషన్‌కు వెంకట్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ ప్రభుత్వం వలస విధానాలు మార్చేస్తుందని భారతీయులు నమ్ముతున్నారు
భారత్-అమెరికా సంబంధాలు
భారత్‌తో కొత్త ప్రభుత్వ సంబంధాలు కచ్చితంగా మెరుగ్గానే ఉంటాయని ఎన్నారైలు భావిస్తున్నారు.
భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలి పదవిలోఉండటం, మంత్రివర్గంలో కూడా చాలామంది భారతీయులకు చోటు దక్కడం ఇందుకు నిదర్శనమంటున్నారు.
అమెరికా ఎన్నికల ప్రచారంలో బైడెన్ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు ప్రచారం, నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
“కమలా హారిస్ మీద భారతీయులకు ఆశలు పెట్టుకున్నారు. విద్యా, ఉద్యోగాలతోపాటు భారతీయ వ్యాపారవేత్తలకు కూడా అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నాను’’ అని కాలిఫోర్నియాలో ఉంటున్న మిసెస్ యూనివర్స్ రుచికా శర్మ అభిప్రాయపడ్డారు.
“బైడెన్ క్యాబినెట్లో 20మంది భారతీయులకు చోటివ్వడం భారత అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడటానికి దోహదం చేస్తుంది.
వలస వచ్చే వారికి అనుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది’’ అని వాషింగ్టన్లో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్‌గా వ్యవహరిస్తున్న వెంకట సత్యనారాయణ పేర్ల అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘తెలుగు’కు వెలుగునిస్తారా ?
అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన భాషల్లో ఒకటిగా తెలుగు నిలిచింది. ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న భాషల్లో తెలుగు అగ్రగామిగా ఉందని ఒక సర్వేలో తేలింది.
2010-2017 మధ్య అమెరికాలో వేగంగా పెరిగిన భాషగా తెలుగు అగ్రస్థానంలో ఉంది.
గత ఏడాది జరిగిన అమెరికా ఎన్నికల అధికారిక బ్యాలట్ పేపర్లలో తెలుగు భాష కూడా కనిపించింది. “తెలుగుకు అధికారిక బ్యాలెట్లో స్థానం లభించడం గొప్ప విషయం’’ అన్నారు మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ అధిపతి ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్.
“అయితే ఇది ఇంతటితో ఆగకూడదు. బైడెన్ పాలనలో భారతీయ భాషలకు, అందులోనూ తెలుగుకు మరింత ఆదరణ లభించాలని ఆశిస్తున్నాం’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)