బైడెన్ పాలనలో భారత సంతతి అమెరికన్లు కీలకం కానున్నారా

  • జుబేర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
హౌడీ మోడీ

ఫొటో సోర్స్, Getty Images

గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో హ్యూస్టన్‌లో ఒక ర్యాలీలో పాల్గొన్నారు.

అందులో 50 వేల మంది భారత సంతతి అమెరికన్లు పాల్గొన్నారు.

నిర్వాహకులు ఈ కార్యక్రమానికి 'హౌడీ మోడీ' అనే పేరు పెట్టారు.

ఆ ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ 2020 నవంబర్‌ ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలుస్తారని అంచనా వేశారు.

2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో మోదీ హ్యూస్టన్ కంటే పెద్ద ర్యాలీ నిర్వహించి ట్రంప్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

మోదీ-ట్రంప్ మధ్య ఈ స్నేహం చూస్తుంటే భారత సంతతి అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీని వదిలి రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారా అనిపించింది.

కానీ, ఎన్నికల ముందు జరిగిన ఒక సర్వేలో రిపబ్లికన్ పార్టీ వైపు ఉన్న ఈ మొగ్గు ఆ పార్టీకి పూర్తిస్థాయి మద్దతుగా మారలేదని తేలింది.

ఫొటో సోర్స్, Michael M. Santiago/gettyimages

ఎన్నికల తర్వాత చేసిన ఒక సర్వేలో భారత సంతతి ప్రజలు 2016తో పోలిస్తే రిపబ్లికన్ పార్టీకి కచ్చితంగా ఎక్కువ ఓట్లు వేశారని తేలింది.. అయితే, 72 శాతం మంది భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ఓటు వేశారని స్పష్టమైంది.

ఫొటో సోర్స్, Reuters

'హౌడీ మోడీ' ర్యాలీ ప్రభావం చూపలేదు

'హౌడీ మోడీ' ర్యాలీలో పాల్గొన్న 'ఇండియాస్పోరా' వ్యవస్థాపకుడు ఎం.ఆర్.రంగస్వామి కూడా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో "ర్యాలీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 2016లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన మొదటి తరం భారతీయ అమెరికన్లు ఉన్నారు" అని చెప్పారు.

భారత సంతతి అమెరికన్లు ఆ దేశంలోని 32 కోట్ల జనాభాలో 1.5 శాతం కంటే తక్కువే ఉన్నారు.

కానీ వారిని అమెరికాలో విజయవంతమైన సమాజాల్లో ఒకటిగా చేర్చారు.

2015లో ఒక వ్యక్తి సగటు ఆదాయం లక్ష డాలర్లు ఉంది. అది జాతీయ సగటు రెట్టింపు కంటే కాస్త తక్కువ.

భారతీయ అమెరికన్ల సమాజం రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు బహిరంగంగా ఎన్నికల విరాళాలు ఇస్తుంది.

అందుకే నేతలకు వీరి ప్రాధాన్యం తెలుసు. దాదాపు 20-25 ఏళ్ల ముందు సిలికాన్ వ్యాలీ అభివృద్ధి కోసం ఈ సమాజం చేసిన కృషికి చాలా పేరు వచ్చింది.

అంతకు ముందు విద్య, కృషి, వ్యాపారంలో ఈ సమాజం విజయవంమైందని స్థానిక అమెరికన్లు భావించేవారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈసారి ఎన్నికల్లో కూడా భారత సంతతి అమెరికా ఓటర్లు డెమొక్రటిక్ పార్టీకి అండగా నిలిచారు.

దానికి కమలా హ్యారిస్ ఒక పెద్ద కారణం అయ్యారు. ఆమె తల్లిది తమిళనాడు కాగా, తండ్రిది కరిబియన్ దేశం జమైకా.

ఫలితంగా బైడెన్-కమలా హ్యారిస్ టీమ్ తమ పారిపాలన కోసం 20 మంది భారత సంతతి అమెరికా సభ్యుల పేర్లను ప్రకటించింది.

అమెరికా వ్యవస్థ ప్రకారం నామినేట్ చేసిన అభ్యర్థుల పేర్లు సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత టీమ్‌లో 13 మంది మహిళలు ఉన్నరు. వీరిలో డాక్టర్ల సంఖ్యే ఎక్కువ.

వీరిలో చాలామందికి ఒబామా పాలనలో పనిచేసిన అనుభవం ఉంది. దాదాపు వీరందరూ లిబరల్ భావజాలానికి చెందినవారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నీరా టండన్

నీరా టండన్- మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తర్వాత నీరా టండన్ అంత కీలకమైన భారత సంతతి అధికారి కానున్నారు.

సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థ అధ్యక్షురాలు, చీఫ్ ఎగ్జిక్యూటిన్ ఆఫీసర్ అయిన నీరా టండన్‌ను జోబైడెన్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.

సెనేట్ ఆమె నియామకాన్ని ధ్రువీకరిస్తే ఆ కార్యాలయానికి నేతృత్వం వహించే మొదటి నల్లజాతి మహిళ ఈమే అవుతారు.

మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టరుగా పరిపాలనా వ్యయం, విధాన ప్రణాళికలకు ఆమె బాద్యత వహిస్తారు.

నీరా టండన్ తల్లిదండ్రులకు భారత్‌తో సంబంధం ఉంది. కానీ, వారు విడాకులు తీసుకోవడంతో నీరాను ఆమె తల్లే పెంచి పెద్ద చేశారు.

పేదరికంలో ఉన్న రోజులను ఇటీవల గుర్తు చేసుకున్న నీరా ఒక ట్వీట్‌లో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు తనకు చాలా చిన్న వయసని, తన తల్లి ఆహారం, ఆశ్రయం అందించే ప్రభుత్వ సహకార కార్యక్రమంపై ఆధారపడిందని చెప్పారు.

"ఇప్పుడు అలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించడానికి, మా కుటుంబం లాంటి వారు సగౌరవంగా జీవించేలా చూసుకోడానికి నన్ను నియమించారు" అన్నారు.

ఆ పదవి దక్కాలంటే ఆమెకు సెనేట్ అనుమతి లభించాల్సిన అవసరం ఉంది. అది చాలా కష్టం కావచ్చు. ఎందుకంటే ఆమె రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలామంది నేతలకు వ్యతిరేకంగా వారికి నచ్చని విధంగా ట్వీట్లు చేశారు.

తన పేరును నామినేట్ చేసిన తర్వాత ఆమె అలాంటి వెయ్యికి పైగా ట్వీట్లను తొలగించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నేతలు ఆమె చేసింది మర్చిపోలేదు.

ఆమె పేరును ప్రకటించిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియిర్ నేత, సెనేటర్ లిండ్సే గ్రాహం నీరాను "మానసిక సంతులనం లేని వ్యక్తి"గా అభివర్ణించారు.

పార్టీలో మరో సెనేటర్ ఆమెను 'రేడియోయాక్టివ్' అన్నారు. ఆమె లాంటి విభజించే వ్యక్తిత్వం ఉన్న వారిని దూరంగా పెట్టడం మంచిదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ వివేక్ మూర్తి

డాక్టర్ వివేక్ మూర్తి- అమెరికా సర్జన్ జనరల్

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం బైడెన్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా మారనుంది.

ఈ ప్రయత్నాల్లో భారత సంతతికి చెందిన కొంతమంది డాక్టర్లు ముందంజలో ఉన్నారు. వారికి డాక్టర్ వివేక్ మూర్తి నేతృత్వం వహిస్తున్నారు.

ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.

డాక్టర్ వివేక్ మూర్తిని అధ్యక్షుడి కోవిడ్-19 టాస్క్ పోర్స్ సహాధ్యక్షుడుగా, అమెరికా సర్జన్ జనరల్‌గా కూడా ప్రకటించారు. ఇంతకు ముందు ఆయన ఈ పదవిలో 2014 నుంచి 2017 ప్రారంభం వరకూ పని చేశారు.

వివేక్ బ్రిటన్‌, యార్క్‌షైర్‌లోని హడర్స్‌ఫీల్డ్‌లో 1977లో పుట్టారు. కానీ, మూడేళ్ల వయసులోనే తన తల్లిదండ్రులతో మియామీ వచ్చేశారు. ఆయన అమ్మనాన్నలు కూడా డాక్టర్లే, వారు కర్ణాటకకు చెందినవారు.

కోవిడ్-19 టాస్క్ ఫోర్స్‌లో సహాధ్యక్షులు డాక్టర్ డేవిడ్ కేసలర్, డాక్టర్ మార్సిలా నునెజ్-స్మిత్‌తో కలిసి డాక్టర్ వివేక్ మూర్తి పనిచేయనున్నారు. ఈ ముగ్గురికీ ఒక డాక్టర్ల టీమ్ సహకారిస్తుంది. అందులో భారత సంతతికి చెందిన అతుల్ గావండే పేరు ముఖ్యమైనది.

వివేక్ ఒక సర్జన్, ప్రొఫెసర్ మాత్రమే కాదు, 1998 నుంచి ఆయన న్యూయార్కర్ పత్రిక కోసం ఒక కాలమ్ కూడా రాస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో భారత సంతతికి చెందిన సెలీన్ గౌండర్ పేరు కూడా ఉంది.

అతుల్ గావండే తల్లిదండ్రులు కూడా డాక్టర్లే. వారు మహారాష్ట్రకు చెందినవారు. ఆయన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో మెడికల్ చేశారు. దీనితోపాటూ రోడ్స్ స్కాలర్ హోదాలో ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీలో డిగ్రీ కూడా అందుకున్నారు.

మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హెల్త్ టాస్క్ ఫోర్స్‌లో అతుల్ భాగంగా ఉన్నారు.

బైడెన్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో సెలీన్ గౌండర్ పేరు వినిపించడంతో తమిళనాడు నేతల్లో ఉత్సాహం వచ్చింది. చాలా మంది ట్వీట్లు చేసి ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

కమలా హ్యారిస్‌లాగే సెలీన్ గౌండర్ సగం కుటుంబం తమిళనాడుకు చెందింది.

ఆయన తండ్రి డాక్టర్ రాజ్ నటరాజన్ గౌండర్ తమిళనాడు ఈరోడ్ జిల్లాకు చెందినవారు. ఆయన తల్లి ఫ్రాన్స్ సంతతి మహిళ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉజ్రా జేయా

ఉజ్రా జేయా- విదేశాంగ మంత్రిత్వ శాఖలో

భారత సంతతికి చెందిన ఏకైక ముస్లిం అమెరికన్ ఉజ్రా జేయా.

బైడెన్ ఈమెను విదేశాంగ శాఖలో ఒక కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఉజ్రా విదేశాంగ శాఖలో పౌర రక్షణ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కార్యకర్శి హోదాలో నియమితులయ్యారు.

అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ విధానాలు చింతించిన ఉజ్రా జేయా 2018లో తన పదవికి రాజీనామా చేసినపుడు, ఆమె కెరీర్ ఇక ముగిసిపోయిందని తన స్నేహితులు అనుకున్నారు.

కానీ బైడెన్ ఆమెకు మరోసారి విదేశాంగ విధానాల బాధ్యతను ఆమెకు అప్పగించారు.

సెనేట్ ఉజ్రా జేయా పేరును ఆమోదిస్తే, బైడెన్ పాలనలో మానవ హక్కులపై రూపొందించే విధానాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు.

తన పేరును ప్రకటించిన తర్వాత "వైవిధ్యం, ప్రజాస్వామ్య ఆదర్శాలకు అమెరికా ప్రసిద్ధి చెందింది, ఆ ఆదర్శాలను పరిరక్షించేందుకు నేను ప్రయత్నిస్తా" అని ఆమె ట్వీట్ చేశారు.

ఉజ్రా చాలా దేశాల్లో అమెరికా రాయబారిగా, దౌత్యవేత్తగా పనిచేశారు. వాటిలో తన పూర్వీకుల దేశమైన భారత్ కూడా ఉంది.

ఆమె కుటుంబం కశ్మీర్ నుంచి అమరికా వెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వనితా గుప్తా

వనితా గుప్తా- అసోసియేట్ అటార్నీ జనరల్

45 ఏళ్ల వనితా గుప్తాకు ఒక ప్రముఖ పౌర హక్కుల కార్యకర్తగా దేశమంతటా పేరుంది. ఒబామా పాలనలో ఆమె న్యాయ విభాగం పౌర హక్కుల విభాగం చీఫ్‌గా పనిచేశారు.

"అమెరికాలో అత్యంత గౌరవనీయులైన పౌర హక్కుల లాయర్లలో వనిత కూడా ఒకరు" అని బైడెన్ ఆమెను ప్రశంసించారు.

వనితా రెండో తరం భారత సంతతి అమెరికన్. స్వయంగా జాతి వివక్షను ఎదుర్కున్న తర్వాత, ఆమె దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

సాధారణంగా రెండు, మూడు తరాల భారత సంతతి అమెరికన్లు భారత్‌తో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు. కానీ వనిత ఇప్పటికీ తన తల్లిదండ్రుల దేశంతో అనుబంధం కొనసాగిస్తున్నారు.

సామాజిక న్యాయం కోసం తనను ప్రేరేపించిన ఒక ఘటన గురించి వనితా గుప్తా న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

నేను నా కుటుంబ సభ్యులతో, లండన్‌లో ఒక మెక్ డొనాల్డ్స్ అవుట్‌లెట్ బయట కూర్చుని తింటున్నాను.

అదే సమయంలో కొందరు పక్కనున్న ఒక టేబుల్‌పై కూర్చున్నారు. 'నల్లవాళ్లు మీ దేశానికి తిరిగి వెళ్లండి' అనడం మొదలుపెట్టారు.

అది చాలా ఇబ్బంది కలిగించే ఘటన. అది నాపై చాలా ప్రభావం చూపించింది" అని చెప్పారు.

బైడెన్ పాలనలో పనిచేయబోయే 20 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లలో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాటిలో వేదాంత్ పటేల్ పేరు కూడా ఉంది. ఆయనను వైట్ హౌస్‌ అసోసియేట్ ప్రెస్ సెక్రటరీగా ప్రకటించారు.

సెనేట్ ఈయన పేరును ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. బైడెన్ ఎన్నికల ప్రచారంలో వేదాంత్ ఒక టీమ్ మెంబర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రతినిధుల్లో ఒకరుగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)