పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?

  • రజనీష్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
నేపాల్‌లోని జామా మసీదు
ఫొటో క్యాప్షన్,

నేపాల్‌లోని జామా మసీదు

నేపాల్‌లోని మధేస్ ప్రాంతంలో మహోత్తరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల సంఘర్ష్ దాహాల్ 2018లో పాకిస్తాన్ వెళ్లారు. ఆ ఏడాది జనవరి 16న పాకిస్తాన్‌లో జరిగిన ఒక వామపక్ష సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్నేహితుడు వీరేంద్ర ఓలీతో కలిసి జనవరి 14న పాకిస్తాన్‌కు ప్రయాణమయ్యారు.

వీర్‌గంజ్‌లోని భారత ఇమిగ్రేషన్ కార్యాలయంలో దాహాల్ అనేక రకాల ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. తన పాకిస్తాన్ ప్రయాణానికి కారణాలను భారత అధికారులకు వివరించి చెప్పడం కష్టమైందని సంఘర్ష్ తెలిపారు.

ఎలాగోలా వారిని ఒప్పించి వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్ చేరుకున్నారు.

"ఈ ప్రయాణం నాకు కళ్లు తెరిపించింది. మేము భారత్‌ నుంచీ పాకిస్తాన్ వెళ్లడం వలన సరిహద్దు భద్రతా దళాలు మాపై దృష్టి కేంద్రీకరించాయి. పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాపై నిఘా పెట్టాయి.

ఒక పాకిస్తాన్ కామ్రేడ్ సహాయంతో అక్కడి హోటల్‌లో మేము ఒక గది తీసుకోగలిగాం. కానీ ఆ రాత్రి ఆర్మీవాళ్లు వచ్చారు. మేము ఆ హోటల్ ఖాళీ చేయాల్సి వచ్చింది. తరువాత మరో హోటల్‌లో చోటు దొరికింది" అని సంఘర్ష్ తెలిపారు.

సైన్యం, భద్రతా దళాలను పక్కనపెడితే పాకిస్తానీ ప్రజలు ఎంతో సహృదయులని సంఘర్ష్ చెప్పారు.

"వాళ్లు మమ్మల్ని ఎంతో ఆభిమానించి, ఆదరించారు. మేము మా సొంత మనుషుల మధ్యే ఉన్నట్లు అనిపించింది. మాకు హిందీ వచ్చు కాబట్టి అక్కడి వారితో మాట్లాడడానికి ఇబ్బంది కాలేదు. నేపాల్‌లోని మధేసీ ప్రజలు చూడ్డానికి భారత, పాకిస్తాన్‌ దేశస్థుల్లాగానే ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వామపక్ష సంస్థల నిరసన ప్రదర్శనలో కూడా పాల్గొన్నాం" అని సంఘర్ష్ తెలిపారు.

పాకిస్తాన్ వెళ్లకముందు ఆ దేశ ప్రజలు కూడా భారతీయుల్లాగే ఉంటారని అనుకునేవాడిని కానీ అక్కడికి వెళ్లొచ్చాక పూర్తిగా వేరే అభిప్రాయం ఏర్పడిందని సంఘర్ష్ అంటున్నారు.

నేపాల్ వెళ్లి పాకిస్తాన్ గురించి లేదా పాకిస్తాన్ ప్రజల గురించి అడిగితే చాలామంది సానుకూలంగానే స్పందిస్తారు. కానీ కొందరు మాత్రం పాకిస్తాన్ అంటే కఠినమైన దేశం అని అనుకుంటుంటారు.

ఫొటో క్యాప్షన్,

మోహనా అంసారీ

పాకిస్తాన్ గురించి మధేసీ, పహాడీ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా?

మధేసీ ప్రాంతంలోని నేపాల్‌గంజ్‌కు చెందిన మోహనా అన్సారీ నేపాల్ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులుగా పని చేశారు.

పాకిస్తాన్ గురించి మధేసీ, పహాడీ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆమె అంటున్నారు.

"మధేసీ ప్రాంతంలోని ప్రజలు భారతీయ హిందీ చానెళ్లను చూస్తారు. ఆ హిందీ న్యూస్ చానెళ్లల్లో పాకిస్తాన్ గురించి ఎలా చూపిస్తారో వారూ అలాగే చూస్తారు. కానీ కమ్యూనిస్టు పార్టీలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవాళ్లు భిన్నమైన అభిప్రాయం కలిగి ఉంటారు.

హిందీ చానెళ్లు, జనాదరణ పొందిన హిందీ సినిమాలు చూసినవారు.. పాకిస్తాన్ ప్రజలంటే చాలా కఠినమైనవాళ్లు అనుకుంటారు. భారతదేశంలో మెజారిటీ జనాభా పాకిస్తాన్ పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటుందో వీళ్లూ అదే వైఖరి కలిగి ఉంటారు. అంతే కాకుండా భారత హిందూ సంస్థలు మధేసీ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తుంటాయి. వీరు కూడా పాకిస్తాన్ పట్ల నేపాలీల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు" అని మోహన తెలిపారు.

నేపాల్‌లో పాకిస్తాన్ పట్ల రెండు ధోరణులు ఉన్నాయని ఆమె అన్నారు.

"ఒక సమూహం మెజరిటీ భారతీయుల్లా ఆలోచిస్తుంది. మరో సమూహం చైనావాళ్లల్లా ఆలోచిస్తుంది. నేపాల్‌కు, చైనాకు దోస్తీ ఉంది కాబట్టి చైనాను సమర్థించేవాళ్లంతా పాకిస్తాన్ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు" అని మోహన తెలిపారు.

ఓలి ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన ఉమేష్ యాదవ్ మధేసీ ప్రాంతంలోని సప్త్రీ జిల్లాకు చెందినవారు.

ఇప్పటికీ భారత సరిహద్దులను కాపాడే దళాల్లో నేపాలీలు ఉన్నారని, భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా నేపాలీలు పాల్గొన్నారని ఉమేష్ యాదవ్ తెలిపారు.

"మేము మానసికంగా భారతదేశంతో అనుసంధానం కలిగి ఉన్నాం. పాకిస్తాన్ గురించి భారతీయులు ఎలా ఆలోచిస్తారో మేము కూడా దాదాపు అలాగే ఆలోచిస్తాం" అని ఆయన అన్నారు.

ఖాట్మండూకు చెందిన 30 ఏళ్ల మొయిన్-ఉద్దీన్ 'టీచ్ నేపాల్’ అనే ఎన్జీవోలో పనిచేసేవారు.

"నాకు తబ్లిగీ జమాత్‌తో సంబంధాలు ఉన్నాయి. తబ్లిగీ ప్రజలు పాకిస్తాన్‌నుంచీ నేపాల్ వచ్చినవారు. వారంతా నేపాలీల గురించి మంచిగా అనుకుంటారని వారితో మాట్లాడాక నాకు అర్థమైంది.

భారత్, పాకిస్తాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. భారత్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు నేపాల్ హిందువులు కూడా పాకిస్తాన్‌కు మద్దతివ్వడం చాలాసార్లు గమనించాను. ముఖ్యంగా ప్రతిష్టంభన తరువాత ఇలా జరగడం చూశాను. ఎందుకంటే అప్పట్లో సామాన్య నేపాలీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది" అని మొయిన్-ఉద్దీన్ అన్నారు.

పాకిస్తాన్‌లో ఇస్లాంకు సంబంధించిన వివాదలు రేగినప్పుడు నేపాల్ ముస్లింలలో కూడా కలకలం రేగుతుంది.

ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డోలో మహమ్మద్ ప్రవక్త గురించి కార్టూన్ వచ్చినప్పుడు.. నేపాల్‌లోని జామా మసీదునుంచి 2020 అక్టోబర్ 28న ఒక ప్రకటన వెలువడింది.

"మా ప్రవక్త గురించి అవమానకర రీతిలో ఫ్రెంచ్ పత్రికలో కార్టూన్ వచ్చింది. ఫ్రాన్స్ ఈ ధోరణిని నిలువరించకుండా మరింత ప్రేరేపిస్తోంది. మొత్తం ఇస్లామిక్ సమాజం ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మా నేపాలీ ముస్లింలందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేపాల్‌లోని ముస్లింలందరూ ఫ్రెంచ్ ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతున్నాం. ప్రవక్త గౌరవం కంటే మరేదీ ఎక్కువ కాదు" అని ఆ ప్రకటనలో తెలిపారు.

పాకిస్తాన్, నేపాల్‌లకు మధ్య రాకపోకలు ఎక్కువగా లేనందువల్ల ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలీదని మొయిన్-ఉద్దీన్ అభిప్రాయపడ్డారు.

నేపాల్‌నుంచీ పాకిస్తాన్ వెళ్లడానికి నేరుగా విమాన మార్గాలు లేవు. ఖతార్‌లోని దోహా నుంచీ వెళ్లాలి. ఇలా వెళ్లడానికి ఒకటిన్నర లేదా రెండు రోజులు పడుతుంది. ఇందుకోసం సుమారు ఒక లక్ష నేపాలీ రూపాయలు ఖర్చవుతాయి.

ఫొటో క్యాప్షన్,

ఫ్రెంచ్ పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై వచ్చిన కార్టూన్‌ను నేపాలీ ముస్లింలు ఖండించారు

కఠ్మాండూ, ఇస్లామాబాద్ మధ్య విమానాలు లేవు

కఠ్మాండూలోని మహారాజ్‌గంజ్‌లో పాకిస్థాన్‌కు ఎంబసీ ఉంది.

"ఇస్లామాబాద్ వెళ్లాలంటే దోహా లేదా దుబాయ్‌నుంచీ వెళ్లాలి. 21 గంటలు పడుతుంది సుమారు 1300 డాలర్లు ఖర్చు అవుతుంది. కఠ్మాండూనుంచి నేరుగా పాకిస్తాన్‌కు విమానం ఉంటే రెండు గంటలు మాత్రమే పడుతుంది. నేను నేపాల్‌లో మూడేళ్లుగా ఉంటున్నాను. నేపాలీ ప్రజలు చాలా అభిమానంగా ఉంటారు. నా దగ్గర ఎప్పుడైనా సరిపోయినంత డబ్బులు లేకపోతే పైసలు తీసుకోకుండానే కూరగాయలు ఇస్తారు. భారతీయులకు, మాకు పెద్దగా తేడా ఉండదు కాబట్టి చాలాసార్లు నన్ను చూసి ‘మీరు భారతీయులా’ అని అడుగుతారు. నేను పెద్దగా వాదించను. ‘అవును, భారతీయుడినే’ అని చెప్తుంటాను" అని పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసే ఒక వ్యక్తి చెప్పారు.

"ఏడేళ్ల క్రితం కఠ్మాండూ నుంచీ ఇస్లామాబాద్‌కు వెళ్లే విమానం ఒకటి ఉండేది. అది పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. అయితే, అందులో ప్రయాణికుల కొరత ఉండడంతో ఆ విమాన సేవలను నిలిపేయాల్సి వచ్చింది" అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి రాజ్‌కుమార్ క్షేత్రి తెలిపారు.

కే2 అధిరోహించిన నేపాలీ బృందం

ఈ ఏడాది జనవరి 16న పాకిస్తాన్ సరిహద్దులనుంచీ చైనా సరిహద్దుల వరకు వ్యాపించిన కరాకోరం శ్రేణిలోని కే2 పర్వత శిఖరాన్ని 10 మంది నేపాలీల బృందం అధిరోహించింది. ప్రపంచంలో ఎవరెస్ట్ తరువాత ఎత్తైన శిఖరం ఇదే. దీన్ని శీతాకాలంలో అధిరోహించడం చాలా కష్టం. చలికాలంలో కే2 పర్వతారోహణం చేయడానికి గతంలో చాలామంది విఫలయత్నం చేశారు. ఈ జనవరిలో నిర్మల్ పూర్జా నాయకత్వంలోని నేపాలీల బృందం ఈ విజయాన్ని సాధించింది. వీరు పాకిస్తాన్‌నుంచే కే2 ఎక్కారు.

ఈ సందర్భంగా, పాకిస్తానీయులు తమకు ఎంతో సహాయం చేశారని నిర్మల్ పూర్జా వారిపై ప్రశంసలు కురిపించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.."పాకిస్తాన్ ప్రజలు మా మనసులు గెలుచుకున్నారు. కే2 శిఖరాన్ని అధిరోహించేందుకు పాకిస్తాన్ ప్రజలు మాకు పూర్తి సహాయ సహకారాలను అందించారు. పర్వతారోహణం చేసి వచ్చిన తరువాత పాకిస్తాన్ ప్రజలు మమ్మల్ని హీరోల్లాగా స్వాగతించారు. అక్కడి ఆర్మీ చీఫ్ మమ్మల్ని విడిగా కలుసుకుని అభినందించారు. మా కార్యక్రమం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి రాష్ట్రపతిని కూడా కలుసుకున్నాం. భారతీయులు కూడా పాకిస్తాన్‌తో స్నేహసంబంధాలు కొనసాగించాలని నా అభిప్రాయం. ఇరు దేశాల ప్రజలూ అన్నదమ్ముల్లాంటివాళ్లు. వాళ్లల్లో వాళ్లే ఘర్షణలు పడుతూ ఉంటే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మూడో వర్గం లాభపడుతుంది" అని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

వీరేంద్ర ఓలీ, సంఘర్ష్ దాహల్

నేపాల్, పాకిస్తాన్ మధ్య సంబంధం

1960 మార్చి 19న నేపాల్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధించిన దగ్గరనుంచీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి.

పాకిస్తాన్ పట్ల తమ వైఖరిని భారతదేశ విధానాలనుంచీ వేరుగా ఉంచింది నేపాల్. భారత, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు నేపాల్ ఎవరి పక్షం వహించలేదు. జమ్మూ కశ్మీర్, భారతదేశంలో అంతర్భాగమని నేపాల్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగని పాకిస్తాన్ వాదనలకూ మద్దతు తెలుపలేదు.

నేపాల్‌కు ఎవరి పక్షం వహించాల్సిన అవసరం కూడా లేదని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి రమేష్ నాథ్ పాండే అభిప్రాయపడ్డారు.

"నేపాల్‌కు తన సొంత ద్వైపాక్షిక విధానాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఆ దేశ నిర్ణయాలు ఉంటాయి. నేపాల్, భారత్‌ల మధ్య చారిత్రకంగా వచ్చిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ రెండు దేశాలూ ఆ బరువును తీసి పక్కకు విసిరేయకపోతే, నేపాల్ బహిరంగంగా భారత్ పక్షాన నిలబడడం కష్టం" అని ఆయన అన్నారు.

నేపాల్, పాకిస్తాన్ కూడా చైనాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ మధ్య ఉన్న సీపీఈసీకి నేపాల్ మద్దతు ఇస్తుంది. చైనా ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ ప్రాజెక్ట్‌లో నేపాల్ కూడా పాల్గొంటోంది. కానీ భారత్ ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఉంది.

1961 సెప్టెంబర్ 10 నుంచీ 16 వరకూ నేపాల్ రాజు మహేంద్ర పాకిస్తాన్ పర్యటనతో ఈ రెండు దేశాల మధ్య ఉన్నతాధికారుల పర్యటన ప్రారంభమైంది. అప్పటి పాకిస్తాన్ రాష్ట్రపతి అయూబ్ ఖాన్, రాజా మహేంద్రకు స్వాగత సత్కారాలందించారు.

ఆ పర్యటనలో రాజా మహేంద్రకు, పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్-ఏ-పాకిస్తాన్’ అందించారు. దీనికి ప్రతిగా నేపాల్ కూడా పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్‌ను ‘ఓజాస్వి రాజన్య’ బిరుదుతో సత్కరించింది.

1963, మే నెలలో అయూబ్ ఖాన్ నేపాల్‌లో పర్యటించారు. దీని తరువాత ఇరు దేశాల అధ్యక్షుల మధ్య రాకపోకలు కొనసాగాయి.

2018 మార్చిలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ నేపాల్‌లో పర్యటించారు.

అలాగే, నేపాల్ ప్రస్తుత ప్రధాని కేపీ ఓలి కూడా పాకిస్తాన్ సందర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)