ఫ్లోరిడా: నగరం మొత్తం నీటిలో విషాన్ని కలిపేందుకు వాటర్ సిస్టమ్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్

కుళాయి నీళ్లు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓల్డ్‌స్మార్ నగర నీటి సరఫరా వ్యవస్థను హ్యాక్ చేసిన ఒక కంప్యూటర్ హ్యాకర్.. ఆ నీటిలోకి ప్రమాదకర స్థాయిలో రసాయనాలను కలిపేందుకు ప్రయత్నించారని అధికారులు చెప్పారు.

నగర వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి అందులో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును పెంచగా.. ఒక ఉద్యోగి గుర్తించి వెంటనే ఆ చర్యను తిప్పికొట్టారు.

నీటిలో అసిడిటీని నియంత్రించటానికి సోడియం హైడ్రాక్సైడ్‌ను స్వల్ప మోతాదులో ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువ మోతాదులో కలిపితే పెద్ద సమస్యలను కలిగిస్తుంది.

ఓల్డ్‌స్మార్ వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌ను శుక్రవారం నాడు హ్యాక్ చేశారు. ఉదయం విధుల్లో ఉన్న ప్లాంట్ ఆపరేటర్ ఒకరు.. సిస్టమ్‌ను యాక్సెస్ చేయటానికి జరుగుతున్న ప్రయత్నాన్ని గుర్తించారు. అయితే అది తన సూపర్‌వైజర్ అని భావించారని టాంపా బే టైమ్స్ ఒక కథనంలో వివరించింది.

అయితే.. మధ్యాహ్నం మరోసారి ప్రయత్నించిన హ్యాకర్ సాఫ్ట్‌వేర్‌లోకి చొరబడ్డాడు. నీటిలో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును 100 పీపీఎం (పార్ట్స్ పెర్ మిలియన్) నుంచి 11,100 పీపీఎంకు పెంచాడు.

ఈ పెరుగుదలను గుర్తించిన ఆపరేటర్ తక్షణమే దానిని రివర్స్ చేసి.. సాధారణ స్థాయికి తగ్గించాడు.

నీటిలో ఈ రసాయనం మోతాదు పెరిగితే.. ఆ నీరు తాకిన చర్మం, కళ్లకు ఇరిటేషన్ కలిగిస్తుంది. జుట్టు తాత్కాలికంగా ఊడిపోగలదు. అదే నీటిని తాగితే నోరు, గొంతు, పొట్టలు దెబ్బతింటాయి. వాంతులు, కళ్లుతిరగటం, విరేచనాలు కూడా కలిగించగలదు.

దుష్ట శక్తులు పొంచివున్నాయి...

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. ఈ హ్యాకింగ్ అమెరికాలో నుంచే జరిగిందా, దేశం వెలుపలి నుంచి జరిగిందా అనేదీ ఇంకా తెలియలేదు.

‘‘దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి’’ అని ఓల్డ్‌స్మార్ మేయర్ ఎరిక్ షీల్డెల్ వ్యాఖ్యానించారు.

ఓల్డ్‌స్మార్ వాటర్ ప్లాంటు.. దాదాపు 15,000 మంది నగరవాసులకు, వ్యాపార సంస్థలకు నీటిని సరఫరా చేస్తుంది.

తాజా పరిణామం నేపథ్యంలో ప్లాంటు రిమోట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా ఆపివేశారు.

2016లో అమెరికాలోని మరొక నీటి ప్లాంటులో కూడా ఇదే తరహా సైబర్ దాడి జరిగిందని బీబీసీ సైబర్ రిపోర్టర్ జో టైడీ తెలిపారు.

2020లో ఇజ్రాయెల్‌లోని పలు నీటి సరఫరా కేంద్రాలపై పలుమార్లు ఇలాంటి దాడి ప్రయత్నాలు జరిగాయని, కానీ విఫలమయ్యాయని వివరించారు.

దేశంలోని ‘‘కీలకమైన జాతీయ మౌలికసదుపాయాల వ్యవస్థల’’ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు అనేక సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. తాజా సైబర్ దాడి వారి ఆందోళనలను మరింతగా పెంచింది.

నీరు, విద్యుత్, అణు విద్యుత్ ప్లాంట్లు, రవాణా వ్యవస్థల్లో సైబర్ భద్రతా లోపాల కోసం ఎప్పటికప్పుడు పరిశోధన చేపడుతూనే ఉంటారు. ఇందుకు.. వీటిలో కాలం చెల్లిన ఐటీ వ్యవస్థలను ఉపయోగిస్తుండటం ఒక కారణమైతే.. వాటిపై దాడివల్ల సంభవించే సామూహిక నష్టం మరొక కారణం.

ఇప్పటివరకూ నీటి సరఫరాల మీద జరిగిన సైబర్ దాడులన్నిటినీ నివారించారు.

కానీ మేయర్ సీడెల్ చెప్పినట్లుగా.. ‘‘దుష్టశక్తులు పొంచివున్నాయని అందరినీ అప్రమత్తం చేసిన దాడి ఇది’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)