వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?

  • జేమ్స్ లైండేల్
  • బీబీసీ ప్రతినిధి
వీగర్ ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

వీగర్ ముస్లింల జాతిని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోదని ''విశ్వసనీయ సమాచారం''తో ధ్రువీకరించినట్లు బ్రిటన్‌లో ఓ అధికారిక ''లీగల్ ఒపీనియన్'' ప్రచురితమైంది.

చైనాలోని వాయువ్య ప్రాంతమైన షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లిం మైనారిటీలైన వీగర్లను పూర్తిగా తుడిచిపెట్టేయాలనే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.

''నిర్బంధ కేంద్రాల్లో వీగర్ ముస్లింలకు హానిచేసే చాలా శిక్షలు విధిస్తున్నారు. వీగర్ ముస్లిం మహిళలు పిల్లలకు జన్మనివ్వకుండా అడ్డుకోవడం, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం, గర్భస్రావాలు చేయించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, వీగర్ల పిల్లలను బలవంతంగా ఇతర జాతులతో కలిసి జీవించేలా చేస్తున్నారు'' అని ఆ నివేదికలో వివరించారు.

మానవాళిపై జరుగుతున్న ఈ సామూహిక నేరాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బాధ్యుడని చెప్పగలిగే చాలా ''విశ్వసనీయ ఆధారాలు'' తమకు లభించాయని నివేదికలో చెప్పారు. ''ఈ ఘటనల్లో జిన్‌పింగ్ పాత్రను చూస్తుంటే.. వీగర్ ముస్లిం జాతి విధ్వంసానికి పాల్పడుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి'' అని వ్యాఖ్యానించారు.

''మాకు లభించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం, షిన్‌జియాంగ్‌లో వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలను చూస్తుంటే జాతి విధ్వంసంలా అనిపిస్తోంది'' అని నివేదికలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP

లీగల్ ఒపీనియన్ అంటే?

అందుబాటులో ఉన్న ఆధారాలు, చట్టాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణులు ''లీగల్ ఒపీనియన్''ను వెల్లడిస్తారు. వీటిని కోర్టులు పరిగణలోకి తీసుకోవచ్చు.

తాజా ఒపీనియన్‌ను గ్లోబల్ లీగల్ యాక్షన్ నెట్‌వర్క్, ద వరల్డ్ వీగర్ కాంగ్రెస్, వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ నిపుణులు సంయుక్తంగా విడుదల చేశారు.

''గ్లోబల్ లీగల్ యాక్షన్ నెట్‌వర్క్'' ఒక మానవ హక్కుల సంస్థ. వివిధ దేశాల్లో చట్టాలు, న్యాయపరమైన అంశాలపై ఇది దృష్టి సారిస్తుంది.

షిన్‌జియాంగ్‌లో వీగర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ఖండిస్తూ వస్తోంది.

జిన్‌పింగ్‌పై కావాలనే పశ్చిమ దేశాలు, చైనా వ్యతిరేక దేశాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని లండన్‌లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, EPA

100 పేజీలున్న తాజా నివేదికను లండన్‌లోని ఎస్సెక్స్ కోర్ట్ చాంబర్స్‌కు చెందిన సీనియర్ అడ్వొకేట్లు సిద్ధం చేశారు. దీన్ని రూపొందించిన న్యాయ నిపుణుల్లో అలీసన్ మెక్‌డోనల్డ్ క్యూసీ కూడా ఉన్నారు. చైనాలోని షిన్‌జియాంగ్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై బ్రిటన్‌లో ఓ లీగల్ ఒపీనియన్ ప్రచురితం కావడం ఇదే తొలిసారి.

బ్రిటన్ పార్లమెంటులో ఇలాంటి ఘటనలకు సంబంధించి ఓ కొత్త చట్టం పెండింగ్‌లో ఉంది. అది ఆమోదం పొందితే, ఇలాంటి ఊచకోతలపై హైకోర్టులో విచారణ చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు ఈ లీగల్ ఒపీనియన్‌ను పరిగణలోకి తీసుకొవచ్చు.

అంతర్జాతీయ సంస్థలు, విద్యావేత్తలు, మీడియా సమాచారంతోపాటు అందుబాటులోనున్న ఆధారాలను ఆరు నెలల పాటు విశ్లేషించిన అనంతరం తాజా నివేదికను సిద్ధంచేశారు.

దీని కోసం బాధితులతోనూ మాట్లాడారు. ప్రభుత్వం నుంచి లీక్ అయిన పత్రాలను, ఉపగ్రహాల సాయంతో తీసిన చిత్రాలనూ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images

వీగర్లకు ఏం జరుగుతోంది?

చైనాలో వీగర్ల జాతి విధ్వంసం జరుగుతోందని రుజువుచేసే బలమైన ఆధారాలు ప్రస్తుతం లభించాయని, చిత్రహింసలు పెట్టడం, అత్యాచారాలు, బలవంతంగా పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయడం లాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని నివేదిక తెలిపింది.

''నిర్బంధ కేంద్రాల్లో వీగర్లను చిత్రహింసలు పెడుతున్నారు. విద్యుత్ షాక్‌కు గురిచేయడం, బాగా కొట్టడం, ఆకలితో అలమటించేలా చేయడం, చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం, కళ్లకు గంతలు కట్టడం, విపరీతంగా ఒత్తిడి చేయడం లాంటివి చేస్తున్నారు'' అని నివేదికలో పేర్కొన్నారు.

ఒక ప్రాంతంలో ప్రజలు పిల్లలకు జన్మనివ్వకుండా అడ్డుకోవడాన్ని జాతి విధ్వంసంగా అంతర్జాతీయ చట్టాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వీగర్ జనాభాను నియంత్రించడమే లక్ష్యంగా వారికి పిల్లలు పుట్టకుండా చేస్తున్నట్లు నివేదికలో వివరించారు.

''వీగర్ ముస్లిం మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతీస్తున్నారు. కొందరి గర్భాశయాలను బలవంతంగా తొలగిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. వీటిని జాతి విధ్వంసం చర్యలుగానే చెబుతారు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP

మరోవైపు పిల్లలను వేరే జాతివారికి బలవంతంగా పెంచుకోవడానికి ఇచ్చేయడాన్ని కూడా జాతి విధ్వంసంగా అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి.

''వీగర్ తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని బలవంతంగా వేరు చేసి అనాథాశ్రమాల్లో పెడుతున్నారు. వారి తల్లిదండ్రులను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు''.

''ఈ పిల్లలకు వీగర్ సంస్కృతి తెలియకుండా పెంచుతున్నారు. అంతేకాదు వీరికి హాన్ జాతి పేర్లను పెడుతున్నారు. వీరిలో చాలా మందిని హాన్ తెగలు పెంచుకుంటున్నాయి. చైనాలో వీగర్లను ఎలా నాశనం చేస్తున్నారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు''.

అయితే, షీ జిన్‌పింగ్ హయాంలో వీగర్ ముస్లింల జనాభా పెరిగిందని, ఇలాంటి ఆరోపణల్లో నిజంలేదని లండన్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

''కొన్ని చైనా వ్యతిరేక, పశ్చిమ దేశాలు కలిసి.. ఇలా జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఈ శతాబ్దంలో మునుపెన్నడూ లేనివిధంగా చైనాపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ ఆరోపణలు నిదర్శనం'' అని ప్రకటనలో వ్యాఖ్యానించారు.

''పక్షపాతం లేకుండా ఆలోచించే ఎవరికైనా... చైనా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇలాంటి విద్వేష ఆరోపణలు పైచేయి సాధించడానికి చైనా ఎప్పుడూ ఒప్పుకోదు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. ఇలాంటి అబద్ధాలన్నింటికీ సమాధానం చెబుతుంది''.

వీడియో క్యాప్షన్,

లక్షల మంది మైనారిటీలతో పత్తి చేలలో బలవంతంగా పని చేయిస్తున్న చైనా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)