మియన్మార్ సైనిక కుట్ర: సరిహద్దు దాటిన తమ పోలీసు అధికారులను అప్పగించాలని భారత్‌కు లేఖ

మియన్మార్ నిరసనలు

ఫొటో సోర్స్, EPA

సైన్యం ఆదేశాలు పాటించడానికి నిరాకరిస్తూ భారతదేశంలో ఆశ్రయం పొందిన పోలీసు అధికారులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని మియన్మార్ కోరింది. కొంత మంది అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల సరిహద్దుదాటి వచ్చారని భారత అధికారులు చెప్పారు.

"రెండు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించేందుకు" వారిని అప్పగించాలని మియన్మార్ అధికారులు లేఖ రాశారు.

గత నెలలో సైనిక తిరుగుబాటు తరువాత మియన్మార్‌లో ప్రజాందోళనలు తీవ్రమయ్యాయి. నిరసనకారుల పట్ల భద్రతాదళాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 55 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

శనివారం నాడు కూడా ప్రదర్శనకారులు సైనిక ఆదేశాలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. యాంగాన్ నగరంలో భారీ సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టేందుకు గ్రెనేడ్లను కూడా విసిరారని వార్తలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA

భారత రాష్ట్రమైన మిజోరంలోని చంపాయి జిల్లాకు చెందిన డిప్యూటీ కమిషనర్ మరియా సీటీ జువాలీ, తమకు మియన్మార్ ఫాలం జిల్లా అధికారులు రాసిన లేఖ అందిందని, అందులో వారు తమ పోలీసు అధికారులను అప్పగించాలని కోరారని తెలిపారు.

ఎనిమిది మంది పోలీసు అధికారులు సరిహద్దు దాటి భారతదేశంలోకి వచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని మియన్మార్ అధికారులు తమ లేఖలో ప్రస్తావించారు.

"రెండు దేశాల మధ్య స్నేహ సంబధాలను కొనసాగించేందుకు వీలుగా, భారత భూభాగంలోకి వచ్చిన ఎనిమిది మంది పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని మాకు అప్పగించండి" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖ విషయంలో భారత హోం మంత్రిత్వ శాఖ సూచనల కోసం ఎదురు చూస్తున్నామని జువాలీ అన్నారు.

రాయిటర్స్ సమాచారం ప్రకారం ఇటీవలి కాలంలో అధికారులు, వారి కుటుంబ సభ్యులు కలిసి దాదాపు 30 మంది సరిహద్దు దాటి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.

శనివారం నాడు కూడా భారత సరిహద్దు వద్ద మియన్మార్ జాతీయులు అధిక సంఖ్యలో ఉన్నారని, దేశంలోని సంక్షోభం నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారని భారత అధికారులు చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదించింది.

ఫొటో సోర్స్, Reuters

భద్రతా దళాల కాల్పుల్లో 38 మంది మృతి

మియన్మార్‌లో మార్చి 3 బుధవారం నాడు 38 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల కిందట సైనిక కుట్ర జరిగిన తరువాత ఇదే 'రక్తసిక్తమైన రోజు' అని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది.

మియన్మార్‌లోని ఐక్యరాజ్యసమితి రాయబారి క్రిస్టీన్ ష్రేనర్ బర్గ్‌నర్, దేశంలో విస్మయాన్ని కలిగించే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.

భద్రతాదళాలను నిరసనకారుల మీద రబ్బర్ బులెట్లతో పాటు నిజమైన బులెట్లతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలో ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శాసనోల్లంఘన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters

నిరసనకారులు సైనిక పాలనకు అంతం పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంగ్ సాన్ సూచీ సహా ప్రజలు ఎన్నుకున్న నాయకులందరినీ విడుదల చేయాలని కోరుతున్నారు.

సైనిక కుట్ర, ఆ తరువాత ప్రజా నిరసనల అణచివేతలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాల ఖండనలను మియన్మార్ సైన్యం పెడచెవిన పెడుతోంది.

బుధవారం నాటి మరణాలపై స్పందించిన బ్రిటన్, శుక్రవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. అమెరికా కూడా మియన్మార్ సైన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

సంయమనం పాటించాలంటూ మియన్మార్ సైన్యానికి పొరుగుదేశాలు సూచించిన మరునాడే దేశంలో హింస పెచ్చరిల్లింది.

ఫొటో సోర్స్, Reuters

'వాళ్లు అలా వీధుల్లోకి వచ్చి కాల్పులు ప్రారంభించారు'

సైనిక కుట్ర తరువాత ఇప్పటి వరకు 50 మందికి పైగా మరణించారని ష్రేనర్ బర్గ్‌నర్ అన్నారు. ఒక స్వచ్ఛంద వైద్య సేవకుడిని పోలీసులు కొడుతున్న వీడియో, ఒక నిరసనకారుడిని రోడ్డు మీద కాల్చి చంపుతున్న వీడియో బయటకు వచ్చాయని ఆమె తెలిపారు.

"సైన్యం ఉపయోగిస్తున్న ఆయుధాలు ఏమిటని ఆయుధ నిపుణులను అడిగాను. అయితే, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, వారు 9ఎంఎం సబ్‌మెషీన్ గన్స్‌లో నిజమైన బులెట్లను పెట్టి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది" అని ష్రేనర్ చెప్పారు.

యాంగాన్ వంటి చాలా నగరాల్లో భద్రతా దళాలు పెద్దగా ముందస్తు హెచ్చరికలేమీ లేకుండా కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

బుధవారం చనిపోయిన వారిలో 14, 17 ఏళ్ల పిల్లలు ఇద్దరున్నారని సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ తెలిపింది. ఒక 19 ఏళ్ల మహిళ కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు.

మియన్మార్ సంక్షోభం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సైనిక పాలకులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆంక్షలు విధించినా, ఏకాకిని చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు.

'జనరల్స్‌పై కఠిన చర్యలు' తీసుకోవాలని ష్రేనర్ ఐక్యరాజ్యసమితిని కోరారు. దానికి మియన్మార్ మిలటరీ డిప్యూటీ చీఫ్, "కొద్ది మంది మిత్రులతో కలసి ప్రయాణించడం మేం నేర్చుకోవాలి" అని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు మరికొన్ని ఐరోపా దేశాలు మియన్మార్‌పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

నిరసన ప్రదర్శనల్లో గాయపడిన యువతి మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మియన్మార్ నిరసనల్లో తలకు గాయమైన మృతి చెందిన యువతి

మియన్మార్ సైనిక కుట్రకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలలో ఒక యువతి చనిపోయారు. మియా త్వే త్వే కెయింగ్ అనే 20 ఏళ్ల యువతి గత వారం పోలీసులు రబ్బర్ బులెట్లు, వాటర్ క్యానన్లు ప్రయోగించినప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బులెట్ గాయమైన ఆ యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆ యువతి చనిపోయారు.

ఆంగ్ సాన్ సూచీని సైనిక కుట్రతో గద్దె దింపడాన్ని వ్యతిరేకిస్తూ మియన్మార్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.

మృతి చెందిన యువతి సోదరుడు యే హుట్ ఆంగ్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నేను విషాదంలో కూరుకుపోయాను. ఏమీ మాట్లాడలేకపోతున్నాను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

తలకు గాయమైన ఆ యువతిని ఫిబ్రవరి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆస్పత్రిలో ఉండగానే ఆమె 20వ పడిలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఆమె లైఫ్ సపోర్టుతోనే ఉన్నారు.

ఆమెకు గాయమైనప్పుడు ఒక పేరు చెప్పని మెడికల్ ఆఫీసర్‌తో బీబీసీ మాట్లాడింది. ఆమె తలకు తీవ్రమైన గాయమైందని ఆ ఆఫీసర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS

అడ్డొచ్చే నిరసనకారులకు 20 ఏళ్ల జైలు శిక్ష... సైన్యం హెచ్చరిక

మియన్మార్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారు సైనిక బలగాలను అడ్డుకుంటే 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని మిలిటరీ హెచ్చరించింది.

సైనికాధికారులను ధిక్కరించడం లేదా వారి పట్ల ద్వేషం పెంచేలా ప్రయత్నించేవారికి ఇంకా ఎక్కువ కాలం శిక్షలు, జరిమానాలు పడతాయని సైన్యం తెలిపింది.

ఈ ప్రకటనకు ముందు, దేశంలోని పలు నగరాల్లోని వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు కనిపించాయి. ఇంటర్నెట్‌ను దాదాపు పూర్తిగా నిలిపివేశారు.

ఉత్తర ప్రాంతంలోని కచిన్ రాష్ట్రంలో నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీన కుట్ర చేసిన సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది ప్రజాప్రతినిధులను నిర్బంధించింది. దీనికి వ్యతిరేంగా దేశంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సైన్యం ప్రజల మీద యుద్ధం ప్రకటించిందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి టామ్ ఆండ్రూస్ ఆరోపించారు. ఈ చర్యలకు సైనిక జనరల్స్‌ను బాధ్యత వహించేలా చేస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యాంగోన్‌లో సైనిక వాహనాలు

సైన్యం సంయమనం ప్రదర్శించాలని పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాలు విజ్ఞప్తి చేశాయి.

యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్‌లు సంతకం చేసిన ఒక ప్రకటనలో, ‘‘చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కూలదోయటంపై నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారులపై హింసకు పాల్పడవద్దని భద్రతా బలగాలను మేం కోరుతున్నాం’’ అని పేర్కొన్నాయి.

ఆంగ్ సాన్ సూచీ పార్టీ నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో మోసం జరిగిందని సైన్యం అంటోంది. సూచీ సారథ్యంలోని పౌర ప్రభుత్వాన్ని సైనిక కుట్ర ద్వారా తొలగించింది.

సూచీ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. వందలాది మంది ఉద్యమకారులు, ప్రతిపక్ష నాయకులను కూడా నిర్బంధించారు.

అణచివేత సంకేతాలు ఏమిటి?

దేశవ్యాప్తంగా సైన్యానికి వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనకారులు వరుసగా తొమ్మిదో రోజూ ప్రదర్శనలు నిర్వహించారు.

కచిన్ రాష్ట్రంలోని మైట్కీనా నగరంలో.. సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులతో భద్రతా బలగాలు తలపడ్డాయి. ఈ సందర్భంగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే వారు రబ్బరు బుల్లెట్లు పేల్చుతున్నారా లేక నిజమైన బులెట్లు పేల్చుతున్నారా అనేది ఇంకా తెలీదు.

సైన్యం అరెస్టు చేసిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు.

సైనిక కుట్ర జరిగిన తర్వాత మొదటిసారిగా యాంగాన్ నగర వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు సంచరిస్తూ కనిపించాయి. బౌద్ధ సన్యాసులు, ఇంజనీర్లు అక్కడ ప్రదర్శనకు సారథ్యం వహించారు.

ఇక రాజధాని నగరం నేపీటాలో మోటార్‌సైకిళ్ల మీద ప్రదర్శన నిర్వహించారు.

ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మియన్మార్‌లోని టెలికామ్ ఆపరేటర్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఫిబ్రవరి 1న సైనిక కుట్ర జరిగిన తరువాత మొదటిసారిగా యాంగోన్ వీధుల్లో కనిపించిన సైనిక శకటాలు

ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాక ఇంటర్నెట్ ట్రాఫిక్ సాధారణ స్థాయి నుంచి 14 శాతానికి పడిపోయిందని నెట్‌బ్లాక్ అనే పర్యవేక్షణ సంస్థ చెప్పింది.

సైనిక బలగాలు రాత్రిళ్లు ఇళ్ల మీద దాడులు చేస్తున్నాయని నేపీటాలోని ఒక ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ఒకరు బీబీసీకి తెలిపారు.

‘‘కర్ఫ్యూ విధిస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని వారు ప్రకటిస్తారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పోలీసులు, సైనికులు మావంటి వారిని అరెస్ట్ చేసే సమయం ఇదే’’ అని ఆ వైద్యుడు వివరించారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరు వెల్లడించడం లేదు.

‘‘ఆ ముందు రోజు వారు ఒక ఇంటి ముందుకు వచ్చి, కంచెను కత్తిరించి, ఇంట్లోకి అడుగుపెట్టి జనాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అందుకే నాకు కూడా ఆందోళనగా ఉంది’’ అని చెప్పారాయన.

మియన్మార్‌లో ఉన్న అమెరికా జాతీయులు కర్ఫ్యూ సమయంలో ఇళ్లలోనే ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.

ఏడుగురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటానికి వారెంట్లు జారీ చేశామని సైన్యం శనివారం నాడు ప్రకటించింది. అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలను హెచ్చరించింది.

అయితే, జనం ఆంక్షల్ని ధిక్కరిస్తూ రావడం వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. భద్రతా బలగాలు రాత్రిపూట దాడులు చేస్తున్నపుడు కుండలు, పళ్లాలు చరుస్తూ తమ పొరుగువారిని హెచ్చరిస్తున్నారు.

ఎవరినైనా 24 గంటలకన్నా ఎక్కువ సేపు అరెస్టు చేయటానికి, ప్రైవేటు ఇళ్లలో సోదాలు చేయటానికి కోర్టు ఆదేశాలు అవసరమని చెప్పే చట్టాలను కూడా సైన్యం శనివారం నాడు సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)