'రేప్ నుంచి కోలుకున్నాక... టీవీలో అలాంటి దృశ్యాలు కనిపిస్తే భయానకంగా ఉంటోంది...'

  • రెబెక్కా కెఫె
  • బీబీసీ ప్రతినిధి
అమ్మాయి దేహాన్ని ముక్కలు చేసినట్లు చూపించే చిత్రం

మార్తా తన ఇంట్లోనే అత్యాచారానికి గురయ్యారు. ఆమె మరొకరితో కలిసి ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. తెలిసిన వ్యక్తే మార్తా బెడ్ రూంలోనే ఆమెపై అత్యాచారం చేశాడు.

మార్తాను వంచనకు గురి చేసిన ఆ సంఘటన ఆమె ఆత్మాభిమానాన్ని తీవ్రంగా గాయపరిచింది. దాంతో ఆమె చాలా వేదనను, అనిశ్చితిని, ఆగ్రహాన్ని అనుభవించారు.

న్యాయం కోసం ఎలా పోరాడారు, ఎంత కష్టపడ్డారు, ఆ ఘటన తన మానసిక ఆరోగ్యంపై చూపిన ప్రభావం గురించి ఆమె వివరించారు:

ఒక వారం తర్వాత నేను పనిలోకి వెళ్లి అక్కడ ఏడవడం మొదలుపెట్టాను

నేను అత్యాచారం నుంచి కోలుకున్న వ్యక్తిని.

ఈ పదాన్ని అలవాటు చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. బాధితురాలు అనడం నాకిష్టం ఉండదు.

కోలుకోవడం అనే పదం గొప్పగా ఉంటుంది. అదొక శక్తిని ఇస్తుంది. బాధితురాలు అనే మాట జాలి చూపిస్తున్నట్లుంటుంది. అందులో శక్తి ఉండదు.

నా మీద అత్యాచారం జరిగిన తర్వాత నేను వణికిపోతూ ఉండేదానిని. ఆ మరుసటి రోజు నేను ఏమి జరగలేనట్లు పనిలోకి వెళ్లాను. ఆ రోజు గురించి నాకేమి గుర్తు లేదు.

మరో రెండు రోజుల తర్వాత నేనొక స్నేహితురాలిని కలిసి జరిగిందంతా వివరించాను. నేను వద్దని వారిస్తున్నా అతడు నన్ను బలాత్కారం చేశారని చెప్పాను. నన్ను బలవంతంగా పట్టుకుని అత్యాచారం చేశాడని వివరించాను.

నేను ఈ మధ్యే ఒక సంబంధంలోంచి బయటకు వచ్చాను. అది ఇంకా చెప్పలేని బాధను మిగిల్చింది.

నా బాధను చూసిన నా స్నేహితురాలు ఈ విషయం గురించి నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నానా, లేదా అని ప్రశ్నించారు. నా లాంటి పరిస్థితుల్లో ఉన్నవారు గతంలో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.

ఫిర్యాదు చేయడం వలన వాళ్ళు తిరిగి శక్తిని సంపాదించుకున్నట్లు భావించారని ఆమె చెప్పారు. ఆ సమయంలో ఆ మాటలు నాకు రుచించాయి. ఎందుకంటే నేను చాలా శక్తిహీనంగా ఉన్నట్లుగా నాకు అనిపించింది.

ఫిర్యాదు చేయడానికి మేము పోలీసు స్టేషన్‌కు వెళ్ళాం

అక్కడ నన్ను ఒక పోలీసు వ్యాన్లో సెక్సువల్ అసాల్ట్ రిఫరల్ కేంద్రానికి తీసుకుని వెళ్లారు. అప్పుడు నాకు ఒక నేరస్థురాలిని తీసుకుని వెళుతున్నట్లుగా అనిపించింది. వాళ్ళు మా మధ్య సెక్స్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి డిఎన్ఏ ఆధారాల కోసం శ్వాబ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఒక వారం అయిపోవడంతో వారికేమి లభించలేదు.

వాళ్ళు కొన్ని అధికారిక పద్ధతులు పాటించాలని నాకు తెలుసు. ఇలా చేయడం అర్ధం లేనిదిగా అనిపించింది. నాకేమి గాయాలు అవ్వలేదని చెప్పగలను. అయితే, అది అంగీకార యోగ్యమైన కలయికా కాదా అనేది నిర్ధరించాలి.

అక్కడ ఉన్న డిటెక్టివ్ లు నా ఫోన్ కావాలని అడిగారు. ఆ ఫోనులో మా ఇద్దరి మధ్య కొంత సంభాషణ నడిచింది.

నేనిప్పుడు కొత్త ఫోను కొనుక్కోవాలా? నేను నా స్నేహితులకు, తల్లితండ్రులకు ఈ విషయం గురించి చెప్పలేదు.

నాకు తాత్కాలిక ఫోన్ నంబర్ ఎందుకు వచ్చిందంటే ఏమి చెబుతాను అనే ఆలోచనలు మాత్రమే ఆ సమయంలో నన్ను చుట్టుముట్టాయి.

తర్వాత ఫోరెన్సిక్ అధికారి నా గదిని సందర్శించారు. నా గదిలో వస్తువులు చెల్లా చెదురుగా ఉండి శుభ్రంగా ఉండకపోవడంతో ఆయన గదిని పరిశీలించి చూస్తున్నప్పుడు నాకు చాలా అవమానకరంగా అనిపించింది.

నా రూమ్ మేట్ అక్కడే నిల్చుని నాకు చాలా చికాకుగా ఉంది అని అంటుంటే ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.

నాకు నేను ఏమి సమాధానం చెప్పుకోవాలో కూడా అర్ధం కాలేదు.

పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిస్ ఆర్డర్ తో నేను పనిని వదిలి పెట్టవలసి వచ్చింది.

అప్పుడు నేనిక నా తల్లితండ్రులతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. నాకు నిజంగా చెప్పాలని లేదు కానీ, మరో దారి కనిపించలేదు.

నేను ఇంటికి వెళ్లి, అమ్మతో ముందు చెప్పాను. ఆమె నాన్నగారికి చెప్పారు.

ఆయన నేనున్న ఫ్లాట్ దగ్గరకు వచ్చి నా గదిని శుభ్రపరచాలని ప్రయత్నించారు. ఆయన నన్ను రక్షించలేక పోయినందుకు ఆయన చేయగలిగిన పని అదొక్కటేనేమో అనిపించింది.

కోర్టుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది

నాకు ఇవన్నీ ఉపసంహరించుకోవాలని అనిపించింది. కానీ, నేను అబద్ధం చెప్పినట్లు ఉంటుందని ఊరుకున్నాను.

నాకెందుకో ఈ విషయంలో తగిన ఆధారాలు లేవని కేసు కొట్టేస్తే అప్పుడు నాకు మరో మార్గం ఉండదని అనుకున్నాను.

ప్రతి విషయాన్ని పదే పదే కోర్టులో వివరించాల్సిన అవసరం లేకుండా నేను అప్పటికే నా సాక్ష్యాన్ని వీడియోలో రికార్డు చేసి ఉంచాను. నన్ను అత్యాచారం చేసిన వ్యక్తి గురించి పూర్తిగా నాకు తెలియదు. ఆయన చిన్నగా, సన్నగా ఉంటారు. కానీ, అతనొక జంపర్ ధరించి ఉన్నారు. అదింకా నాతోనే ఉంది.

నన్ను విచారణ చేయడం ఇంకొక కొత్త వేదన.

డిఫెన్సు న్యాయవాది కూడా మహిళే.

నేను అబద్ధం చెబుతున్నట్లు ఆమె ఏదో ఒక కథ అల్లాలి అని అల్లుతున్నట్లుగా అని నాకు అర్ధం అవుతోంది.

నేను సరదాగా చేసిన సెక్స్ లో ఆనందం లేకపోవడం వలన అత్యాచారానికి గురయ్యానని స్నేహితులతో చెప్పడం చాలా సులభం అని ఆమె ఆరోపిస్తున్నారు.

ఆ సమయంలో నా ఒంటి మీద ధరించిన దుస్తుల గురించి ఎక్కువగా దృష్టి పెట్టారని అర్ధమయింది. దాంతో నా ధైర్యం అంతా కోల్పోయాను. నా ఒంటి మీద పైజామా ఉందో లేదో కూడా నాకు గుర్తు లేదు.

ఈ లోపు డిఫెన్సు న్యాయవాది మాట్లాడటానికి ఏమి లేక మౌనంగా కూర్చున్నారు.

అంత మంది మధ్యలో ఏమి చెప్పాలో తెలియని స్థితిలో నా మీద దాడి జరుగుతున్నట్లే అనిపించింది.

అక్కడుండే క్లర్క్ నన్ను బయటకు తీసుకుని వచ్చారు. నేను అప్పటికే వణికిపోతున్నాను. నేను బాగా గాయపడ్డాను.

ఇద్దరం కలిసి బయటకు నడుస్తూ ఉండగా ఆమె నా వైపు చూసి, ఇది వ్యక్తిగత విషయమేమి కాదని అన్నారు.

నాకు జరిగింది వ్యక్తిగతం కాక మరేమిటి? ఆమె మాటలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.

నా పై దాడి చేసిన వారికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అందులో 2 సంవత్సరాలు పరిశీలనలో ఉంచుతారు. రెండు సంవత్సరాలు ఎంతలో ముగుస్తాయి? ఈ శిక్ష పడటానికి మేము రెండేళ్లు ఎదురు చూశాం.

కానీ, ఆ నేరం నిరూపితమవ్వడం వలన నేను ఎంత అదృష్టవంతురాలినో అర్ధమయింది.

కొంతమంది వెంటనే ఫిర్యాదు చేస్తారు. విచారణ జరిగిన వారిలో కొందరికి మాత్రమే శిక్ష పడుతుంది.

మాకు న్యాయం జరగడమే కావాలి. కానీ, ఆ తర్వాత జరిగేవన్నీ చాలా చికాకు పుట్టిస్తాయి.

నేను నా శక్తికి మించి పోరాడాను. దాంతో అతను నన్ను అత్యాచారం చేసినట్లు అధికారికంగా నమోదు అయింది. నాకు తిరిగి శక్తి వచ్చినట్లయింది.

కానీ, నా పోస్ట్ ట్రమాటిక్ డిస్ఆర్డర్ తిరిగి రావడం మొదలయింది. నేను ఒక టీవీ షో చూస్తున్నప్పుడు కానీ, పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా అత్యాచార దృశ్యం చూస్తే నాకు వెంటనే నీరసం ఆవహించేస్తుంది. ఆ సమయంలో నన్ను ఎవరైనా పట్టుకుంటే ఇష్టం ఉండదు.

ఎక్కడికో తోసేసినట్లు ఉండి నిస్సహాయంగా ఉంటుంది. నా నరాలన్నీ మండిపోతున్నట్లుగా ఉంటుంది.

నా బుర్రలో అత్యాచారానికి గురైన వేరే మహిళలు మెదులుతారు. అది చాలా భయానకంగా ఉంటుంది.

దీని నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక్కొక్కసారి అర్ధం కాదు. ఇలా మళ్ళీ నాకే జరగవచ్చు. లేదా ఇంకెవరికైనా నేను ప్రేమించేవారికి జరగవచ్చు.

నన్ను ఇఎండీఆర్ (ఐ మూవ్మెంట్ డెసెన్సిటైజేషన్ అండ్ రీప్రొసెసింగ్) థెరపీకి పంపించారు. వేదన కలిగించే జ్ఞాపకాలు తక్కువ కాలం ఉండే జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. దానిని గుర్తించి దీర్ఘకాల జ్ఞాపకాలలోకి ఈ థెరపీ ద్వారా పంపించడం వలన అది ఎక్కువ వేదనను కలిగించదని చెబుతారు.

ఆ వేదనను విడుదల చేయమని థెరపిస్టు వారి చేతులను మన ముఖం ముందు ఊపుతూ అడుగుతారు. దాంతో కళ్ళు వేగంగా కదులుతాయి.

ఇది కొంత వరకు ఉపయోగపడవచ్చు. కానీ, ఆ సమయంలో అది నాకు పని చేస్తున్నట్లు అనిపించలేదు.

అతడు క్రిస్మస్ రోజు జైలు నుంచి విడుదల అయ్యారు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను వేరేగా బంధిస్తున్నట్లు నా లైజన్ ఆఫీసర్ చెప్పారు. కానీ, వారు కూడా అతడ్ని బెయిల్ మీద విడుదల చేస్తారు.

లైంగిక నేరాలు చేసినవారి జాబితాలో ఉండటం వలన అతనికి ఇల్లు దొరకలేదు.

కానీ, నేనుండే ప్రాంతానికి ఒక 10 నిమిషాల దూరంలో అతడికి ఓ ఇల్లు దొరికింది.

ఆ ప్రాంతంలో ఉండటానికి ఆయనకు అనుమతి ఎందుకు ఇచ్చారనే విషయాన్ని నేను లైజన్ అధికారిని ప్రశ్నించినప్పుడు నేనక్కడ ఉంటున్నట్లు వారికి తెలియదని చెప్పారు.

అయితే, ఇంత శిక్ష అనుభవించాక ఆ వ్యక్తి నన్ను తిరిగి గాయపరుస్తారని నేను అనుకోలేదు.

నేను సెంట్రల్ లండన్ కి వెళ్లాల్సిన ప్రతి సారి ఆయన నివాసం ఉండే ప్రాంతాన్ని దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. కానీ, మరొక్క సంవత్సరంలోనే ఆయనను మరో దేశానికి అప్పగించారు. నేను ఊపిరి పీల్చుకున్నాను.

నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. నాకు నా సొంత పిల్లలు కావాలని అనుకుంటున్నానా? అత్యాచారం నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి పిల్లలను కనడం చాలా బాధాకరంగా ఉంటుంది. దీని గురించి ఎవరూ చెప్పరు. ఇప్పుడు నేను గర్భవతిని కాదు. నేను అత్యాచారానికి గురైన 15 సంవత్సరాల తర్వాత గర్భం దాలుస్తుంటే నాకు కొత్తగా అనిపించవచ్చు.

నేను ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పడానికి సందేహించాను. ఒక సారి వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు, చూడండి, నేను అత్యాచారానికి గురయ్యాను. మీరు నాతో మాట్లాడి ఏమి చేస్తున్నారో చెప్పండి అని చెప్పాల్సి వచ్చింది.

నాకు అత్యాచారం జరిగిన తర్వాత నాకు మొదటి సారి స్మియర్ పరీక్ష చేయించుకోవడం కోసం లెటర్ వచ్చింది. కానీ, నేను చాలా రోజులు దానిని తప్పించుకుంటూ వచ్చాను

అయితే, లైంగిక హింసకు గురైన వారికి కేవలం సెర్వికల్ స్క్రీనింగ్, ఎస్ టిఐ పరీక్షలు మాత్రం నిర్వహించే 'మై బాడీ బ్యాక్ ప్రాజెక్ట్' అనే స్వచ్చంద సంస్థ కనిపించింది. వాళ్ళు అద్భుతమైన పని చేస్తున్నారు.

వాళ్ళు మీకు మార్గదర్శకత్వం వహిస్తారు. వాళ్ళ దగ్గర అనుభవుజ్ఞులైన డాక్టర్లు, విచక్షణతో పని చేసి అర్ధం చేసుకునే వ్యక్తులు ఉన్నారు.

ఈ సంస్థలో మెటర్నిటీ విభాగం కూడా ఉంది.

అయితే, అక్కడ పిల్లలను కనాలని అనుకుంటే నా భర్త ఏమనుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే నేనేదైనా పనిలో ఉన్నప్పుడు నా భర్త నన్ను వెనక నుంచి వచ్చి కౌగిలించుకోవడం, నా మెడ మీద ముద్దు పెట్టుకోవడం లాంటి వాటిని సాధారణంగా తీసుకోగల్గుతున్నాను.

నా పిల్లల విషయంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని భావిస్తున్నాను. ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ని పిల్లలకు అందించడంలో చాలా పురోగతి కనిపించడం మాత్రమే కాకుండా పరస్పర అంగీకారం గురించి కూడా చర్చిస్తున్నారు.

అత్యాచారం గురించి ఎక్కువగా చర్చ జరగాలని భావిస్తున్నాను. ఇందులో అంగీకారం గురించి వాదులాడుకోవడం కాదు. ఒక అత్యాచారం నుంచి కోలుకున్న వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది. మనుషులు విభిన్నంగా ఉండటం వలన కోలుకున్న వారిలో చాలా రకాల వారు ఉంటారు.

మీకేమి జరిగిందో మీకు తెలిస్తే చాలు. అదే ముఖ్యం.

ఇల్లస్ట్రేషన్స్ : కేటి హార్విక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)