గాడిద పాలతో చేసే ఈ చీజ్ ధర కిలో రూ.80 వేలు.. మాజీ ఎంపీ వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images
చీజ్
"దీని రుచి మామూలుగా ఉండదు, మరే పదార్థమూ ఇలాంటి రుచి ఉండదు" - గాడిద పాల చీజ్ గురించి తయారీదారు చెప్పే మాట ఇది.
ఈ చీజ్ చాలా పరిమితంగా దొరుకుతుంది. కిలో చీజ్ ధర సుమారు రూ.80 వేలు (1100 డాలర్లు).
ఐరోపాలోని సెర్బియాలో ఈ వ్యాపారం చేసే స్లోబోడన్ సిమిక్ సెర్బియా ప్రాంతీయ పార్లమెంటు మాజీ సభ్యుడు.
"50 గ్రాముల చొప్పున మేం తయారుచేస్తాం. ఇది పది మంది తినొచ్చు. నాకు తెలిసి ఎవరూ ఇది అర్ధ కేజీ లేదా కేజీ తినరు" అని సిమిక్ వివరించారు.
సెర్బియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవక్ జొకోవిచ్- తన రెస్టారెంట్ల కోసం ఈ చీజ్ కొంటారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ చీజ్ రుచి ప్రత్యేకమైనదని, ఇది ఆరోగ్యానికి మంచిదని సిమిక్ చెబుతారు
కుర్రాళ్లు తమ ప్రేయసికి ఆశ్చర్యపరిచే బహుమతి ఇవ్వాలనుకుంటే దీనిని కొని ఇస్తుంటారు.
ఏడాదికి 50 కేజీల చీజ్ మాత్రమే తయారుచేస్తానని, పాల ఉత్పత్తులపై ఉన్న నియంత్రణల దృష్ట్యా ఎగుమతి చేయలేకపోతున్నానని సిమిక్ చెప్పారు.
వివిధ దేశాల సంపన్నులు ఈ చీజ్ కోసం సెర్బియాకు వస్తారని తెలిపారు. అలా మలేషియా నుంచి వచ్చిన ఒక ధనవంతుడు తన వద్ద 15 కేజీల చీజ్ కొన్నారని వెల్లడించారు.
ఎందుకింత ధర?
చాలా దేశాల్లో వస్తురవాణాకు, వ్యవసాయ పనులకు గాడిదలను వాడతారు. అనేక ప్రాంతాల్లో గాడిద పాలను తాగుతారు. కానీ వీటి నుంచి చీజ్ తయారు చేయడం చాలా కష్టం. పాలు తోడుకోవడానికి అవసరమైన 'కేసీన్' అనే ప్రొటీన్ గాడిద పాలలో లేకపోవడమే దీనికి కారణం.
దీనిని దృష్టిలో ఉంచుకొని, గాడిద పాల నుంచి చీజ్ చేయడానికి ఒక సాంకేతిక పరిష్కారం కనిపెట్టాలని ఓ నిపుణుడిని పురమాయించారు. ఈ చీజ్ తయారీ విధానం ఒక చిదంబర రహస్యం.
"ఆ విధానమేమిటో ఆయన ఒక్కరికే తెలుసు. నాక్కూడా తెలియదు" అని సిమిక్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆవుల కన్నా గాడిదలు పాలు తక్కువగా ఇస్తాయి. ఒక్క లీటర్ చీజ్ తయారీకి 25 లీటర్ల గాడిద పాలు కావాలి.
డబ్బు సంపాదించాలనో, ఏదైనా కొత్తది కనిపెట్టాలనో కోరికో తనను చీప్ వ్యాపారం వైపు నడపించలేదని సిమిక్ చెబుతారు.
ఆయన గతంలో తన అభిరుచి కొద్దీ స్కౌట్స్ లాంటి సంస్థ తరపున పనిచేసేవారు.
తర్వాత సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఒక నేచర్ రిజర్వ్ బాధ్యతలను చేపట్టారు. అక్కడ అన్ని రకాల జంతువులు ఉండేవి గానీ గాడిదలు మాత్రం ఉండేవి కావు.
ఫొటో సోర్స్, Getty Images
గాడిద పాలు
ఈ నేచర్ రిజర్వ్ కోసం ఆయన 20 గాడిదలు కొన్నారు. సరైన పోషణ లేని, ఏ పనికీ వాడని గాడిదలు అవి.
"గాడిదలు తెలివిలేని జంతువులనే అపోహ సెర్బియాలో ఉంది. నిజానికి ఇదో చక్కటి జంతువు" అని సిమిక్ ఉత్సాహంగా చెబుతారు.
సిమిక్ రిజర్వ్‌లో కొంత కాలం తర్వాత గాడిదల సంఖ్య పెరిగింది. డబ్బు సంపాదన కోసం ఆయన వాటి పాలను విక్రయించసాగారు.
ఫొటో సోర్స్, Getty Images
50 గ్రాముల స్వల్ప పరిమాణంలో ఈ చీజ్ అమ్ముతారు
గాడిద పాలు కొనేవారు తక్కువగా ఉండటంతో, వ్యాపారాభివృద్ధి కోసం వీటి నుంచి చీజ్ తయారు చేసి అమ్మాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు సిమిక్ వద్ద 250కి పైగా గాడిదలు ఉన్నాయి. తన వ్యాపారం ప్రారంభించడానికి ముందు సెర్బియా అంతటా కలిపి కేవలం 500 గాడిదలే ఉండేవి.
"నేను రోజూ దాదాపు వంద గ్రాముల గాడిద పాలు తాగుతా. నా వయసు ఇప్పుడు దాదాపు 65 ఏళ్లు. నాకు ఏ ఆరోగ్య సమస్యలూ లేవు" అని సిమిక్ చెబుతారు.
ఈ వ్యాపారంలో తన విజయాన్ని చూసి స్ఫూర్తి పొందిన మరో పది మంది, గాడిదల పెంపకాన్ని చేపట్టారు.
గాడిదను పెంచుకోవాలని, గాడిద పాలు తాగాలని తాను ప్రతి ఒక్కరికీ చెబుతానని సిమిక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- గుండెపోటు మనుషులకే ఎందుకొస్తుంది
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- జనాభా పెరిగితే పురుగులు తినాల్సిందేనా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)