చిరంజీవి: 'విశాఖ ఉక్కు సాధిస్తామని గోడల మీద నినాదాలు రాశాను.. ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలి' - Newsreel

చిరంజీవి

ఫొటో సోర్స్, Chiranjeevi/FB

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నానని నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.

ఎన్నో త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అని, దాన్ని కాపాడుకోవడానికి పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఉద్యమించాలని చిరంజీవి ట్వీట్ చేశారు.

నర్సాపురం వైయన్ కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశాం, నినాదాలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశామని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

'సారంగ దరియా పాటను సేకరించిన కోమలికి సినిమాలో క్రెడిట్ ఇస్తాం' -శేఖర్ కమ్ముల

సారంగ దరియా పాట మీద కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. మరుగున పడిన జానపద గీతాన్ని వెలుగులోకి తెచ్చిన కోమలకు సినిమాలో క్రెడిట్ ఇస్తాం, తగిన పారితోషికం ఇస్తాం అంటూ 'లవ్ స్టోరీ' చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఎంతో శ్రమతో తాను సేకరించిన పాటను తీసుకుని తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన కోమల కూడా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించారు.

లవ్ స్టోరీ చిత్రంలోని 'సారంగ దరియా' పల్లవితో సాగే పాటను గత వారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆ పాట రెండు కోట్ల వ్యూస్ దాటిపోయింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. పది రోజుల్లో 4 కోట్ల వ్యూస్‌కు చేరువవుతోంది.

అయితే, ఈ జానపద గీతాన్ని మొదట సేకరించింది తానేనని, తనకు మాట మాత్రం కూడా చెప్పకుండానే ఈ పాటను సినిమాలో వాడుకున్నారని పదేళ్ల కిందట ఈ గీతాన్ని టీవీ షోల్లో పాడిన గాయని కోమల ఆరోపించారు. "సారంగ దరియా పాటను మా అమ్మమ్మ నుంచి నేనే సేకరించాను. దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాను. ఆ పాటకు సుద్దాల అశోక్ తేజతో పాటు సేకర్తగా నాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి" అని ఆమె బీబీసీతో అన్నారు.

తెలుగు న్యూస్ చానళ్లలో ఈ వివాదంపై చర్చ కొనసాగింది. చివరకు దర్శకుడు శేఖర్ కమ్ముల తన ట్విటర్, ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా దీనిపై వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది. కోమలకు గుర్తింపు, పారితోషికంతో పాటు ఆడియో ఫంక్షన్‌లో పాడేందుకు ఆహ్వానిస్తామని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు.

కేటీఆర్: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నాం'

ఫొటో సోర్స్, TRS Party/ FB

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో, అనుమతితో మేం అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఉద్యమానికి మద్దతు తెలుపుతామని కూడా కేటీఆర్ అన్నారు.

"తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆంధ్రప్రదేశ్‌లో మన సోదరులు ఎప్పుడో 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అని సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఈ రోజు కేంద్రం వంద శాతం అమ్మే ప్రయత్నం చేస్తోంది" అని కేటీఆర్ అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న వారందరికీ తాము నైతికంగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎక్కడో విశాఖలో జరుగుతున్న ఉద్యమం మనకెందుకులే అనుకుంటే, రేపు మనదగ్గరకి వస్తారని చెప్పిన కేటీఆర్, తెలంగాణలో కూడా ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే వారు కూడా తమతో కలసి రావాలని కోరారు.

హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న కేటీఆర్, "ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నరు. రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతంటరు. ఎల్లుండి సింగరేణి అమ్ముతరు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు, వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండని అంటారు. అందుకే, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాం" అని అన్నారు.

చంద్రుడి మీద ఉమ్మడిగా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తాం: చైనా, రష్యాల ప్రకటన

ఫొటో సోర్స్, PA Media

చంద్రుడి ఉపరితలంపై లేదా కక్ష్యలో, వీలైతే రెండింట్లోనూ పరిశోధనకు అనువైన కేంద్రాన్ని నెలకొల్పేందుకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది.

ఈ కేంద్రం ఇతర దేశాలకు కూడా అందుబాటులో ఉంటుందని ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ ప్రకటించాయి.

అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టి 60 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో రష్యా ఈ ప్రకటన విడుదల చేసింది.

1961 ఏప్రిల్ 12న రష్యా కాస్మోనాట్ యూరి గగారిన్ తొలిసారిగా అంతరిక్షానికి ప్రయాణించారు.

కొత్తగా నిర్మించబోయే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ లూనార్ స్టేషన్‌లో చంద్రుడిపై అన్వేషణతో సహా వివిధ రకల శాస్త్రీయ పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుందని ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ తెలిపాయి.

"చైనా, రష్యా కూడా స్పేస్ సైన్స్‌లో తమ అనుభవం, పరిశోధన, అభివృద్ధి, స్పేస్ టెక్నాలజీ, పరికరాల సహాయంతో సంయుక్తంగా చంద్రమండలంపై అంతరిక్ష పరిశోధనా కేంద్ర నిర్మాణానికి రోడ్ మ్యాప్ తయారుచేస్తాయి" అని ఆ ప్రకటనలో తెలిపారు.

పరిశోధనా కేంద్రం ప్రణాళిక, రూపకల్పన, అభివృద్ధి, కార్యాచరణలను తయారుచేయడంలో ఇరు దేశాలూ కలిసి పని చేస్తాయని తెలిపారు.

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్,

చైనాకు చెందిన చాంగ్-ఎ-5 మూన్ మిషన్ గత డిసెంబరులో చంద్రుడి మీద నుంచి మట్టి నమూనాలు తీసుకువచ్చింది

చైనా స్పేస్ ప్రోగ్రాం నిపుణులు చెన్ లాన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ "ఇది ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్" అని అన్నారు.

"చైనాకు ఇది అతి పెద్ద అంతర్జాతీయ అంతరిక్ష సహకార ప్రాజెక్ట్. కాబట్టి ఇది చాలా ప్రముఖ్యతను సంతరించుకుంటుంది" అని ఆయన అన్నారు.

అంతరిక్ష పరిశోధనలో చైనా కొంత ఆలస్యంగా అడుగు పెట్టినప్పటికీ గత డిసెంబర్‌లో చాంగ్'ఎ-5 ప్రోబ్‌ను చంద్రుడి పైకి పంపి అక్కడి రాళ్లను, మట్టిని సేకరించడంలో సఫలమైంది. స్పేస్‌లో చైనా సామర్థ్యానికి ఇది ప్రతీకగా నిలిచింది.

అంతరిక్ష అన్వేషణలో తొలి అడుగు వేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన రష్యాను ఇటీవల కాలంలో అమెరికా, చైనాలు అధిగమిస్తున్నాయి.

గత ఏడాది అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రారంభమవ్వడంతో అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్‌లను పంపే విషయంలో రష్యా తన గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది.

2024 కల్లా చంద్రునిపై అడుగు పెట్టేందుకు తాము సిద్ధమని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా ఒక స్త్రీ, ఒక పురుషుడు చంద్రమండలంపై అడుగుపెడతారని ప్రకటించింది. 1972 తరువాత ఇదే చంద్రునిపై మానవులు మళ్లీ అడుగుపెట్టడం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)