యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి ‘పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా?

శాస్త్రవేత్తలు ఈ పరికరం త్రీడీ మోడల్ తయారు చేశారు

ఫొటో సోర్స్, PROF TONY FREETH / UC

ఫొటో క్యాప్షన్,

శాస్త్రవేత్తలు ఈ పరికరం త్రీడీ కంప్యూటర్ మోడల్ తయారు చేశారు

ప్రపంచంలోనే అత్యంత పురాతన కంప్యూటర్‌గా చెబుతున్న 2,000 ఏళ్ల నాటి ఒక పురాతన పరికరం అసలు ఎలా పనిచేసేదో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు దాని త్రీడీ మోడల్‌ను రీక్రియేట్ చేశారు.

రోమన్ కాలం నాటి నౌక శిథిలాల్లో 1901లో దీనిని కనుగొన్నప్పటి నుంచి యాంటీకితేరా మెకానిజం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

గ్రహణాలు, మిగతా ఖగోళ ఘటనల గురించి అంచనా వేయడానికి చేతితో తిప్పే ఈ పురాతన గ్రీకు పరికరాన్ని ఉపయోగించేవారని భావిస్తున్నారు.

కానీ ఈ పరికరంలో మూడో భాగం మాత్రమే మిగలడంతో, దీని పూర్తి రూపం ఎలా ఉండేదో, ఇది ఎలా పనిచేసేదో అని పరిశోధకులను ఆలోచనలో పడిపోయారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఈ పరికరంలో మూడో భాగం మాత్రమే దొరికింది

గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు

ఈ పరికరం వెనుక భాగం మెకానిజం గురించి ఇంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కనుగొన్నారు. కానీ దాని ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది.

ఇప్పుడు పరికరం త్రీడీ కంప్యూటర్ మోడల్ ఉపయోగించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు, చివరకు దీని గుట్టు విప్పారని భావిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ఈ పరికరం ముందు ప్యానల్ మొత్తాన్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు ఆధునిక మెటీరియల్స్ ఉపయోగించి యాంటీకిథెరా పూర్తి స్థాయి నమూనాను తయారు చేయాలని అనుకుంటున్నారు.

శుక్రవారం సైంటిఫిక్ రిపోర్ట్‌లో ప్రచురితమైన ఒక పేపర్ ఈ పరికరం గేరింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కొత్త చిత్రాలను బయటపెట్టింది. అందులో వాటి పూర్తి వివరాలు, క్లిష్టమైన భాగాలు కనిపిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్,

Antikythera mechanism is believed to be the world's oldest computer.

మొట్టమొదటి త్రీడీ మోడల్

"అద్భుతమైన ఈ పురాతన గ్రీకు మేధోశక్తి గుట్టు విప్పినపుడు, అది సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలను చూపించింది. ఈ మెకానిజంలో స్వయంగా చెక్కివున్న శాస్త్రీయ శాసనాల్లోని భౌతిక ఆధారాలకు అనుగుణంగా, దానిలోని వర్ణనలకు సరిపోలేలా ఉన్న మొట్టమొదటి మోడల్ మాదే" అని ఈ పేపర్ ప్రధాన రచయిత ప్రొఫెసర్ టోనీ ఫ్రీత్ అన్నారు.

ఈ మెకానిజంను ఒక ఖగోళ కాలిక్యులేటర్‌గా, ప్రపంచంలోని మొట్టమొదటి ఆనలాగ్ కంప్యూటర్‌గా కూడా వర్ణిస్తున్నారు.

ఇత్తడితో చేసిన ఈ పరికరంలో కొన్ని డజన్ల గేర్లు ఉన్నాయి. దీని వెనుక కవర్ మీద విశ్వం వర్ణన ఉంది. అందులో ఆ పరికరాన్ని తయారు చేసినప్పుడు వారికి తెలిసిన ఐదు గ్రహాల కదలికలను చూపిస్తున్నారు. కానీ 82 భాగాలే ఉన్న ఈ పరికరంలో మూడో వంతు మాత్రమే మిగిలింది.

అంటే, ఈ పరికరం ఎక్స్-రే డేటా పూర్తి చిత్రాన్ని, పురాతన గ్రీకు గణిత పద్ధతిని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక్కో భాగాన్నీ కలపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)