మియన్మార్‌లో ‘సరోంగ్ విప్లవం’: మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం

  • లారా ఒవెన్
  • బీబీసీ న్యూస్
మియన్మార్‌లో మహిళల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న మహిళలు బట్టలకు సంబంధించిన ఒక మూఢనమ్మకాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.

వారు అలా చేయడాన్ని మియన్మార్‌లో 'సరోగ్ విప్లవం' అని కూడా అంటున్నారు.

మగవాళ్లు ఎవరైనా సరోంగ్ కింద నుంచి వెళ్తే, వారు తమ మగతనం కోల్పోతారనే ఒక నమ్మకం మియన్మార్ అంతటా ఉంది.

ఆ దేశంలో మగతనాన్ని 'హపోన్' అంటారు. ఇక 'సరోంగ్' అంటే ఆగ్నేయాసియాలో మహిళలు నడుముకు చుట్టుకునే ఒక రంగురంగుల వస్త్రం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వీధుల్లో బ్యానర్లలా వేలాడదీసిన సరోంగ్‌‌లు

పోలీసులు, సైనికులు నివాస ప్రాంతాల్లోకి చొరబడి అరెస్టులు చేయకుండా వారిని అడ్డుకోడానికి మియన్మార్‌లోని చాలా పట్టణాల్లో మహిళలు తమ సరోంగ్‌లను దారుల్లో వేలాడదీశారు. కొన్ని ప్రాంతాల్లో వీటి ప్రభావం కూడా కనిపిస్తోంది.

బర్మాలో తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో వీధుల్లో ముందుకు వెళ్తున్న పోలీసులు తమకు అడ్డుగా ఉన్న సరోంగ్‌లను తీసేస్తూ కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, MAY THA ZIN LEI/BBC BURMESE

ఫొటో క్యాప్షన్,

సరోంగ్‌లతో మహిళల నిరసన ప్రదర్శనలు

మియన్మార్‌లో సైనిక పాలన ముగించాలని, తాము ఎన్నుకున్న ప్రభుత్వ నేతలను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

సైనిక పాలకులు నిర్బంధంలో ఉంచిన వారిలో ఆంగ్ సాన్ సూచీ కూడా ఉన్నారు. సైన్యం ఆమెను ఫిబ్రవరిలో గద్దెదించింది.

ఎన్నికల్లో మోసాలు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేసి, ఆర్మీ చీఫ్‌కు అధికారం అప్పగించామని ఆ దేశ సైన్యం చెబుతోంది. దేశంలో ఏడాదిపాటు అత్యవసర స్థితి విధించామని అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వీధుల్లో దారాలపై సరోంగ్‌లు వేలాడదీస్తున్న మహిళలు

నమ్మకమే ఆయుధం

'సరోంగ్ విప్లవం' కోసం తాము దేశంలో అందరికీ తెలిసిన నమ్మకాలపై ఆధారపడ్డామని మియన్మార్ మహిళలు చెప్పారు.

"నేను ఈ మూఢ నమ్మకంతోపాటే పెరిగాను. మహిళలు చుట్టుకునే సరోంగ్‌ను అపవిత్రంగా భావిస్తారు. దానిని నాపైన పెడితే, అది నా శక్తిని తగ్గించేస్తుందట" అని హుతున్ లిన్ అనే ఒక విద్యార్థి చెప్పారు.

వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న మహిళలు, ఇలాంటి మూఢనమ్మకాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని బర్మా రచయిత్రి మిమి ఆయ్ అన్నారు. ఆమె ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు.

"నిజానికి, స్త్రీలు అపవిత్రం కాబట్టి, సరోంగ్ కింది నుంచి వెళ్లే పురుషులు తమ మగతనం కోల్పోతాడనేది దీనికి అర్థం కాదు. ఈ నమ్మకం వెనుక వేరే భావన ఉంది. మహిళలు ఆకర్షణీయంగా, వశపరుచుకునేలా ఉంటారని, అలా బలహీనులైన పురుషులను వారు నాశనం చేస్తారనేది ఇది చెబుతుంది" అన్నారు మిమి.

ఫొటో సోర్స్, MAY THA ZIN LEI/BBC BURMESE

మియన్మార్ సంప్రదాయం ప్రకారం 'సరోంగ్‌'ను అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారని ఆమె చెప్పారు.

‘‘ఒకప్పుడు, యుద్ధానికి వెళ్లే మగవాళ్లు తమ తల్లి సరోంగ్‌ నుంచి ఒక చిన్న ముక్కను తమతో తీసుకెళ్లేవారు. ఇక, 1988 తిరుగుబాటు సమయంలో నిరసనకారులు తమ తల్లుల సరోంగ్‌ను తలగుడ్డల్లా కూడా కట్టుకున్నారు" అని మిమి తెలిపారు.

ఇప్పుడు, మియన్మార్‌లో నిరసన ప్రదర్శనల్లో ఉన్న మహిళలు బహిరంగ ప్రాంతాల్లో తమ 'సరోంగ్ శక్తి'ని ఉపయోగిస్తున్నారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ సరోంగ్‌లను అక్కడక్కడా దారాలపై వేలాడదీశారు. దీనిని విప్లవంలో ఒక భాగంగా చెప్పారు.

ఫొటో సోర్స్, THINZAR SHUNLEI

ఫొటో క్యాప్షన్,

థిన్ జార్ షున్‌లీ దేశంలోని సైనికుల కంటే సరోంగ్ ఎక్కువ రక్షణ అందించింది అని చెప్పారు

మియన్మార్‌లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న థిన్‌జార్ షున్‌లీ ఒక సరోంగ్ ఫొటోను ఆన్‌లైన్లో పోస్ట్ చేసి "నా సరోంగ్ నాకు మియన్మార్ సైన్యం కంటే ఎక్కువ రక్షణను అందిస్తోంది" అని రాశారు.

నిరసన ప్రదర్శనలు చేస్తున్న కొంతమంది మహిళలు, జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ ఫొటోలను శానిటరీ ప్యాడ్స్ మీద అతికించారు. సైన్యం తమ జనరల్ ఫొటో మీద కాలు పెట్టరని, వాళ్లు ముందుకు రాకుండా ఉంటారనే అలా చేశామని చెప్పారు.

తున్ లిన్ జా అనే ఒక విద్యార్థి కూడా సరోంగ్‌ను తన తలకు కట్టుకుని ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, MAY THA ZIN LEI/BBC BURMESE

ఫొటో క్యాప్షన్,

తున్ లిన్ జా సరోంగ్‌ను తలకు చుట్టుకుని మహిళలకు సంఘీభావం తెలిపారు

"మహిళల్లో మరింత శక్తిని ఇవ్వడానికి, నిరసనలు చేపట్టిన సాహస మహిళలకు సంఘీభావం ప్రకటించడానికి ఇది ఒక పద్ధతి" అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వివరాల ప్రకారం మియన్మార్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో భద్రతా బలగాలు ఇప్పటివరకూ 60 మందికి పైగా కాల్చి చంపాయి. వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, HTUN LYNN ZAW

ఫొటో క్యాప్షన్,

మూడు వేళ్లతో ఇలా అనడాన్ని మియన్మార్‌లో నిరసన ప్రదర్శనల చిహ్నంగా చూస్తారు

మియన్మార్ సైన్యం హింసాత్మక చర్యలను చాలా దేశాలు ఖండించాయి. కానీ, తిరుగుబాటు చేసిన సైనిక పాలకులు వాటిని అసలు పట్టించుకోవడం లేదు.

కానీ, నిరసన ప్రదర్శనలు చేస్తున్న మహిళలు మాత్రం సైనిక పాలనను ధిక్కరించడానికి తమ బట్టలను ఉపయోగిస్తున్నారు.

"మా సరోంగ్, మా బ్యానర్, మా విజయం" అని నినాదాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)