చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం

తైవాన్‌లో ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తారు
ఫొటో క్యాప్షన్,

తైవాన్‌లో ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తారు

పైనాపిల్‌ పండ్ల కారణంగా చైనా, తైవాన్ల మధ్య తాజాగా వివాదం మొదలైంది.

గత నెలలో తైవాన్ నుంచి పైనాపిల్ దిగుమతిని చైనా నిలిపివేసింది. ఈ పండ్లపై హానికారక క్రిములు ఉన్నట్లు గుర్తించామని, అవి తమ దేశంలో పంటను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ దిగుమతిని నిషేధించింది.

ఈ నిషేధంపై తైవాన్ అధికారులు మండిపడుతున్నారు. క్రిములు కారణం కాదని, తమ దేశంపై రాజకీయ ఒత్తిడిని పెంచడానికే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

చైనా ఇప్పటికీ తైవాన్‌ను తమ దేశంలోని భాగంగానే పరిగణిస్తుంది.

అయితే, చైనా నిషేధించిన వెంటనే తైవాన్ ప్రభుత్వం విదేశాల్లో కొత్త కస్టమర్లను వెతుక్కుంది. చైనా ప్రజలు తినడానికి నోచుకోని పండ్లను కొని తినమని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది.

"తైవాన్ పైనాపిల్స్ ఫైటర్ జెట్ల కన్నా బలమైనవి. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఈ పండ్లలోని రుచిని తగ్గించలేవు" అని తైవాన్ ఉపాధ్యక్షుడు లెయ్ చింగ్-టె ట్విట్టర్‌లో తెలిపారు.

తైవాన్‌లోని కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఆ దేశంలో ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తారు. గత ఏడాది ఇందులో 10 శాతం కన్నా ఎక్కువే ఎగుమతి చేశారు. ఈ ఎగుమతుల్లో అధిక భాగం చైనాకే వెళతాయి.

ప్రస్తుతం చైనా ఈ పండ్ల దిగుమతిని నిలిపివేయడంతో తైవాన్‌లో పండ్ల లభ్యత పెరిగి ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఫ్రీడం పైనాపిల్స్

తైవాన్ ప్రజలు పైనాపిల్ పండ్లను ఎక్కువగా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ సోషల్ మీడియాలో "పైనాపిల్ ఛాలెంజ్"ను ప్రారంభించారు.

"ప్రపంచవ్యాప్తంగా ఒకేలాంటి ఆలోచనలు ఉన్న స్నేహితులంతా తైవాన్‌కు అండగా నిలబడాలని, ఫ్రీడంపైనాపిల్ ప్రచారానికి మద్దతు ఇవ్వాలని" తైవాన్ విదేశాంగ మంత్రి జోసఫ్ వూ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.

తైవాన్‌లో ఉన్న అమెరికా, కెనడా రాయబార కార్యాలయాలు ఈ పిలుపును అంగీకరించాయి.

తైవాన్‌లో ఉన్న 'ది అమెరికన్ ఇన్స్టిట్యూట్' తమ ఫేస్బుక్ పేజీలో పలు పైనాపిల్ పండ్ల ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిల్లో ఆ సంస్థ డైరెక్టర్ బ్రెంట్ క్రిస్టెన్సెన్ టేబుల్ మీద మూడు పండ్లు పెట్టుకుని ఉన్న ఫొటో కూడా ఒకటి.

తైపైలోని కెనడా వాణిజ్య కార్యాలయం కూడా పైనాపిల్ పిజ్జా ఫొటో పోస్ట్ చెయ్యడంతో పాటూ ఈ పిజ్జా ఐడియా హవాయిది కాదని, తమ సొంత ఆలోచన అని కూడా గుర్తు చేసింది.

"మాకు పైనాపిల్ పిజ్జా అంటే ఇష్టం, ముఖ్యంగా తైవాన్ పైనాపిల్స్‌తో చేసినది ఇష్టం" అని ఆ ఫొటో కింద రాశారు.

అయితే, అనేకమంది జపాన్ వినియోగదారులు మా పండ్లను కొంటామని ముందుకొస్తున్నారని, సుమారు 5,000 టన్నుల పండ్లకు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని సాయ్ ఇంగ్-వెన్ తెలిపారు.

ట్విట్టర్‌లో కూడా పలువురు జపనీస్ తైవాన్ పండ్లను కొనడానికి ఆసక్తి చూపారు.

తైవాన్ ప్రభుత్వం చేపట్టిన ప్రచారం కారణంగా అతి కొద్ది రోజుల్లోనే చైనాకు వెళ్లవలసిన పండ్లకు ఇతరత్రా మార్గాలలో గిరాకీ వచ్చేసింది.

"జపాన్‌లాంటి మార్కెట్ల కన్నా చైనాలో తనిఖీలు సులభంగా, వేగంగా జరుగుతాయి. అందుకే మేము ఎక్కువగా ఈ పండ్లను చైనాకు ఎగుమతి చేస్తాం. అయితే, ఇప్పుడు ఈ ధోరణి మారుస్తూ.. వ్యవసాయ రంగాన్ని విస్తృత పరుచుకుంటూ, ఎగుమతులను బహుముఖం చేయాల్సిన అవసరం ఉందని" తైవాన్‌లో 'పైనాపిల్ ప్రిన్స్'గా పేరు పొందిన యాంగ్ యూఫాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

తైవాన్‌లో 'పైనాపిల్ ప్రిన్స్'గా పేరు పొందిన యాంగ్ యూఫాన్

విదెశీ తెగుళ్లు, వ్యాధులు

తైవాన్ నుంచీ వస్తున్న పైనాపిల్ పండ్లలో తరచూ తెగుళ్లు కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా దిగుమతిని నిలిపివేశామని చైనా వివరించింది.

అయితే, గత ఏడాదిగా చైనా తమ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి అస్పష్టమైన, అపారదర్శక వాణిజ్య విధానాలను అమలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ విషయంలో ముఖ్యంగా ఆస్ట్రేలియా వ్యవసాయ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలకు ప్రతిగా.. చైనా అనధికారికమైన, అసమంజసమైన కొత్త విధానాలను ప్రవేశపెట్టి తమ ఉత్పత్తులపై నిషేధం విధించే అవకాశం ఉందని వారు అంటున్నారు.

తైవాన్ పైనాపిల్స్‌పై తెగుళ్లు ఉంటున్నాయన్న ఆరోపణలను ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ఖండించారు. దిగుమతి చేసుకునే పండ్లలో 99.97 శాతం పండ్లు అన్ని రకాల తనిఖీలను దాటుకునే మార్కెట్లోకి వెళతాయని స్పష్టం చేశారు.

బయోసెక్యూరిటీ అనేది రెండంచుల కత్తిలాంటిది. ఉద్దేశపూర్వకంగా తెగుళ్లను ప్రవేశపెడితే ఒక దేశానికి అవి నిజమైన ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు.

అయితే, వాణిజ్య వివాదాలలో బయోసెక్యూరిటీని ఆయుధంగా ఉపయోగించిన సుదీర్ఘ చరిత్ర ఉంది అని నిపుణులు అంటున్నారు.

"విదేశీ తెగుళ్ల పట్ల నిజమైన ఆందోళన ఉంది. స్వదేశాల్లో వాటిని ఎదుర్కొనే రక్షణ ఏర్పాట్లు అస్సలు లేకపోవచ్చు. అయితే, శానిటరీ, పైటోశానిటరీ (ఎస్‌పీఎస్) లాంటి పరిమితులను వాడుకొని కూడా విదేశీ వాణిజ్యాన్ని నిషేధించవచ్చు" అని ఆసియా వాణిజ్య కేంద్రానికి చెందిన డెబొరహ్ ఎల్మ్స్ తెలిపారు.

చైనాలో 1,642 ఎస్‌పీఎస్ పరిమితులు ఉన్నాయని 'ది యునైటెడ్ నేషన్స్ కాంఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్' (యూఎన్‌సీటీఏడీ) డాటాబేస్ చెబుతోంది. ఇండియా, అమెరికా, పనామా, పెరూలలో తప్ప ఇంతకన్న ఎక్కువ పరిమితులు ఇంకే ఏదేశంలోనూ లేవని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)