పాకిస్తాన్‌కు ఉన్నట్లుండి విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎలా పెరిగింది?
- తన్వీర్ మాలిక్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు చెందిన మాలిక్ అల్లా యార్ ఖాన్ జపాన్‌లో ఉద్యోగం చేస్తూ హవాలా, హండీ ద్వారా స్వదేశంలోని తన కుటుంబానికి డబ్బు పంపేవారు.
అయితే, ఇప్పుడు ఖాన్ ఆ పద్ధతిలో డబ్బు పంపడం మానేశారు. నేరుగా బ్యాంకుల ద్వారా తన కుటుంబానికి డబ్బు పంపుతున్నారు. ఖాన్ జపాన్‌లో ఫైనాన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్.
పాకిస్తాన్లో బ్యాంకింగ్ వ్యవస్థ అందిస్తున్న సౌకర్యాల కారణంగా స్వదేశంలోని వారికి డబ్బులు పంపడం సులభమవుతోందని ఆయన చెప్పారు.
తనకు వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్లో హవాలా, హండీ పద్ధతి పూర్తిగా అంతమైపోలేదు. కానీ, జపాన్‌లో నివసిస్తున్న పాకిస్తానీయులు అనేకమంది ఇప్పుడు చట్టబద్ధమైన మార్గాల ద్వారానే పాకిస్తాన్‌కు డబ్బు పంపుతున్నారని ఖాన్ తెలిపారు.
నార్వే రాజధాని ఓస్లోలోని ఒక కిరాణా దుకాణంలో పని చేస్తున్న కన్వల్ అజీం కూడా పాకిస్తాన్‌లోని తన కుటుంబానికి హవాలా, హండీ ద్వారానే డబ్బు పంపించేవారు.
"ఇలా డబ్బు పంపే ఏర్పాట్లు చేసేవాళ్లు ఇక్కడ కొందరు ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా డబ్బు పంపే పని తగ్గింది. బ్యాంకుల ద్వారానే ఎక్కువమంది డబ్బు పంపిస్తున్నారు. నేనూ కూడా బ్యాంకు ద్వారానే పంపిస్తున్నాను" అని కన్వల్ తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ఆజం షకీల్ కూడా ఇదే మాట అంటున్నారు. 99 శాతం ప్రజలు చట్టబద్ధమైన మార్గాల ద్వాగానే పాకిస్తాన్‌కు డబ్బు పంపుతున్నారని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ కంటే అమెరికా చట్టాలు మరింత కఠినంగా ఉంటాయని, అక్రమంగా డబ్బు పంపాలనే ఆలోచన కూడా రానివ్వవని షకీల్ అన్నారు.
ఇలా విదేశాల నుంచీ స్వదేశానికి పంపే డబ్బును 'చెల్లింపులు' (రెమిటెన్స్) అంటారు. ఒక దేశ ఆదాయ ఖాతాలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
పాకిస్తాన్లో ఈ రెమిటెన్స్‌లు గత కొద్ది నెలలుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో, ప్రతి నెలా రెండు బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రెమిటెన్స్ రూపంలో పాకిస్తాన్‌కు చేరింది.
పాకిస్తాన్లో నివసిస్తున్న హుమా ముజీబ్‌కు తన భర్త జర్మనీ నుంచీ డబ్బు పంపిస్తుంటారు. ఆమె ఈ డబ్బును బ్యాంకు ద్వారా అందుకుంటున్నారు.
ఇలా బ్యాంకింగ్ విధానం ద్వారా డబ్బు అందుకోవడం తృప్తి కలిగిస్తోందని హుమా తెలిపారు. ఈ విధానంలో తనకు ఎలాంటి సమస్యలూ లేవని ఆమె చెప్పారు.
ఆమెకు ఎప్పుడైనా హవాలా, హండీ ద్వారా డబ్బు వచ్చిందా అని అడిగితే "లేదని" చెప్పారు.
హవాలా, హండీ ద్వారా డబ్బు పంపే విధానం సన్నగిల్లడం, బ్యాంకింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేయడం వల్లనే పాకిస్తాన్ ఆదాయ ఖాతాలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోందని పాకిస్తాన్ ఆర్థిక, వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.
దీనికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కచ్చితమైన విధానాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫైనాన్షియన్ టాస్క్ ఫోర్స్ షరతులను అందుకునే విధంగా పాకిస్తాన్లో ప్రభుత్వ విధానాలను రూపొందించారు. వీటిని కచ్చితంగా అమలు చేయడం ద్వారా గ్రే లిస్ట్‌లోంచి బయటపడాలన్నదే పాకిస్తాన్ ప్రయత్నం.
ఫొటో సోర్స్, SANA TAUFIQ
సనా తౌఫిక్
పాకిస్తాన్ విదేశీ ఆదాయంలో పెరుగుదల ఎంత?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందే చెల్లింపుల పెరుగుదల మొదలైందని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో కూడా రెండు బిలియన్ డాలర్లు పాకిస్తాన్ ఖాతాలో జమ అయ్యాయని ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్‌కు చెందిన ఆర్థిక వ్యవహారాల విశ్లేషకులు సనా తౌఫిక్ తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గణాంకాల ప్రకారం గత తొమ్మిది నెలల నుంచీ చూస్తే ఫిబ్రవరి 2021లో రెమిటెన్స్ అత్యధికంగా 2.266 బిలియన్ డాలర్లు నమోదు అయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి చెల్లింపులతో పోల్చి చూస్తే ఇవి 24.2 శాతం ఎక్కువ.
2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు మొత్తం 18.7 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ జమ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెల్లింపులు 24.1 శాతం పెరిగాయి.
జూలై-ఫిబ్రవరి మధ్యలో రెమిటెన్స్‌లో ఎక్కువ భాగం సౌదీ అరేబియా (5.0 బిలియన్ డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (3.9 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.5 బిలియన్ డాలర్లు), అమెరికా (1.6 బిలియన్ డాలర్లు) నుంచీ వచ్చాయి.
కచ్చితమైన ప్రభుత్వ విధానాలు
పాకిస్తాన్ ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ పాటిస్తున్న విధానాల వలనే నగదు జమలు పెరిగాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
కరోనా కారణంగా విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, మహమ్మారిని అడ్డుకోవడానికి చేసిన వైద్యపరమైన ఖర్చులు, సంక్షేమ నిధుల బదిలీ, వినిమయ మార్కెట్ స్థిరీకరణ.. ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలలో భాగంగా ఉన్నాయి.
చట్టవిరుద్ధమైన విధానాలపై వేటు, చట్టబద్ధమైన విధానాల ప్రోత్సాహం కూడా ఇందుకు కారణం అని సనా తౌఫిక్ వివరించారు.
కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని చోట్లా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వినోదాలకు, విలాసాలకు పెట్టే ఖర్చు తగ్గింది. అదంతా కూడా విదేశాల్లో నివసిస్తున్నవారు పాకిస్తాన్‌లోని తమ కుటుంబాలకు పంపారని, చెల్లింపుల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం అని తౌఫిక్ తెలిపారు.
"చెల్లింపుల విషయంలో ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ విధానాలు పెను మార్పుకు దోహదపడ్డాయి. ఫైనాన్షియల్ మానిటరింగ్ చురుకుగా ఉండడం, లావాదేవీలను పర్యవేక్షించడం ప్రజలను చట్టబద్ధమైన జవాబుదారీతనానికి సిద్ధమయ్యేలా చేసింది. అందుకే వారంతా బ్యాంకింగ్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు" అని పాకిస్తాన్ ఎక్స్ఛేంజ్ కంపెనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్ పార్చా తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏఎఫ్టీ) షరతులు
ఎఫ్ఏఎఫ్టీ లక్ష్యాలను అందుకోవడానికే పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ విధానాల్లో మార్పులు తెచ్చిందని సనా తౌఫిక్ అభిప్రాయపడ్డారు.
"ఇది మంచి పద్ధతే, అక్రమ మార్గాల ద్వారా పాకిస్తాన్‌ను డబ్బు చేరే విధానంపై వేటు పడింది. ఎఫ్ఏఎఫ్టీ షరతుల్లో మనీలాండరింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కూడా ఒకటి. చెల్లింపులను చట్టబద్ధమైన మార్గాల్లోకి మళ్లించడానికి ఇది ఉపయోగపడింది. 40-50 ఏళ్ల క్రితం హవాలా, హండీ ద్వారా డబ్బు పంపించడం చట్టవిరుద్ధం కాదు. కానీ గత పాతికేళ్లల్లో పరిస్థితులు మారాయి. ఈ పద్ధతిపై నియంత్రణ పెరిగింది" అని తౌఫిక్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
చెల్లింపుల ఖాతా పెరుగుదల కొనసాగే అవకాశాలున్నాయా?
రంజాన్, ఈద్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో నగదు జమ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని సనా తౌఫిక్ అన్నారు.
ఇప్పటికే 18 బిలియన్ డాలర్ల కన్నా అధికంగా రెమిటెన్స్ వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాదిలో నగదు రాబడి 28 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు.
"ఇది దేశ కరెంట్ అకౌంటుకు ఎంతో మేలు చేస్తుంది. ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటును పూడ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు పెరుగుతాయి. అందువల్ల దిగుమతి చేసుకునే పెట్రోల్ ధరలు అధికం అవుతాయి. ఈ ధరలను కొంతవరకు నియంత్రించడానికి విదేశీ ఖాతాలో వస్తున్న పెరుగుదల ఉపయోగపడుతుంది" అని సనా తౌఫిల్ వివరించారు.
చెల్లింపుల పెరుగుదల కొనసాగుతుందని జాఫర్ పార్చా కూడా ఆశిస్తున్నారు. చట్టబద్ధంగా వచ్చే ప్రతీ రూపాయి రికార్డు అవుతుంది. ఇది దేశ ఆర్థిక పరిస్థితికి మేలు చేస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- ఎమ్మెల్సీ ఎన్నికలు: పట్టభద్రుల, టీచర్ల ఓట్లు కూడా వేల సంఖ్యలో చెల్లకపోవటానికి కారణాలేంటి... అసలు ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారు?
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)