పాకిస్తాన్: దిశ కేసు తరహాలో ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించిన అత్యాచారం కేసు... రేపిస్టులకు ఉరిశిక్ష

లాహోర్ జిల్లా జైలులో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు విచారణ సాగింది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

లాహోర్ జిల్లా జైలులో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు విచారణ సాగింది

అత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.

అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్తులు హైవేలో రోడ్డు మీద ఆగిపోయిన కారులో ఒక 'పాకిస్తాన్-ఫ్రెంచ్' మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చిక్కుకుపోయి ఉండడం గమనించారు. పెట్రోల్ అయిపోవడంతో కారు లాహోర్ సమీపంలో నిలిచిపోయింది.

అది గమనించిన వీరిద్దరూ కారులోకి చొరబడి వారిని దోచుకోవడమే కాక పిల్లల ముందే ఆ మహిళపై అత్యాచారం జరిపారు.

ఈ ఘటనపై ఒక పోలీసు అధికారి, ఆమె అంత పొద్దుపోయాక బయటకు వెళ్లాల్సిన అవసరమేంటని వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

వారిద్దరూ సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు లాహోర్‌లోని ప్రత్యేక కోర్టు శనివారం నిర్థరించింది.

ఈ తీర్పుపై వాళ్లిద్దరూ పైకోర్టులో అప్పీల్ చేసుకుంటారని అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా తరపు న్యాయవాది ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

మహిళలకు మరింత భద్రత కల్పించాలంటూ పాకిస్తాన్‌లో వెల్లువెత్తిన నిరసనలు

దాడి ఎప్పుడు, ఎలా జరిగింది...

2020 సెప్టెంబర్ 9న ఆ మహిళ తన పిల్లలు ఇద్దరితో కలిసి లాహోర్ వైపు కారులో ప్రయణిస్తుండగా, మధ్యలో పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోయింది.

ఆమె వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. హైవే అత్యవసర నంబర్‌కు కాల్ చెయ్యమని సలహా ఇచ్చి, వాళ్లు కూడా ఆమె ఉన్నచోటుకు బయలుదేరారు.

ఆ మహిళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 30 ఏళ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి లోపలికి చొరబడి డబ్బు, నగలు దోచుకున్నారు. ఆమెను పక్కనే ఉన్న మైదానంలోకి లాక్కెళ్ళి పిల్లల ముందే రేప్ చేసి పారిపోయారు.

దాడి చేసిన వారి గుర్తులు చూచాయిగా చెప్పగలిగినప్పటికీ ఆమె మానసికంగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఆ మర్నాడు, లాహోర్‌కు చెందిన ఒక అత్యున్నత పోలీసు అధికారి ఉమర్ షేక్ మీడియా ముందుకు వచ్చి ఇందులో ఆమె తప్పు కూడా ఉందన్నట్లుగా మాట్లాడారు.

పిల్లలతో కలిసి ఒంటరిగా వెళ్తున్నప్పుడు రద్దీగా ఉండే మార్గంలో ఎందుకు వెళ్లలేదు, పెట్రోలు ఉందో లేదో ఎందుకు చూసుకోలేదని ఆ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

పలు టీవీ చానళ్లలో ఆయన ఇదే అంశాన్ని మళ్లీ మళ్లీ చెబుతూ కనిపించారు.

అంతేకాకుండా, ఆ ఫ్రెంచి మహిళ పాకిస్తాన్ కూడా ఫ్రాన్స్ అంత సురక్షితమనే అభిప్రాయంతో ఉన్నారేమోనని కూడా అన్నారు. దాంతో, సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబికింది. బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆ పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆమెకు న్యాయం జరగాలని, పాకిస్తాన్‌లో మహిళలకు మెరుగైన రక్షణ కల్పించాంటూ వేలాదిమంది నిరసనలు చేపట్టారు.

డిసెంబర్‌లో పాకిస్తాన్‌లో అత్యాచారానికి సంబంధించిన కొత్త చట్టాలను అమలులోకి తీసుకు వచ్చారు. వేగవంతమైన విచారణ, కఠినమైన శిక్షలను ఈ చట్టాల్లో చేర్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)