కరోనావైరస్‌ను సమర్థంగా కట్టడి చేసిన దేశాల నుంచి ఏం నేర్చుకోవచ్చు

  • జేన్ కార్బిన్
  • బీబీసీ పనోరమ
కోవిడ్‌ని అదుపులో పెట్టిన దేశాల నుంచి ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది ప్రజలు వైరస్ బారిన పడగా 2 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.

గత ఏడాదంతా నేను కోవిడ్ వార్తలు రిపోర్ట్ చేశాను. వైరస్‌ను అరికట్టేందుకు నాలుగు ఖండాలలో ఉన్న ప్రపంచ నాయకులు, సీనియర్ వైద్య అధికారులు అమలు చేసిన విధానాలు, వారి ప్రాధాన్యాలను తెలుసుకోవడమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాను.

వైరస్‌ని నియంత్రించి మరణాలను అదుపులో పెట్టేందుకు ఈ దేశాల్లో ప్రధానంగా నాలుగు అంశాల పై దృష్టి సారించారని అర్థమైంది.

* సరైన సమయంలో సరిహద్దు నియంత్రణ చర్యలు, రాకపోకలపై పర్యవేక్షణ

* కోవిడ్ సోకిందని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయడం.. ట్రాకింగ్, ట్రేసింగ్

* క్వారంటైన్‌లో ఉన్న వారి సంక్షేమం, ఆరోగ్య బాధ్యతలు

* ఉత్తమ నాయకత్వం, సమయానికి తగిన సమాచారాన్ని ప్రజలకు అందివ్వడం

అయితే, ఇందులో ఏ ఒక్క వ్యూహమూ ఇదే సరైన పద్దతి అని గట్టిగా చెప్పేందుకు లేదు. కాకపోతే, ప్రపంచంలో చాలా చోట్ల ప్రభావవంతంగా పని చేసిన కొన్ని విధానాలను ఇక్కడ ప్రస్తావించాం.

వీటినన్నిటినీ కలిపితే "పాండమిక్ ప్లే బుక్"‌కి బ్లూ ప్రింట్ దొరుకుతుంది. దీంతో భవిష్యత్తులో మహమ్మారులు కానీ, అంటురోగాలు కానీ ప్రబలినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

సంసిద్ధత

స్టాన్లీ పార్క్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉంటారు. ఆయన కూతురు జూ ఇయోన్‌ని ఎయిర్‌పోర్టు నుంచి తేవాడానికి వెళ్లినప్పుడు ఆయన ఆమెను కౌగలించుకుని ఆహ్వానం పలకడానికి బదులు మాస్కు, శానిటైజర్‌తో స్వాగతం పలికారు.

అయితే, ఇదేమి వారికి మొదటిసారి కాదు. ఆయనకు తూర్పు ఆసియాలో 2015లో మెర్స్ అంటువ్యాధి ప్రబలినప్పుడు సృష్టించిన బీభత్సం ఇంకా గుర్తుంది.

మెర్స్ సృష్టించిన విలయం నుంచి ఆ దేశం పాఠాలు నేర్చుకుంది.

దేశంలో అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తినప్పుడు ఉండాల్సిన సంసిద్ధత, స్పందించాల్సిన తీరు గురించి దక్షిణ కొరియా ప్రభుత్వం 48 సంస్కరణలను అమలు చేసింది. అవి ఇప్పుడు పనికొచ్చాయి.

కరోనావైరస్ ప్రబలినప్పుడు వ్యాపారాలు మూసివేయకుండా, ప్రజలను ఇళ్లలోనే ఉండమని ఆదేశించకుండానే అధికారులు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగారంటే దానికి కారణం ఆనాటి అనుభవాలే.

BBC
I didn't even go to the garden, just in case
Joo Yeon Park

అట్లాంటా నుంచి వచ్చిన జూ ఇయోన్ కచ్చితంగా ఇంటి దగ్గరే 2 వారాల క్వారంటైన్ పాటించారు.

ఆమె కదలికలను పర్యవేక్షించే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆమెకు అధికారుల నుంచి 6 చెక్ అప్ కాల్స్ వచ్చాయి.

కనీసం ఇంటి ముందున్న తోటలోకి కూడా వెళ్లకుండా కఠినమైన క్వారంటైన్ పాటించారు.

"వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదటి దశ నుంచి మళ్లీమళ్లీ జరిగిందే జరగకుండా మేము సంపూర్ణమైన నివారణ చర్యలను అమలు చేశాం. చరిత్ర పునరావృతం కాకుండా చూసుకున్నాం" అని దక్షిణ కొరియా ప్రధాన మంత్రి చంగ్ సై కియన్ చెప్పారు.

టెస్ట్, ట్రాక్ అండ్ ట్రేస్

ప్రస్తుతానికి పరిస్థితి చాలా సవాళ్లతో కూడుకుని ఉంది. నేను పరీక్షిస్తున్న రోగులకు కరోనావైరస్ ఉందో లేదో తెలియదు. కొన్ని వందల కేసులును మనం కనిపెట్టలేకపోతూ ఉండి ఉండవచ్చు" అని ఇంగ్లండ్‌కి చెందిన డాక్టర్ డేవిడ్ హోడ్జ్స్ నిరుడు మార్చిలో చెప్పారు.

మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించక ముందు కేసుల సంఖ్య పెరగడం, వనరులు తగినంత లేకపోవడంతో , అప్పటి వరకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్న యూకే ప్రభుత్వం కమ్యూనిటీలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ఆపేసింది.

అప్పటికి ఆ దేశ వైద్య వ్యవస్థకి హాస్పిటళ్లలో మాత్రమే పరీక్ష చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మే నెలలో అధికారికంగా ప్రభుత్వం టెస్ట్ అండ్ ట్రేస్ కార్యక్రమాన్ని అమలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దక్షిణ కొరియాలో కొన్ని ఆసుపత్రులు కోవిడ్ పరీక్షలు చేయడం నుంచి చికిత్సలు చేసే వరకు నిర్వహించే బాధ్యతలు తీసుకున్నాయి.

తూర్పు ఆసియాలో చాలా దేశాలు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడాన్ని జనవరి నుంచే ప్రారంభించాయి.

దక్షిణ కొరియాలో కొన్ని ఆసుపత్రులు కోవిడ్ పరీక్షలు చేయడం నుంచి చికిత్సల వరకు బాధ్యతలు తీసుకున్నాయి.

ఇక్కడ ప్రజలు పరీక్ష కోసం ఆసుపత్రి భవనంలోకి కూడా ప్రవేశించనక్కర లేకుండా కాస్త దూరంగానే ఒక ప్రత్యేక బూత్‌లో పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఈ పరీక్షల ఫలితాలు కూడా 4 నుంచి 5 గంటల్లో వచ్చేస్తాయి. యుకే‌లో అయితే, ఫలితాలు రావడానికి ఒక రోజు కంటే ఎక్కువే పట్టేది.

ఆసుపత్రిలో పరీక్ష చేసిన తర్వాత అనుమానం ఉన్న ప్రతి కేసు గురించి ట్రాక్ అండ్ ట్రేస్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేది.

ఈ బృందానికి వారి క్రెడిట్ కార్డు, మొబైల్ ఫోను డేటాతో కూడా యాక్సెస్ ఉండేది.

జిల్లా అంతటా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించి, వీధుల్లో తిరుగుతున్నవారిని పర్యవేక్షించడానికి కూడా బృందాలను పంపేది.

ఈ మొత్తం పరిస్థితి గురించి దక్షిణ కొరియా ప్రధాన మంత్రి వ్యక్తిగత శ్రద్ధ చూపి పర్యవేక్షించారు. దేశంలో ఒక్క కేసూ నమోదు కాకముందే మూడు 'టి' లు టెస్ట్, ట్రాక్, ట్రేస్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

"ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి మేం మంచి ఫలితాలను సాధించాం" అని సై కియన్ చెప్పారు.

5.2 కోట్ల జనాభా గల దక్షిణ కొరియాలో 1,693 మంది కరోనా కారణంగా చనిపోయారు.

క్వారంటైన్ మద్దతు

"ప్రజలను ఇంటి వద్దనే ఉండమని ఆదేశించడం ద్వారా మేము కోవిడ్‌ని చాలా వరకు నియంత్రించగలిగాం" అని కేరళలోని కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగి ఉష కుమారి చెప్పారు.

ఆమె ఇంటి దగ్గరలో ఉండే వారంతా ఇంటిలోపలే ఉండేలా చూసుకునే బాధ్యతను ఆమె నిర్వహించారు.

ఆమె వారికి కావాల్సిన సరకులు, మందులు, అవసరమైన వస్తువులు తెచ్చి ఇచ్చేవారు.

Usha Kumari
BBC
Making people stay at home is the main reason we've been able to contain Covid
Usha Kumari
Community health worker

ఐసోలేషన్‌లో ఉండేవారికి మద్దతివ్వడం అంతటితో ఆగలేదు. సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఇంట్లో కానీ, ఆసుపత్రిలో కానీ ఐసోలేషన్‌లో ఉన్న వారికి రోజుకు 600 మందికి ఉచిత భోజనాలు కూడా అందచేశారు.

మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రజల మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపించింది.

కొంత మందికి ఆర్థిక సహాయం కూడా అందచేశారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి నగదు సహాయం అందించే పథకం యూకేలో ప్రవేశపెట్టారు.

యూకెలో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సిన వారిలో 20 శాతం మంది కంటే తక్కువ మంది పూర్తిగా క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సైంటిఫిక్ అడ్వైజ్ గ్రూప్ ఫర్ ఎమెర్జెన్సీస్ సెప్టెంబరులో విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

అయితే, సెల్ఫ్ ఐసోలేషన్ అయిన వారిలో ఎంత మందికి డబ్బులు లభించాయి?

ఈ పథకానికి 40 లక్షల మంది అర్హులని యూకె ప్రభుత్వం ప్రకటించింది.

కేరళలో నిఫా వైరస్ ప్రబలినప్పుడు మూడు పాఠాలను నేర్చుకున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు.

సొంతంగా ఐసోలేషన్‌లో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో పెట్టి ఆసుపత్రులు నిండిపోకుండా చూసుకోవడంపై వారు దృష్టి పెట్టారు.

3.5 కోట్ల జనాభా కలిగిన కేరళలో మార్చి 2020లో అత్యధిక కేసులు నమోదు అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత తక్కువ మరణాలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి.

వృద్ధుల సంరక్షణ

జర్మనీలో టుబిన్గెన్ పట్టణంలో ఏప్రిల్ మొదట్లో వైరస్‌ని కట్టడి చేసేందుకు వృద్ధుల సంరక్షణ గృహాలలో పరీక్షలు చేయడం నిర్వహించి సందర్శకులను అనుమతించేవారు.

వైరస్‌తో అధిక ముప్పు ఉన్నవారికి ప్రత్యేక రక్షణ కల్పించాలని అధికారులు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వైరస్‌తో అధిక ముప్పు ఉన్నవారికి ప్రత్యేక రక్షణ కల్పించాలని అధికారులు భావించారు.

ఇటలీ, స్పెయిన్లో వృద్ధులు వైరస్ బారినపడి మరణించటాన్ని ఆయన గమనించారు.

దాంతో వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక నిధులను కేటాయించారు. వారి కోసం సబ్సిడీతో కూడిన టాక్సీ సర్వీస్, ఉచిత మాస్కుల పంపిణీ , ప్రత్యేక షాపింగ్ సమయాలు ఏర్పాటు చేయడం లాంటివి చేశారు.

దీంతో, ఆ పట్టణంలోని ఆసుపత్రికి కోవిడ్ కేసులు రావడం తగ్గింది. అలాగే ఇతర వైద్య సేవలను అందించటం ఆపివేయలేదు.

మిగిలిన దేశాల్లోలా కాకుండా జర్మనీ నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలకు వదిలేసింది.

యూకెలో సంరక్షణ గృహాలకు సందర్శకులు రావడాన్ని నిషేధించినప్పటికీ , టెస్టింగ్ నెమ్మదిగా జరుగుతుందనే విమర్శలు ఎదుర్కొంది.

ఆసుపత్రుల నుంచి సంరక్షణ గృహాలకు వచ్చిన వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయాలని ఏప్రిల్ 15 తరువాత యూకె ప్రభుత్వం నిర్ణయించింది.

జులై నాటికి ఇంగ్లాండ్, వేల్స్‌లో ఉన్న సంరక్షణ గృహాల్లో ఉంటున్న కనీసం 20,000 మంది కోవిడ్ బారిన పడి మరణించినట్లు ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

"ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు వైరస్ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యమేమీ కాదని, అంటువ్యాధుల నివారణ నిపుణులు ప్రొఫెసర్ డేల్ ఫిషర్ చెప్పారు. ఆయన ఫిబ్రవరి 2020లో వుహాన్ లో కోవిడ్ తలెత్తినప్పుడు పరిస్థితిని చూశారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ

యూకెలో ఇప్పటి వరకు 2.6 కోట్ల మంది ప్రజలు తొలి డోసు వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇది విజయవంతమైన కార్యక్రమమే అని చెప్పవచ్చు. అయితే, ఇజ్రాయెల్ జనాభాలో సగానికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

యూకెలో ఇప్పటి వరకు 2.6 కోట్ల మంది ప్రజలు తొలి డోసు వ్యాక్సీన్ తీసుకున్నారు.

అయితే, యూకెలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడానికి అక్కడ చేపట్టిన ప్రణాళికాబద్ధమైన విధానమే కారణం. యూకెలో తొలి కోవిడ్ కేసు నమోదు అయ్యేటప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ వ్యాక్సినేషన్ ప్రణాళికలు రచించడం ప్రారంభించింది.

గత వేసవిలోనే యూకే ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ నుంచి 100 మిలియన్ డోసులు, ఫైజర్ బయోఎన్‌‌టెక్ నుంచి 30 మిలియన్ డోసులు కొనుక్కునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, యూరోప్‌లో కథ మరోలా ఉంది. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రణాళికలు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి.

ఇప్పటివరకు యూకేలో 36 శాతం మంది వ్యాక్సీన్ తీసుకుంటే యూరోప్‌లో కేవలం 8 శాతం మందే వ్యాక్సీన్ తీసుకున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆఫ్రికాలో కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సీన్ ప్రక్రియను ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఆఫ్రికాలో చాలా కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సీన్ ప్రక్రియను ప్రారంభించాయి.

దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో డాక్టర్ లిండా గయిల్ బెక్కర్ నిర్వహించిన జాన్సన్ & జాన్సన్ వ్యాక్సీన్ ట్రయల్ కార్యక్రమంలో మైకేల్ కూటా స్వచ్చందంగా పాల్గొన్నారు. అయితే, ఆయనకు వ్యాక్సీన్ నిజంగా అందిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

"కానీ ఇది తీసుకోవడం ఉపయోగం అని భావిస్తున్నాను. నా కుటుంబానికి నా అవసరం ఉంది" అని అన్నారు.

చాలా పేద దేశాలు కోవాక్స్ అందించే సరఫరాల మీద ఆధారపడుతున్నారు. అందరికీ కోవిడ్ వ్యాక్సీన్ అందాలనే లక్ష్యంతో వ్యాక్సీన్ కూటమిని ఏర్పాటు చేసి వ్యాక్సీన్ సరఫరా చేస్తున్నారు.

దీనికి యూకె 500 మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చి అతి పెద్ద దాతల్లో ఒకరిగా మారింది.

కోవాక్స్ ద్వారా వ్యాక్సీన్ తీసుకునేందుకు దక్షిణ ఆఫ్రికా కూడా సంతకం చేసింది.

కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతర్జాతీయంగా జరగాలి. వ్యాక్సీన్ సరఫరా తక్కువగా ఉన్న దేశాల్లో, వైరస్ పరిణామం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీంతో కొత్త వేరియంట్‌లు పుట్టి వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం దొరుకుతుంది.

కొత్తగా పుట్టిన వేరియంట్‌లు వ్యాక్సీన్ కి లొంగుతాయో లేదోననే భయం కూడా శాస్త్రవేత్తలకు ఉంది. ఇది ఇప్పటికే అమలు చేస్తున్న వ్యాక్సీన్ ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రమాదం కూడా ఉంది.

భారీ మూల్యం

గత 12 నెలల్లో పాఠాలు నేర్చుకోకుండా ఉంటే వచ్చే ముప్పును ఎదుర్కోలేం అని ప్రొఫెసర్ డేల్ ఫిషర్ అంటున్నారు.

"ఇప్పటికే మనం వైరస్ కొట్టిన దెబ్బకు భారీ మూల్యం చెల్లించాం. ఇది పూర్తయ్యే సమయానికి మనం తిరిగి సాధారణ స్థితిలోకి వెళ్ళిపోతాం అనుకోవడం కూడా తప్పే. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే, చరిత్ర పునరావృతమవుతుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)