మార్స్‌ రోవర్‌: అంగారకుడిపై నాసా హెలీకాప్టర్‌ ప్రయోగం... రైట్‌ బ్రదర్స్‌ తొలి విమాన ప్రయోగానికి సమానమైందా?

నాసా మార్స్‌ రోవర్‌
ఫొటో క్యాప్షన్,

ఏప్రిల్ ఆరంభంలో మార్స్‌పై హెలీకాప్టర్‌ ప్రయోగం జరుపుతామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

నెల రోజుల కిందట అంగారక గ్రహం మీదకు వెళ్లిన పెర్సెవీరన్స్‌ రోవర్‌ జెజెరో సరస్సు సమీపంలో క్షేమంగా ల్యాండ్‌ అయ్యింది. రోవర్‌లో అమర్చిన 1.8 కిలోల బరువున్న ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌, మార్స్ ఉపరితలంపై చక్కర్లు కొట్టనుంది.

ఏప్రిల్‌ మొదటి వారంలో గురు గ్రహంపై తొలిసారి హెలీకాప్టర్‌ ఎగురవేయబోతున్నట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది.

ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇది భూమి మీద రైట్‌ బ్రదర్స్‌ తొలినాటి విమాన ప్రయోగంలాగా, గురుగ్రహం మీద ఇది తొలి వైమానిక ప్రయోగంగా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనినే వారు 'రైట్‌ బ్రదర్స్‌ మూమెంట్‌' అని పిలుస్తున్నారు.

1903లో రైట్‌ బ్రదర్స్‌ తొలిసారి విమానాన్ని ఎగరేశారు. దానికి గుర్తుగా ఆ విమానానికి సంబంధించి పోస్టల్‌ స్టాంప్‌ సైజులో ఉన్న ఫ్యాబ్రిక్‌ పీస్‌ను ఈ ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌లోని ఒక రెక్కకు అంటించారు.

ప్రస్తుతం ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌ పెర్సెవీరన్స్‌ రోవర్‌లోనే ఉంది. ఈ నెలాఖరుకల్లా ఆ హెలీకాప్టర్‌ను రోవర్‌ నుంచి బయటకు తెస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. జెజెరో సరస్సు సమీపంలో 10మీ.ల పొడవు, 10 మీ.ల వెడల్పుతో ఒక చదునైన ప్రాంతాన్ని నాసా ఇంజినీర్లు గుర్తించారు. దీన్నే వారు ఎయిర్‌ఫీల్డ్‌గా పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

ఫొటో క్యాప్షన్,

మార్స్‌ పై హెలీకాప్టర్‌ ప్రయోగం భూమి మీద తొలి విమాన ప్రయోగంతో సమానమని సైంటిస్టులు అన్నారు.

ఫొటో క్యాప్షన్,

అంగారక గ్రహ ఉపరితలంపై ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌ చక్కర్లు కొడుతుంది

ఈ హెలీకాప్టర్‌ ఎలా ఎగురుతుంది ?

ఇది 90 మీటర్ల ఫ్లైట్‌ జోన్‌కు చివర్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌ ఐదుసార్లు చక్కర్లు కొట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతటినీ పెర్సెవీరన్స్‌ రోవర్‌ రికార్డు చేస్తుంది.

"ఇదంతా సవ్యంగా సాగడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఫొటోలు, వీలైతే వీడియోలు కూడా తీసుకుంటాం." అన్నారు నాసా ఇంజినీర్‌ ఫరా అలిబే. అయితే పెర్సెవీరెన్స్‌కు, ఇంజెన్యుటీకి వేర్వేరు క్లాక్‌ (గడియారాలు)లు ఉన్నాయని, ఈ రెండూ ఫొటోగ్రఫీతో సింక్‌ కావాల్సి ఉందని, అదే ప్రస్తుతం పెద్ద సవాలని ఆమె తెలిపారు.

ఇంజెన్యుటీ హెలీకాప్టర్‌ను తక్కువ బరువు ఉండేలా రూపొందించారు. మార్స్‌ గ్రహం మీద ఎగరడానికి తగినంత బరువు ఉండేలా జాగ్రత్త పడ్డారు. నాలుగు కార్బన్‌-ఫైబర్‌ రెక్కలను, 1మీ. పొడవైన రోటార్స్‌కు ఏర్పాటు చేశారు.

ఇవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో నిమిషానికి 2400సార్లు తిరుగుతాయి. ఇది సాధారణ హెలీకాప్టర్ల రెక్కలు తిరిగే రేటుకన్నా చాలా రెట్లు ఎక్కువ.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

ఫొటో క్యాప్షన్,

హెలీకాప్టర్‌ చక్కర్లు కొట్టే ప్రాంతాన్ని ఎయిర్‌ఫీల్డ్‌గా సైంటిస్టులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

ఫొటో క్యాప్షన్,

ఈ ప్రయోగం భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు దారి తీస్తుందని సైంటిస్టులు అంటున్నారు.

మరిన్ని ప్రయోగాలు ఎప్పుడు ?

మొదటిసారి కేవలం 3మీ.ల ఎత్తులో 30 సెకండ్ల పాటు హెలీకాప్టర్‌ను ఎగరేసేందుకు ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతా బాగుంటే తర్వాత మళ్లీ ప్రయత్నాలు ఉండొచ్చని తెలిపారు.

"ముందు దాని పని తీరు, సామర్ధ్యం తెలుసుకోవడానికే మొదటి మూడు ఫ్లైట్‌లను ప్రయోగించి చూడబోతున్నాం." అని ఇంజెన్యుటీ చీఫ్‌ పైలట్‌ హావర్డ్‌ గ్రిప్‌ బీబీసీకి తెలిపారు. "అంతా బాగుంటే మిగిలిన ప్రయోగాల గురించి ఆలోచిస్తాం. ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలులేవు" అన్నారాయన.

ఇంజెన్యుటీ ప్రయోగం భవిష్యత్తులో అక్కడ ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు అవకాశం కల్పిస్తుందని నాసా సీనియర్‌ అధికారిణి లోరీ గ్లేజ్‌ అన్నారు. "ఆకాశం నుంచి చూడలేని ప్రాంతాలను, రోవర్‌ చేరుకోలేని ప్రదేశాలను మనం చిత్రించలేమా? ఒక హెలీకాప్టర్‌ ఈ ప్రయోగాలలో పెర్సెవీరెన్స్‌ రోవర్‌కు మార్గం చూపలేదా? భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు మనం పునాదులు వేయలేమా? అన్నారామె.

ఇక నాసా 2030నాటికి 'డ్రాగన్‌ ఫ్లై' పేరుతో శని ఉపగ్రహం టైటాన్‌ మీద రోటో క్రాఫ్ట్‌ను ఎగరేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

1980లలో ఇతర గ్రహాల మీద వెగా బెలూన్స్‌ రూపంలో వాయు యంత్రాల (ఎయిర్‌ వెహికల్స్‌)ను ఎగరేసిన ఘనతను ఇప్పటికే రష్యన్లు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)