సూయజ్ కెనాల్‌కు అడ్డంగా చిక్కుకున్న భారీ నౌక, స్తంభించిన రాకపోకలు

కాలువకు అడ్డంగా కంటైనర్ షిప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

సూయజ్ కాలువకు అడ్డంగా కంటైనర్ షిప్

ఈజిప్ట్ దగ్గర సూయజ్ కెనాల్‌లో ఒక పెద్ద కంటెయినర్ నౌక ఇసుకలో చిక్కుకుపోయింది. దీంతో, ఆ కాలువలో కార్గో నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి.

400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు గల ఎవర్ గివెన్ అనే నౌక సూయజ్ కెనాల్‌కు అడ్డంగా ఇరుక్కుపోయింది. దీనిని అక్కడ్నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ దానిని తీయడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని భావిస్తున్నారు. దీంతో, రాకపోకలను మళ్లించడానికి ఈజిఫ్ట్ అధికారులు కెనాల్ పాత కాలువను మళ్లీ తెరిచారు.

ఈ ఘటన సూయజ్ రేవుకు ఉత్తరాన జరిగింది. ఈ జలమార్గం మధ్యదరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. ఆసియా నుంచి యూరప్‌కు వెళ్లడానికి దగ్గరి సముద్ర మార్గం ఇదే.

ఎవర్‌ గివెన్ కంటైనర్ నౌక పనామాకు చెందినది. ఇది చైనా నుంచి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్ రేవుకు వెళ్తోంది.

ఆ దారిలో నౌక ఉత్తరదిశగా మధ్యదరా సముద్రం వైపు వెళ్తున్నప్పుడు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.40కి సూయజ్ కాలువకు అడ్డంగా ఇరుక్కుపోయింది.

ఫొటో సోర్స్, VESSEL FINDER

ఫొటో క్యాప్షన్,

ఎవర్ గివెన్ ఇరుక్కుపోయిన ప్రాంతం

4 ఫుట్‌బాల్ మైదానాలంత పొడవు

2 లక్షల టన్నుల బరువున్న ఈ నౌక 2018లో తయారైంది. తైవాన్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ దీనిని నడుపుతోంది.

ఈ నౌక నాలుగు ఫుట్‌బాల్ పిచ్‌ల అంత పెద్దగా ఉంటుంది. ఇది కాలువకు అడ్డంగా చిక్కుకుపోవడంతో అటూ ఇటూ చాలా నౌకలు ఆగిపోయాయి.

నౌక చిక్కుకున్న ప్రాంతాన్ని.. దానికి అటూ ఇటూ ఆగిపోయిన మిగతా నౌకలను నౌకల దిశను గుర్తించే ఒక ట్రాకింగ్ వెబ్‌సైట్ చూపిస్తోంది.

ఈ నౌకను తప్పించడానికి కెనాల్ పక్క నుంచి యంత్రాలతో ఇసుకను తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

హఠాత్తుగా వచ్చిన బలమైన గాలుల వల్ల అది చిక్కుకుపోయి ఉంటుందని ఎవర్‌గ్రీన్ మెరైన్ సంస్థ అధికారులు చెప్పారని రాయిటర్స్ చెప్పింది.

ఫొటో సోర్స్, PLANET LABS

ఇసుకను తవ్వి తప్పించాలి

మంగళవారం ఈ నౌకకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

దానిని ఎవర్ గివన్ వెనక వస్తున్న ద మెర్క్స్ డెన్వర్ అనే మరో కార్గో నౌక నుంచి తీశామని వాళ్లు చెప్పారు. ఆ ఫొటోలో నౌక కాలువకు అడ్డంగా చిక్కుకుపోయి ఉంది.

ఈ నౌకకు సంబంధించిన మరికొన్ని పొటోల్లో కెనాల్ ఒడ్డున ఇసుక తీస్తున్న ఒక చిన్న ఎక్స్‌కవేటర్ కూడా కనిపిస్తోంది.

ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ, ఇలాంటి వాటి వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అని అమెరికా సముద్ర చరిత్రకారుడు డాక్టర్ సాల్ మెర్కోగ్లియానో అన్నారు.

"ప్రస్తుతం సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన నౌక చాలా పెద్దది. ఈ నౌక తీరం దగ్గరకు వచ్చి ఇసుకలో చిక్కుకుపోయింది, దాని పవర్ పోయింది. అందుకే అది అక్కడ నుంచి కదల్లేకపోయింది. నౌకను అక్కడ నుంచి లాగలేకపోతే, దాని మీద ఉన్న కంటైనర్లు దించడం మొదలెట్టాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

తీరంలో ఇసుక తీసే ప్రయత్నాలు

ఎన్ని రోజులు పట్టచ్చు

ఎవర్ గివెన్‌ను అక్కడ నుంచి తొలగించే ఆపరేషన్‌లో భాగంగా తీరంలో భారీగా ఇసుక తొలగించాల్సి ఉంటుందని, దానికి చాలా రోజులు పట్టవచ్చని సూయజ్ కెనాల్ అథారిటీకి చెందిన ఒక అధికారి చెప్పినట్లు కైరో 24 న్యూస్ చానల్ తెలిపింది.

సూయజ్ కెనాల్ అథారిటీ వివరాల ప్రకారం ఈ కాలువ నుంచి ప్రతి రోజూ సగటున 51 నౌకలు ప్రయాణిస్తుంటాయి.

2017లో కూడా ఒక జపాన్ నౌక సూయజ్ కెనాల్ దారికి అడ్డంగా ఇరుక్కుపోయింది. కానీ ఈజిఫ్ట్ అధికారులు దాన్ని నౌకలు ఉపయోగించి బయటకు లాగగలిగారు. కొన్ని గంటల్లోనే దాన్ని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు.

A container ship sailing through Egypt's Suez Canal on 17 November 2019
AFP
సూయజ్ కెనాల్

  • 1869 జలమార్గాన్ని మొదట ప్రారంభించిన సంవత్సరం

  • 2015విస్తరణలో 35 కి.మీ. సమాంతర కాలువ తవ్విన సంవత్సరం

  • 193కి.మీ. పొడవు

  • 205మీటర్ల వెడల్పు

  • 24మీటర్ల లోతు

ఆధారం: సూయజ్ కెనాల్ అథారిటీ

సూయజ్ కాలువ ఈజిఫ్ట్‌లోని సూయజ్ ఇస్థమస్ దాటి వెళ్తుంది. ఈ కాలువ దాదాపు 193 కిలోమీటర్ల పొడవుంటుంది.

2015లో ఈజిఫ్ట్ ప్రభుత్వం సూయజ్ కెనాల్‌ను విస్తరించింది. ఆ విస్తరణ పనుల్లో భాగంగా జలమార్గాన్ని మరింత లోతుగా చేశారు. అటు నుంచి వెళ్లే నౌకల కోసం 35 కిలోమీటర్ల పొడవున్న ఒక సమాంతర కాలువను కూడా తవ్వారు.

ప్రపంచవ్యాప్తంగా నౌకా వాణిజ్యంలో 10 శాతం సూయజ్ కెనాల్ మీదుగానే జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)