మియన్మార్ తిరుగుబాటు: నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న ఆర్మీ జనరల్స్

మియన్మార్

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా కొందరు నిరసనకారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారిపై సైన్యం కాల్పులు జరిపింది. 90 మంది నిరసనకారులు సైన్యం కాల్పుల్లో మరణించారు.

సైనిక దళాల దినోత్సవం సందర్భంగా అదే రోజు రాత్రి తిరుగుబాటు నాయకుడు మిన్ ఆంగ్ హ్లెయింగ్ ఇతర సైనిక జనరల్స్‌కు విందు ఇచ్చారు.

ఆర్మీ జనరల్స్‌ పాల్గొన్న విందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

శనివారం కాల్పుల్లో మరణించిన నిరసనకారుల మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఇందులో జోక్యం చేసుకోవడానికి సైన్యం ప్రయత్నించింది.

ఫిబ్రవరి ఒకటిన సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER

నిరసనకారులపై కాల్పులను ఖండించిన అంతర్జాతీయ సమాజం

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తున్న 90 మంది నిరసనకారులను చంపేయడాన్ని అంతర్జాతీయం సమాజం తీవ్రంగా ఖండించింది.

మియన్మార్‌లో శనివారం జరిగిన ఘటనలు తమను 'దిగ్భ్రాంతికి' గురి చేశాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ అన్నారు.

సైనిక కుట్ర తరువాత నెల రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరసనకారులు సైనికుల కాల్పుల్లో చనిపోయారు. అయితే, శనివారం నాట ఘటనలు కనీ వినీ ఎరుగని స్థాయిలో రక్తపాతాన్ని సృష్టించాయి. 100 మందికి పైగా ప్రజలు కాల్పుల్లో చనిపోయారని వార్తలు వస్తున్నాయి.

ఈ హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ. "సైన్యం ప్రజలను హతమార్చి ఏ కొద్ది మందికో పాలకులుగా ఉంటుందా? సాహసికులైన ప్రజలు బర్మాలో భయానకమైన సైనిక పాలనను వ్యతిరేకిస్తున్నారు" అని బ్లింకెన్ అన్నారు.

మియన్మార్‌లో భద్రతా దళాలు 'నిరాయుధులైన పౌరులను హత్య చేస్తున్నాయి" అని అమెరికన్ రాయబార కార్యాలయం ఇప్పటికే వ్యాఖ్యానించింది. ఆ దేశానికి వెళ్లిన ఈయూ ప్రతినిధి బృందం, "అధికారికంగా సైనిక దళాల రోజైన శనివారం, హింస-అణచివేతల రోజుగా గుర్తుండిపోతుంది" అని వ్యాఖ్యానించింది.

"ఈ ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి" అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గ్వెటెరెస్ అన్నారు. "పరిస్థితి మరింత దిగజారింది" అని బ్రిటిష్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

శనివారం ఏం జరిగింది...

సైన్యం హెచ్చరికలను కాదని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. సైన్యం వారిపై కాల్పులు జరిపింది.

ఈ కాల్పుల్లో 91 మంది చనిపోయారని అసిస్టెన్స్ అసోషియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిసనర్స్ - ఏఏపీపీ తెలిపింది. స్థానిక మీడియా అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని చెబుతోంది. మియన్మార్ నవ్ అనే స్థానిక పత్రిక 114 మంది చనిపోయారని రిపోర్ట్ చేసింది.

శనివారం నాటి మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారని ఏఏపీపీ తెలిపింది.

ఈ హింసను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించాయి.

"నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరిపి భద్రతా బలగాలు వాటి పరువు అవే తీసుకున్నాయి" అని బ్రిటన్ రాయబారి డేన్ చుక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

'భద్రతా దళాలు నిరాయుధులైన పౌరులను చంపుతున్నాయి' అని అమెరికా రాయబార కార్యాలయం చెప్పింది.

ఫొటో సోర్స్, Reuters

వీధుల్లో ఏం జరుగుతోంది?

సైనిక తిరుగుబాటు నేతలు శనివారం సాయుధ దళాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు అనేక నగరాల్లో రోడ్ల మీదికి వచ్చారు.

యాంగాన్‌ సహా ఇతర నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు.

"వాళ్లు మమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారు. మేము ఇంట్లో ఉన్నా సరే. అయితే, ఏం జరిగినా నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉంటాం" అని మ్యింగ్యాన్ పట్టణానికి చెందిన థు యాజా రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పారు.

'ఆ దృశ్యాలు షాకింగ్‌గా, భయంకరంగా, క్రూరంగా ఉన్నాయని, అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు' అని ఆసియాలో హ్యూమన్ రైట్స్ వాచ్ డిప్యూటీ డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

"ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, ఎన్నికలు జరిపిస్తానని" సైనిక తిరుగుబాటు నేత మిన్ ఆంగ్ హ్లయింగ్ జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు.

అయితే, అది ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

ఫొటో సోర్స్, Reuters

"గతంలో జరిగిన విషాద మరణాల నుంచి ప్రజలు నేర్చుకోవాలి. మీ తలపై, వీపులో కాల్పులు జరిపే ప్రమాదం ఉంది" అని జాతీయ టీవీలో హెచ్చరికలు ప్రసారం చేశారు.

ఫొటో సోర్స్, EPA / LYNN BO BO

నిరసనలను అణచివేసేందుకు భద్రతా దళాలను భారీగా ఉపయోగించే ప్రమాదం ఉన్నప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు.

దేశంలో ముఖ్యంగా రాజధాని యాంగూన్‌లో నిరసనలను అడ్డుకోడానికి భద్రతాదళాలను మరింతగా మోహరించారు.

ఫొటో సోర్స్, Reuters

దేశంలోని రెండో అతిపెద్ద నగరం మండలైలో కూడా నిరసనకారులు ఆంగ్ సాన్ సూచీకి చెందిన ఎన్ఎల్‌డీ పార్టీ జెండాతో రోడ్లపైకి వచ్చారు.

సైనిక పాలనకు వ్యతిరేకంగా మూడు వేళ్లతో సెల్యూట్ చేస్తూ నిరసనలు చేపట్టారు.

లాషివో నగరంలో నిరసనకారులపై పోలీసులు లైవ్ బుల్లెట్లు కాల్చారని ఒక జర్నలిస్ట్ ఏఎఫ్‌పీతో చెప్పారు.

"ఈరోజు సాయుధ దళాలు సిగ్గు పడాల్సిన రోజు. 300 మందికి పైగా అమాయక పౌరులను చంపిన మిలిటరీ జనరళ్లు.. సాయుధ దళాల దినోత్సవం జరుపుకుంటున్నారు" అని తిరుగుబాటు వ్యతిరేక గ్రూప్ సీఆర్‌పీహెచ్ ప్రతినిధి డాక్టర్ సాసా అన్నారు.

ఫొటో సోర్స్, EPA / KAUNG ZAW HEIN

తిరుగుబాటు నేతలు ఏమంటున్నారు?

ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి సైన్యం మొత్తం దేశంతో చేతుల కలపాలనుకుంటోందని జనరల్ ఆంగ్ హ్లయింగ్ అన్నారు.

"మీ డిమాండ్ల కోసం స్థిరత్వం, భద్రతపై ప్రభావం పడేలా హింసాత్మక చర్యలకు పాల్పడడం తగదు. ప్రజాస్వామ్యబద్ధంగాఎన్నికైన సూచీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం వల్లే, సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది" అని అన్నారు.

1945లో జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా మియన్మార్ సైనిక ప్రతిఘటన ప్రారంభానికి గుర్తుగా ఆ దేశంలో సాయుధ దళాల దినోత్సవం జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)