సూయజ్ కాలువలో చిక్కుకున్న నౌకను వెంటనే తీయకపోతే మీ జేబుకు చిల్లుపడొచ్చు..ఎందుకో మీరే చదవండి

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సూయజ్ కాలువ

ప్రపంచ వాణిజ్యానికి సూయజ్ కాలువను వెన్నెముకగా చెబుతుంటారు. ప్రధాన జల మార్గాల్లో ఇది ఒకటి.

ప్రపంచ వాణిజ్యంలో 12శాతం సరుకు రవాణా దీని ద్వారానే జరుగుతోంది.

చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తున్న ఒక కార్గో నౌక మంగళవారం ఉదయం కాలువలో చిక్కుకుపోయింది.

ఇసుకలో చిక్కుకున్న దాన్ని తిరిగి సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.

మరికొన్ని రోజులు ఆ నౌక అక్కడే అలాగే ఉంటే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కాలువలో ఈ కార్గో నౌక ఇరుక్కుపోవడంతో ఆ దారిలో చాలా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి.

రోజుకు దాదాపు 70వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

ఈ నౌక మరో రెండు రోజులు ఇలాగే ఉంటే, ఇప్పటికే తీవ్రంగా ఉన్న పరిస్థితి మెల్లమెల్లగా మరింత దారుణంగా మారుతుందని డెన్‌మార్క్ కన్సల్టన్సీ సంస్థ సీ-ఇంటెలిజెన్స్‌ ప్రొడక్ట్స్ అండ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నీల్స్ మాడిసన్ చెబుతున్నారు.

"ఇది నాలుగైదు రోజులు ఇలాగే ఉండిపోతే, దానివల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా దారుణమైన ప్రభావం మొదలవుతుంది. సరకు రవాణా ఆగిపోవడం వల్ల ధరలు పెరగడం అనేది వాటిలో చాలా ముఖ్యమైనది" అని ఆయన రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పారు.

సూయజ్ కెనాల్ అంత కీలకం ఎందుకు?

1) తూర్పు పడమరను కలిపే ముఖ్యమైన మార్గం

సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది.

ఆసియా, యూరప్ మధ్య దగ్గరి జలమార్గం ఇదే.

ఈ కాలువ ఈజిఫ్టులోని సూయజ్ ఇస్థమస్(జలసంధి)ని దాటి వెళ్తుంది.

ఈ కాలువలో మూడు సహజ సరస్సులు కూడా ఉన్నాయి.

1869లో ఈ కాలువలో రాకపోకలు మొదలయ్యాయి. వాణిజ్యానికి ఇది చాలా కీలకం.

దీనిని తవ్వక ముందు ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిపోయే నౌకలు దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించేవి.

కానీ ఈ జలమార్గం నిర్మించిన తర్వాత ఆసియా, యూరప్ నౌకలన్నీ పశ్చిమాసియాలోని ఈ జలమార్గం నుంచే వెళ్తున్నాయి.

వరల్డ్ మారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఈ కాలువ తవ్వడం వల్ల యూరప్‌ వెళ్లే ఆసియా నౌకల ప్రయాణంలో 9వేల కిలోమీటర్ల దూరం తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

2) రోజువారీ నష్టం దాదాపు రూ.70వేల కోట్లు

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోవడంతో బుధవారం 40 కార్గో నౌకలు, మరో 24 చమురు ట్యాంకర్లు అటూ ఇటూ నిలిచిపోయాయి. కాలువ క్లియర్ అయ్యే సమయం కోసం అవి ఎదురుచూస్తున్నాయని కన్సల్టన్సీ లాయడ్స్ లిస్ట్ చెప్పింది.

ఈ కార్గో నౌకల్లో ధాన్యం, సిమెంట్ లాంటి ఉత్పత్తులు ఉన్నాయి.

ఇక ట్యాంకర్ల నిండా పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి.

సూయజ్ కాలువ దగ్గర నిలిచిపోయిన ఓడల్లో పశువుల దాణా, నీళ్ల ట్యాంకర్లు తీసుకెళ్లే 8 నౌకలు కూడా ఉన్నాయని బ్లూంబర్గ్ చెప్పింది.

సూయజ్ కెనాల్‌ను ప్రపంచంలో ఉన్న కొన్ని చోక్ పాయింట్లలో ఒకటిగా చెబుతుంటారు.

అందుకే, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి అవసరమయ్యే అన్ని రకాల సరుకుల సరఫరాకు సూయజ్ కాలువ అత్యంత ముఖ్యమైనదని అమెరికా ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది.

ప్రతి సంవత్సరం సూయజ్ కెనాల్ నుంచి ప్రయాణించే దాదాపు 19వేల ఓడలు 120 కోట్ల టన్నుల సరుకులను రవాణా చేస్తుంటాయని ఒక అంచనా.

ఈ కాలువలో వెళ్లే నౌకల ద్వారా ప్రతి రోజూ 9.5 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు వెళ్తుంటాయి. ఇందులో దాదాపు ఐదు బిలియన్ డాలర్ల సరుకు రవాణా పశ్చిమానికి, మరో 4.5 బిలియన్ డాలర్ల కార్గో తూర్పుకు వెళ్తాయని లాయడ్స్ లిస్ట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

3) సప్లయి చెయిన్‌కు కాలువ చాలా ముఖ్యం

ప్రపంచవ్యాప్తంగా సరకుల సరఫరాకు సూయజ్ కాలువ చాలా కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఈ కాలువలో ఏదైనా అడ్డంకి వచ్చినపుడు పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని అంటున్నారు.

దానివల్ల వచ్చే మొదటి సమస్య 'పోర్ట్ కంజెషన్' అని సీ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు లార్స్ జాన్సన్ అన్నారు.

"అన్ని నౌకలూ కంటైనర్లతో నిండిపోయి ఉన్నాయని అనుకుందాం. రోజుకు 55వేల టీఈయూ (కంటైనర్ సామర్థ్యం కొలిచే ఒక యూనిట్) చొప్పున రెండు రోజుల్లో మొత్తం 110 వేల టీఈయూ సరుకులు ఆసియా నుంచి యూరప్ వెళ్తుంటాయి. అవి మధ్యలో ఇరుక్కుపోతాయి. ఆ జామ్ ముగియగానే ఈ నౌకలన్నీ ఒకేసారి యూరోపియన్ రేవులకు చేరుకుంటాయి. వాటితో పాటు అవి తీసుకెళ్లిన సరుకులు కూడా అక్కడికి భారీగా చేరుకుంటాయి" అని ఆయన అన్నారు.

ఒక వారంలో యూరోపియన్ రేవులపై భారీ ఒత్తిడి ఉండడం మనం చూడాల్సి వస్తుందని జాన్సన్ అంచనా వేస్తున్నారు.

ఆయన అంచనా ప్రకారం ఈ సమస్యతో షాపుల్లో అమ్మే ప్రతి వస్తువు సరఫరా, డిమాండ్, వాటి ధరలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్

4) ధరలు పెరిగే అవకాశం

ఈ సమస్యతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడొచ్చని అమెరికా నార్త్ కెరోలినా కాంప్‌బెల్ యూనివర్సిటీలో సముద్ర అంశాల నిపుణుడు, ప్రొఫెసర్ సల్వటోర్ మార్కగ్లియానో చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన "సూయజ్ కాలువలో రాకపోకలు ఆగిపోవడం వల్ల సరకు రవాణా నౌకలు, చమురు ట్యాంకర్లు యూరప్‌కు ఆహార పదార్థాలు, ఇంధనం లాంటివి చేర్చలేకపోతున్నాయి. అలాగే యూరప్ నుంచి తూర్పుకు ఏ సరుకులనూ పంపించలేకపోతున్నారు" అన్నారు.

"పెట్రోలియం, లిక్విడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు సూయజ్ కాలువ చాలా కీలకం. ఎందుకంటే, మధ్యప్రాచ్యం నుంచి యూరప్ వరకూ ఈ కాలువ నుంచే ఇంధనం తీసుకెళ్తారు" అని బీబీసీ ఆర్థిక ప్రతినిధి థియో లెగట్ చెప్పారు.

లాయడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం గత ఏడాది సూయజ్ కాలువలో 5,163 ట్యాంకర్లు ప్రయాణించాయి.

ఈ కెనాల్ నుంచి ప్రతి రోజూ దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకెళ్తుంటారు.

వీడియో క్యాప్షన్,

సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక వల్ల రోజూ 70 వేల కోట్ల నష్టం

సముద్రం ద్వారా జరిగే మొత్తం చమురు వాణిజ్యంలో 9 శాతం, ఎల్పీజీలో 8 శాతం సూయజ్ కాలువ, సుమెడ్ పైప్ లైన్ (మధ్యధరాలోని అలెగ్జాండ్రియా నుంచి సూయజ్ తీరం వరకు) నుంచే తరలిస్తారని అమెరికా ఈఐఏ వివరిస్తోంది.

కాలువలో ప్రస్తుతం నౌక చిక్కుకుపోయింది. మిగతా నౌకలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాంతో బుధవారం చమురు ధరలు 6శాతం కంటే ఎక్కువే పెరిగాయి. అయితే గురువారం ఈ ధరల్లో పతనం వచ్చింది.

"ఒకవేళ ఈ సమస్య ఇంకా ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే కొనుగోలుదారులు వేరే ప్రాంతాల నుంచి చమురు సరఫరా జరిగేలా చూసుకోడానికి క్యాష్ మార్కెట్ వైపు మళ్లే అవకాశం ఉంటుంది" అని ఐఎన్‌జీ బ్యాంక్ భావిస్తోంది.

ఇప్పుడు కార్గో నౌకలు.. కాలువలో ఉన్న ఓడను తప్పించే వరకూ ఆగాలా, లేక కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా వెళ్లాలా అనేది కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ఈ రెండు ప్రత్యామ్నాయాలలో ఏది ఎంచుకున్నా, ఆ సరుకులను గమ్యస్థానానికి చేర్చడం ఆలస్యం అవుతుందని బ్యాంక్ చెబుతోంది.

ఈ సమస్య వల్ల ముందు ముందు అసలు ప్రభావం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, DAVID DEGNER

మిగతా వస్తువులపై ప్రభావం

ఈ అంశంపై లండన్ క్లాయిడ్ అండ్ కో సముద్ర అంశాల న్యాయవాది ఇయాన్ వుడ్స్ ఎన్‌బీసీతో మాట్లాడారు.

"అక్కడ ఉన్న మిగతా నౌకల్లో వందల కోట్ల రూపాయల విలువైన సరుకులు ఉన్నాయి. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, ఆ ఓడలన్నీ వేరే మార్గంలో వెళ్తాయి. అంటే మరింత సమయం, మరింత ఖర్చు అని అర్థం. దాన్నంతా చివరకు వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు" అని ఆయన అన్నారు.

దీనిని ఒక పీడకలగా అభివర్ణించారు నిపుణులు లెగెట్.

"ఎవర్ గివెన్ లాంటి కొత్త తరం, భారీ నౌకలు, ఇలాంటి ఇరుకైన కాలువలో వెళ్తుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చనేది, ఇప్పుడు దీని ద్వారా తెలిసింది" అని లెగెట్ చెప్పారు.

ఆధునికీకరణ ప్రణాళికల్లో భాగంగా 2015లో కాలువలోని కొన్ని భాగాలను విస్తరించారు.

అయినప్పటికీ, ఈ కాలువలో ప్రయాణించడం చాలా కష్టం.

ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులోనూ జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)