నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన: 12 మంది మరణించే పరిస్థితులు ఎందుకు వచ్చాయి

  • అంబరసన్ ఎథిరాజన్
  • బీబీసీ న్యూస్
బంగ్లాదేశ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాకతో తమ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చిరస్మరనీయంగా మిగులుతాయని బంగ్లాదేశ్ భావించింది.

అయితే, మోదీ పర్యటన విధ్వంసకర నిరసనలకు దారితీసింది. ఈ నిరసనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్‌తోపాటు విదేశాల్లోనూ ప్రజలను మతాల పేరుతో విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీపై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి.

మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని, ముస్లింలపై హింసను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని వార్తలూ వస్తున్నాయి.

మోదీ, బీజేపీలపై వస్తున్న ఇలాంటి ఆరోపణలే బంగ్లాదేశ్‌లో ప్రస్తుత నిరసనలను కారణంగా కనిపిస్తున్నాయి.

ఇలా హింస చెలరేగడం రెండు దేశాలకూ తలవంపులు తీసుకువస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పటివరకూ సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగుతున్న రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపైనా ఈ హింస ప్రభావం పడుతోంది.

ఫొటో సోర్స్, Salim Parvez

అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 26న రెండు రోజుల పర్యటన కోసం ఆ దేశ రాజధాని ఢాకాలో మోదీ అడుగుపెట్టారు. ప్రస్తుత ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ వందో జయంతి వేడుకలు కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్నాయి.

ఈ వేడుకలకు మాల్దీవులు, శ్రీలంక, భూటాన్, నేపాల్ నాయకులూ వచ్చారు. పది రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలు మోదీ పర్యటన నడుమ వివాదాస్పదంగా మారాయి.

ఢాకాలో మార్చి 26న ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ముస్లింలు నిరసనలు మొదలుపెట్టారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు ఉపయోగించారు.

ఈ నిరసనలు అలా దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారికి మద్దతుగా అతివాద ఇస్లామిక్ సంస్థ ''హెఫాజతే ఇస్లాం'' మార్చి 28న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. మరోవైపు బలగాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.

ఢాకాతోపాటు తూర్పు జిల్లా బ్రహ్మణ్‌బరియాలో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. బస్సులు, ఒక రైలు, ఒక హిందు దేవాలయం, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. పలువురు తూటా గాయాలతో ఆసుపత్రుల్లోనూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

''నిరసన ప్రదర్శన చేపడుతున్న మదర్సా విద్యార్థులపై భద్రతా బలగాలు, అధికార పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులు దాడులు చేశారు. దీంతో ఘర్షణలు చెలరేగాయి. ఎలాంటి ఆయుధాలు లేని నిరసనకారులపై కాల్పులు జరపాల్సిన అవసరమే లేదు''అని హెఫాజతే ఇస్లాం వైస్ ఛైర్మన్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ ఖాదెర్ బీబీసీతో చెప్పారు.

12 మంది నిరసనకారులు మరణించారని అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సంస్థ చెబుతోంది.

''బంగ్లాదేశ్ ఓ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతిఒక్కరూ తమ భావాలను బయటకు చెప్పుకోవచ్చు. అయితే, శాంతి, భద్రతలు, పరిస్థితులను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు''అని బంగ్లాదేశ్ న్యాయ శాఖ మంత్రి అనీషుల్ హక్ బీబీసీతో చెప్పారు.

''వారు హద్దులు మీరారు. దేశ పౌరులను, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయి''అని హక్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

నిరసనలు ఎందుకు జరిగాయి

అతివాద ఇస్లామిక్ సంస్థలు, కొన్ని వామపక్ష సంస్థలు, మదర్సాల విద్యార్థులు ఈ నిరసనలు చేపడుతున్నాయి. ముస్లిం వ్యతిరేక విధానాలకు మోదీ పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

నిరసనలు చేపడుతున్న వారిపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయని, తీవ్రంగా దాడులు చేస్తున్నారని అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన కొందరు నాయకులు కూడా ఆరోపిస్తున్నారు.

నిరనసకారులపై దాడుల విషయంలో న్యాయం కోరుతూ కొందరు ప్రముఖులు, మానవ హక్కుల ఉద్యమకారులు ఓ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు.

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగుతున్నప్పటికీ, కొందరు బంగ్లాదేశ్ పౌరుల్లో భారత్ వ్యతిరేక భావజాలం గూడుకట్టుకొని ఉంది.

''2014లో భారత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ భావజాలం మరింత పెరిగింది. ఈ భారత్ వ్యతిరేక భావజాలం కాస్త, మోదీ వ్యతిరేక భావజాలంగా మారింది''అని బీబీసీతో మహిళా హక్కుల ఉద్యమకారిణి షిరీన్ హక్ చెప్పారు.

''ఇప్పుడు భారత్‌ లేదా భారత ప్రజలకు వ్యతిరేకంగా నిరసనలు జరగడం లేదు. ముఖ్యంగా ముస్లిం వ్యతిరేక విధానాలను తీసుకొచ్చే వ్యక్తిగా పేరొందిన మోదీని ఈ వేడుకలను ఆహ్వానించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు''అని ఆమె చెప్పారు.

''భారత రాష్ట్రపతిని బంగ్లాదేశ్ ఆహ్వానించి ఉండాల్సింది. అప్పుడు అందరూ సమ్మతించేవారు''.

అయితే, మోదీని ఆహ్వానించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం సమర్థించుకొంది.

''స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు తోడుగా నిలిచిన దేశం నాయకుడిని ఆహ్వానించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు భావించారు. అందుకే మోదీని మేం ఆహ్వానించాం''అని హక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందా?

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.

బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్‌గా ఉండేది. హిందూ ఉప ఖండాన్ని 1947లో బ్రిటన్ విభజించినప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో భాగమైంది.

అయితే, 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బంగ్లాదేశ్ పోరాడింది. భారత సైన్యం సాయంతో స్వతంత్ర్య దేశంగా బంగ్లాదేశ్ అవతరించింది.

అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక, రెండు దేశాల సంబంధాల్లో కాస్త ఒడిదొడుకులు ఎదురయ్యాయి.

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే భారత రాష్ట్రాలైన పశ్చిమ్ బెంగాల్, అసోంలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ నాయకులు.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అయితే, ఇలాంటి వలసలు ఏమీ లేవని బంగ్లాదేశ్ అధికారులు పదేపదే చెబుతున్నారు.

2019 ఎన్నికల ర్యాలీలో భారత హోం మంత్రి అమిత్ షా.. అక్రమ వలసదారులను చెద పురుగులతో పోల్చారు. ''బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఒక్కొక్కరినీ పట్టుకొని సముద్రంలోకి విసిరేస్తుంది''అని ఆయన వ్యాఖ్యానించారు.

షా వ్యాఖ్యలపై మానవ హక్కుల సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. బంగ్లాదేశ్ కూడా స్పందించింది.

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల గురించి పదేపదే భారత్‌లో వ్యాఖ్యలు చేయడంతో బంగ్లాదేశ్‌లోని హసీనా ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.

2019లో మోదీ ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ ఆశ్రయం ఇస్తుంది. అయితే, మైనారిటీలు అనే పదంలో ముస్లింలను పేర్కొనలేదు.

దీంతో ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టంగా చాలా మంది అభివర్ణించారు. భారత్‌లోని ప్రతిపక్షాలతోపాటు మానవ హక్కుల సంస్థలు కూడా దీనిపై నిరసన వ్యక్తం చేశాయి.

ఫొటో సోర్స్, Salim Parvez

ఈ చట్టంపై బంగ్లాదేశ్ కూడా స్పందించింది.

మతపరమైన హింస వల్ల బంగ్లాదేశ్ నుంచి ఎవరూ భారత్‌లోకి వెళ్లడంలేదని హసీనా చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 8 శాతం వరకూ ఉంటుంది.

భారత్‌లో ప్రతిపాదిత పౌర నమోదు పట్టిక (ఎన్ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఒకానొక సమయంలో భారత్‌కు వెళ్లాల్సిన తమ మంత్రుల పర్యటనలను కూడా బంగ్లాదేశ్ రద్దుచేసుకుంది.

అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీలో దాదాపు రెండు కోట్ల మందికి చోటు దక్కలేదు. వీరిలో ముస్లింలతోపాటు హిందువులు కూడా ఉన్నారు. తాము బంగ్లాదేశ్ నుంచి రాలేదని, ఇక్కడి వారిమేనని రుజువు చేసుకోవడానికి వీరి దగ్గర తగిన ధ్రువపత్రాలు లేకపోవడంతో వీరికి ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కలేదు. అయితే, దీనిలో చోటు దక్కని ముస్లింలను వెంటనే బంగ్లాదేశ్‌కు పంపించేయాలని హిందూ అతివాద నాయకులు కోరుతున్నారు.

మరోవైపు సరిహద్దుల్లో బంగ్లాదేశ్ పౌరులను భారత బలగాల హతమార్చడం కూడా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తోంది. 2011 నుంచి 300 మందికిపైగా బంగ్లాదేశ్ పౌరులను బలగాలు హతమార్చాయని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. దీనిపై బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

మృతుల్లో చాలా మంది స్మగ్లర్లు, నేరస్థులే ఉన్నారని భారత అధికారులు చెబుతున్నారు. అయితే, వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులేనని బంగ్లాదేశ్ చెబుతోంది. భారత్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ ఈ హత్యలు ఆగడంలేదని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

''భారత్-బంగ్లాదేశ్ బందాలతో కేవలం బంగ్లాదేశ్‌కే మేలు జరుగుతుందని అనుకోకూడదు. ఎందుకంటే భారత్‌కు కూడా ఈ బంధాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి''అని షిరీన్ అన్నారు.

వేర్పాటువాద సంస్థలు క్రియాశీలంగా పనిచేసే ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ శాంతి భద్రతల పరిరక్షణకు బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.

బంగ్లాదేశ్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని భారత్ తరచూ చెబుతుంటుంది. అయితే, పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో భారత్ బంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్న సమయంలో.. బంగ్లాదేశ్‌తో సంబంధాలపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరముంది.

మోదీకి వ్యతిరేకంగా ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు భారత్‌కు హెచ్చరికల్లాంటివి. ఇక్కడి ప్రజల ఆగ్రహావేశాలను పట్టించుకోకపోతే, భారత్ కేవలం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాత్రమే సత్సంబంధాలు కలిగివున్నట్లు అవుతుంది. బంగ్లాదేశ్ ప్రజలతో కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)