క్రొయేషియా: తేనెటీగలు బాంబులు, మందుపాతరలు ఎక్కడ ఉన్నాయో కనిపెడతాయా?

  • క్రిస్ బరన్యూక్
  • బీబీసీ ప్రతినిధి
తేనెటీగలు మందుపాతరలు కనిపెడతాయి

ఫొటో సోర్స్, BEE4EXP

తేనెటీగలకు ఎన్నో మంచి గుణాలతో పాటు, బాంబులను గుర్తించే నైపుణ్యం కూడా ఉందని మీకు బహుశా తెలిసుండకపోవచ్చు.

అవి తమ యాంటెన్నాల సాయంతో పేలుడు పదార్థాల వాసనను పసిగట్టగలవనే వాస్తవాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.

భూమిలో పాతిపెట్టిన మందుపాతరలను గుర్తించడానికి తేనెటీగలను ఎలా ఉపయోగించాలి అనేదానిపై క్రొయేషియా లాంటి దేశాల్లోని పరిశోధకులు ఏళ్ల తరబడి పరిశోధనలు చేశారు.

కానీ ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. మందుపాతరలున్న ప్రాంతానికి, అవి వేగంగా చేరుకుంటాయి కాబట్టి, మనుషులు వాటిని అనుసరించి వెళ్లడం చాలా కష్టం.

అందులోనూ మందుపాతరలున్న ప్రాంతంలో తేనెటీగల వెంట పరుగులు తీయడం కూడా చాలా ప్రమాదం.

అందుకే, వాటికితోడుగా శాస్త్రవేత్తలు డ్రోన్లను రంగంలోకి దించారు.

తేనెటీగలు మందుపాతరలను గుర్తించడానికి వెళ్తున్నప్పుడు, వాటిని ట్రాక్ చేయడానికి డ్రోన్లు ఉపయోగించే పద్ధతిని బోస్నియా, హెర్జ్‌గవీనా, క్రొయేషియా దేశాల ఒక పరిశోధకుల బృందం కనిపెట్టింది.

రిమోట్‌తో నడిచే ఈ డ్రోన్లు తేనెటీగలను ట్రాక్ చేస్తాయి.. అవి ఎక్కడ ఉన్నాయో చిత్రీకరిస్తాయి. తర్వాత ఆ ఫుటేజిని కంప్యూటర్ల ద్వారా విశ్లేషించి నేలలో ఎక్కడెక్కడ మందుపాతరలు పాతిపెట్టారో గుర్తిస్తారు.

దశాబ్దాల క్రితం యుద్ధాలు జరిగినపుడు పాతిపెట్టిన మందుపాతరలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాంతకంగా మారుతున్నాయి.

1990లో జరిగిన బాల్కన్ యుద్ధాల సమయంలో కొన్ని వేల మందుపాతరలు పాతిపెట్టారు. వాటివల్ల ఇప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఒక అంచనా ప్రకారం బోస్నియా, హెర్జ్‌గవీనాలో 80 వేలు, క్రొయేషియాలో మరో 30 వేల మందుపాతరలు ఇప్పటికీ భూమి లోపల ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బాల్కన్ యుద్ధంలో వందల మందుపాతర్లు పాతిపెట్టారు

మందుపాతరలను గుర్తించడానికి సులభమైన పద్ధతులు లేవు. దీంతో వీటన్నిటినీ వెలికితీయడం ఇప్పటికీ ఒక సుదీర్ఘ ప్రక్రియగా మారింది.

కానీ సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఆ పరిస్థితిలో మార్పులు తీసుకురావచ్చు.

"ఈ ప్రక్రియలో మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే, మేం డ్రోన్లు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం" అని బోస్నియా, హెర్జ్‌గవినాలోని బంజా యూనివర్సిటీకి చెందిన వ్లాదిమిర్ రిసోజెవిక్ చెప్పారు.

ఇంతకు ముందు, మరో పరిశోధకుల బృందం మందుపాతరలు గుర్తించేలా తేనెటీగలకు శిక్షణ ఇచ్చే ఒక పద్ధతిని కనుగొంది. వాటికి ఆహారంగా ఇచ్చే చక్కెర ద్రావణంలో టీఎన్‌టీ వాసనను కూడా కలపడం ద్వారా వారు తేనెటీగలకు ఆ వాసన పసిగట్టడం అలవాటు చేశారు.

శిక్షణ పొందిన ఆ తేనెటీగలను వదలగానే. అవి ఆహారం వెతుక్కుంటూ మందుపాతరలు పాతిపెట్టిన ప్రాంతాలకు చేరుకుంటాయి.

ఇలాంటి ప్రయత్నాలు చాలా ఏళ్లనుంచీ చురుగ్గా సాగుతున్నాయి.

కానీ, మందుపాతరల దగ్గరకు వెళ్లే తేనెటీగలను వీడియో తీయడం ద్వారా, వాటి యాక్టివిటీని.. కంప్యూటర్ సాయంతో ఆటోమేటిగ్గా అనలైజ్ చేయచ్చని, ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ మందుపాతరలు ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చని ప్రొఫెసర్ రిసోజెవిక్ చెప్పారు.

అయితే, వీడియోలో ఎగురుతున్న తేనెటీగలను మనుషులు గుర్తించడం చాలా కష్టంగా ఉందని అని ఆయన చెప్పారు.

"ఇలాంటి పరిశోధనలు చేయడం పిచ్చితనమేనని మేం కొన్నిసార్లు అనుకున్నాం. కానీ, మాకు లభించిన ఫలితాలు మమ్మల్ని నిజంగానే ఆశ్చర్యంలో పడేశాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BEE4EXP

ఫొటో క్యాప్షన్,

డ్రోన్ తీసిన ఫుటేజిలో బూడిద రంగు మచ్చల్లా సింథటిక్ బీస్

మొదట ఈ బృందం ఒక బహిరంగ ప్రాంతంలో డ్రోన్ తీసిన ఫుటేజ్‌ మీద, మందుపాతరలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ, సింథటిక్ తేనెటీగలను సూపర్ ఇంపోజ్ చేశారు. అవి అందులో బూడిద రంగు మచ్చల్లా కనిపిస్తాయి.

తర్వాత అసలు తేనెటీగలను కూడా పంపి, ఆ ఫుటేజికి, సింథటిక్ తేనెటీగల దృశ్యాలకు ఏమాత్రం తేడాలు లేవనే విషయం గమనించారు.

దీనిని బట్టి ఆ బృందం ఒక మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం తయారు చేసింది. స్క్రీన్ మీద ఉన్న మచ్చలను బట్టి అది మందుపాతరలను కచ్చితత్వంతో గుర్తించేలా ట్రైన్ చేశారు.

ఈ పరీక్షలను ఇటీవల ఒక పత్రికలో ప్రచురించారు. డిజిటల్ తేనెటీగలను ఈ అల్గారిథం 80 శాతానికి పైగా కచ్చితత్వంతో ట్రాక్ చేసినట్లు నిరూపితమైందని చెప్పారు.

ఫొటో సోర్స్, BEE4EXP

ఫొటో క్యాప్షన్,

తేనెటీగలను చిత్రీకరిస్తున్న డ్రోన్

తర్వాత ప్రామాణిక పరిస్థితుల్లో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోడానికి పరిశోధకులు, ఈ తేనెటీగలను నిర్వీర్యం చేసిన నిజమైన మందుపాతరలు పాతిపెట్టిన క్రొయేషియాలోని ఒక సురక్షితమైన మైన్ యాక్షన్ సెంటర్‌లో ప్రయోగించారు.

ఈ పరీక్షల ఫలితాలను ఇంకా అకడమిక్ పేపర్‌లో ప్రచురించాల్సి ఉంది. కానీ, తేనెటీగలు చాలా వరకూ టెస్టింగ్ సైట్‌లో మందుపాతరలు పాతిపెట్టిన ప్రాంతాల్లోనే భారీగా గుమిగూడి ఉండడం కనిపించిందని ప్రొఫెసర్ రిసోజెవిక్ చెప్పారు.

ప్రస్తుతం ముందే నిర్ణయించిన మార్గంలో వెళ్లేలా, తేనెటీగలపై తిరుగుతూ అవి ఎగిరే ప్రాంతాలను చిత్రీకరించేలా ప్రోగ్రాం చేసిన డ్రోన్ల ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేస్తోంది. తర్వాత, ఆ ఫుటేజిని విశ్లేషించి, తేనెటీగలు ఎక్కువగా ఎక్కడ గుమిగూడాయి అనేది తెలుసుకుంటారు.

ప్రమాదకరమైన మందుపాతరలున్న ప్రాంతాలను గుర్తించేలా దీన్ని ఉపయోగించడానికి, ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చని ప్రొఫెసర్ రిసోజెవిక్ చెబుతున్నారు.

అయితే, మందుపాతరలు బయటకు తీయడానికి మిగతా పద్ధతులతోపాటూ దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ బిల్టిన్ మెటల్ డిటెక్టర్లను చేత్తో పట్టుకుని మందుపాతరలను గుర్తించడం లాంటివి ఉన్నాయి.

ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ.. పాతిపెట్టిన ప్రాంతంలో అన్ని మందుపాతరలూ తీసేశారా అనేది పక్కాగా తెలుసుకోవడం కష్టం. అందుకే, ఆ తర్వాత అక్కడ తేనెటీగలు, డ్రోన్లతో చెక్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక్క మందుపాతర కూడా మిస్ కాలేదని ధ్రువీకరించుకోవచ్చు.

ఫొటో సోర్స్, PACE UNIVERSITY

ఫొటో క్యాప్షన్,

మాథ్యూ బ్రే బోల్టన్

"ఒక ప్రమాదకరమైన ప్రాంతాన్ని ధ్రువీకరించుకోడానికి మంచి సాంకేతిక ఆవిష్కరణలు ఉండడం చాలా సహాయం అవుతుంది" అని 'పొలిటికల్ మైన్‌ఫీల్డ్స్-ది స్ట్రగుల్ అగైనెస్ట్ ఆటొమేటెడ్ కిల్లింగ్' పుస్తక రచయిత న్యూయార్క్ పేస్ యూనివర్సిటీకి చెందిన మాథ్యూ బ్రే బోల్టన్ అన్నారు.

అయితే, మందుపాతరల సమస్యకు ఇప్పటికిప్పుడు ఎలాంటి పరిష్కారం లేదని ఆయన అన్నారు. సాయం అందించడానికి ఎన్నో టెక్నాలజీలు ఉన్నప్పటికీ, రాజకీయ గొడవలు, వనరుల కొరత వల్ల ఇలాంటి ప్రాజెక్టులు తరచూ ఆగిపోతుంటాయని చెప్పారు. దానికి తోడు యెమెన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ మందుపాతరలు పాతిపెట్టడం కొనసాగుతోందని చెప్పారు.

తమకు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్రొయేషియా, బోస్నియా, హెర్జ్‌గవినా లాంటి దేశాల్లో పాతిపెట్టిన మందుపాతరలు తొలగించడానికి ఏదో ఒక రోజు తన బృందం సాయం అందిస్తుందని ప్రొపెసర్ రిసోజెవిక్ చెబుతున్నారు.

ఇలాంటి అప్లికేషన్లు ఇంకా చాలా ఉన్నాయి.

ఇటీవల ఏళ్లలో కంప్యూటర్ విజన్ పరిశోధకులు అడవిలోని, కీటకాలను ట్రాక్ చేయడానికి ఒక ప్రయోగాత్మక వ్యవస్థలను తయారు చేశారు.

అలాంటి పరికరాలు ఒక రోజున పరాగ సంపర్కానికి కారణమయ్యే కీటకాలను పరిశీలించడానికి ఉపయోగపడతాయని ప్రొఫెసర్ రిసోజెవిక్, ఆయన బృందం చెబుతున్నారు.

పంటలు పండడానికి, పర్యావరణానికి తేనెటీగలు, ఇలాంటి కీటకాలు చాలా ముఖ్యం. కానీ ఇటీవల వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎక్కువగా మనుషుల ద్వారా ఏర్పడే కాలుష్యం వల్ల ఇవి అంతరిస్తున్నాయి.

కీటకాలు, యంత్రాలు కలిసి పనిచేయడం అనేది ఒక మంచి ఆలోచన, అది బహుశా మన భూమికి కూడా మంచిదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)