కరోనావైరస్ ఎలా పుట్టింది.. మనుషులకు ఎలా సోకింది.. WHO కనిపెట్టిన 4 అంశాలు.. ఇంకా సమాధానం దొరకని 3 ప్రశ్నలు..

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ ఎలా పుట్టింది.. మనుషులకు ఎలా సోకింది..
ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకని ప్రశ్నలు ఇవి.
వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాకు వెళ్లి పరిశోధించింది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం.
చైనాలో పరిశోధించిన డబ్ల్యూహెచ్ఓ బృందంలో 17 మంది చైనా నిపుణులు, మరో 17 మంది అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు.
రెండు వారాల పాటు అక్కడి ఆసుపత్రులు, మార్కెట్లు, ల్యాబ్‌లను వీరు సందర్శించారు.
మిగతా దేశాల నుంచి వచ్చిన అధికారిక సమాచారం, అధ్యయనాలను కూడా వీళ్లు సమీక్షించారు.
దక్షిణ చైనాలోని ఫామ్‌లు, సప్లై మార్కెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను విశ్లేషించారు.
ఈ అధ్యయనానికి చైనా అధికారులు మొదట అడ్డుతలిగారు. ఆ తర్వాత ఇది ముందుకు సాగినప్పటికీ.. అదంతా చైనా నియంత్రణలోనే సాగింది.
పరిశోధన పూర్తి చేసి, డబ్ల్యూహెచ్ఓ బృందం ఇచ్చిన 120 పేజీల నివేదికలో... కరోనావైరస్ మూలాల గురించి, అది మనుషులకు వ్యాపించిన తీరు గురించి విశ్లేషిస్తూ ఆ బృందం నాలుగు రకాల సిద్ధాంతాలను చర్చించింది.
‘‘ఈ నివేదిక తొలి అడుగే. ముగింపు కాదు. మేం వైరస్ మూలాలను ఇంకా గుర్తించలేదు. అనేక సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ అంగీకరించారు.
ఫొటో సోర్స్, Getty Images
వైరస్ ఇలా పుట్టి ఉండొచ్చు - W.H.O.
1. నేరుగా జంతువు నుంచి మనిషికి...
ఇప్పటి వరకు మనుషులకు సోకిన వివిధ రకాల కరోనావైరస్లు చాలా వరకూ జంతువుల్లోనే మొదలైనట్లు బలమైన ఆధారాలున్నాయి.
కోవిడ్-19కు కారణమైన కరోనావైరస్ కూడా ఇలాగే జంతువుల నుంచి మనిషికి వ్యాపించి ఉండొచ్చని WHO నివేదిక అభిప్రాయపడింది.
మనుషుల్లోకి వ్యాపించే అవకాశం ఉన్న వైరస్లు గబ్బిలాల్లో చాలా ఉంటాయి. కరోనావైరస్ కూడా గబ్బిలం నుంచి మనుషులకు వచ్చి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది.
పాంగోలిన్, మింక్ జంతువుల నుంచి కూడా మనుషులకు వైరస్ పాకి ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.
2. మధ్యలో మరో జంతువు...
ఇక కరోనావైరస్ మొదట ఏదో ఒక జంతువులో మొదలై, దాని నుంచి మరో జీవికి పాకి, దాని ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసింది.
గబ్బిల్లాల్లో ఉండే కరోనావైరస్లకు, మనుషులకు సోకుతున్న వైరస్‌కు మధ్య తేడాలు అందుకే ఉండి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.
వన్యప్రాణులు, పెంపుడు జంతువుల్లాంటివి ఈ మధ్యలో వాహక పాత్ర పోషించి ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది.
అయితే, వైరస్ ఒక జీవి నుంచి మరొక జీవికి పాకడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, దాన్ని కనిపెట్టడం చాలా కష్టమని పరిశోధకులు అంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
3. ఆహారం ద్వారా...
ఆహారం ద్వారా గానీ, వాటిని ఉంచే డబ్బాల ద్వారా గానీ కరోనావైరస్ మనుషులకు సోకి ఉండే అవకాశాలున్నాయన్న వాదన కూడా ఉంది.
శీతల మాంసం ఉత్పత్తులను కూడా ఇలాంటి ఆహారాల జాబితాలో పేర్కొంది.
చైనాలోని వుహాన్ మార్కెట్లో ఇలాంటి ఉత్పత్తులు అమ్ముడయ్యేవి.
ఇలాంటి ఉత్పత్తుల్లో వైరస్ మనుగడ సాగిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయి.
చైనా అధికారిక మీడియా ఇదే వాదనను సమర్థిస్తూ విదేశాల నుంచి ఇలాంటి ఉత్పత్తుల ద్వారా తమ దేశానికి కరోనావైరస్ వచ్చి ఉండొచ్చని వాదిస్తోంది.
అయితే, ఆహారం నుంచి ఇలా వైరస్ వచ్చి, వ్యాపించే అవకాశాలున్నాయని నిర్ధారించే ఆధారాలేవీ లేవని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది.
ఫొటో సోర్స్, Reuters
4. ల్యాబ్ నుంచి రాకపోయి ఉండొచ్చు.. కానీ...
వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న ల్యాబుల్లో ప్రమాదవశాత్తు సిబ్బందికి సోకి గానీ, మరో రకంగా గానీ వైరస్ బయటకు వ్యాపించి ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి.
ఈ వైరస్‌ను ల్యాబుల్లో తయారుచేశారా? ఎవరైనా కావాలనే వైరస్‌ను వ్యాప్తి చేశారా? అన్న విషయాలను తాము విశ్లేషించలేదని డబ్ల్యూహెచ్ఓ బృందం తెలిపింది.
ల్యాబుల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది.
అయితే, ఇప్పుడు వ్యాపించిన కరోనావైరస్తో దగ్గరి సంబంధాలున్న వైరస్లు 2019 డిసెంబర్లో ఏ ల్యాబ్‌లోనూ ఉన్నట్లు ‘రికార్డులు లేవని’ పేర్కొంది.
కరోనావైరస్లపై పరిశోధనలు చేస్తున్న వుహాన్‌లోని మూడు ల్యాబుల్లోనూ అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారని... 2019 డిసెంబర్‌కు ముందు అక్కడి సిబ్బంది ఎవరికీ కోవిడ్-19 సోకిన కేసులు నమోదు కాలేదని తెలిపింది.
‘‘వైరస్ ల్యాబ్ నుంచి లీకవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. అసలు అలా లీకవ్వలేదని చెప్పడానికి మాత్రం ప్రత్యేకమైన నిపుణులతో మరింత లోతైన పరిశోధనలు, దర్యాప్తులు చేయాల్సి ఉంటుంది’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు..
అయితే, సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి.
కరోనావైరస్ కేసులు మొదట చైనాలోని వుహాన్ నగరంలోనే బయటపడ్డాయి.
అక్కడున్న ఓ వన్యప్రాణుల మార్కెట్ నుంచే వైరస్ వ్యాపించిందని చాలా కథనాలు వచ్చాయి.
అయితే డబ్ల్యూహెచ్ఓ నివేదిక వైరస్ వ్యాప్తిలో ఈ మార్కెట్ పాత్రపై ఎలాంటి నిర్ధారణకూ రాలేదు.
రెండోది.. వుహాన్ మార్కెట్‌కు 20కిపైగా దేశాల్లో ఉన్న వన్యప్రాణుల ఫామ్‌ల నుంచి జంతువులు వస్తాయి.
గబ్బిలాల్లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని ఏదో ఒక ఫామ్‌లోని జంతువులకు వైరస్ సోకి... అలా అది వుహాన్కి వచ్చి ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి.
కానీ, దీన్ని నిరూపించాలంటే మరింత లోతైన అధ్యయనం జరపాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అభిప్రాయపడింది.
మూడోది.. మనుషుల్లో కరోనా మొదటిసారి బయటపడానికి కొన్ని వారాల ముందు నుంచే ఈ వైరస్ వ్యాపిస్తూ ఉండొచ్చనిఈ నివేదిక సూచించింది.
పలు దేశాలు ప్రచురించిన అనేక అధ్యయనాలను ఈ బృందం అధ్యయనం చేసింది. ముందు నుంచే వైరస్ వ్యాప్తిలో ఉందనే సంకేతాలు వాటిలో ఉన్నాయని పేర్కొంది.
వూహాన్లో మొదటి కరోనా కేసు నమోదు కావడానికి ముందే కోవిడ్ పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్న పలు శాంపిల్స్ బయటపడ్డాయని, దాన్ని బట్టి చూస్తుంటే వూహాన్ కంటే ముందే ఇతర దేశాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోందని అనుమానాలు వస్తున్నాయని ఈ నివేదిక WHO అభిప్రాయపడింది.
అయితే, ఆ నివేదికల నాణ్యత పరిమితమేనని కూడా ఈ టీమ్ చెప్పుకొచ్చింది. కానీ తొలి కేసు ఎక్కడ మొదలైందో దర్యాప్తు చేయడం అవసరమని తెలిపింది.
ఫొటో సోర్స్, Reuters
ఒత్తిడి మధ్య అధ్యయనం...
చైనాలో, బయటా తాము రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన పీటర్ బెన్ ఎంబారెక్ మంగళవారం అన్నారు.
అయితే, ఏదైనా అంశాన్ని తమ నివేదిక నుంచి తొలగించాలంటూ చైనా తమను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆయన చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదికపై అమెరికా, బ్రిటన్ సహా 14 దేశాలు స్పందించాయి.
డబ్ల్యూహెచ్ఓ నిపుణులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని చైనాను కోరాయి.
‘‘పూర్తి, అసలైన సమాచారం, శాంపిళ్లు ఈ అధ్యయనంలో లోపించాయి. తీవ్ర జాప్యం కూడా జరిగింది. శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం అవసరం. అప్పుడే నిజాలు బయటికొస్తాయి’’ అని వ్యాఖ్యానించాయి.
ఇవి కూడా చదవండి:
- దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)