ఆంధ్రప్రదేశ్‌లో 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 10న ఫలితాలు - News Reel

పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 10న నిర్వహించబోతున్నట్లు నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల నిర్వహణపై అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తైన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి... పొరపాటునే ఆ ఉత్తర్వులు వచ్చాయి: నిర్మలా సీతారామన్

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

ఈ పథకాల్లో 2020-2021 చివరి త్రైమాసికం వడ్డీరేట్లే కొనసాగుతాయని ఆమె చెప్పారు.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ తగ్గిస్తూ నిన్న నిర్ణయం తీసుకున్నారు.

అయితే, నిన్న జారీ చేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పొరపాటున జారీ అయినవేనని, వాటిని వెనక్కితీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.

ఆయా పథకాలపై గత ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయంటూ ఆమె ట్వీట్ చేశారు.

నిన్న ఏం జరిగింది?

చిన్న మొత్తాల పెట్టుబడులపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గత మూడు త్రైమాసికాలలో కొనసాగిస్తూ వచ్చిన వడ్డీ రేటును ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే త్రైమాసికంలో తగ్గిస్తున్నట్లు కేంద్రం బుధవారం తెలిపింది.

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై వడ్డీని 7.1 శాతం నుంచి 6.4కు కేంద్రం తగ్గించింది. మరోవైపు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీని కూడా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది.

వార్షిక డిపాజిట్లపై వడ్డీని 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. మరోవైపు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు.

సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ)పై వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు.

ప్రభుత్వ రాబడుల ఆధారంగా, ప్రతీ ఆర్థిక త్రైమాసికానికీ ప్రభుత్వం చిన్న మొత్తాల పెట్టుబడులపై వడ్డీ రేట్లను ప్రకటిస్తుంటుంది.

ఉద్యోగులు ఎక్కువగా ఈ చిన్నమొత్తాల పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తుంటారు. వీటిలో చాలా పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

ఫొటో సోర్స్, AFP

''నేను చెడ్డవాణ్ని కాదు.. నన్ను కాల్చొద్దు.. మా అమ్మ కూడా చనిపోయింది''..

''నేను చెడ్డవాణ్ని కాదు. నన్ను కాల్చొద్దు.. మా అమ్మ కూడా చనిపోయింది. మీరు ఏం చెప్పినా చేస్తాను''అంటూ అమెరికా పోలీసుల్ని ఫ్లాయిడ్ వేడుకొంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తున్నారు.

పోలీసుల బాడీక్యామ్‌లో రికార్డు అయిన ఈ దృశ్యాలను మిన్నెయాపోలిస్ కోర్టులో అధికారులు సమర్పించారు.

ఫ్లాయిడ్‌ మెడపై తొమ్మిది నిమిషాలపాటు మోకాలితో నొక్కి హత్య చేసినట్లు 45ఏళ్ల పోలీసు అధికారి డెరెక్ చావిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసు విచారణ సమయంలో అధికారులు తాజా దృశ్యాలను కోర్టులో సమర్పించారు.

ఫ్లాయిడ్‌కు ఆరోగ్యం బాగాలేదని, ఆయనపై డెరెక్ అంత ఒత్తిడి చేయలేదని కోర్టులో డెరెక్ న్యాయవాది వాదించారు.

ఈ కేసులో డెరెక్ దోషిగా నిరూపణ అయితే, పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images

హాంకాంగ్ నిరసనలు: మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్ దోషిగా నిర్ధరణ

రెండేళ్ల క్రితం హాంకాంగ్‌లో చెలరేగిన విధ్వంసకర ఘర్షణలకు సంబంధించి ఏడుగురు ప్రముఖ పౌర హక్కుల ఉద్యమకారులు దోషులుగా నిర్ధరణ అయ్యారు.

మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్, సీనియర్ రాజకీయ నాయకుడు మార్టిన్ లీ కూడా ప్రస్తుతం దోషులుగా నిరూపణ అయిన వారిలో ఉన్నారు. వీరికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశముంది.

ఈ కేసు విచారణ సమయంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకే వీరిని దోషులుగా నిర్ధారించారని కోర్టు బయట పలువురు నిరసనలు చేపట్టారు.

హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమకారుల్లో జిమ్మీ లాయ్ కూడా ఒకరు. చైనా కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద కూడా ఆయనపై అభియోగాలు మోపారు.

జిమ్మీ నడుపుతున్న మీడియా సంస్థ నెక్స్ట్ డిజిటల్.. చైనాకు వ్యతిరేకంగా చాలా వార్తలు ప్రచురించింది. జిమ్మీని చాలా మంది హాంకాంగ్ వాసులు హీరోగా కీర్తిస్తుంటారు. కానీ చైనా ఆయన్ను దేశద్రోహిగా అభివర్ణిస్తోంది.

ఫొటో సోర్స్, Nia

పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోదాలు చేస్తోంది.

హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ ఇంటిలో.. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్.. అలాగే డప్పు రమేశ్, పలువురు ఇతర నాయకుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.

కాగా పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావులు ఖండించారు.

ఫొటో సోర్స్, Nsdl

పాన్, ఆధార్ లింకేజీ గడువు పెంపు.. జూన్ 30 వరకు అవకాశం ఇచ్చిన కేంద్రం

ఆధార్, పాన్ అనుసంధాన గడువును కేంద్రం మరో మూడు నెలలు పెంచింది. ఈ ఏడాది జూన్ 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం ప్రకటించింది.

కోవిడ్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

మరోవైపు 'రికరింగ్ ఆన్‌లైన్ ట్రాంజాక్షన్'లకు అదనపు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడాన్ని కూడా సెప్టెంబరు 30 వరకు వాయిదా వేశారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

మార్చి 31 తరువాత ఇలాంటి ఆటోమేటిక్ చెల్లింపుల ప్రక్రియను నిలిపివేయాలని.. అడిషినల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్(ఏఎఫ్ఏ) తప్పనిసరిగా ఇవ్వాలని గతంలో ఆర్‌బీఐ సూచించింది.

దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు వస్తాయని బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులకు సమాచారం పంపించాయి.

అయితే, తాజాగా ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాల అమలును సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.

ఫొటో క్యాప్షన్,

బీబీసీ చైనా ప్రతినిధి జాన్ సడ్‌వర్త్

ప్రభుత్వ బెదిరింపుల కారణంగా తైవాన్‌ వెళ్లిపోయిన బీబీసీ చైనా ప్రతినిధి జాన్ సడ్‌వర్త్

చైనా అధికారుల ఒత్తిడి, బెదిరింపుల కారణంగా బీబీసీ చైనా ప్రతినిధి జాన్ సడ్‌వర్త్ కుటుంబంతో సహా చైనా వదిలి వెళ్లిపోయారు.

షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలపై చైనా అరాచకాలకు సంబంధించి జాన్ రాసిన కథనాలకు చాలా అవార్డులు వచ్చాయి.

జాన్ తమకు గర్వకారణమని, ఇప్పటికీ తనే తమ రిపోర్టర్ అని బీబీసీ స్పష్టంచేసింది.

షిన్‌జియాంగ్‌లో తాము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని, జాన్ రాస్తున్నవన్నీ తప్పుడు కథనాలని చైనా ఆరోపిస్తోంది.

చైనాలో ఉండటం తనకు చాలా కష్టంగా మారుతోందని, అందుకే తైవాన్‌కు వెళ్లిపోతున్నానని జాన్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

షిన్‌జాంగ్‌లోని మసీదు

ఎయిర్ పోర్ట్‌లోనూ సాధారణ దుస్తులు వేసుకున్న పోలీసులు జాన్, ఆయన కుటుంబాన్ని ఫాలో అయ్యారు.

జాన్ భార్య యువోనే ముర్రే ఐర్లాండ్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ఆర్‌టీఈ తరఫున పనిచేస్తున్నారు.

తాము అడుగుపెట్టిన ప్రతిచోట కేసులు, నిఘా, బెదిరింపులు వస్తున్నాయని జాన్ చెప్పారు. జాన్‌తో పనిచేసిన బీబీసీ సిబ్బంది ఇప్పటికీ బీజింగ్‌లోనే ఉన్నారు. తను తైవాన్ నుంచి వారితో కలిసి పనిచేస్తానని ఆయన స్పష్టంచేశారు.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జాన్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

''జాన్ ప్రెస్ కార్డు పునరుద్ధరించే సమయంలో ఆయన చెప్పకుండా తైవాన్ వెళ్లినట్లు తెలిసింది. ఆయన ఎందుకు వెళ్తోంది? ఎక్కడకు వెళ్తోంది? చెప్పనేలేదు''అని హువా చన్యింగ్ వ్యాఖ్యానించారు.

''ప్రపంచం తెలుసుకోకూడదని చైనా భావించిన నిజాలను జాన్ వెలుగులోకి తీసుకొచ్చారు. అందుకే ఆయనపై చైనా ఒత్తిడి చేస్తోంది''అని బీబీసీ ఒక ప్రటకన విడుల చేసింది.

ఫొటో సోర్స్, AFP

వైట్‌హౌస్ సిబ్బందిని మళ్లీ కరిచిన బైడెన్ శునకం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శునకం మేజర్.. మరోసారి వైట్‌హౌస్ సిబ్బందిని కరిచింది.

ఇటీవల డెలావేర్ నుంచి ట్రైనింగ్ పూర్తిచేసుకుని వచ్చిన ఈ శునకం ఇంతకుముందు కూడా ఒకరిని కరిచింది.

మేజర్ కరిచిన వ్యక్తికి వైద్య సిబ్బంది సాయం అందించారని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ అధికార ప్రతినిధి తెలిపారు.

బెడెన్‌కు రెండు జెర్మన్ షెఫెర్డ్ శునకాలు ఉన్నాయి. వీటిలో మేజర్ చిన్నది. అది చాలా మంచిదని ఇదివరకు బైడెన్ చెప్పారు.

''కొత్త పరిస్థితులకు ఇంకా మేజర్ అలవాటు పడుతోంది. వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకరిని అది కరిచింది''అని జిల్ బైడెన్ అధికార ప్రతినిధి మైఖేల్ లారోసా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)