కరోనావైరస్: మీ పెంపుడు జంతువులకు కూడా వ్యాక్సీన్ వేయించాలా... లేదంటే ప్రమాదమా?

పెంపుడు జంతువులకు వ్యాక్సీన్ వేయించాలా...

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఈ వైరస్ జంతువులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే విషయంలో నిపుణుల నుంచి చాలా రకాల ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

చాలా రకాల జంతువుల్లో కరోనా ఇన్ఫెక్షన్లు కనిపించినప్పటికీ, వాటి ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని చెప్పడానికి ఆధారాలేవీ లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. కుక్కలు, పిల్లులు, కోతులు, మింక్‌లు... ఇలా కరోనావైరస్ సోకిన జంతు జాతుల్లో ఉన్నాయి.

జంతువుల్లో ఇన్ఫెక్షన్లను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కోవిడ్-19 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి జంతువుకు తాము కోవిడ్ వ్యాక్సీన్ ఇచ్చామని రష్యా బుధవారం ప్రకటించింది.

కానీ, నిజంగా జంతువులకు వ్యాక్సీన్లు వేయాల్సిన అవసరం ఉందా? జంతువులకు ఇన్ఫెక్షన్లు వస్తాయా?

ఈ విషయంలో సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉంది. దీనిపై ఇప్పటివరకూ అధ్యయనాలు చిన్న స్థాయిలోనే జరిగాయి.

చాలా దేశాల్లో స్వల్ప సంఖ్యలో పిల్లులు, కుక్కలు కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు గురైన కేసులు వచ్చాయి. గత ఏడాది జులైలో బ్రిటన్‌లో తొలి సారి ఓ పిల్లికి కోవిడ్ సోకిన కేసు నమోదైంది.

‘‘ఇది చాలా అరుదైన సంఘటన. ఇన్ఫెక్షన్‌కు గురైన జంతువుల్లో ఇప్పటివరకూ స్వల్ప స్థాయి లక్షణాలే కనిపించాయి. కొన్ని రోజుల్లోనే అవి కోలుకున్నాయి’’ అని అప్పుడు బ్రిటన్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టీన్ మిడిల్మిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గొరిల్లాలకు మనుషుల నుంచి శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

పెంపుడు జంతువులే కాదు... కొన్ని జూలోని జంతువులలోనూ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలోని న్యూయార్క్‌లో బ్రాంక్స్ జూలో ఓ పులికి కరోనావైరస్ సోకింది. అమెరికాలో ఓ జంతువు కోవిడ్ బారినపడ్డ కేసుల్లో అదే మొదటిదై ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆ తర్వాత కాలిఫోర్నియాలోని శాండియాగో జూలో ఎనిమిది గొరిల్లాలు కోవిడ్ పాజిటివ్‌గా తేలాయి.

ఈ రెండు కేసుల్లోనూ జూ కీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తుల నుంచే ఆ జంతువులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. స్వల్ప లక్షణాలతో ఆ జంతువులు కోలుకున్నాయి.

మింక్ జంతువుల్లో మాత్రం కోవిడ్ వ్యాధి తీవ్ర ప్రభావం చూపించింది. వీటిని చర్మం కోసం చాలా దేశాల్లో ఫామ్‌ల్లో పెంచుతుంటారు.

చాలా దేశాల్లో మింక్ ఫామ్‌ల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మింక్‌లు తీవ్ర స్థాయిలో అనారోగ్యం బారినపడటం, మరణించడం వంటివి కనిపించాయి.

డెన్మార్క్‌లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు లక్షల సంఖ్యలో మింక్‌లను చంపేశారు. 2022 వరకూ ఈ ఫామ్‌లనే ఏర్పాటు చేయకుండా నిషేధం విధించారు.

మ్యుటేషన్ చెందిన వైరస్‌ను మింక్‌లు మనుషులకు అంటించాయని కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మహమ్మారి వ్యాప్తి తరువాత డెన్మార్క్‌లో మింక్‌లను లక్షల సంఖ్యలో హతమార్చారు

అవసరం ఉందా?

జంతువులకు వ్యాక్సీన్ తేవాల్సిన అవసరం ఉందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లులు, కుక్కలను ఉదాహరణగా తీసుకుంటే... అవి వైరస్‌ను మనుషులకు అంటిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కుక్కలు, పిల్లులకు వ్యాక్సీన్ వేయించాల్సిన అవసరమే లేదని ఎకోహెల్త్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరోగ్య నిపుణుడు విలియం కరేష్ గత ఏడాది సైన్స్ మ్యాగజీన్‌తో అన్నారు.

పెంపుడు జంతువుల వ్యాక్సీన్ల విషయంలో నియంత్రణ సంస్థగా ఉన్న అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఇదే వైఖరి వ్యక్తం చేసింది.

మిగతా జంతువుల విషయానికి వస్తే... మింక్‌లు కోవిడ్‌ను వ్యాప్తి చేస్తాయన్న అనుమానాలున్న కారణంగా జంతువులకు కూడా వ్యాక్సీన్ అభివృద్ధి చేయాలన్న వాదనలో బలం కనిపిస్తోందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

మనుషులకు వచ్చే శ్వాసకోశ వ్యాధులతో కోతులకు కూడా ముప్పు ఉంటుందని, ముఖ్యంగా గొరిల్లాలకు ఈ ప్రమాదం ఉందని జంతు పరిరక్షణ కార్యకర్తలు అంటున్నారు. వాటి కోసం వ్యాక్సీన్ తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కొన్ని జంతువులకు వైరస్ సోకే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి

వేయకపోతే ఏంటి?

ఒక వేళ తీవ్ర పరిస్థితులే వస్తే, అంతరించిపోవడానికి దగ్గర్లో ఉన్న గొరిల్లా లాంటి జంతువులు కనుమరుగైపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జంతువుల్లో వైరస్ మ్యుటేషన్ చెంది, మరింత ప్రమాదకారిగా కూడా మారొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మ్యుటేషన్ చెందిన వైరస్‌లకు కూడా ప్రస్తుతం ఉన్న వ్యాక్సీన్లు పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

‘‘జంతువుల్లో వైరస్ పూర్తిగా వేరేలా పరిణమించి, భవిష్యత్తులో మనకు మళ్లీ సవాలుగా మారొచ్చు. దీనికి ఉత్తమ పరిష్కారం జంతువులకు కూడా వ్యాక్సీన్ కనిపెట్టడమే’’ అని వైరెలెన్స్ జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ కెవిన్ టైలర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వ్యాక్సీన్లు వస్తున్నాయా?

కుక్కలు, పిల్లులు, మింక్‌లు, నక్కల వంటి జంతువులపై పనిచేసే కార్నివాక్-సీఓవీ వ్యాక్సీన్‌ను గత అక్టోబర్ నుంచి పరీక్షిస్తున్నట్లు రష్యా వెంటర్నరీ సంస్థ తెలిపింది.

పరీక్షల్లో వ్యాక్సీనేషన్ చేసిన అన్ని జంతువుల్లోనూ కోవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందాయని ఆ సంస్థ డిప్యుటీ హెడ్ వెల్లడించారు.

అమెరికాకు చెందిన జంతు ఔషధాల సంస్థ జొయెటిస్ కూడా ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తోంది.

మొదట్లో ఈ వ్యాక్సీన్‌ కుక్కలు, పిల్లులకు పనిచేస్తుందని భావించారు. అయితే, శాండియాగో జూలో గత ఫిబ్రవరిలో నాలుగు ఒరంగుటాన్లు, ఐదు బొనొబోలకు కోవిడ్ సోకింది. వీటికి కూడా ఈ వ్యాక్సీన్ వేశారు.

వాటిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయా, లేదా అనేది త్వరలో పరీక్షల్లో వెల్లడి కానుందని ఆ జూ తెలిపింది.

పెంపుడు జంతువులకు పెద్ద సంఖ్యలో వ్యాక్సీనేషన్ చేసే అవకాశాలైతే సమీప భవిష్యతులో కనపడటం లేదని కెవిన్ టైలర్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)