Virginity Test: రియాలిటీ షోలో కన్యత్వ పరీక్షలు... ఖండించిన ప్రభుత్వం

  • హఫ్‌ స్కోఫీల్డ్‌
  • బీబీసీ న్యూస్, పారిస్
కన్యత్వ పరీక్షలు

ఫొటో సోర్స్, iStock

ఒక పక్క వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ వివాహం జరిగే ప్రదేశంలో ఒక బెడ్‌ కనిపిస్తుంది.

బ్యాక్ గ్రౌండ్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంటుంది.

"ఈ బెడ్‌ మీద నవోమీ (పాత్ర పేరు) కన్నెపొరను (‌Hymen) ఒక అనుభవజ్ఞురాలైన మహిళ ఒక సన్నని టిష్యూతో పరీక్షిస్తారు. 'హ్యాండ్‌ కర్చీఫ్‌' వేడుకగా పిలుచుకునే ఈ సంప్రదాయం చాలా పురాతనమైంది. ఇది అందరికీ తప్పనిసరి. ఒకవేళ దీని ద్వారా నవోమీకి ఇప్పటికే ఎవరితోనైనా శారీరక సంబంధాలున్నాయని తేలితే, ఈ పెళ్లి ఆగిపోతుంది" అంటూ కామెంటరీ వినిపిస్తూ ఉంటుంది.

ఒక ఫ్రెంచ్ చానెల్ రూపొందించిన రియాల్టీ షోలోని సన్నివేశం ఇది.

కన్యత్వ పరీక్షలకు సంబంధించి పలు సన్నివేశాలు ఉన్న ఈ ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారమైంది.

చానెల్ ఫోర్ నిర్వహించే 'బిగ్‌ ఫ్యాట్‌ వెడ్డింగ్స్‌' కార్యక్రమం స్ఫూర్తితో ఫ్రెంచ్ చానెల్ ఈ సిరీస్ రూపొందించింది.

ఇందులో కేటలాన్ గిటాన్ అనే ఒక తెగలోని వివాహ సంప్రదాయలను చూపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

టీవీ షోలో కన్యత్వ పరీక్షల సన్నివేశాలను మార్లీన్‌ స్కాపా తీవ్రంగా తప్పుబట్టారు.

ఎందుకు కన్యత్వ పరీక్షలు?

మరో సీన్‌లో ఈ తెగకు చెందిన ఓ మహిళ ఈ పరీక్ష ప్రాధాన్యత ఏంటో వివరిస్తూ ఉంటుంది.

"ఇది పెళ్లి కొడుకు కుటుంబం కోసం చేస్తున్న పరీక్ష. దీని ద్వారా వారు తమ ఇంటికి ఎంత పవిత్రమైన, అందమైన కోడలు వస్తుందో తెలుసుకోగలుగుతారు" అని చెబుతూ కనిపిస్తుంది.

"ఒక అమ్మాయికి తనకు మున్ముందు ఈ పరీక్ష ఉంటుందని, ఇలా దుస్తులన్నీ విప్పాల్సి ఉంటుందని చిన్నతనం నుంచే తెలుస్తుంది" అని మరో మహిళ చెబుతుంటారు.

మరి మగాళ్లకు ఇలాంటి పరీక్షలన్నీ ఉండవా అని అడిగినప్పుడు "మగవాళ్లకు అవసరం లేదు. పెళ్లి కాక ముందు అతను పార్టీలకు వెళ్లకపోయినా, అమ్మాయిలను చూడకపోయినా, పెళ్లయ్యాక అతను అవన్నీ చేయలేడు. కాబట్టి వాళ్లకు ఆ అనుభవం అవసరం" అని మరో మహిళ చెబుతుంది.

ఫొటో సోర్స్, AFP

కన్యత్వ పరీక్షలు నేరమా ?

అయితే, టీవీ షోలో ఇలా అమ్మాయిల కన్యత్వాన్ని నిరూపించే పరీక్షలను చూపించడాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది.

దేశ ప్రసార మాధ్యమాలను పరిశీలించే వాచ్‌డాగ్‌ సంస్థ సీఎస్‌ఏకు ఫ్రాన్స్‌ మంత్రి మార్లీన్‌ స్కాపా ఈ వ్యవహారంపై ఒక లేఖ రాశారు.

జిప్సీ తెగలో పెళ్లికి ముందు కన్యత్వాన్ని పరీక్షించే సంప్రదాయాన్ని చూపించిన తీరును చూసి తాను చలించిపోయానని మార్లీన్ ఆ లేఖలో అన్నారు.

ఏకపక్షంగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని చూశాక తనలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని మంత్రి మార్లీన్‌ స్కాపా అన్నారు. ఈ కార్యక్రమంలో చూపించిన క్రతువులున్నీ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆమె అన్నారు.

పెళ్లికి ఇద్దరి అనుమతి ఉంటే చాలని, ఎలాంటి కన్యత్వ పరీక్షలు అవసరం లేదంటూ ఇటీవలే ఓ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిందని మార్లీన్‌ గుర్తు చేశారు.

ప్రస్తుతం సెనెట్‌ పరిశీలనలో ఉన్న ఈ బిల్లులో డాక్టర్లు కన్యత్వ నిరూపణ సర్టిఫికెట్లు ఇవ్వడం నేరంగా పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో ముస్లిం కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని రూపొందించారు. ‌

ఫ్రాన్స్‌లో కొన్ని ముస్లిం కుటుంబాలు ఇప్పటికీ పెళ్లి కూతుళ్ల నుంచి కన్యత్వ నిరూపణను సర్టిఫికెట్లను అడుగుతుంటాయి. ఇప్పుడు ఈ ఆచారం వివాదాస్పదంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కన్యత్వ పరీక్షలు అశాస్త్రీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

శిక్షలు ఏంటి?

ఫ్రాన్స్ తెస్తున్న ఈ బిల్లు ప్రకారం కన్యత్వ పరీక్షల సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లకు ఒక ఏడాది జైలుతోపాటు 15,000 యూరోల జరిమానా కూడా విధిస్తారు.

పరీక్ష చేయించుకునే మహిళ అనుమతి ఉన్నా, ఎలాంటి సర్టిఫికెట్‌ లేకుండా ఇలాంటి పరీక్షలు నిర్వహించే వారిపై అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు చేస్తారు.

కన్నెపొరను చూడటం, వేళ్లతో ముట్టుకోవడం ద్వారా ఒక మహిళ కన్య అవునా, కాదా అన్నది తేల్చడం శాస్త్రీయమైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తేల్చి చెప్పింది.

పైగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది.

ఫ్రెంచ్‌ టెలివిజన్‌లో సెక్సిజంపై గతంలో కూడా మార్లీన్‌ స్కాపా ఆరోపణలు చేశారు.

పాత ఛాందస పద్దతులను ప్రమోట్‌ చేస్తున్న టీవీ షోలను ఆమె తప్పుబట్టారు.

"రియాలిటీ షోలు మహిళలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రోత్సహిస్తున్నాయి" అని మార్లీన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)