మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో సైనిక కుట్రతో పదవీచ్యుతురాలయిన ఆంగ్ సాన్ సూచీ మీద కొత్తగా వలస పాలన కాలం నాటి అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన అభియోగాన్నినమోదు చేశారు. ఇప్పటి వరకు ఆమె పై నమోదు చేసిన అభియోగాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది.

ఈ అభియోగం గురించి రెండు రోజుల క్రితమే తమకు తెలిసినట్లు ఆమె న్యాయవాది రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఈ నేరం నిరూపణ అయితే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

గతంలో సూచీపై నమోదు చేసిన అభియోగాలపై విచారణ నిమిత్తం ఆమె వీడియో ద్వారా కోర్టు విచారణకు హాజరయిన తర్వాత ఈ కొత్త అభియోగాన్ని నమోదు చేశారు.

మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు.

గత సంవత్సరం మియన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఆమెను పదవి నుంచి తప్పించి నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే, ఈ ఆరోపణకు ఎటువంటి ఆధారాలు లేవు.

తిరుగుబాటు జరిగిన నాటి నుంచి మియన్మార్‌లో గత కొన్ని వారాలుగా నిరసనలు చోటు చేసుకుంటుండగా వాటిని సైన్యం హింసాత్మకంగా అణచివేస్తోంది.

ఇప్పటివరకు ఈ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. అందులో 40 మంది పిల్లలు కూడా ఉన్నారు.

సూచీ అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటకు కనిపించలేదు.

ఫొటో క్యాప్షన్,

మియన్మార్‌లో సైనిక పాలన అంతమొందాలనే దృఢ నిశ్చయంతో యువత పోరాడుతోంది

ఆమె పై ఉన్న అభియోగాలేమిటి?

సూచీతో పాటు పదవీచ్యుతులైన మరో ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, నిర్బంధంలో ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ధిక సలహాదారుడు సీన్ టర్నెల్ పై కూడా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లఘించిన నేరాన్ని నమోదు చేసినట్లు సూచీ ప్రధాన న్యాయవాది ఖిన్ మౌన్గ్ జా చెప్పారు.

యాంగాన్ కోర్టులో గత వారమే ఈ అభియోగాలు నమోదు చేసినప్పటికీ ఈ విషయం గురించి ఆయనకు రెండు రోజుల క్రితమే తెలిసినట్లు చెప్పారు.

75 సంవత్సరాల సూచీ 600,000 డాలర్ల సొమ్మును నగదు రూపంలో, 11 కేజీల బంగారాన్ని తీసుకుని ఆమె అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే అభియోగాన్ని నమోదు చేశారు. దీంతో పాటు, ఆమె సహజ విపత్తుల చట్టాన్ని కూడా ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వాకీ టాకీలను తీసుకున్నట్లు కూడా అభియోగాన్ని కూడా నమోదు చేశారు.

ఆమె గురువారం నాడు వీడియో ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.

ఈ వీడియోలో ఆమె ఆరోగ్యంగానే కనిపించారని ఆమె న్యాయవాది మిన్ మిన్ సో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

అసలేం జరిగింది?

మియన్మార్‌ సైన్యం పాలక ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత దేశంలో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది.

ఇలా జరిగిన కొన్ని రోజుల్లోనే వందలాది మంది పౌరులు మియన్మార్ వీధుల్లో కొచ్చి నిరసనలు చేయడం మొదలు పెట్టడంతో ఆ దేశంలో పౌర నిరాకరణ ఉద్యమం మొదలయింది.

ఈ ఉద్యమం ఊపందుకుని వేలాది మంది ప్రజలు నిరసనల్లో పాల్గొనడం ప్రారంభించారు.

కానీ, పోలీసు అధికారులకు, పౌరులకు మధ్య హింస పెరుగుతూ వస్తోంది.

సైనిక తిరుగుబాటు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించినట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే మానవ హక్కుల సంఘం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)