డిజిటల్ ఫోటో ఫింగర్ ప్రింటింగ్‌ టెక్నాలజీతో మీ ఫోటోల సీక్రెట్ డేటా తెలిసిపోతుందని మీకు తెలుసా?

ఫోటో డేటా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ 2020 అక్టోబరు 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోటోలు రెండింటిని ప్రచురించింది.

అందులో ఒకటి అధికారిక పత్రాలపై ట్రంప్ సంతకం చేస్తున్నట్లున్న ఫోటో. మరొకటి, ఆయన ఏదో చదువుతున్నట్లుగా ఉన్న ఫోటో.

ఈ ఫోటోలను ట్రంప్ కోవిడ్ బారిన పడ్డారని ప్రకటించిన మరుసటి రోజు ప్రచురించారు. "అమెరికా ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నారు, ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు నిరంతరంగా" అనే వ్యాఖ్యతో ట్రంప్ కుమార్తె ఇవాంకా ఆ ఫోటోలను ట్వీట్ చేశారు.

కానీ, కొంత మంది ఉత్సాహవంతులు మాత్రం ఆ ఫోటోలలో ఒక అసాధారణ విషయాన్ని గమనించారు.

ఫొటో సోర్స్, EPA/Joyce N Boghosia/The White House

ఫొటో క్యాప్షన్,

కోవిడ్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆస్పత్రిలో తీసిన రెండు ట్రంప్ ఫోటోలు

ఆ ఫోటోలను వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో రెండు వేర్వేరు గదుల్లో తీశారు. ఒక దాంట్లో ట్రాంప్ సూటు ధరించి ఉండగా మరొక దాంట్లో ఆయనొక షర్ట్ వేసుకుని ఉన్నారు.

ఈ ఫోటోలను చూసిన వారికెవరికైనా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ రోజంతా అధ్యక్ష పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఆ ఫోటోల మీద ఉన్న టైమ్ స్టాంపులు మాత్రం మరో విషయాన్ని తెలియచేస్తున్నాయి. అదేమంటే, అవి రెండూ 10 నిమిషాల వ్యవధిలోనే తీసిన ఫోటోలు.

అవెందుకు అలా తీశారనేందుకు కారణాలు ఉండవచ్చు. ఆ ఫోటో తీసే వ్యక్తికి కేవలం 10 నిమిషాలే సమయం దొరికి ఉండవచ్చు. లేదా అదే సమయంలో ట్రంప్ గదులు మారతానని అని ఉండవచ్చు.

కానీ, ప్రజలు ఆ టైమ్ స్టాంపులు గమనించడం పట్ల వైట్ హౌస్‌కు ఆనందం కలగలేదు.

అవి రాజకీయ ప్రయోజనాల కోసం తీసిన ఫోటోలని కొందరు, నిజంగానే ట్రంప్ నిరంతరం పని చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తూ మరికొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.

దీనికంతటికీ కారణం, ఒక డిజిటల్ ఫొటో తీసినప్పుడు ఆ సమయం తదితర వివరాలు అందులో నమోదు కావడమే.

ఎపో నైమస్ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ మెక్ అఫీ 2012లో సెంట్రల్ అమెరికాలో బెలీజియన్ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నప్పుడు, ఒక పత్రికకు చెందిన విలేకరులు ఆయనను కనిపెట్టి, "ఆయనతో మేమున్నాం" అంటూ ఒక చిత్రాన్ని ఆన్ లైన్లో ప్రచురించారు. దాంతో, ఆ ఫోటోలోని లొకేషన్ డేటా ప్రకారం ఆయన గ్వాటెమాలలో ఉన్నారని తెలిసింది. ఆ వెంటనే ఆయనను పట్టుకుని నిర్బంధించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గ్వాటెమాలాలో జర్నలిస్టులతో మాట్లాడుతున్న జాన్ మెక్‌అఫీ

డిజిటల్ ఫోటోల్లో మీకు తెలియని సమాచారం

డిజిటల్ ఫొటోలలో ఫొటోగ్రాఫర్లు, ఫోటోలో ఉన్న వ్యక్తులకు కూడా అవసరం లేనంత సమాచారం ఎలా నిక్షిప్తమై ఉంటుందో తెలియచెప్పడానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

మీ ఫోటోలు మీకు తెలియని ఎన్నో వివరాలను ఈ ప్రపంచంతో పంచుకుంటున్నాయా?

మీరు ఫోటో తీసుకున్నపుడు మీ స్మార్ట్ ఫోన్ లేదా డిజిటల్ కెమెరా ఆ ఫొటోకు సంబంధించిన మెటాడేటాను భద్రపరుస్తుంది.

ఈ డేటా అంతా మీరు తీసుకున్న ఫొటోలో ఒక పారసైట్ లా చేరిపోతుంది. ఇది ఎక్కడ, ఎప్పుడు ఏ కెమేరాతో తీశారనే సమాచారాన్ని కూడా బయటపెట్టేస్తుంది.

ఈ సమాచారాన్ని ఉచితంగా అందుబాటులో ఉన్న ఎక్సిఫ్ టూల్ లాంటి వాటితో కూడా తొలగించడం సాధ్యం కాదు.

అసలు అందులో సమాచారం ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. ఇక ఆ సమాచారాన్ని తొలగించాలనే ఆలోచన ఎలా వస్తుంది?

అందుకే ఫోటోలను ఆన్ లైన్ లో పోస్టు చేసేటప్పుడు ఈ విషయాలేవీ ఆలోచించరు.

కొన్ని సోషల్ మీడియా వేదికలు లొకేషన్ గురించిన సమాచారాన్ని పబ్లిక్ వ్యూ నుంచి తొలగిస్తాయి. కానీ, ఇలాంటి పనిని అన్ని వెబ్ సైట్లు చేయవు.

ఇలాంటి అవగాహన లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి నేరస్థులను పట్టుకోవడానికి వీలవుతుంది. కానీ, సాధారణ పౌరుల గోప్యతకు ఇదొక సమస్యగా దారి తీస్తుంది.

దురదృష్టవశాత్తు కొంత మంది నేరస్థులు కూడా ఇదే కిటుకులను వాడి దొంగతనాలు, వెంటపడటం లాంటివి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Javier Hirschfeld

ఫొటో క్యాప్షన్,

అడోబ్ ఫోటోషాప్‌లో కనిపిస్తున్న లొకేషన్ మెటాడేటా

మెటాడేటా మాత్రమే కాదు...

మీ ఫోటోలలో కేవలం మెటాడేటా మాత్రమే ఉండదు. మీరు వాడే కెమేరాతో తీసే ప్రతి ఫోటోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది ఫొటోగ్రాఫర్లు కూడా గ్రహించరు.

అదేమిటో తెలుసుకోవడానికి మీరు ముందు మీ ఫోటోను ఎలా తీస్తారో కూడా తెలుసుకోవాలి. ప్రతీ కెమేరాకు, ఫోనుకు చిత్రాన్ని గుర్తించే సెన్సర్ ఉంటుంది.

ఇందులో కొన్ని లక్షల సిలికాన్ ఫోటోసైట్లు ఉంటాయి. ఇవి ఫోటోన్లను గ్రహించే కావిటీలు.

ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం అనే ప్రక్రియ వల్ల ఫోటోసైటు ఫోటోన్లను గ్రహించి ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది.

సరళంగా చెప్పాలంటే ఇది ఒక నైట్ క్లబ్ లో ఉండే బౌన్సర్ లా పని చేస్తుంది.

ఫోటో సైట్ నుంచి బయటకు విడుదలైన ఎలక్ట్రాన్లను కొలిచి ఒక డిజిటల్ విలువగా మారుస్తుంది. దీంతో ప్రతి ఫోటో సైట్‌కు ఒక విలువ వస్తుంది. అలా ఫోటో బయటకు వస్తుంది.

ఇంకోలా చెప్పాలంటే ఫోటోను వెలుగుతో చేసే చిత్రలేఖనం అని చెప్పవచ్చు.

కానీ, ఇమేజింగ్ సెన్సర్ల తయారీలో ఉండే లోటుపాట్లు వల్ల ప్రతీ ఫోటో సైట్ పరిమాణాలు భిన్నంగా ఉంటాయి.

దీంతో అవి ఫోటోన్లను ఎలక్ట్రాన్లుగా మార్చే సామర్థ్యం కూడా భిన్నంగా ఉంటుంది. కొన్ని ఫోటో సైట్లు అవి ఉండాల్సిన దాని కంటే వెలుగుకు తక్కువ సెన్సిటివ్ గా ఉంటాయి.

అందుకే ఒక మోడల్‌కు చెందిన రెండు కెమేరాలతో ఫోటో తీసినప్పటికీ ఆ రెండు చిత్రాలూ ఒకేలా రాకపోవచ్చు.

దీనివల్ల ప్రతి ఫోటోకు ప్రత్యేక గుర్తింపు రికార్డవుతుంది. ఇది తెలియకుండా జరిగినప్పటికీ మీ కెమెరాకు మాత్రమే ప్రత్యేకమైన వేలి ముద్రలా, మీరు తీసే ప్రతి ఫోటో లోపలా ముద్రితమైపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

చిన్న చిన్న లోపాలను కూడా పట్టుకునే డిజిటల్ కెమేరా ఫోటో సెన్సర్స్ ఫింగర్ ప్రింట్‌లా పని చేస్తాయి

ఏ రెండు ఇమేజింగ్ సెన్సర్స్ ఒకేలా ఉండవు

దీనిని ఎంత ప్రయత్నించినా తొలగించడం అంత సులభం కాదని న్యూ యార్క్ లోని బింగ్హామ్టన్ యూనివర్సిటీకి చెందిన జెస్సికా ఫ్రిడ్రిక్ చెప్పారు.

అయితే, ఇలా ఉండటం వల్ల ఫ్రిడ్రిక్ లాంటి పరిశోధకులకు దొంగ ఫోటోలను కనిపెట్టడం సులభమైపోతుంది.

ఫోటోలు చాలా విషయాలకు ఆధారాలుగా పని చేస్తాయి. అయితే, ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లు, తప్పుడు సమాచారం విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో ఆ ఫోటో ఎక్కడ పుట్టింది, దాని నిజాయితీ, స్వభావం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఫోటో ఫింగర్ ప్రింటింగ్ అంటే...

ఈ ఫోటో ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఫ్రిడ్రిక్ పేటెంట్ తీసుకున్నారు. దీనిని కోర్టుల్లో ఫోరెన్సిక్ ఆధారంగా తీసుకోవచ్చని అమెరికాలో అధికారికంగా ఆమోదం ఇచ్చారు.

అంటే, దీని ద్వారా పరిశోధకులు, కెమెరాను ఉపయోగించి తారు మారు చేసిన విషయాలన్నీ కనిపెట్టే అవకాశం ఉంది.

ఇదే సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డీప్ ఫేక్ సృష్టించే వాటిని కూడా కనిపెట్టడానికి వాడవచ్చు.

డీప్ ఫేక్ లో ఫోటోలు నిజమైన వాటిలాగే కనిపిస్తాయి. ఇవి సమాచార వ్యవస్థకే ముప్పు కలిగిస్తాయి.

మనం ఏది సరైనదో, కాదో తెలుసుకోలేని పక్షంలో ప్రతి సమాచారాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఫొటో సోర్స్, Javier Hirschfeld

ఫొటో క్యాప్షన్,

ఇమేజి రెజల్యూషన్ తగ్గించడం వల్ల ఫింగర్ ప్రింట్‌ను గుర్తించే అవకాశాలు తగ్గించవచ్చు

ఈ యుగంలో ఈ సాంకేతికతను ఉపయోగించి నకిలీ చిత్రాలను గుర్తు పట్టగలగడం ఒక సానుకూల పరిణామం అని చెప్పవచ్చు. కానీ, వీటి వలన సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్ ప్రొఫెసర్ హానీ ఫరీద్ చెప్పారు.

పిల్లల పై చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసులలో ఫోటోలను పరిశీలించేటప్పుడు ఆయన అవి తీసిన కెమెరాలను కనుక్కోవడానికి నాన్ యూనిఫార్మిటీ విధానాన్ని వాడారు.

ఈ సాంకేతికతను తప్పుగా వాడకుండా చూడటం ముఖ్యమని అన్నారు.

ముఖ్యంగా ఇది మానవ హక్కుల కార్యకర్తలు, ఫోటో జర్నలిస్టులు, విజిల్ బ్లోవర్ లకు వర్తిస్తుందని చెప్పారు. వారెంత రహస్యంగా ఉంటే వారి భద్రత ఆధారపడి ఉంటుందని అన్నారు. వారు ఆన్ లైన్ లో పోస్టు చేసిన ఫోటోను వారి పరికరంతో గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఫరీద్ అంటారు.

ఈ ప్రైవసీ అంశాల గురించి పట్టించుకునేటప్పుడు మనం ఇతర రకాల సాంకేతికతతో ఉన్న సారూప్యాలు చూసుకుంటాం.

అలాగే, చాలా కలర్ ప్రింటర్లు పత్రాల పై రహస్యంగా ట్రాకింగ్ డాట్లను చేరుస్తాయి.

దీని వల్ల ప్రింటర్ కున్న సీరియల్ నంబర్, ఆ డాక్యుమెంట్ ప్రింట్ చేసిన తేదీ, సమయం కూడా కనిపెట్టవచ్చు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్ర ఉందని వివరించిన జాతీయ భద్రతా సంస్థకు సంబంధించిన పత్రాలను ఒక రియాలిటీ విజేత బయట పెట్టారనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇదే సంకేతాలను వాడి కనిపెట్టింది.

ఈ పర్యవేక్షణ విధానాలు మనల్ని అందరినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వాటి వల్ల వ్యక్తుల గోప్యత హక్కు, వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగే అవకాశం ఉంది.

ఒక ప్రింటర్ సీరియల్ నంబర్ ని ఫోటో ఫింగర్ ప్రింట్స్ తో సమానంగా చూస్తే ఈ ఫోటోలు నాన్ యూనిఫార్మిటీకి స్పందించే పద్దతి కూడా వ్యక్తుల వ్యక్తిగత సమాచార హక్కును ఉల్లంఘిస్తుందా అని ప్రశ్నించుకోవచ్చు.

ఈ పరిస్థితుల్లో ఎంత వ్యక్తిగత సమాచారాన్ని బయటకు తెలియజేయాలనే విషయాన్ని మనమే నిర్ణయించుకోవాలి.

సాధారణ మెటాడేటాను ఫోటో తీశాక తొలగించడం కష్టం. కానీ, ఫోటో తీసిన లొకేషన్ మాత్రం బహిర్గతం కాకుండా చూసుకోవచ్చు.

వేలి ముద్రలను తొలగించడానికి ఒక ప్రామాణికమైన సాంకేతికత ఏదీ లేదు. రకరకాల అప్లికేషన్లతో ఉండే పరిణామాల గురించి నేను ఫ్రిడ్రిక్ ని ప్రశ్నించినప్పుడు, "ఒక సుత్తితో వడ్రంగి అద్భుతాలు సృష్టించగలరు. కానీ, అదే సుత్తితో చంపవచ్చు కూడా" అని అన్నారు.

ఫోటోల లోపల అంతర్లీనంగా ఉన్న సమాచారం ప్రమాదకరమైనదని ఎవరూ చెప్పలేకపోతున్నప్పటికీ ఇది తప్పుడు చేతుల్లో పడితే హాని జరిగే అవకాశం ఉందని ఆమె అంటారు.

అయితే, ఈ ఫోటో మెటాడేటా, వేలి ముద్రలకు ప్రభావితం కావడానికి మీరేమి డోనాల్డ్ ట్రంప్ కానీ, జాన్ మెక్ అఫీ కానవసరం లేదు.

మీరు లెన్స్‌తో చూసే దాని కంటే ఎంత ఎక్కువ కాప్చర్ చేస్తున్నారనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే చాలు.

(జెరోన్ ఆండ్రూస్ లండన్ యూనివర్సిటీ కాలేజీలో బ్రిటిష్ సైన్స్ అసోసియేషన్ నిర్వహించిన మీడియా ఫెలోషిప్ చేస్తున్న సమయంలో ఈ వ్యాసాన్ని రాశారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)