ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: జవాన్‌లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా

  • బీబీసీ టీమ్
  • తెలుగు సర్వీస్
మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు 'టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపేయిన్' (టీసీఓసీ)లో భాగంగా జరిపిన దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఒక మహిళ సహా నలుగురు కేడర్లు చనిపోయారని మావోయిస్టులు ప్రకటించారు.

ఒక గ్రామీణుడిని పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని కూడా మావోయిస్టులు ఆరోపించారు. అలాగే, కోబ్రా జవాను తమ కస్టడీలోనే ఉన్నారని, మధ్యవర్తులను ప్రకటిస్తే అప్పగిస్తామని కూడా తమ ప్రకటనలో వెల్లడించారు.

ఇంతకీ ఈ దాడులు దేనికి సంకేతం? ఈ పరిణామాలను ఎలా చూడాలి?

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

హింస నిజంగా తగ్గిందా...

గత ఏడాది సెప్టెంబర్ 19న రాజ్యసభలో ఓ ప్రశ్నకు జవాబిస్తూ, 'దేశంలో వామపక్ష తీవ్రవాద హింస, వారి భౌగోళిక విస్తృతి, ప్రభావం గణనీయంగా తగ్గాయి' అని హోంశాఖ సహాయమత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. నక్సలైట్ల హింసలో 2010లో 1005 మంది సాయుధ బలగాలు, పౌరులు మరణించగా, 2019 నాటికి అది 202కు తగ్గిందని, 2020లో ఆ సంఖ్య ఇంకా పడిపోయిందని అన్నారు.

కానీ, జొన్నగూడెం వద్ద జరిగిన దాడితో ఈ ప్రకటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే, ఈ దాడికి సరిగ్గా పది రోజుల ముందు, మార్చి 23న బస్తర్ ప్రాంతంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన మందుపాతర దాడిలో ఐదుగురు భద్రతా జవాన్లు చనిపోగా, 14 మంది గాయపడ్డారు. అంతకు ముందు కూడా ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో జరిగిన కొన్ని దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడులు మావోయిస్టులు మళ్లీ బలపడ్డారనేందుకు సంకేతమా? లేక ఇవి వారు తమ పట్టున్న కేంద్రాలను కాపాడుకునేందుకు ఆఖరి పోరులో భాగంగా చేసిన డెస్పరేట్ దాడులా? అక్కడి వాస్తవ పరిస్థితేంటి? వంటి ప్రశ్నలకు లోతైన సమాధానాలు రాబట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కొందరు పోలీసు అధికారులతో, మావోయిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలంగా పరిశీలిస్తున్న వారితో, మాజీ మావోయిస్టులతో, మావోయిస్టు ప్రాంతాల్లోంచి సుదీర్ఘ కాలంగా రిపోర్టింగ్ చేస్తున్న విలేఖరులతో, హక్కుల కార్యకర్తలతో బీబీసీ బృందం విడివిడిగా మాట్లాడింది. వాళ్లంతా వేర్వేరు కారణాల వల్ల తమ పేర్లు వెల్లడించకూడదని మమ్మల్ని కోరారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పోలీసు బృందాలు

'ఆపరేషన్ హిడ్మా' - అసలేం జరిగింది?

ఈ దాడికి దారితీసిన పరిస్థితుల గురించి వేర్వేరు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం, నక్సల్ అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా మాడ్వి జొన్నగూడ సమీపంలోని అడవిలో తన అనుచరులతో మకాం వేశారన్న సమాచారం వారికి కొద్ది రోజుల ముందే లభించింది. దాంతో పోలీసులు బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి మొత్తం 8 బృందాలుగా, ఏప్రిల్ 2న రాత్రిపూట వేర్వేరు దారుల్లో కాలినడకన బయలుదేరారు. అన్ని టీమ్‌లలో ఉన్న మొత్తం బలగాల సంఖ్య దాదాపు 2 వేలు. అయితే, నిర్ణీత లక్ష్యం దగ్గరికి వెళ్లిన తర్వాత బలగాలకు అక్కడ మావోయిస్టులెవ్వరూ తారసపడలేదు. దాంతో వారు వెనక్కి మళ్లారు.

వెనక్కి మళ్లిన వాళ్లలో వేర్వేరు బృందాలకు చెందిన దాదాపు 400 మంది జవాన్లు జొన్నగూడెం సమీపంలో ఒక చోటే ఆగారు. అక్కడే ఉన్నతాధికారులు తదుపరి ప్రణాళిక గురించి చర్చించుకోసాగారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ గుట్ట మీది నుంచి నక్సల్స్ కాల్పులు మొదలుపెట్టారు.

'నక్సల్స్ దేశీయంగా తయారు చేసుకున్న నాటు రాకెట్ లాంఛర్లను మా వాళ్లపైన విచ్చలవిడిగా ఉపయోగించారు' అని ఒక అధికారి బీబీసీతో చెప్పారు. 'వాటి వల్లనే చాలా మంది గాయపడ్డారు. నిజానికి వాటిలో చాలా పేలలేదు. లేదంటే నష్టాలు ఇంకా ఎక్కువే ఉండేవి. ఆ తర్వాత బులెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన మావోయిస్టులు మా వాళ్ల మీదికి దూసుకొచ్చారు. గాయపడ్డ వారిపై విపరీతంగా కాల్పులు జరిపారు. మా వాళ్లు కూడా తీవ్ర స్థాయిలోనే ఎదురుకాల్పులు జరిపారు. అక్కడే రెండు వైపులా భారీగా నష్టం జరిగింది' అన్నారు.

అంటే ఒకరకంగా పోలీసులు బలగాలు మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాయనే భావించొచ్చని ఆయనన్నారు. 'మరి ఇంటలిజెన్స్ వైఫల్యమే దీనికి కారణం కాదా?' అని ప్రశ్నించినప్పుడు, ఆ అధికారి కాదన్నారు.

'సమాచారం ఉన్నందువల్లనే మేం హిడ్మాను టార్గెట్ చేసే లక్ష్యంతోనే అక్కడికి వెళ్లాం. కానీ, వెనక్కి వచ్చేటప్పుడు బలగాల్లో అప్రమత్తత స్థాయి కాస్త సడలింది. దాని ఫలితమే ఈ నష్టం' అన్నారు.

'ఈ దాడి స్థలం నుంచి హిడ్మా స్వగ్రామం పువ్వర్తి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఆయనకు కొట్టిన పిండి. పైగా స్థానికుల మద్దతు ఆయనకు ఉంది. కాబట్టి పోలీసుల ప్రతి కదలికనూ వారు జాగ్రత్తగా గమనించి, పకడ్బందీ ప్లాన్‌తోనే దాడికి దిగారు' అని ఓ స్థానిక పాత్రికేయుడు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

'ఆంధ్రా మోడల్..'

ఒకప్పుడు మావోయిస్టు సాయుధ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో అది ఇప్పుడు గణనీయంగా బలహీనపడింది. ఒకప్పుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధాన నేతల్లో చాలా మంది వేర్వేరు 'ఎన్‌కౌంటర్లలో' మరణించారు. పోలీసుల దాడుల్లో దళాలకు దళాలే దెబ్బతిన్నాయి. మావోయిస్టుల అణచివేతలో నాటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా గ్రేహౌండ్స్ బలగాలు కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో ఆ అణచివేత విధానాన్ని 'ఆంధ్రా మోడల్'గా కూడా వ్యవహరించారు.

గ్రేహౌండ్స్ రాష్ట్ర బలగమే అయినప్పటికీ అది చాలా సార్లు సరిహద్దులు దాటి ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మావోయిస్టులపై దాడులు చేసిందనే వార్తలున్నాయి. వేర్వేరు రాష్ట్రాల ప్రత్యేక బలగాలకు హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. 1986లో ఏర్పాటైన గ్రేహౌండ్స్ బలగాలు గత 35 ఏళ్లలో ఒకటి, రెండు సార్లు తప్ప ఎప్పుడూ మావోయిస్టుల చేతిలో పెద్దగా ఎదురుదెబ్బలు తినలేదు.

జొన్నగూడ దాడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఓ అధికారితో ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు, 'ఎక్కడైనా, ఎప్పుడైనా నిఘా సమాచారమే కీలకం' అన్నారు. 'మాకు ఇంటలిజెన్స్ ఇన్‌పుట్స్ అందినప్పుడు వాటిని వేర్వేరు స్థాయిల్లో విశ్లేషిస్తాం. ఉన్నతాధికారుల మధ్య ఎంతో బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. చాలా లోతుగా డేటా సేకరిస్తాం. అనేక కోణాల్లో ఆలోచిస్తాం. ఆ తర్వాతే గ్రేహౌండ్స్‌ను రంగంలోకి దించుతాం. ఒకవేళ అనూహ్య పరిస్థితిలో వారు శత్రుదాడిలో చిక్కుకుపోయినా, దాన్ని ఎదుర్కొని ఎలా బయటపడాలో వారికి పూర్తి శిక్షణ ఉంటుంది' అన్నారు. 'పై పై సమాచారంతో ఆపరేషన్‌లకు మేం ఎప్పుడూ ప్లాన్ చేయం' అన్నారు.

'వేర్వేరు రాష్ట్రాల పోలీసు బలగాలకు ఇక్కడి గ్రేహౌండ్స్ శిక్షణ ఇస్తున్నప్పటికీ వారు గ్రేహౌండ్స్‌లా ఎందుకు విజయాలు సాధించలేకపోతున్నారు? ఎందుకు నక్సల్స్ చేతిలో దెబ్బతింటున్నారు?' అని అడిగినప్పుడు వివిధ శ్రేణుల నాయకత్వ లోపమే కారణమన్నారు. 'హిడ్మా, ఆయన అనుచరులు అక్కడ దాడికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం మాకు ముందు నుంచే ఉంది. ఏదైనా దాడి జరగొచ్చనే సమాచారంతో మేం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధికారులను ముందే హెచ్చరించాం' అని కూడా ఆ అధికారి బీబీసీతో చెప్పారు.

అసలు 'మావోయిస్టులు ఇలా వరుసగా దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? దాడులతో ఏం నిరూపించుకోవాలనుకుంటారు?' అన్న ప్రశ్నకు ఆ అధికారి 'వారి టీసీఓసీలో భాగమే ఆ దాడులు' అని బదులు చెప్పారు.

ఫొటో సోర్స్, CGKHABAR/BBC

ఫొటో క్యాప్షన్,

మావోయిస్టులు (ప్రతీకాత్మక చిత్రం)

అసలేంటీ టీసీఓసీ?

మావో రచించిన గెరిల్లా యుద్ధతంత్రంలో టీసీఓసీ (టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపేయిన్) అనేది ఓ కీలక అంశం. 'శత్రువు బలం ఎక్కువగా ఉండి, నీ బలం తక్కువగా ఉన్నప్పుడు, నీ బలమైన ప్రాంతాల్లో నీకున్న శక్తులన్నీ కూడగట్టుకొని శత్రువుకు చెందిన చిన్న చిన్న విభాగాలపై బలమైన మెరుపుదాడులు చేసి విజయాలు సాధించాలి' అనేది మావో చెప్పిన గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఒకటి.

దీని గురించి మరో పోలీసు అధికారి ఇలా వివరించారు: 'మావోయిస్టులు తమ బలమైన ప్రాంతాల్లో ప్రతియేటా, ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి వరుస దాడులకు పాల్పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచే వాళ్లు దాడులు పెంచారు. మేం కూడా ప్రతిసారీ జాగ్రత్తగానే ఉంటాం. వారి వ్యూహాలను చిత్తు చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఎదురుదెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. ఇది పూర్తిగా ఊహించనిదేమీ కాదు.'

'వాళ్ల ప్రాంతాల్లోకి మేం చొచ్చుకుపోతూ వరుసగా క్యాంపుల్ని ఏర్పాటు చేస్తూ పోతుండటంతో నక్సలైట్లు రెచ్చిపోతున్నార'ని కూడా ఆ అధికారి అన్నారు. ఈ దాడి జరిగిన జొన్నగూడెం సమీపంలోనే తర్రెం, పెగడుపల్లి, సార్కెగూడ, బాసగూడలో మొత్తం నాలుగు పోలీసు క్యాంపులు/స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీన్ని అడ్డుకోవడం కోసమే మావోయిస్టులు ఈ దాడికి స్కెచ్ వేశారనేది మరి కొందరు పోలీసు అధికారుల అభిప్రాయం కూడా.

శనివారం దాడి తర్వాత బాసగూడలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ చేసిన ప్రకటనల్లో కూడా ఇదే ధ్వనించింది. పోలీసు బలగాలు మావోయిస్టులకు పట్టున్న లోతట్టు ప్రాంతాలకు కూడా చొచ్చుకెళ్లి క్యాంపులు ఏర్పాటు చేసి, దాడులు చేస్తుండటంతోనే వారిలా ఎదురుదాడులకు పాల్పడుతున్నారని, దీంతో వెనక్కి తగ్గేది లేదని, ఇక అమీతుమీ తేల్చుకునే రీతిలో దాడులు ఉధృతం చేస్తామని వారిద్దరూ స్పష్టం చేశారు.

ఫొటో క్యాప్షన్,

చనిపోయిన మావోయిస్టులు

మావోయిస్టుల బలమైన ప్రాంతాలేవి? వారి వాస్తవ బలం ఎంత?

ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ ఉద్యమ సానుభూతిపరులతో, దీన్ని చాలా కాలంగా అధ్యయనం చేస్తున్న విద్యావేత్తలతో బీబీసీ మాట్లాడింది. 'నక్సలిజమే దేశ ఆంతరంగిక భద్రతకు ఏకైక ముప్పు' అని 2006 ఏప్రిల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రకటించే నాటికి మావోయిస్టు ఉద్యమం దేశంలో దాదాపు 14 రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో ఉనికిలో ఉంది.

ఆ తర్వాతి సంవత్సరంలో జరిగిన మావోయిస్టు పార్టీ 7వ కాంగ్రెస్‌లో దండకారణ్యం, బీహార్-ఝార్ఖండ్‌లను విముక్తి ప్రాంతాలుగా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు కర్నాటక-కేరళ-తమిళనాడు సరిహద్దులోని పశ్చిమ కనుమల ప్రాంతంలో, ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో గెరిల్లా యుద్ధాన్ని తీవ్రం చేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటికి దెబ్బతిన్న ఉద్యమాన్ని పునరుద్ధరించాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు.

కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో, ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం, దేశవ్యాప్తంగా ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ తర్వాత సమాధాన్, ప్రహార్ వంటి బహుముఖ దాడులను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కొన్ని బలమైన ప్రాంతాలను కోల్పోయింది. మరికొన్ని ప్రాంతాలు బాగా కుదించుకుపోయాయి. సంఖ్యాపరంగా కూడా కేడర్లను నష్టపోయింది. కొందరు సరెండర్ అయ్యారు. కొత్త రిక్రూట్లు తగ్గిపోయాయి. ఇక పట్టణ ప్రాంతాల నుంచి, విద్యార్థి సెక్షన్ల నుంచి దాదాపు పూర్తిగానే నిల్చిపోయాయి. దాంతో కొత్త నాయకత్వం రాలేదు. ఉన్న నాయకత్వంలో చాలా మంది వయసు మీరి పోవడంతో వారు వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా, వారిని కాపాడుకోవడమే ఆ పార్టీకి ఓ సవాలుగా మారింది.

ఇక బస్తర్ ప్రాంతం నుంచి చాలా కాలంగా రిపోర్టింగ్ చేస్తున్న ఓ విలేఖరి అభిప్రాయం ప్రకారం: 'మావోయిస్టులకు బస్తర్ ప్రాంతంలో ప్రధానంగా రెండు బలమైన కేంద్రాలున్నాయి. ఒకటి - దాదాపు నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అబూజ్‌మాడ్. దీన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం సర్వే కూడా చేయలేదని చెబుతారు. ప్రస్తుత ప్రభుత్వమనే కాదు... బ్రిటిషర్లు కానీ అంతకు ముందు కానీ ఏ రాజ్యమూ చేరని ప్రాంతం అని చెప్తారు. దట్టమైన అడవులు, కొండలతో, పల్చని జనాభాతో ఉండే ప్రాంతం.

మరొకటి దక్షిణ బస్తర్‌లోని చింతల్నార్-జెగురుగొండ-కిష్టారం-బాసగూడ ప్రాంతం. ఇదీ దాదాపు అంతే వైశాల్యం గలదే అయినా, ఇక్కడి అడవి దట్టమైంది కాదు. ఎత్తైన కొండలు కూడా పెద్దగా లేవు. జనసాంద్రత కూడా ఎక్కువే. కానీ, ముఖ్యంగా గత పదిహేనేళ్ల కాలంలో, ప్రభుత్వ బలగాలు పెద్ద ఎత్తున నష్టాల్ని చవిచూసింది ఈ ప్రాంతంలోనే. 2010లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తాడిమెట్ల గ్రామం గానీ, గత ఏడాది లాక్‌డౌన్ ప్రకటించడానికి రెండు రోజుల ముందు 17 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న మిన్ప గ్రామం గానీ… ఇవన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మరోవైపు, 2012లో 17 మంది భద్రతా బలగాలు ఒక వివాదాస్పద 'ఎన్‌కౌంటర్'లో హతమార్చిన సార్కెగూడ గ్రామం కూడా ఈ పరిధిలోనే ఉంది.' ఆ 17 మంది గ్రామస్తులేనని, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని మావోయిస్టు పార్టీతో పాటు అనేక హక్కుల సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నాయి.

ఒక మాజీ మహిళా మావోయిస్టు తెలిపిన వివరాల ప్రకారం, 'అబూజ్‌మాడ్ (నారాయణపూర్ జిల్లా) ప్రాంతంలో గత రెండేళ్ల కాలంలో కొన్ని కొత్త పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. అందుకే అక్కడ దాడులు జరుగుతున్నాయి. దక్షిణ బస్తర్‌లోనూ అదే జరుగుతోంది. అందుకే ఇక్కడా మావోయిస్టుల దాడులు పెరిగాయి.'

మావోయిస్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ బలగాలకు, తమ ప్రాంతాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మావోయిస్టు గెరిల్లాలకు మధ్య పోరుగా దీన్ని చూడొచ్చని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'గనులపై ఆధిపత్యం కోసమే సర్కారు ప్రయత్నం'

ఈ అంశంపై మావోయిస్టు సానుభూతిపరుల అభిప్రాయాల సారాంశం ఇలా ఉంది:

'ఈ అటవీ ప్రాంతాలన్నీ అపారమైన ఖనిజ సంపదకు నెలవు. ఈ ప్రాంతాలను మైనింగ్ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, మావోయిస్టుల నాయకత్వంలో ఆదివాసులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఈ ప్రాంతాలను తమ చేతిలోకి తీసుకొని మావోయిస్టుల్ని ఏరివేయడం, ఈ అడవుల్లోంచి ఆదివాసుల్ని వెళ్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టడం - రెండు ప్రయోజనాలూ నెరవేర్చుకోవచ్చన్నదే ప్రభుత్వాల వ్యూహం' అని వారన్నారు.

ఈ ప్రాంతంలోని రావ్‌ఘాట్, ఆమ్దాయిమెట్ట, కువ్వేమారి, బైలడిల్లా, చార్‌గాం, పల్లేమాడి వంటి మైనింగ్ ప్రాజెక్టులను, వాటి విస్తరణ ప్రణాళికలను వారు ఉదాహరణలుగా పేర్కొన్నారు. PESA, గ్రామసభలు వంటి చట్టాలను, నిబంధనలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందనేందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయని వారన్నారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

చర్చలతో పరిష్కరించుకోవచ్చా?

కొన్ని షరతులకు సిద్ధపడితే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు దండకారణ్య కమిటీ కొన్ని వారాల ముందే ప్రకటించింది. అయితే, చర్చలకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని మావోయిస్టు ప్రతినిధి వికల్ప్ షరతు విధించారు. కానీ, నక్సలైట్లే ముందుగా హింసను, సాయుధ పోరాటాన్ని వదిలెయ్యాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు.

చర్చల ప్రతిపాదనకు ఇరువైపులా సంక్లిష్టతలున్నాయి. అవసరమనుకునే వారూ, సాధించేదేమీ లేదనే వారూ రెండు పక్షాల్లోనూ ఉన్నారు. అది గతంలోకూడా స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వైఎస్ హయాంలో జరిగిన చర్చల్లో సాధించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువని మావోయిస్టు పార్టీ నేతలు సైతం పలు సందర్భాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉన్నారు.

చర్చల తర్వాత అనేక మంది కీలకనేతలను ఆ పార్టీ త్వరితగతిన కోల్పోయింది. అప్పటి హోమంత్రి చిదంబరంతో చర్చల కోసం స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిగా సాగిన ప్రయత్నాల్లో భాగంగానే మరో కీలక నేత ఆజాద్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఆయన్ను పట్టుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపారనే ఆరోపణలున్నాయి.

వీటిని స్వతంత్రంగా నిర్ధరించే పరిస్థితిలో బీబీసీ లేదు.

'సాయుధపోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని చేబూనడం అనేది లక్ష్యంగా ఉన్న పార్టీతో చర్చలు జరిపి సాధించేదేంటి' అనే వాదన ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుంచి కూడా వినిపిస్తూ ఉంటుంది.

ఏది ఏమయినా, ఎన్ని ఒడిదొడుకులున్నా చర్చలకు ప్రయత్నాలైతే సాగుతూనే ఉన్నాయి. పౌరసమాజంలోని కొందరు కన్సర్డ్ సిటిజన్స్, మేధావులు, కొందరు ఎన్జీవోలు అలాంటి ప్రయత్నాలు ఏదో రూపంలో చేస్తూ వస్తున్నారు.

అయితే, ఏ ప్రయత్నమూ ముందడుగు వేయడం లేదు.

మావోయిస్టు పంథాకు అగ్నిపరీక్ష?

ఎన్నికల బహిష్కరణ, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడం - ఈ రెండే మావోయిస్టు పార్టీని మిగతా వామపక్ష పార్టీలకు భిన్నంగా నిలిపే ప్రధానాంశాలు. వందేళ్ల చరిత్రలో కమ్యూనిస్టు పార్టీలు ఎన్ని పాయలుగా విడిపోయినా, ఎన్ని పంథాలు చేపట్టినా సోషలిజం, కమ్యూనిజం సాధనే తమ లక్ష్యమని అవన్నీ చెప్పుకుంటాయి.

ప్రధాన స్రవంతి కమ్యూనిస్టు పార్టీలుగా చెప్పుకునే సీపీఐ, సీపీఎంలను పక్కన పెడితే, చారుమజుందార్ నాయకత్వంలో 1969లో ఏర్పాటైన సీపీఐ (ఎంఎల్) నుంచి విడిపోయిన లిబరేషన్ వాళ్లు సాయుధ పోరాటాన్ని విరమించి ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నారు.

బిహార్‌లో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ పార్టీ 12 సీట్లు సాధించింది. మరోవైపు, జనశక్తి, న్యూ డెమోక్రసీ వంటి ఇతర పార్టీలకు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టు అత్యంత స్వల్పస్థాయిలో సాయుధ దళాలున్నప్పటికీ, ప్రధాన పోరాట రూపాలు వేరే. లీగల్ రూపాలే ప్రధానం. ఎంఎల్ ఉద్యమం మొదలై అర్ధ శతాబ్దం దాటినా, సీపీఐ (మావోయిస్టు) ఒక్కటే నేటికీ సాయుధ పోరాటాన్నే ప్రధాన రూపంగా ఎంచుకుని పోరాడుతున్నది.

అయితే, యాభయ్యేళ్లలో దేశంలో వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పులను అది గుర్తించడం లేదని, తన పంథాను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడం లేదని అందులోంచి బయటకు వచ్చిన కొందరు అగ్రనేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సాయుధ పోరాట పంథాను వదిలి, బహిరంగ ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Ganesh Mishra BASTAR IMPACT

చరిత్ర ఏం చెబుతోంది?

90ల తర్వాత ప్రపంచం శరవేగంగా మారిపోయింది. ప్రపంచ చరిత్రలో చైనా తర్వాత మావోయిస్టు పంథాలో ఉద్యమాలు సాగిన పెరూ, ఫిలిప్పీన్స్, నేపాల్, టర్కీ తదితర దేశాల్లో ఇప్పుడు ఎలాంటి ప్రగతీ లేదు. శ్రీలంకన్ తమిళులతో పాటు ఐరిష్, కుర్దిష్ జాతుల పోరాటాలు కూడా పూర్తిగా వెనుకపట్టు పట్టాయి లేదా తుడిచిపెట్టుకుపోయాయి.

పెరూలో 1992లో 'షైనింగ్ పాత్' నేత గొంజాలో అరెస్టు తర్వాత ఆ దేశంలో మావోయిస్టు ఉద్యమం క్రమంగా దెబ్బతినిపోగా, ఫిలిప్పీన్స్‌లో అనేక దశాబ్దాలుగా అది ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. టర్కీలో ప్రభుత్వ అణచివేతతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది.

మెక్సికోలో జపాటిస్టా ఉద్యమం కూడా పంథా మార్చుకుంది. మొత్తంగానే ప్రపంచపోకడ మారింది. పెట్టుబడిదారీ శకం, ప్రజాస్వామ్య శకం, పార్లమెంటరీ శకం ఏదైనా అనుకోండి.. అది సాయుధ పోరాటాలకు అనుకూలమైంది కాదని చరిత్ర చెబుతోందని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

మరోవైపు, హోంమంత్రి చెబుతున్నట్టుగా 'ఆర్ పార్ లడాయి' (అమీతుమీ తేల్చుకునే యుద్ధం) ద్వారా మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యం ఎప్పటి వరకు నెరవేరుతుంది?

ఒక మానవ హక్కుల కార్యకర్తతో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే, 'మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యం బహుశా ఎప్పటికీ నెరవేరకపోవచ్చు. సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నంత కాలం అది ఏదో స్థాయిలో, ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉండొచ్చు. దీని సామాజికార్థిక మూలాలను స్పృశించకుండా కేవలం సైనిక పరిష్కారం ద్వారా అంతా చక్కబడుతుందనుకుంటే పొరపాటే' అన్నారు.

మొదట పేర్కొన్న తెలంగాణ పోలీసు శాఖకు చెందిన అధికారి కూడా సామాజిక, ఆర్థిక కారణాలను చూడటం అవసరం అన్నారు. 'నక్సల్ ప్రభావిత ప్రాంత యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారికి ఉపాధి కల్పించవచ్చు. అంతేకాదు, వారు రాడికలైజ్ కాకుండా అడ్డుకోవచ్చు' అన్నారు.

ప్రభుత్వ బలగాలపై అడపాదడపా సాగించే సైనిక దాడుల్లో టాక్టికల్ విజయాలు సాధించడం ద్వారా మావోయిస్టులు తమ బలగాల్లో, తమ ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజల్లో, సానుభూతిపరుల్లో ఉత్సాహాన్ని నింపుకోవచ్చు. కానీ ఇంత విశాలమైన దేశంలో ప్రస్తుతం కొన్ని చిన్న చిన్న ప్రాంతాలకే పరిమితమైపోయిన మావోయిస్టులు కేవలం సైనిక పద్ధతుల్లోనే తమ ఉద్యమాన్ని ఎలా నిలబెట్టుకోగలరు? రోడ్లతో పాటు అన్ని చోట్లా ఆధునికత, ఆధునిక మార్కెట్ వ్యాపిస్తున్న తరుణాన పాత కాలపు సాయుధపోరాట రూపం ఇంకెంత కాలం కొనసాగిస్తారు అనేవి బలంగా వినిపించే సంక్లిష్టమైన ప్రశ్నలు.

అదే సమయంలో ఆదివాసీ ప్రాంతాలపైన, అక్కడి వనరులపైనా విచ్చలవిడి దోపిడీని అరికట్టకుండా, కేవలం మావోయిస్టులను అణచివేయడమే ప్రధాన లక్ష్యంగా సాగే ప్రభుత్వ వ్యూహం సరైనదేనా అనేది మరోవైపు నుంచి వినిపించే ప్రశ్న.

కారణాలు ఏమైనా అక్కడ సాగే రక్తపాతంలో బాధితులెవ్వరు? ప్రమాదకరమైన టెర్రెయిన్‌లో సాగుతున్న ఈ నెత్తుటిపోరులో బలయ్యేది ఎవరు? మరింత రక్తపాతం లేకుండా, మరిన్ని గర్భశోకాలు వినిపించకుండా సమస్యను పరిష్కరించుకునే మార్గం ఏదైనా ఉందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)