రష్యా: పుతిన్‌కు కరోనా సోకకుండా ఉండేందుకు అధికారులను క్వారంటైన్‌లో పెట్టారు

  • ఎనా ప్యూషకర్స్‌కియా, పావెల్ ఎకస్యోనిక్, పెటర్ కోజ్లాఫ్
  • బీబీసీ ప్రతినిధులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార యంత్రాంగం దానికోసం కొన్ని అసాధారణ పద్ధతులు కూడా అనుసరిస్తోంది.

పుతిన్‌కు కోవిడ్-19 సోకకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక క్వారంటైన్ పద్ధతిని పాటిస్తున్నారు. దానికోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతి ప్రకారం క్వారంటైన్‌లో ఉండకుండా దాదాపు ఎవరైనా పుతిన్‌ను కలవడం అసాధ్యం.

గత ఏడాది పుతిన్‌ను కలిసినందుకు వందలాది మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

కొంతమంది అధ్యక్షుడితో నేరుగా కాంటాక్ట్‌లోకి రాకపోయినా, ఆయను కలిసినవారితో కాంటాక్ట్‌లోకి రావడంతో ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది.

2020 మార్చి 25న దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన పుతిన్ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్ 1ని 'నాన్ వర్కింగ్ వీక్‌' ప్రారంభంగా భావిస్తున్నామని అన్నారు.

ఆ తర్వాత ఏప్రిల్‌లో దేశమంతా లాక్‌డౌన్ విధించారు. అత్యవసరం కాని షాపులు కూడా మూసివేశారు. సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. జనం ఎక్కువ మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మొదటిసారి అధికారుల క్వారంటైన్

లాక్‌డౌన్ సమయంలో పుతిన్‌కు సేవలు అందించే రష్యా విమాన సంస్థ రోసియా ప్రత్యేక విమానం 60 మంది సిబ్బంది, మరికొందరు ప్రభుత్వ అధికారులను 2020 మార్చి 26న మొదటిసారి క్వారంటైన్ చేశారు.

వారిని మొదట రాజధాని మాస్కోకు దగ్గర్లో ఉన్న ఒక హోటల్లో ఉంచారు.

ఆ తర్వాత వందలాది మంది పైలట్లు, ఆరోగ్య సిబ్బంది, డ్రైవర్లు, మిగతా సహాయక సిబ్బంది, అధ్యక్షుడిని కలవడానికి వచ్చే చాలా మందిని కూడా హోటళ్లలో క్వారంటైన్ చేశారు.

వీటన్నింటి వెనుక ఒకే ఒక కారణం ఉంది. అధ్యక్షుడు పుతిన్‌కు కోవిడ్-19 వ్యాపించకుండా కాపాడడం.

అధ్యక్షుడు పుతిన్ స్వదేశీ వాక్సీన్ వేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఏ వ్యాక్సీన్ వేసుకున్నారో స్పష్టంగా చెప్పలేదు.

ఇక మీదట కూడా జనాలను హోటళ్లలో క్వారంటైన్ చేయడం కొనసాగవచ్చు.

పుతిన్‌ను కరోనా నుంచి కాపాడే చర్యల కోసం అధ్యక్షుడి కార్యకలాపాలు చూసుకునే డైరెక్టరేట్, బడ్జెట్ నుంచి 6.4 బిలియన్ రూబుల్స్ (దాదాపు 618 కోట్ల రూపాయలు) నిధులు కేటాయించింది.

బీబీసీ రష్యాకు అందిన సమాచారం ప్రకారం ప్రజలను క్వారంటైన్ చేయడానికి కనీసం 12 హోటళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ హోటళ్లు మాస్కో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా షోచీలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ పనులు షోచీ నుంచే

క్వారంటైన్ కోసం ఎంపిక చేసిన హోటళ్ల జాబితాలో ప్రైవేటు హోటళ్లు ఏవీ లేవు. వాటన్నిటికీ అధ్యక్షుడి కార్యకలాపాలు చూసుకునే డైరెక్టరేట్‌కు సంబంధం ఉంది. వీటిలోని కొన్ని హోటళ్లలో 2022 మార్చి వరకూ బుకింగ్స్ నిలిపివేశారు.

ఈ హోటళ్లలో ఎక్కువగా రోసియా ఎయిర్‌లైన్ ఫ్లైట్ క్రూ ఉంటున్నారు. వీరు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, 8 మంది కేబినెట్ మంత్రులు, మరికొందరు అధికారులకు సేవలు అందిస్తారు.

వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాది ఎక్కువగా షోచీలోని తన ఇంటి నుంచే పనిచేశారు.

క్వారంటైన్ నిబంధనల గురించి సమాచారం ఇచ్చిన ఒకరు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మిగతా కీలక నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పదుల సంఖ్యలో పైలట్లు, ఎయిర్ లైన్ సిబ్బందిని షోచీలో క్వారంటైన్ చేశారని చెప్పారు.

క్వారంటైన్ చేసిన వారిలో విమానాలు, హెలికాప్టర్ల పైలట్లు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, KREMLIN.RU

'విక్టరీ డే'కు ముందే క్వారంటైన్

రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా రష్యాలో 75వ వార్షికోత్సవ వేడుక భారీగా జరగాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఈ వేడుకలను విక్టరీ డే పెరేడ్ అంటారు.

గత ఏడాది జూన్ 24న సాదాసీదాగా ఆ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలో సైనిక పరేడ్ కూడా జరగలేదు.

కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కొంతమంది సైనికులు ఆ వేడుకలో అధ్యక్షుడికి షేక్ హాండ్ ఇచ్చారు. ఆయన నుంచి పురస్కారాలు అందుకున్నారు.

ఆ వేడుకకు ముందే కొంతమంది మాజీ సైనికులను తాము మెరుగైన స్థితుల్లో క్వారంటైన్ చేశామని, తగిన జాగ్రత్తలు తీసుకోడానికే అలా చేశామని క్రెమ్లిన్ ప్రతినిధి దమిత్రి పెస్కోవ్ ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

జర్నలిస్టులకూ క్వారంటైన్

"మాస్కోలోని ఒక హోటల్‌లో 20 మంది జర్నలిస్టులను కూడా క్వారంటైన్ చేశారు. ఒక్కో గదిలో ఒకరిని మాత్రమే ఉంచారు. నేరుగా కలిసి మాట్లాడ్డానికి వారికి అనుమతి లేదని అని రష్యా ప్రభుత్వ సమాచార ఏజెన్సీ టాస్(TASS) , ఆర్ఐఏ-నోవోస్తీ కథనాలు ఇచ్చాయి.

మద్యం, సిగరెట్ తాగడానికి కూడా వారికి అనుమతి కూడా లేదని, బయట నుంచి వారికోసం వచ్చే పదార్థాలను శానిటైజ్ చేశాకే లోపలికి పంపిస్తున్నారని అందులో చెప్పారు.

ప్రాంతీయ ప్రభుత్వ అధికారుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటోంది. అధ్యక్షుడు తమను కలబోయే ముందు వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లాల్సివస్తోంది.

అధ్యక్షుడు పుతిన్ భద్రత కోసం ఇంత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం గురించి క్రెమ్లిన్ ప్రతినిధిని బీబీసీ ప్రశ్నించినపుడు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)