ప్రిన్స్‌ ఫిలిప్‌ 99 ఏళ్ళ వయసులో కన్నుమూత, ప్రకటించిన బకింగ్‌‌హమ్‌ ప్యాలెస్‌

ప్రిన్స్‌ ఫిలిప్‌
ఫొటో క్యాప్షన్,

ప్రిన్స్‌ ఫిలిప్‌

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణించినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. ఆయన వయసు 99 సంవత్సరాలు.

"రాణి ఎంతో విషాదంతో తన భర్త 'డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ప్రిన్స్ ఫిలిప్' మరణించినట్లు తెలిపారు" అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటన చేసింది.

"విండ్సర్ కోటలో హిజ్‌ రాయల్‌ హైనెస్‌ ప్రిన్స్ ఫిలిప్ ఈ ఉదయం ప్రశాంతంగా కన్నుమూశారు." అని ఆ ప్రకటనలో తెలిపారు.

ప్రిన్సెస్‌ ఎలిజబెత్‌ను ప్రిన్స్‌ ఫిలిప్‌ 1947లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు ఎలిజబెత్‌ బ్రిటన్‌ రాణి అయ్యారు. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్‌.

ఫొటో సోర్స్, Tim Graham/PA

ఫొటో క్యాప్షన్,

ప్రిన్స్ ఫిలిప్ ఆరు దశాబ్దాలకు పైగా రాణికి పాలనలో తోడుగా ఉన్నారు, 2009 నాటికి బ్రిటన్‌ను అత్యంత సుదీర్ఘ కాలం పాలించిన రాణిగా ఎలిజబెత్ చరిత్ర సృష్టించారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌, క్వీన్‌ ఎలిజబెత్‌లకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనుమలు, 10 మంది మునిమనుమలు ఉన్నారు. వారి మొదటి సంతానం, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రిన్స్‌ ఛార్లెస్‌ 1948లో జన్మించగా ఆయన తర్వాత రాయల్‌ ప్రిన్సెస్‌ అన్నే 1950లో పుట్టారు. డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ 1960లో, ఎర్ల్‌ ఆఫ్‌ వెసెక్స్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్ 1964లో జన్మించారు.

1921 జూన్ 10న గ్రీక్ ఐలాండ్‌ కొర్ఫూలో ప్రిన్స్‌ ఫిలిప్‌ జన్మించారు. ప్రిన్స్ ఆఫ్‌ గ్రీస్‌ అండ్‌ డెన్మార్మ్‌ ప్రిన్స్‌ ఆండ్రూ ఆయన తండ్రి. కింగ్‌ ఆఫ్‌ హెలెన్స్ కింగ్‌ జార్జ్‌-1 కడపటి సంతానమే ప్రిన్స్‌ ఆండ్రూ.ప్రిన్స్‌ ఫిలిప్ తల్లి ప్రిన్సెస్‌ ఆలిస్‌ లార్డ్ లూయీ మౌంట్‌ బాటెన్‌ కుమార్తె. క్వీన్‌ విక్టోరియాకు ఆలిస్ ముని మనుమరాలు అవుతారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ప్రిన్స్ ఫిలిప్ మరణవార్త ప్రకటించిన తరువాత ఆ నోటీసును తీసుకు వస్తున్న బకింగ్‌హమ్ ప్యాలెస్ సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ప్యాలెస్ గేటు మీద మరణవార్త ప్రకటన

"ఆయన ఎంతోమంది యువతీ యువకుల జీవితాలకు స్ఫూర్తినిచ్చారు" అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.

"రాజరికాన్ని, రాజ కుటుంబాన్ని నడిపించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడంలో ఆయన పాత్ర విశేషంగా ఉంది. ఆయన మరణ వార్త చాలా బాధాకరం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కామన్‌వెల్త్‌ దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన అనేక తరాల ప్రజల అభిమానాన్ని పొందారు" అని బోరిస్ జాన్సన్ అన్నారు.

ప్రిన్స్‌గా అత్యధిక కాలం సేవలందించడమే కాక, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారిలో జీవించి ఉన్న అతి కొద్దిమందిలో ఆయన ఒకరని ప్రధాని జాన్సన్‌ గుర్తు చేసుకున్నారు.

స్కాట్‌లాండ్‌ నుంచి సంతాప సందేశాలు

డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరా, ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణ వార్త ఎంతో విచారకరమని స్కాట్‌లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ నికోలా స్టర్జియన్‌ అన్నారు. "స్కాట్‌లాండ్‌ ప్రజలు, ప్రభుత్వం తరఫున క్వీన్‌ ఎలిజబెత్‌కు, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నాను" అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో నెలరోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రిన్స్‌ ఫిలిప్‌ ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. లండన్‌లోని మరో ఆసుపత్రిలో ఆయన గుండెకు సంబంధించిన చికిత్స కూడా తీసుకున్నారు.

"ఒక అత్యద్భుతమైన ప్రజా సేవకుడిని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కోల్పోయింది" అని లేబర్‌ పార్టీ నేత సర్‌ కెయిర్‌ స్టామర్‌ అన్నారు. "రాణి పట్ల అత్యధిక నిబద్ధత, అనురాగాలు ఉన్న వ్యక్తిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారు" అని స్టామర్‌ వ్యాఖ్యానించారు.

"సొంత విషయాల కన్నా ఇతరుల ప్రయోజనాలు, బాగు గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ప్రిన్స్‌ ఫిలిప్‌. క్రైస్తవ సేవా ధర్మపాలనకు ఆయన ఒక ఉదాహరణ" అని కాంటర్‌బరీలో ఆర్చిబిషప్‌గా పని చేస్తున్న జస్టిన్‌ వెల్బీ అన్నారు.

విండ్సర్‌ ప్యాలెస్‌కు తరలి వస్తున్న ప్రజలు

హెలెనా విల్కిన్సన్‌,

బీబీసీ న్యూస్‌ కరస్పాండెంట్‌, విండ్సర్‌ క్యాజిల్రాజ ప్రసాదం నుంచి ప్రిన్స్‌ మరణ వార్త వెలువడగానే, ప్రజలు పెద్ద ఎత్తున రాజ ప్రసాదానికి రావడం ప్రారంభించారు. విండ్సర్‌ ప్యాలెస్‌ గేట్‌ దగ్గర అనేకమంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పిస్తున్నారు.

ఆ పుష్పగుచ్ఛాలలో 'రిప్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌' అన్న వాక్యాలు రాసి ఉన్న అనేక కార్డులు కనిపించాయి. మరికొందరు రాణికి తమ సంతాపాన్ని తెలిపారు.

ఇక ప్రిన్స్‌ మరణ వార్త తెలియగానే విండ్సర్‌ ప్యాలెస్‌ పరిసర ప్రాంతాలలో విషాద వాతావరణం నెలకొని ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక ప్రిన్స్‌ ఫిలిప్‌ విండ్సర్‌ ప్యాలెస్‌లోనే గడిపారు.

అంతిమ దినాలలో భార్య క్వీన్‌ ఎలిజబెత్‌ ఆయన చెంతనే ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)